ETV Bharat / sports

'భారత్​ మాత్రమే కాదు ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది'

author img

By

Published : Jan 20, 2021, 2:15 PM IST

ఆస్ట్రేలియాపై టీమ్​ఇండియా చారిత్ర‌క విజ‌యం త‌ర్వాత విజ‌యానికి కార‌ణ‌మైన ప్లేయ‌ర్స్‌ను ఉద్దేశించి డ్రెస్సింగ్ రూమ్‌లో.. భావోద్వేగంతో మాట్లాడాడు భారత జట్టు కోచ్​ రవిశాస్త్రి. ఎన్నో ప్రతికూలతల నడుమ అద్భుత పోరాటం చేశారని ఆటగాళ్లను కొనియాడాడు.

ravi
రవి

ఆస్ట్రేలియా పర్యటనను టీమ్​ఇండియా దిగ్విజయంగా ముగించింది. గబ్బా టెస్టులో చారిత్రక విజయాన్ని అందుకుని టెస్టు సిరీస్‌ను 2-1తో సాధించింది. అయితే విజయానంతరం టీమ్​ఇండియా కోచ్‌ రవిశాస్త్రి డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టును ఉద్దేశించి భావోద్వేగంతో మాట్లాడాడు. ఎన్నో ప్రతికూలతల నడుమ అద్భుత పోరాటం చేశారని ఆటగాళ్లను కొనియాడాడు. రవిశాస్త్రి ప్రసంగిస్తున్న సమయంలో ఆటగాళ్లు చప్పట్లు, ఈలలతో సందడి చేశారు.

"మీరు ప్రదర్శించిన ధైర్యం, సంకల్పం, స్ఫూర్తి అసాధారణం. గాయాలు, 36 పరుగులకే ఆలౌటవ్వడం.. ఇలా ఎన్నో ప్రతికూలతలు. అయినా ఆత్మవిశ్వాసంతో పోరాడారు. ఇది రాత్రికి రాత్రి వచ్చిన గెలుపు కాదు. గొప్ప పోరాట పటిమ చూపించి జట్టుగా విజయం సాధించారు. ఇప్పుడు భారత్‌ మాత్రమే కాదు, యావత్‌ ప్రపంచమంతా నిల్చొని మీకు సెల్యూట్ చేస్తోంది. మీరు సాధించిన ఈ గొప్ప ఘనతను గుర్తుంచుకోండి. ఈ క్షణాలను ఆస్వాదించండి. వీలైనంత ఆనందంగా ఉండండి. మన విజయం మెల్‌బోర్న్‌లో మొదలైంది. సిడ్నీలో గొప్ప పోరాటం చేశారు. ఇక గబ్బాలో అద్భుత విజయం సాధించారు. శుభ్‌మన్‌ గిల్‌.. గ్రేట్‌. పుజారా పోరాట యోధుడు. రిషభ్‌ పంత్ ప్రదర్శన అత్యద్భుతం. పంత్‌ బ్యాటింగ్ చేస్తుంటే ఎంతో మందికి హార్ట్‌ఎటాక్‌ వస్తుందనిపించింది. గొప్పగా జట్టును గెలిపించాడు. ఇక కెప్టెన్‌ రహానె జట్టును పుంజుకునేలా చేశాడు. పరిస్థితుల్ని నియంత్రణలో ఉంచుతూ అతడు జట్టును ఘనంగా నడిపించాడు. మరోవైపు ఆఖరి టెస్టుతో అరంగేట్రం చేసిన ముగ్గురు ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేశారు. సుందర్, నట్టూకు తొలి మ్యాచ్ కాగా, శార్దూల్ 2018లో మొదటి మ్యాచ్ ఆడాడు. కానీ అతడు గాయంతో మధ్యలోనే జట్టును వీడాడు. అందుకే అతడికి ఇది అరంగేట్రమే. అయితే తొలి ఇన్నింగ్స్‌లో వారు చక్కని ప్రదర్శన కనబరిచారు. 186 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయినప్పుడు క్రీజులోకి వచ్చి పట్టుదలతో బ్యాటింగ్‌ చేశారు. జట్టు స్కోరును 336కు చేర్చారు. ఆస్ట్రేలియాపై పైచేయి సాధించడానికి అదే కారణం."

- రవిశాస్త్రి, టీమ్​ఇండియా కోచ్​.

2-1తేడాతో టెస్టు సిరీస్​ను సొంతం చేసుకుని.. చారిత్రక విజయాన్ని నమోదు చేసింది టీమ్​ఇండియా. దీంతో సర్వత్రా భారతజట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇదీ చూడండి : అద్భుత ప్రదర్శనపై సిరాజ్​ భావోద్వేగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.