ETV Bharat / sports

'నన్ను బౌలరే కాదు అలానూ పిలవచ్చు'

author img

By

Published : Jan 23, 2021, 6:57 AM IST

గబ్బా టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన టీమ్​ఇండియా ఆటగాడు శార్దుల్ ఠాకూర్​.. తనను ఫాస్ట్​బౌలర్​ మాత్రమే కాకుండా బౌలింగ్​ ఆల్​రౌండర్​గా కూడా పిలవొచ్చని అన్నాడు. దీంతోపాటే పలు ఆసక్తికర విషయాలను చెప్పాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే..

sardul
శార్దూల్​

రెండేళ్ల కిత్రం టెస్టు అరంగేట్ర మ్యాచ్‌లో పది బంతులు వేయగానే గాయంతో మ్యాచ్‌ మొత్తానికే దూరమైన ఆ బౌలర్‌.. దాదాపు రెండేళ్ల తర్వాత కంగారూ గడ్డపై వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ కీలక ప్రదర్శన చేసి బ్రిస్బేన్‌లో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇక నుంచి తనను బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా పరిగణలోకి తీసుకోవచ్చని చెబుతున్నాడు. అతనే.. గబ్బాలో సత్తాచాటిన టీమ్‌ఇండియా పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌. ఆ సిరీస్‌ విజయానంతరం భారత్‌ చేరుకున్న అతను.. ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే..!

ఇక నుంచి నేను కేవలం ఫాస్ట్‌బౌలర్‌ను మాత్రమే కాదు. నన్ను బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అని పిలవొచ్చు. బ్రిస్బేన్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్‌లో రాణించడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. గబ్బాలో ఆస్ట్రేలియాతో తలపడడం అంత సులభం కాదు. ఈ మ్యాచ్‌ ముందు వరకూ 1988 నుంచి ఆ స్టేడియంలో ఆ జట్టుకు ఓటమే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీయడమ్ కాకుండా తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగులు చేసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో రాణించడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లోనూ అవకాశం వచ్చినపుడు బ్యాటింగ్‌ చేసే నైపుణ్యం నాకుంది. జట్టుకు ఉపయోగపడే పరుగులు చేయగలను.

క్రీజులో నిలబడాలనుకున్నాం..

తొలి ఇన్నింగ్స్‌లో జట్టు 186/6తో కష్టాల్లో ఉన్నపుడు క్రీజులో అడుగుపెట్టా. మరోవైపు సుందర్‌ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో నిలబడాలనుకున్నాం. ఆ సమయంలో వికెట్లు కాపాడుకోవడం మాకెంతో ముఖ్యం. ఒక్కో అర్ధగంట బ్యాటింగ్‌ చేస్తూ పోయాం. స్కోరుబోర్డు వైపు అసలు చూడలేదు. ప్రత్యర్థి బౌలర్ల గురించి చర్చించుకుంటూ బ్యాటింగ్‌ కొనసాగించాం. కమిన్స్‌, హేజిల్‌వుడ్‌, స్టార్క్‌.. ఇలా ఆ పేసర్లు ఎలాంటి బంతులు వేస్తారో అని మాట్లాడుకున్నాం. ఏకాగ్రత కోల్పోయినట్లు అనిపించగానే.. జాగ్రత్తగా ఆడాలని ఒకరికొకరం చెప్పుకున్నాం. అలా మాట్లాడుకోవడంతోనే ఏడో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగలిగాం.

కఠిన పరిస్థితుల్లో సిరాజ్‌..

చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్ల ఘనతకు ఒక్క వికెట్‌ దూరంలో ఆగిపోయినందుకు ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే సిరాజ్‌ ఆ ఘనత సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అతను అయిదు వికెట్లు పడగొట్టాలని కోరుకున్నా. ఎందుకంటే సిరీస్‌ ఆరంభానికి ముందే తన తండ్రి చనిపోవడంతో అతనెంతో భావోద్వేగానికి లోనయ్యాడు. తాను టెస్టు క్రికెట్‌ ఆడాలని తన తండ్రి ఎంత బలంగా కోరుకున్నాడోనని అతను మాతో చెప్పాడు. ఆయన ఇప్పుడు మన మధ్యలో లేకపోయినా.. పైనుంచి సిరాజ్‌ ప్రదర్శనను కచ్చితంగా చూస్తూనే ఉంటాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో చివరి క్యాచ్‌ అందుకోగానే అతనికి అయిదు వికెట్లు దక్కాయని ఎంతో ఆనందపడ్డా.

ఇదీ చూడండి : ఆటో నుంచి బీఎమ్​డబ్ల్యూ వరకు.. సిరాజ్​ శెభాష్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.