ETV Bharat / sports

'ఐపీఎల్​ కోసం ఐసీసీ మ్యాచ్​లను వదులుకుంటారా?'

author img

By

Published : Apr 8, 2021, 2:00 PM IST

పాకిస్థాన్​తో జరుగుతోన్న వన్డే సిరీస్​ కాదని ఐపీఎల్​ కోసం భారత్​కు వచ్చారు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు. రెండో మ్యాచ్​ గెలిచాక ఆ జట్టు ప్రధాన క్రికెటర్లు డికాక్, మిల్లర్, లుంగి ఎంగిడి, రబాడ లీగ్​ కోసం బయల్దేరారు. దీనిపై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అప్రిది మండిపడ్డాడు. టీ20 లీగుల కోసం ఐసీసీ మ్యాచ్​లకు దూరమవడం ఏంటని ప్రశ్నించాడు.

Afridi
అఫ్రిది

పాకిస్థాన్‌తో జరుగుతున్న పరిమిత ఓవర్ల క్రికెట్‌ నుంచి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మధ్యలో వైదొలగడం ఏంటని పాక్ మాజీ సారథి షాహిద్‌ అఫ్రిది మండిపడ్డాడు. తాజాగా ఇరు దేశాల మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగ్గా పాక్‌ 2-1 తేడాతో గెలుపొందింది. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించాక ఆ జట్టు ఆటగాళ్లు.. కగిసో రబాడ, క్వింటన్‌ డికాక్‌, ఎన్రిచ్ నోర్జే, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలోనే గతరాత్రి వన్డే సిరీస్‌ పూర్తయ్యాక అఫ్రిది ఓ ట్వీట్‌ చేశాడు.

"క్రికెట్‌ దక్షిణాఫ్రికా అధికారులు పరిమిత ఓవర్ల క్రికెట్‌ మధ్యలో ఐపీఎల్‌ కోసం తమ ఆటగాళ్లను అనుమతించడం ఆశ్చర్యంగా ఉంది. టీ20 లీగులు అంతర్జాతీయ క్రికెట్‌పై ప్రభావం చూపడం బాధగా ఉంది. దీనిపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది."

-అఫ్రిది, పాక్ మాజీ క్రికెటర్

అంతకుముందు పాకిస్థాన్‌ వన్డే సిరీస్‌ గెలుపొందడంపై స్పందించిన అతడు.. తమ ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తాడు. "దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించిన పాక్‌ ఆటగాళ్లకు అభినందనలు. జోహెనస్‌బర్గ్‌లో మరో శతకం సాధించిన ఫకర్‌ జమాన్‌ ఇన్నింగ్స్‌ చూడటం గొప్పగా ఉంది. బాబర్‌ మరోసారి మంచి క్లాసిక్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక బౌలర్లంతా అద్భుత ప్రదర్శన చేశారు. బాగా ఆడారు" అని మెచ్చుకున్నాడు.

కాగా, శుక్రవారం నుంచి ఐపీఎల్‌ 14వ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు తమ ఫ్రాంఛైజీలను చేరుకున్నారు. ఇటీవలే వచ్చిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రబాడ, నోర్జే ముంబయిలో దిల్లీ జట్టును కలుసుకోగా, డికాక్‌ చెన్నైలోని ముంబయి ఇండియన్స్‌ను కలిశాడు. ఇక మిల్లర్‌ రాజస్థాన్‌ రాయల్స్‌, ఎంగిడి చెన్నై సూపర్‌ కింగ్స్‌ హోటల్స్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం వీరంతా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్న నేపథ్యంలో ఆయా జట్ల తొలి మ్యాచ్‌ల్లో పాల్గొనే వీలు లేకపోయింది. మరోవైపు దక్షిణాఫ్రికా టీమ్‌ ఈనెల 10 నుంచి పాకిస్థాన్‌తో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.