ETV Bharat / sports

చెప్పి మరీ సెహ్వాగ్ త్రిశతకం.. తొలి భారతీయుడిగా రికార్డు

author img

By

Published : Mar 29, 2021, 11:03 AM IST

ప్రపంచాన్నే సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతూ ముల్తాన్‌లో పాకిస్థాన్‌పై సాధించిన ట్రిపుల్‌ సెంచరీ సెహ్వాగ్​కు ఎంతో ప్రత్యేకం. పదునైన పాక్‌ బౌలింగ్‌ను అతడు చీల్చి చెండాడిన తీరు అభిమానుల మనసుల్లో ఇప్పటికీ అలానే ఉంది. టెస్టుల్లో త్రిశతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించడడమే కాదు 'సుల్తాన్‌ ఆఫ్‌ ముల్తాన్‌' అన్న బిరుదునూ సొంతం చేసుకున్నాడు.

On this day in 2004: Sehwag became first Indian to score triple century in Tests
చెప్పి మరీ సెహ్వాగ్ త్రిశతకం.. తొలి భారతీయుడిగా రికార్డు

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై వీరూ ఆడిన ఆ ఇన్నింగ్స్‌ను అభిమానులెప్పటికీ మరిచిపోలేరు. హైలైట్స్‌ను చూస్తున్నామా అన్న భావన కలిగించిన అతడు తన త్రిశతకం (309)తో పాక్‌ గడ్డపై భారత్‌కు మొట్టమొదటి టెస్టు విజయాన్ని అందించాడు. 375 బంతుల పాటు సాగిన అతడి ఊచకోతలో 39 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా సక్లయిన్‌ ముస్తాక్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో అతడు 300 పరుగుల మార్క్​ను అందుకున్న తీరు అద్భుతం. ఇప్పుడు ఆ ఘనతకు సోమవారంతో 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ట్విట్టర్​ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు సెహ్వాగ్.

వీరూ జోరుతో అప్పుడు మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 52 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. సెహ్వాగ్‌తో పాటు సచిన్‌ (194 నాటౌట్‌) చెలరేగడం వల్ల తొలి ఇన్నింగ్స్‌ను 675/5 వద్ద డిక్లేర్‌ చేసిన భారత్‌.. పాకిస్థాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే ఆలౌట్‌ చేసింది.

Sehwag
వీరందర్ సెహ్వాగ్

పాకిస్థాన్‌కు పీడకలలను మిగిల్చిన ముల్తాన్‌ టెస్టు.. భారత అభిమానులకు మాత్రం ఎప్పుడు తలచుకున్నా సంతోషాన్నిచ్చే అనుభూతులను ఇచ్చింది. సహజంగానే భారత్‌, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ అంటే ఎంతో ఆసక్తి, ఉత్కంఠ ఉంటాయి. కానీ 2004లో పాకిస్థాన్‌లో భారత పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే 1989-90 తర్వాత ఆ దేశానికి వెళ్లడం టీమ్‌ ఇండియాకు అదే తొలిసారి. అంతకుముందెప్పుడూ పాక్‌లో భారత్‌ టెస్టు మ్యాచ్‌ నెగ్గలేదు.

హోరాహోరీ వన్డే సిరీస్‌ను 3-2తో గెలిచి తొలి టెస్టులో అడుగుపెట్టింది ద్రవిడ్‌ నేతృత్వంలోని భారత జట్టు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. షోయబ్‌ అక్తర్‌, మహ్మద్‌ సమి, సక్లయిన్‌ ముస్తాక్‌ లాంటి స్టార్‌ బౌలర్లున్న పాకిస్థాన్‌ ధీమాగానే దిగింది. కానీ పెను తుఫాను ముంచేయబోతోందని ఊహించలేకపోయింది. ఆకాశ్‌ చోప్రాతో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన వీరూ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన స్ట్రోక్‌ ప్లేతో పరుగుల వరద పారించాడు. పెద్దగా ఫుట్‌వర్క్‌ లేకపోయినా.. చక్కని కంటి, చేతి సమన్వయంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

Sehwag became first Indian to score triple century
వీరందర్ సెహ్వాగ్

పాక్‌ బౌలర్లను కనీసం పాఠశాల బౌలర్లుగానైనా పరిగణించలేదతడు. అతడి చేతిలో బ్యాటు మంత్రదండమైన వేళ.. బౌలర్లు నిస్సహాయులుగా మారిపోగా ఫీల్డర్లకు పెద్దగా పనే లేకుండా పోయింది. బంతి నిర్విరామంగా బౌండరీకి వెళ్లింది. స్వీప్స్‌, కట్స్‌, పుల్స్‌, లాఫ్డెడ్‌ షాట్లతో వీరూ చెలరేగిపోయాడు. అతడు కేవలం 107 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయగా.. అప్పటికి చోప్రా స్కోరు 32 మాత్రమే. చోప్రా, ద్రవిడ్‌ (6) వెంటవెంటనే ఔటైనా అది భారత్‌పై ఏమాత్రం ప్రభావం పడలేదంటే కారణం సెహ్వాగ్‌ నిర్భీతిగా విరుచుకుపడడమే. మరోవైపు సచిన్‌ నిలవగా అతడు అంతులేని విధ్వంసాన్ని కొనసాగించాడు.

150 బంతుల్లో 150, 222 బంతుల్లో 200, 299 బంతుల్లో 250, 364 బంతుల్లో 300.. ఇలా సాగింది సెహ్వాగ్ ఊచకోత. శతకం సమీపంలో అతి జాగ్రత్తగా ఆడే రోజుల్లో సెహ్వాగ్‌.. అత్యంత అరుదైన మైలురాయి అయిన ట్రిపుల్‌ సెంచరీని సిక్స్‌తో సాధించడం అతడిలోని నిర్భయత్వానికి నిదర్శనం. 295 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సక్లయిన్‌ బౌలింగ్‌లో అతడు ముందుకొచ్చి డీప్‌ మిడ్‌వికెట్లో కొట్టిన సిక్స్‌ను చూసితీరాల్సిందే. అంతే కాదు అతడు శతకాన్ని సిక్స్‌తోనే అందుకున్నాడు. అక్తర్‌ బౌలింగ్‌లో బంతిని ముచ్చటైన అప్పర్‌కట్‌తో స్టాండ్స్‌లో పడేశాడు. వీరూ 195 వద్ద కూడా ఫోర్‌ కొట్టాడు. వీరూ విధ్వంసానికి అక్తర్‌, షమి, షబ్బీర్‌లు వందకుపైగా పరుగులివ్వగా.. సక్లయిన్‌ కెరీరే బలైంది. ఏకంగా 204 పరుగులిచ్చిన సక్లయిన్‌కు కెరీర్‌లో అదే చివరి మ్యాచ్‌ అయింది. సెహ్వాగ్‌ 295 వద్ద ఉన్నప్పుడు అక్తర్‌ ఓవర్‌ పూర్తయింది. ఒకవేళ తర్వాతి ఓవర్‌ సక్లయిన్‌ది అయితే సిక్స్‌తో ట్రిపుల్‌ సెంచరీ పూర్తి చేస్తానని సచిన్‌తో చెప్పాడట వీరూ. అతడి ఆత్మవిశ్వాసానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది. మ్యాచ్‌ తొలి రోజే 228 పరుగులు చేసిన సెహ్వాగ్‌.. రెండో రోజు ట్రిపుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. సచిన్‌తో మూడో వికెట్‌కు 336 పరుగులు జోడించాడు.

సరిగ్గా నాలుగేళ్ల తర్వాత సెహ్వాగ్‌ మరోసారి ట్రిపుల్‌ సెంచరీ చేశాడు. 2008లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో చెన్నైలో తొలి టెస్టులో ఈ మార్క్​ను అందుకున్నాడు. తన వ్యక్తిగత అత్యధిక స్కోరును తానే అధిగమించాడు. మొత్తంగా ప్రపంచ టెస్టు క్రికెట్‌ చరిత్రలో రెండుసార్లు ట్రిపుల్‌ సెంచరీ చేసింది నలుగురే. బ్రాడ్‌మన్‌(ఆస్ట్రేలియా), బ్రియన్‌ లారా (వెస్టిండీస్‌), వీరేందర్‌ సెహ్వాగ్‌ (భారత్‌), క్రిస్‌గేల్‌ (వెస్టిండీస్‌) ఈ జాబితాలో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.