ETV Bharat / sports

డేవిడ్‌ వార్నర్‌.. సన్​రైజర్స్​పై స్వీట్‌ రివెంజ్‌..

author img

By

Published : May 6, 2022, 12:51 PM IST

warner sweet revenge on sunrisers
డేవిడ్‌ వార్నర్‌.. సన్​రైజర్స్​పై స్వీట్‌ రివెంజ్‌

IPL 2022 SRH VS DC warner record: సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ ప్లేయర్​ డేవిడ్​ వార్నర్ పలు​ రికార్డులు సాధించాడు. తనను వదిలేసిన జట్టుపై అద్భుత ప్రదర్శన చేసి తన విలువేంటో తెలియజేశాడు. ఈ నేపథ్యంలో అతడి ఐపీఎల్​ కెరీర్​, ఈ సీజన్​ ప్రదర్శన సహా సాధించిన రికార్డులను తెలుసుకుందాం..

IPL 2022 SRH VS DC warner record: "ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం కొందరికే అలవాటు. అలా ఒదిగి ఉండటం కూడా అంత తేలికేం కాదు." ఇప్పుడు ఈ సామెత దిల్లీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు సరిగ్గా సరిపోతుంది. కేవలం ఒక్క సీజన్‌లో విఫలమైనంత మాత్రాన ఘోర అవమానంతో బయటకు గెంటేసిన హైదరాబాద్‌ జట్టుకు ఇప్పుడు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. కనీసం కారణం కూడా చెప్పకుండా వదిలేసిన జట్టుపై.. వీసమెత్తు మాట తూలకుండా తానేంటో, తన విలువేంటో ఆటతోనే తేల్చి చెప్పాడు. దీంతో ఈ దిల్లీ ఓపెనర్‌ హైదరబాద్‌ జట్టుపై స్వీట్‌ రివెంజ్‌ తీసుకున్నాడు.

దిల్లీతో మొదలెట్టి.. హైదరాబాద్‌తో పేరు సంపాదించి.. డేవిడ్‌ వార్నర్‌ భారత టీ20 లీగ్‌లో చెరగని ముద్రవేశాడు. 2009లో దిల్లీ జట్టుతోనే ఈ టోర్నీలో ప్రయాణం మొదలెట్టాడు. 2013 వరకూ ఐదేళ్లు ఇక్కడే ఆడినా అప్పుడప్పుడు మెరుపులు మెరిపించించడమే తప్ప పెద్దగా పేరు సంపాదించలేదు. కానీ, 2014లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించడం మొదలుపెట్టాక అతడి గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయింది. ఒకవైపు సారథిగా జట్టును ముందుండి నడిపిస్తూనే మరోవైపు బ్యాట్స్‌మన్‌గా పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలోనే 2016లో అప్పటి బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (973)తో పోటీపడి మరీ పరుగులు సాధించాడు. ఆ సీజన్‌లో వార్నర్‌ తొమ్మిది అర్ధశతకాలతో మొత్తం (848) పరుగులు దంచికొట్టాడు. మరోవైపు బెంగళూరుతోనే తలపడిన ఫైనల్లోనూ ధనాధన్‌ బ్యాటింగ్‌తో హైదరాబాద్‌కు కప్పు అందించాడు. దీంతో ఆ జట్టును వరుసగా ఐదేళ్లు ప్లేఆఫ్స్‌ వరకూ తీసుకెళ్లి ఘన చరిత్ర సృష్టించాడు.

కోహ్లీ, రోహిత్‌ కన్నా మేటి.. ఇక ఈ టీ20 టోర్నీలో బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ (6,499), పంజాబ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (6,153), ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (5,766) అత్యధిక పరుగుల వీరులుగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వారి తర్వాత వార్నర్‌ (5,762) పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. అయినా, సగటు, స్ట్రైక్‌రేట్‌, అర్ధశతకాల సంఖ్యల పరంగా చూస్తే వార్నరే మేటిగా ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ (36.51), ధావన్‌ (35.36), రోహిత్‌ (30.51) సగటుతో కొనసాగుతుండగా.. వార్నర్‌ (42.06) ముగ్గురికన్నా గొప్పగా రాణిస్తున్నాడు. అలాగే స్రైక్‌రేట్‌లోనూ వార్నర్‌ (140.71).. కోహ్లీ (129.26), ధావన్‌ (126.53), రోహిత్‌ (130.19)ల కన్నా అద్భుతంగా దూసుకుపోతున్నాడు. ఇక శతకాలు, అర్ధ శతకాలతో పోల్చి చూసినా వార్నర్‌ 4 శతకాలు, 53 అర్ధశతకాలతో ముందున్నాడు. విరాట్‌ 5 శతకాలు, 43 అర్ధశతకాలతో ఉండగా, ధావన్‌ 2 సెంచరీలు, 47 హాఫ్‌ సెంచరీలు, రోహిత్‌ 1 శతకం, 40 అర్ధశతకాలతో ఉన్నారు. ఇలా ఏ విధంగా చూసినా వార్నర్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు.

ఈ సీజన్‌లో ఎలా ఆడుతున్నాడంటే.. వార్నర్‌ ఎప్పటిలాగే ఈ సీజన్‌లోనూ అదరగొడుతున్నాడు. గతేడాది హైదరాబాద్‌ తరఫున ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండు అర్ధశతకాలతో 195 పరుగులే చేసిన అతడు ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో నాలుగు అర్ధశతకాలతో 356 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో దూసుకుపోతున్నాడు. అయితే, ఇక్కడ టాప్‌-10 బ్యాట్స్‌మెన్‌ అందరూ 9, 10 మ్యాచ్‌లు ఆడగా.. వార్నర్‌ 8 మ్యాచ్‌ల్లోనే టాప్‌లో ఒకడిగా నిలిచాడు. దీన్నిబట్టి అతడెలా రాణిస్తున్నాడో, అతడిని వదిలేసుకొని హైదరాబాద్‌ ఎంత పెద్ద తప్పు చేసిందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా గతరాత్రి ఆ జట్టుపైనే చెలరేగడం విశేషం. ఓపెనర్‌గా వచ్చిన వార్నర్‌ (92 నాటౌట్‌; 58 బంతుల్లో 13x4, 3x6) విధ్వంసం సృష్టించి ఈ సీజన్‌లో తన అత్యధిక స్కోర్‌ నమోదు చేయడమే కాకుండా హైదరాబాద్‌కు మ్యాచ్‌ దూరం చేయడంలోనూ అతడిదే కీలక పాత్ర. దీంతో దిల్లీ ఈ సీజన్‌లో ఐదో విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. వార్నర్‌ మున్ముందు ఇలాగే ఆడితే ఆ జట్టు ప్లేఆఫ్స్‌ రేసులోనూ దూసుకుపోయే అవకాశం ఉంది.

ఇందుకే వార్నర్‌ గ్రేట్‌ అనేది.. ఇక గతరాత్రి మ్యాచ్‌ గెలిచి 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా ఎంపికయ్యాక వార్నర్‌ మాట్లాడాడు. హైదరాబాద్‌పై ఇలా చెలరేగడానికి తనకేం అదనపు స్ఫూర్తి అవసరం లేదన్నాడు. దీన్నిబట్టి వార్నర్‌ ఎంత సహృదయుడో అర్థం చేసుకోవచ్చు. గతేడాది సీజన్‌ మధ్యలో హైదరాబాద్‌ తుది జట్టులో నుంచి తొలగించినా, తర్వాత కెప్టెన్సీ నుంచి పక్కనపెట్టినా.. వార్నర్‌ చాలా హూందాగా ప్రవర్తించాడు. సామాజిక మాధ్యమాల్లో ఆ జట్టుపై ఎన్ని విమర్శలొచ్చినా వార్నర్‌ ఒక్క మాట కూడా తూలలేదు. మనసులో ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూనే కనిపించాడు. ముఖ్యంగా కొన్ని మ్యాచ్‌లకు గ్యాలరీలో నిల్చొని మరీ జట్టును ఉత్సాహపర్చాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే ఇదేనేమో! అందుకే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై అత్యధిక స్కోర్‌ సాధించినా చాలా నిష్కల్మషంగా కనిపించాడు. తన ఆటకు కట్టుబడి ఉంటే పరుగులు వాటంతట అవే వస్తాయనే ప్రాథమిక సూత్రాన్నే నమ్ముకొన్నాడు. ఎంతైనా తనని దూరం చేసుకున్న జట్టుపై ఈ బ్యాటింగ్‌ దిగ్గజం స్వీట్‌ రివెంజ్‌ తీర్చుకొన్నాడు.

ఇదీ చూడండి:

వార్నర్​ రికార్డు.. ధోనీ, కోహ్లీని వెనక్కినెట్టి రోహిత్​ సరసన

SRH VS DC: ఆ జాబితాలో అగ్రస్థానంలోకి వార్నర్​.. ఉమ్రాన్​ @157

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.