ETV Bharat / sports

ధోనీ ఆటతీరే కాదు.. మాటతీరు అద్భుతమే

author img

By

Published : Aug 15, 2020, 10:46 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా అతడు పేల్చిన కొన్ని మాటల తూటాలను ఓసారి చూద్దాం.

ధోనీ ఆటతీరే కాదు.. మాటతీరు అద్భుతమే
ధోనీ ఆటతీరే కాదు.. మాటతీరు అద్భుతమే

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్​కు ముగింపు పలికాడు. అభిమానులకు తీవ్ర బాధను మిగిల్చాడు. అతడు తన ఆటతీరుతోనే కాకుండా తన చమత్కారంతోనూ ఆకట్టుకున్నాడు. మీడియాకు పలు సందర్భంగా చురకలంటిస్తుండేవాడు. ఈ సందర్భంగా ధోనీ పేల్చిన కొన్ని మాటల తూటాలను చూద్దాం.

వందశాతం ఫిట్‌గా లేకున్నా.. ఆటలో కొనసాగుతూ ఉంటే మోసం చేస్తున్నట్లే

-2008లో శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌ సందర్భంగా తన ఫిట్‌నెస్‌ గురించి

కావాలనుకుంటే 1.8 లేదా 1.9పరుగులను 2 పరుగులుగా మార్చవచ్చు. కానీ 1.75, 1.70ను రెండు పరుగులుగా చేయలేం.

-వికెట్ల మధ్య సహచరుల పరుగు గురించి నిర్మోహమాటంగా

మనపై 100కిలోల భారం మోపారు అనుకుందాం. ఆ తర్వాత ఓ పర్వతాన్ని భుజాలపై వేసినా పెద్దగా తేడా అనిపించదు.

-కెప్టెన్సీ ఒత్తిడిపై చమత్కారంగా చెప్పిన మాట

నలుగురు ఫాస్ట్‌బౌలర్లతో ఆడిన ప్రతిసందర్భంలో రెండు విషయాలు జరిగాయి. ఒకటి, కెప్టెన్‌ నిషేధాన్ని ఎదుర్కోవడం. రెండు, ఓడిపోవడం

-విదేశాల్లో ఓటములపై ప్రశ్నలకు ధోనీ విశ్లేషణ

శ్రీశాంత్‌ను నియంత్రించగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీశాంత్‌ మాత్రమే. నా నియంత్రణలో లేని అంశం ఇది. అందుకోసం ఎక్కువగా ఆలోచించను.

-జట్టు సభ్యుల నియంత్రణలో మిస్టర్‌ కూల్‌ వ్యవహార శైలి

సెలెక్టర్లు, కెప్టెన్‌, కోచ్‌లు మాత్రమే ఉండే సమావేశంలో జరిగే విషయాలు బయటకు వస్తుండటం అసహనం కలిగించేది, అది నిజంగా అమర్యాదకరం

-సెలక్షన్‌ కమిటీ సమావేశాల్లో చర్చలపై లీక్‌ల గురించి

చాలామంది మాకు చెప్పిన మాట... ముంబయి నగరం ఎప్పుడూ పరుగెడుతునే ఉంటుందని. కానీ... చూడండి, నేను మా జట్టు మొత్తం నగరాన్ని ఎక్కడికీ కదలకుండా మునివేళ్లపై నిలబెట్టాం

-టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ సందర్భంగా పోటెత్తిన ప్రేక్షకులను ఉద్దేశించి

మీరు (మీడియా) ప్రతి 2రోజులకు ఒకసారి నా ప్రేయసిని మార్చేస్తున్నారు. ఒక్కరితో అయినా కొంతకాలం కొనసాగనివ్వండి

-ప్రేమ వ్యవహారాలపై తరచు మీడియాలో వచ్చిన ఉహాగానాలపై

మాట్లాడటం మొదలు పెట్టే ముందు క్రిక్‌ఇన్ఫోకి మీరు రాసిన వ్యాసం చదివానని మీకు తప్పక చెప్పాలి. మీరు ఆస్ట్రేలియా గెలుపు గుర్రం చెప్పారు. ఇవాళ నేను, మా జట్టు అది తప్పని నిరూపించాం.

-2007టీ ట్వంటీ ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై విజయం తర్వాత రవిశాస్త్రితో

నువ్వు చనిపోతునే ఉన్నావ్‌, చస్తునే ఉంటావ్‌, ఇందులో ఏది గొప్ప చావు అంటే ఏం చెప్పగలం.

-ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలో వరస ఓటములపై నిస్సహాయంగా చేసిన వ్యాఖ్యలు

సూటిగా చెప్పాలంటే నాకు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి అసలు అర్థమే కాలేదు. కేవలం అంపైర్‌ ఏం చెబితే అది వినడానికి సిద్ధపడిపోయా. విచిత్రం ఏమిటంటే అంపైర్‌కు కూడా మాకంటే పెద్దగా తెలియక పోవడం

-ఇంగ్లాండ్‌లో వర్షం కారణంగా ఓ మ్యాచ్‌ ఓటమి గురించి

ఫుల్‌స్టాప్‌ పెట్టేంత వరకు ఒక వాక్యం ముగిసినట్లు కాదు

-2011ప్రపంచకప్‌ విజయానంతరం విలేకర్లకు చురక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.