ETV Bharat / sports

భారత్-ఇంగ్లాండ్ టెస్టులు ఆగితే కోట్ల డాలర్లు నష్టం?

author img

By

Published : Jul 8, 2021, 8:06 PM IST

ఇంగ్లాండ్​ జట్టులో కరోనా కలకలం రేగడం వల్ల ఆ దేశ క్రికెట్​ బోర్డుకు భయం వెంటాడుతోంది. భారత్​తో టెస్టు సిరీస్​ సజావుగా సాగుతోందో లేదో అని అనుమానం మొదలైంది. ఎందుకంటే ఈ సిరీస్​ రద్దు అయితే కోట్ల డాలర్ల నష్టం వాటిల్లనుంది. మళ్లీ మ్యాచ్​లు నిర్వహణ కూడా కుదరదు! ఈ నేపథ్యంలోనే సిరీస్​కు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది.

england series
ఇంగ్లాండ్​ సిరీస్​

కరోనా వైరస్‌ మహమ్మారి మొదట వెలుగు చూసినప్పుడు క్రీడారంగం వెలవెలబోయింది. అంతర్జాతీయ క్రికెట్‌ స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా లాక్‌డౌన్లు.. ఆంక్షలు.. జన సమూహాలపై నిషేధం.. ఇలాంటి పరిస్థితుల్లో బయో బుడగలో తొలి క్రికెట్‌ సిరీస్‌ నిర్వహించింది ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు. అప్పుడు ధైర్యంగా ముందడుగు వేసిన ఈసీబీకి ఇప్పుడు భయం పట్టుకుంది.

ఎందుకంటే?

మరికొన్ని రోజుల్లో టీమ్‌ఇండియాతో ఇంగ్లాండ్‌ ఐదు టెస్టుల సిరీసులో తలపడాలి. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌-2లో ఇదే అతిపెద్ద సిరీస్. ఇది రెండు జట్లకూ ప్రతిష్ఠాత్మకమే. అయితే శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసు తర్వాత ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టును కరోనా వైరస్‌ వెంటాడింది. ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సహాయ సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో వెంటనే అందరినీ ఐసోలేషన్‌కు పంపించి చికిత్స అందిస్తోంది. పాక్‌తో సిరీసుకు బెన్‌స్టోక్స్‌ సారథ్యంలో కొత్త ఆటగాళ్లతో అప్పటికప్పుడు మరో జట్టును ఎంపిక చేసింది.

ఈ అనుభవంతో ఇంగ్లాండ్‌, భారత్‌ సిరీసును అత్యంత సురక్షితంగా, కఠిన బయో బుడగలో నిర్వహించాలని ఈసీబీ కంకణం కట్టుకుంది. ఎందుకంటే ఈ ఐదు మ్యాచుల సిరీసు ద్వారా ఈసీబీ దాదాపు 137 మిలియన్‌ డాలర్ల ఆదాయం ఆర్జించనుంది. మధ్యలో ఆటగాళ్లకు మరోసారి వైరస్‌ సోకితే సిరీస్‌ను పూర్తి చేయడం కష్టమవుతుంది. మళ్లీ నిర్వహించేందుకు సమయం కుదరదు. ఐపీఎల్‌ కోసం టీమ్‌ఇండియా క్రికెటర్లు యూఈకి వెళ్లాల్సి ఉంటుంది. పైగా కోట్లాది డాలర్ల నష్టం వాటిల్లుతోంది. రెండు జట్లకు రెండో డోసును సిరీస్​కు ముందే వేయించాలని నిర్ణయించింది. ఏప్రిల్‌లో వైరస్‌ వల్ల ఐపీఎల్‌కు జరిగినట్టు తమకు ఇబ్బంది కలగొద్దని కఠిన చర్యలు తీసుకుంటోంది.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.