ETV Bharat / sports

కెరీర్ అరుదైన మ్యాచ్​లో టేలర్​కు 100 వచ్చె.. 50 పోయే

author img

By

Published : Feb 22, 2020, 12:42 PM IST

Updated : Mar 2, 2020, 4:14 AM IST

Ross Taylor
చారిత్రక టెస్టులో అర్ధశతకం మిస్సైన టేలర్​

అంతర్జాతీయ క్రికెట్​లో మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్​లు ఆడిన తొలి క్రికెటర్​గా రికార్డులకెక్కాడు న్యూజిలాండ్​ బ్యాట్స్​మన్​ రాస్​ టేలర్​. భారత్​తో శుక్రవారం ఆరంభమైన తొలి టెస్టు​లో ఈ ఘనత అందుకున్నాడు. అయితే కివీస్​ తొలి ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన టేలర్.. తన కెరీర్​ చారిత్రక టెస్టులో అర్ధశతకం మిస్సయ్యాడు.

వెల్లింగ్టన్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌కు చాలా ప్రత్యేకం. క్రికెట్‌ చరిత్రలోనే మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్​లు​ ఆడిన ఏకైక ఆటగాడిగా ఈ మ్యాచ్​ ద్వారా చరిత్ర సృష్టించాడీ ఆటగాడు. ఈ టెస్టులో కివీస్​ తొలి ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన టేలర్​కు అభిమానులు చప్పట్లతో స్వాగతం పలికారు. అయితే అరుదైన మ్యాచ్​లో.. కెరీర్​లో మరో అర్ధశతకం చేసే అవకాశం కోల్పోయాడు. 44 రన్స్​(71 బంతుల్లో; 6 ఫోర్లు, 1 సిక్సర్​) చేసి పెవిలియన్​ చేరాడు. ఇషాంత్​ శర్మ బౌలింగ్​లో పుజారా చేతికి క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు.

భారత్​పైనే రెండో ఘనత...

ఇటీవల భారత్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ ద్వారా వందో టీ20 మ్యాచ్‌ పూర్తి చేసుకున్నాడు టేలర్​. తాజాగా టెస్టు మ్యాచ్​లోనూ ఇదే ఫీట్​ సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో 231 మ్యాచ్‌లు ఆడిన టేలర్‌.. మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్​లు ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. టేలర్​ 2007లో టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు సుదీర్ఘ ఫార్మాట్​లో 19 శతకాలు, 33 అర్ధశతకాలు బాదాడు. 3 డబుల్​ సెంచరీలు ఖాతాలో ఉన్నాయి.

Ross Taylor
రాస్​ టేలర్​

ప్రస్తుతం టేలర్‌... కివీస్‌ తరఫున వన్డేలు, టెస్టుల్లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. వన్డేల్లో 7219 పరుగులు చేసిన అతడు... టెస్టుల్లో మొత్తం 8565 పరుగులు చేశాడు. మాజీ సారథి బ్రెండన్‌ మెక్‌కలమ్‌, మార్టిన్‌ గప్తిల్‌ మాత్రం పొట్టి క్రికెట్‌లో టేలర్‌ కన్నా ఎక్కువ పరుగులు చేశారు. ఈ ఫార్మాట్​లో కేవలం 1909 రన్స్​ చేశాడు రాస్​.

100 ఖాళీ చేయడానికి సాయం కావాలి..

100వ టెస్టు ఆడుతున్న రాస్ టేలర్​కు ఓ విచిత్రమైన బహుమానం అందింది. కివీస్​ జట్టు మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు కలిసి 100 వైన్​ బాటిల్స్​ను అతడికి గిఫ్ట్​గా ఇచ్చారు. మాజీ ఆటగాడు ఇయాన్ స్మిత్ చేతుల మీదుగా టేలర్​ వాటిని తీసుకున్నాడు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన రాస్​... ఆ బాటిళ్లను ఏం చేస్తాడో చెప్పాడు.

"ఇయాన్ చేతుల మీదుగా ఈ బహుమానం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. మంచి మిత్రుడు, మార్గదర్శకుడు ఇయాన్ స్మిత్ కొన్ని మంచి మాటలు చెప్పాడు. అవి కాస్త అతిగా అనిపించినా(నవ్వుతూ).. జట్టు సభ్యులు, కుటుంబసభ్యులతో ఇలాంటి అనుభవం మరిచిపోలేనిది. ఇవన్నీ తాగడానికి నాకు సహాయం కావాలి" అని టేలర్ తెలిపాడు.

ఇదీ చూడండి.. తొలి ఇన్నింగ్స్​లో కివీస్ ఆధిక్యం.. శ్రమిస్తోన్న భారత బౌలర్లు

Last Updated :Mar 2, 2020, 4:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.