ETV Bharat / sports

ఐపీఎల్​ నుంచి రైనా నిష్క్రమణ వెనకున్న కథేంటి?

author img

By

Published : Sep 1, 2020, 7:20 AM IST

Updated : Sep 1, 2020, 7:29 AM IST

ఐపీఎల్​ నుంచి టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనా అర్ధంతరంగా తప్పుకోవడంపై చర్చ నడుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లాడని కొంతమంది వాదిస్తుంటే.. సీఎస్కే యాజమాన్యంతో విభేదాల వల్ల రైనా టోర్నీ నుంచి నిష్క్రమించాడని మరికొంతమంది అంటున్నారు. అయితే ఐపీఎల్​ టోర్నీ నుంచి తప్పుకోవడం వల్ల దాదాపు రూ.11 కోట్ల ఆదాయం కోల్పోనున్నాడట ఈ స్టార్​ బ్యాట్స్​మన్​.

What was the real reason behind Raina's departure from the IPL?
ఐపీఎల్​ నుంచి రైనా నిష్క్రమణ వెనుకున్న కథేంటి?

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌ నుంచి తప్పుకోవడం, యూఏఈ నుంచి స్వదేశానికి బయల్దేరడంపై రెండు రోజులుగా పెద్ద చర్చే నడుస్తోంది. ముందేమో ఈ నెల 19న రైనా మేనత్త ఇంటిపై దోపిడీ దొంగలు దాడి చేసి ఆమె భర్తను హతమార్చిన ఉదంతమే... అతను అర్ధంతరంగా స్వదేశానికి బయల్దేరడానికి కారణం అన్నారు. అయితే రైనా దుబాయ్‌కి బయల్దేరడానికి ముందే ఆ ఘటన జరిగింది. అప్పుడు ఆగని వాడు.. ఇప్పుడు ఎందుకు తిరిగొస్తున్నాడనే ప్రశ్న తలెత్తింది.

మరోవైపు కరోనా భయం, దుబాయ్‌లో దిగినప్పటి నుంచి ఒంటరిగా ఉండటం, జట్టులో పది మందికి పైగా కరోనా పాజిటివ్‌గా తేలడం రైనాను మానసిక ఒత్తిడిలోకి నెట్టిందని.. అందువల్లే అతను ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడని మరో కథనం ప్రచారంలోకి వచ్చింది.

కానీ ఇంకో రోజు గడిచేసరికి మళ్లీ ఇంకో కథనం పుట్టుకొచ్చింది. తనకు కేటాయించిన హోటల్‌ గదిలో బాల్కనీ లేకపోవడంపై రైనా జట్టు యాజమాన్యంపై ఆగ్రహించాడని, బయో బబుల్‌ నిబంధనల్ని కూడా ఉల్లంఘించాడని.. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీ ప్రతినిధులతో మాటా మాటా పెరిగి ఐపీఎల్‌ నుంచే తప్పుకొనే పరిస్థితి వచ్చిందని ఈ కథన సారాంశం.

అది నిజం కాదు

రైనా విషయమై ఫ్రాంఛైజీ యజమాని శ్రీనివాసన్‌ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడని, "కొన్నిసార్లు విజయం తలకెక్కుతుంది" అంటూ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తన గది విషయంలో ఫ్రాంఛైజీతో రైనా గొడవ పడ్డాడనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నది జట్టు వర్గాల సమాచారం.

అతడికి కెప్టెన్‌ ధోనీ, కోచ్‌ ఫ్లెమింగ్‌లతో పాటే సూట్‌ గది కేటాయించారని, దానికి బాల్కనీ మాత్రమే లేదని.. ఆమాత్రానికి రూ.11 కోట్ల ఒప్పందాన్ని కాదనుకుని ఐపీఎల్‌కు దూరమవ్వాలని రైనా ఎందుకు అనుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. రైనాపై తాను విమర్శలు గుప్పించినట్లు వచ్చిన వార్తల్ని స్వయంగా శ్రీనివాసన్‌ ఖండించడం గమనార్హం.

మానసిక ఒత్తిడే కారణం!

"చెన్నై జట్టుకు ఇన్నేళ్లలో రైనా చేసిన అందించిన తోడ్పాటు అసమానమైనది. రైనా కుంగుబాటులో ఉన్న ఈ సమయంలో అతడికి ఫ్రాంఛైజీ పూర్తి అండగా ఉంటుంది. నా వ్యాఖ్యను ప్రతికూల కోణంలో తీసుకున్నారు" అని శ్రీనివాసన్‌ ఓ మీడియా సంస్థతో పేర్కొన్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే మేనత్త ఇంట్లో విషాదానికి తోడు కరోనా భయం, ఒంటరిగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి ఎదుర్కోవడం వల్లే రైనా ఐపీఎల్‌కు దూరమై, స్వదేశానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.

Last Updated :Sep 1, 2020, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.