ETV Bharat / sports

భారత్‌, ఇంగ్లాండ్‌ కెప్టెన్ల ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి

author img

By

Published : Feb 2, 2021, 7:50 AM IST

Updated : Feb 2, 2021, 8:20 AM IST

Deep Discussion the performance of the captains of India and England
భారత్‌, ఇంగ్లాండ్‌ కెప్టెన్ల ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి

విరాట్‌ కోహ్లీ.. జో రూట్‌.. ప్రస్తుత ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌. కెప్టెన్లుగానూ తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడేందుకు సిద్ధమయ్యారు. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ శుక్రవారం ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి ప్రదర్శనను పోల్చుతూ చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాబోయే సిరీస్‌ సారథిగా, బ్యాట్స్‌మన్‌గా రాణించి.. కోహ్లీ తన స్థాయిని చాటుతాడా? రూట్‌పై ఆధిపత్యం సాధించగలడా?

మరో మూడు రోజుల్లో ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా తలపడే టెస్టు సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో సిరీస్‌కు ముందు రెండు జట్ల కెప్టెన్ల గురించి చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల బ్యాట్‌తో పాటు కెప్టెన్‌గానూ సత్తా చాటలేకపోతున్న విరాట్‌ కోహ్లీకి ఈ సిరీస్‌ పరీక్షగా నిలవనుంది. సొంతగడ్డపై.. అదీ పూర్తి అనుకూలమైన పరిస్థితుల్లో జట్టుకు ఘన విజయాన్ని అందించాల్సిన బాధ్యత అతనిపై ఉంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌.. అదే జోరు కొనసాగించి ఫైనల్స్‌ చేరాలంటే కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ ఈ సిరీస్‌లో సత్తాచాటాల్సిందే. మరోవైపు రూట్‌ మాత్రం చాలా మెరుగ్గా కనిపిస్తున్నాడు. బ్యాట్‌తో పాటు సారథిగానూ అతను జోరు ప్రదర్శిస్తున్నాడు.

కెప్టెన్‌గా..

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అందరి దృష్టి కోహ్లీపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకు కారణం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌. 2018-19 పర్యటనలో సారథిగా జట్టును సమర్థంగా నడిపించిన కోహ్లీ.. తొలిసారి ఆ గడ్డపై టెస్టు సిరీస్‌ (2-1తో) సొంతం చేసుకున్న భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. కానీ అదే గడ్డపై ఇటీవల సిరీస్‌ (2020-21)లో అప్రతిష్ఠ మూటగట్టుకున్నాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే జట్టు పరిమితమై ఘోర ఓటమితో పాటు తీవ్రమైన అవమానాన్ని అందించింది. దీంతో కోహ్లీపై విమర్శలు చెలరేగాయి. దీనికి తోడు అతని గైర్హాజరీలో తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును నడిపించిన రహానె 2-1తో సిరీస్‌ విజయాన్ని అందించడం వల్ల మరోసారి కోహ్లీ సారథ్యంపై చర్చ మరింత పెరిగింది.

నిరుడు కోహ్లీ నాయకత్వంలో ఆడిన మూడు టెస్టుల్లో (న్యూజిలాండ్‌లో 0-2)నూ జట్టు ఓడింది. 2014లో అతను కెప్టెన్సీ స్వీకరించిన తర్వాత ఇలా వరుసగా మూడు టెస్టుల్లో ఓడడం ఇదే తొలిసారి. ఒక్క టెస్టు విజయం లేకుండా అతను గతేడాదిని ముగించాడు. మరోవైపు భారత్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ రూట్‌ మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. భారత్‌ లాంటి పరిస్థితులే ఉండే శ్రీలంకలో అతని సారథ్యంలోని జట్టు రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్‌ చేయడమే అందుకు కారణం. టీమ్‌ఇండియాతో సిరీస్‌లోనూ అతను జట్టును సమర్థంగా నడిపించి.. విజయాన్ని అందించాలనే పట్టుదలతో ఉన్నాడు.

బ్యాట్స్‌మన్‌గా..

ఇటీవల ఫామ్‌ ఆధారంగా చూస్తే బ్యాటింగ్‌లో కోహ్లీ కంటే రూట్‌ ముందంజలో ఉన్నాడు. నిరుడు కేవలం మూడు టెస్టులే ఆడిన విరాట్​.. ఆ మ్యాచ్‌ల్లో కలిపి ఒక్క అర్ధశతకం మాత్రమే నమోదు చేశాడు. కేవలం 19.33 సగటుతో పరుగులు చేశాడు. బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నైపుణ్యాలను శంకించాల్సిన అవసరమే లేదు. కానీ ప్రస్తుతం అతని ఫామ్‌ జట్టును ఇబ్బంది పెడుతోంది. తాను పరుగులు చేసి సహచర ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవాల్సిన కెప్టెన్​ కోహ్లీ.. ఇలా విఫలమవడం జట్టును దెబ్బతీస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అతను తిరిగి పుంజుకుని సత్తాచాటాల్సి ఉంది.

ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూసుకుంటే రూట్‌ బ్యాటింగ్‌ మరో స్థాయిలో ఉంది. శ్రీలంకలో రెండు టెస్టుల్లోనూ అతను భారీ ఇన్నింగ్స్‌లాడాడు. తొలి టెస్టులో ద్విశతకం (228) బాదిన అతను.. రెండో టెస్టులో భారీ శతకం (186) చేశాడు. ఆ సిరీస్‌లో 106 సగటుతో 426 పరుగులు చేశాడు. భారత్‌కు హెచ్చరికలు పంపాడు. స్పిన్‌ ఆడటంలో మిగతా బ్యాట్స్‌మెన్‌ తడబడితే అతను మాత్రం అలవోకగా బ్యాటింగ్‌ చేశాడు. భారత్‌లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేయాలనే ధ్యేయంతో ఉన్నాడు.

ఇదీ చూడండి: పరీక్ష ముగిసింది.. ప్రాక్టీస్ మొదలైంది

Last Updated :Feb 2, 2021, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.