సౌరభ్ గంగూలీ.. క్రికెట్ ప్రియులకు సుపరిచితమైన పేరు. ముద్దుగా అభిమానులు దాదా అని పిలుచుకుంటారు. కోల్‌కతా ప్రిన్స్, బంగాల్ టైగర్ ఇలా చాలా పేర్లే ఇతడికి ఉన్నాయ్ లెండి. భారత క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్‌గా, దూకుడైన బ్యాట్స్‌మన్‌గా అభిమానుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు గంగూలీ. అయితే.. దాదా అంటే క్రికెట్ మాత్రమే కాదు, అంతకుమించి ఆసక్తి రేకెత్తించే ప్రేమకథ అతడి జీవితంలో ఉంది. 1997 ఫిబ్రవరి 1న ఆ ప్రేమ.. పెళ్లి పీటలెక్కింది.
చిన్నప్పటినుంచే గంగూలీ, డోనాలు ఒకరికొకరు తెలుసు. వారిద్దరివీ పక్క పక్క ఇళ్లే అయినా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌కు వెళ్లేటప్పుడు ఆమెపై చూపుల బాణాలు విసిరేవాడు దాదా. ఆమెను ఆకర్షించేందుకు అప్పుడప్పుడు డోనా చదివే పాఠశాల మీదుగా వెళ్లేవాడు. ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, స్వయంగా గంగూలీనే ఈ విషయాన్ని అంగీకరించాడు.
![BCCI Chief Sourav ganguly and Dona roy ganguly's love story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10592781_4.jpg)
'' నేను ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు.. ఎక్కడికో వెళ్లేవాడిని. నేను ఆమెను బాగా చూసేవాడ్ని'' - దాదా
డోనా తక్కువేం కాదు. తనకు తెలియకుండానే దాదా ప్రేమలో పడిపోయింది. దాదా బ్యాడ్మింటన్ ఆడే సమయంలో షటిల్ కాక్ ఎప్పుడెప్పుడు.. తన కాంపౌండ్‌లో పడుతుందా అని ఎదురుచూసేదట. ఓ ముఖాముఖిలో ఈ విషయాన్ని వెల్లడించింది గంగూలీ ప్రేయసి.
''షటిల్‌కాక్.. మా కాంపౌండ్‌లో పడినప్పుడల్లా.. దానిని తిరిగిచ్చేందుకు నాకు ఛాన్స్ దొరికేది.'' - డోనా గంగూలీ
రెస్టారెంట్లో డేట్‌కు..
కోల్‌కతాలోని చైనీస్ రెస్టారెంట్లో తొలిసారి డేట్‌కు వెళ్లిందీ జంట. అయితే.. దాదా చేసిన ఫుడ్ ఆర్డర్‌ను చూసి డోనా ఆశ్చర్యపోయింది. కానీ.. చివరకు మొత్తం లాగించేశాడట.
![BCCI Chief Sourav ganguly and Dona roy ganguly's love story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10592781_5.jpg)
ఇక్కడో విలన్..!
ఎప్పుడు ఎలా మొదలైందో తెలియదు కానీ ఒకరితో ఒకరు ప్రేమలో పడిపోయారు. తొలుత సౌరభ్ తల్లిదండ్రులు.. వారి ప్రేమను తిరస్కరించినా, చివరకు ఒప్పుకున్నారు. అయితే.. ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. డోనా తండ్రికి.. గంగూలీ కుటుంబంతో ఏళ్లుగా గొడవలున్నాయి. ఆయన.. పెళ్లికి ఒప్పుకుంటాడో లేదోనని కొంత అనుమానాలున్నా.. గంగూలీ ఏ మాత్రం ఆశలు కోల్పోలేదు. రోజూ డోనాను కలిసేవాడు. డోనా కూడా గంగూలీ కోసం క్రికెట్ మ్యాచ్‌లకు హాజరయ్యేది.
రహస్య పెళ్లి..
డోనా తండ్రి ఒప్పుకుంటాడని కొద్ది కాలం ఎదురుచూసీ చూసీ విసుగొచ్చిన దాదాకు ఓ ఆలోచన తట్టింది. అంతే.. ఇంగ్లాండ్‌లో భారత క్రికెట్ జట్టు పర్యటన ముగిసిన అనంతరం రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే.. ఆ ప్లాన్ బెడిసికొట్టింది. కార్యాలయం వద్ద చాలా మంది నిరీక్షణలో ఉండటం వల్ల పెళ్లి జరగలేదు.
![BCCI Chief Sourav ganguly and Dona roy ganguly's love story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10592781_1.jpg)
ఆ తర్వాత మరో షాకింగ్ నిర్ణయం తీసుకుని, స్నేహితుడి ఇంట్లో రహస్య వివాహం చేసుకున్నాడు గంగూలీ. ఇరువురి ప్రేమపై ఎప్పుటినుంచో కోపంగా ఉన్న డోనా తల్లిదండ్రులు తొలుత ఆగ్రహించినా, చివరికి అంగీకరించక తప్పలేదు.
అధికారికంగా..
గంగూలీ-డోనాలకు పెళ్లి జరిగిన విషయం 6 నెలల వరకు బయటి సమాజానికి తెలియలేదు. వారికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో.. ఓ స్థానిక వార్తాపత్రిక ఈ రహస్య వివాహాన్ని బయటపెట్టింది. దీంతో సౌరభ్-డోనాలు దీనిని అంగీకరించాల్సి వచ్చింది.
ఇక చేసేదేం లేక వారి తల్లిదండ్రులు.. 1997 ఫిబ్రవరి 1న అధికారికంగా మరోసారి పెళ్లి జరిపించారు. ఘనంగా జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులు, పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. ఇప్పుడీ జంట ఎంతో సంతోషంగా ఉంది. గంగూలీ-డోనా దంపతులకు సనా గంగూలీ అనే కూతురుంది.
![BCCI Chief Sourav ganguly and Dona roy ganguly's love story](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10592781_12.jpg)
గంగూలీ కూడా తన క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం.. కీలక పదవులను అధిరోహించాడు. తొలుత బంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడిగా.. ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా ఉన్నాడు.
ఇదన్న మాట సంగతి. మన దాదా క్రికెట్లోనే కాదు.. ప్రేమ వ్యవహారంలోనూ దూకుడు ప్రదర్శించి నచ్చిన, మనసిచ్చిన అమ్మాయినే జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు.