ETV Bharat / sports

ఐపీఎల్​ స్పాన్సర్​గా 'డ్రీమ్​ 11'కు కొత్త చిక్కులు​..?

author img

By

Published : Aug 19, 2020, 2:45 PM IST

DREAM 11 LATEST NEWS
ఐపీఎల్​ స్పాన్సర్​గా 'డ్రీమ్​ 11'కు చిక్కులు​..?

ఐపీఎల్‌-2020 స్పాన్సర్‌షిప్​ కోసం భారీగా బిడ్​ వేసిన డ్రీమ్​ ఎలెవన్​కు ఓ చిక్కొచ్చి పడింది. 2021, 2022లో జరగనున్న మెగాటోర్నీ కోసం ఈ సంస్థ ఎంత కండిషనల్​ అమౌంట్ చెల్లిస్తుందో చెప్పాలని బీసీసీఐ కోరింది. ఈ ఏడాది వేసిన రూ.222 కోట్ల మొత్తమే చెల్లిస్తే.. రానున్న రెండు ఐపీఎల్లో​ స్పాన్సర్​గా కొనసాగేందుకు వీలుండదని స్పష్టం చేసింది.

ఈ ఏడాది ఐపీఎల్​ టైటిల్​ హక్కులను 'డ్రీమ్​ 11' దక్కించుకున్నట్లు ఐపీఎల్​ ఛైర్మన్​ బ్రిజేష్​ పటేల్​ ఆగస్టు 18న ప్రకటించినప్పటికీ.. ఈ సంస్థను స్పాన్సర్​గా బీసీసీఐ ప్రకటించకపోవడం వెనక కారణముంది. 'డ్రీమ్​ 11' వచ్చే రెండు సీజన్లకు చెల్లించే మొత్తం ఆధారంగానే ఈ ఏడాది స్పాన్సర్​షిప్​ ఇవ్వాలా? వద్దా? అన్నది బీసీసీఐ నిర్ణయించుకోనుందట. అంతేకాకుండా ఈ ఏడాది బిడ్​ వేసిన రూ.222 కోట్ల మొత్తానికే అయితే వచ్చే రెండు సీజన్లకు డ్రీమ్​ 11 స్పాన్సర్​గా ఉండటం కుదరదని అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంతోనే ఇప్పటివరకు 'డ్రీమ్​ 11'ను అధికారికంగా ఐపీఎల్​ కొత్త స్పాన్సర్‌గా ప్రకటించలేనట్లు తెలుస్తోంది.

చిక్కుముడి..

ఈ ఏడాది బిడ్​ మూడేళ్ల పరిమితికి నిర్వహించింది బీసీసీఐ. ఒకవేళ వివో 2021, 22లో నిర్వహించే ఐపీఎల్​ నిర్వహణకు ముందుకు రాకపోతే.. ఈ ఏడాది స్పాన్సర్​ షిప్​ గెలుచుకున్న సంస్థే రెండేళ్ల బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఇందుకు వివో ఏడాదికి ఇచ్చే రూ.440 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే రూ.222 కోట్ల కంటే ఎక్కువగానే కండిషనల్​ అమౌంట్​ ఇస్తామని స్పష్టం చేయాలి. 'డ్రీమ్​ 11' రూ.240 కోట్లు చెల్లించాలని ఇప్పటికే బీసీసీఐ పేర్కొంది.

"ఎక్కువ మొత్తం బిడ్​ వేసిన వారికి టైటిల్​ హక్కులు దక్కవు. బీసీసీఐ నిబంధనలు బిడ్డర్లకు తెలుసు. డ్రీమ్​11 భారీగా బిడ్​ వేసి..ఫేవరెట్​గా బరిలో ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి పరిష్కారం అయ్యాకే స్పాన్సర్​గా అధికారిక ప్రకటన వస్తుంది".

-- బీసీసీఐలో ఓ ఉన్నతాధికారి.

ఇప్పటికే ఈ విషయంలో బీసీసీఐ, డ్రీమ్​ 11 మధ్య చర్చలు జరుగుతున్నాయి. తర్వాత రెండు ఐపీఎల్​ టోర్నీల బిడ్​ల మొత్తాన్ని పెంచాలని డ్రీమ్ 11కు బీసీసీఐ సూచించింది.

"ఈ ఏడాది స్పాన్సర్​గా రూ.222 కోట్లు పర్వాలేదు. కానీ ఇది మూడేళ్ల కండిషనల్​ బిడ్​. ఇప్పటికీ వివోతో మా డీల్ కొనసాగుతోంది. డ్రీమ్​ 11కు రెండు ఆప్షన్లు ఉన్నాయి. నాలుగు నెలల 13 రోజుల కాలానికి రూ.222 కోట్లు చెల్లించాలి. లేదంటే 2021, 2022 కాలానికి కండిషనల్​ అమౌంట్​ను పెంచాలి" అని బీసీసీఐ అధికారులు కోరుతున్నారు.

స్పాన్సర్‌షిప్‌ హక్కుల రేసులో బైజుస్‌ (రూ.201 కోట్లు), అన్‌అకాడమీ (రూ.170 కోట్లు) రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. గతేడాది వరకు స్పాన్సర్​గా కొనసాగిన వివో.. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాదికి ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

అక్కడా చైనా కంపెనీ పెట్టుబడులు:

డ్రీమ్‌ 11లో చైనా కంపెనీ టెన్సెంట్‌ పెట్టుబడులు ఉండడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అది 10 శాతం లోపేనని బోర్డులోని ఓ అధికారి చెప్పారు.

"వ్యవస్థాపకులు సహా డ్రీమ్‌ ఎలెవన్‌ వాటాదారులు, మొత్తం 400 మంది ఉద్యోగులు భారతీయులే. భారత్‌కే చెందిన కలారి క్యాపిటల్‌, మల్టిపుల్స్‌ ఈక్విటీ అందులో పెట్టుబడిదారులు. డ్రీమ్‌ 11 ఉత్పత్తులు కూడా కేవలం భారతీయులు కోసమే. డ్రీమ్‌ 11లో టెన్సెంట్‌ వాటా పది శాతం లోపే" అని బీసీసీఐ అధికారి వివరించారు

అయితే గత నెలలోనే బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం.. ఓ నకిలీ టీ20 లీగ్‌తో డ్రీమ్‌ 11కు సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ కంపెనీపై విచారణ చేయాలని పోలీసులను కోరింది. పంజాబ్‌లో జరిగిన ఆ లీగ్‌ను శ్రీలంకలో జరిగినట్లుగా లైవ్‌స్ట్రీమ్‌ చేశారు. లీగ్‌లో ఆటగాళ్లు వాడిన కిట్లపై డ్రీమ్‌ 11 లోగోలు ఉన్నట్లు, మ్యాచ్‌లను ఫ్యాన్‌ కోడ్‌లో లైవ్‌స్ట్రీమ్‌ చేసినట్లు ఏసీయూ విచారణలో తేలింది. డ్రీమ్‌ 11, ఫ్యాన్‌కోడ్‌లు రెండూ డ్రీమ్‌ స్పోర్ట్స్‌ గ్రూపులో భాగమే. వివో నుంచి వచ్చిన మొత్తంలో సగమే రావడం ఊహించిందేనని బీసీసీఐ అధికారి చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.