ETV Bharat / sports

గిల్లీ దెబ్బకు ఆ బౌలర్ల దిమ్మతిరిగింది!

author img

By

Published : May 11, 2020, 6:36 AM IST

ముత్తయ్య మురళీధరన్‌కు బంతి ఎక్కడేయాలో పాలుపోలేదు.. చమిందా వాస్‌ అస్త్రాలన్నీ అయిపోయాయి.. జయసూర్య ట్రిక్కులూ పని చేయలేదు.. అలా అని వాళ్లేమీ వేరే దేశంలో ఆడలేదు. తమ అడ్డా అయిన స్వదేశంలోనే బౌలింగ్‌ చేస్తున్నారు. కానీ అతని దెబ్బకు లంకకు సొంతగడ్డపైనే దిమ్మతిరిగిపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత సిరీస్​ చేజార్చుకుంది. లంకను అంతగా దెబ్బ కొట్టిన ఆ ధీరుడే ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌! ఓ టెస్టు మ్యాచ్‌లో లంకను లంకలో ఓడించడం ప్రత్యర్థులకు అసాధ్యంలా కనిపించిన సమయంలో 3-0తో అక్కడ సిరీస్‌ గెలిచిన ఘనత ఆస్ట్రేలియాది. 2004లో జరిగిన ఈ అద్భుతంలో గిల్లీది కీలక పాత్ర. కాండీలో జట్టుకు సిరీస్‌ విజయాన్నందించిన గిల్లీ మెరుపు ఇన్నింగ్స్‌ (144) అతడి కెరీర్లోనే ప్రత్యేకం.

Adam Gilchrist who made the Sri Lankan spinners stun
లంక స్పిన్నర్లకు దిమ్మదిరిగేలా చేసిన గిల్లీ

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా జట్లకు ఉపఖండంలో ఆడుతుంటే చెమటలు పడతాయి.. దీనికి కారణం స్పిన్నర్లు! ఇక్కడ స్పిన్‌ వికెట్లపై బంతి గిర్రు గిర్రున తిరుగుతుంటే ఆ దేశాల బ్యాట్స్‌మెన్‌ క్రీజులోనే నాట్యం చేయడం చాలాసార్లు చూశాం. కానీ 2004 లంక సిరీస్‌లో మాత్రం ఆస్ట్రేలియా చరిత్రలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుని సత్తా చాటింది. ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు విధ్వంసక ఓపెనర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌. ఈ సిరీస్‌లో తొలి టెస్టులో ఓడి నిరాశలో ఉన్న లంకకు కాండీ టెస్టులో గిల్లీ పెద్ద షాక్‌ ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ చేసింది 120 పరుగులే. ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. బదులుగా లంక 211 పరుగులు చేసింది. మురళీధరన్‌ అప్పుడున్న ఫామ్‌ ప్రకారం చూస్తే 91 పరుగుల ఆధిక్యం సాధించిన లంక.. ఇక మ్యాచ్‌ గెలవడం లాంఛనమే అనుకున్నారంతా!

సిరీస్​ క్లీన్​స్వీప్​

ఐతే రెండో ఇన్నింగ్స్‌లో మురళీ ధాటికి ఆసీస్‌ కుప్పకూలడం ఖాయమనుకుంటే.. గిల్‌క్రిస్ట్‌ (144; 185 బంతుల్లో 19×4, 3×6), డామియన్‌ మార్టిన్‌ (161; 349 బంతుల్లో 21×4, 1×6) జోడీ కథ మొత్తం మార్చేసింది. మార్టినే ఎక్కువ స్కోరు చేసినా.. తన ఆటతో లంకను ఆత్మరక్షణలోకి నెట్టి, మ్యాచ్‌ మలుపు తిరిగేలా చేసింది మాత్రం గిల్లీనే. 26 పరుగులకే 2 వికెట్లు పడ్డ స్థితిలో.. అతను లంక బృందంపై ఎదురుదాడి చేశాడు. ప్రమాదకర మురళీని లక్ష్యంగా చేసుకుని స్వీప్‌ షాట్లతో హోరెత్తించిన అతను.. వాస్‌నూ ఓ ఆట ఆడుకున్నాడు. క్రీజు వదిలి ముందుకొచ్చి అతను కొట్టిన కట్‌ షాట్లు.. లాఫ్టెడ్‌ షాట్లు చూసి తీరాల్సిందే. 72 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన గిల్లీ... మరో 56 బంతుల్లో సెంచరీ మైలురాయిని అందుకున్నాడు. శతకం పూర్తయ్యాక మరింత ధాటిగా ఆడిన గిల్లీ.. మార్టిన్‌తో కలిసి మూడో వికెట్‌కు సరిగ్గా 200 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఆసీస్‌ అనూహ్యంగా 442 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు 352 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. ఛేదనలో జయసూర్య (131; 145 బంతుల్లో 17×4, 2×6) చెలరేగినా.. లంకను 324 పరుగులకు ఆలౌట్‌ చేసి 27 పరుగుల తేడాతో ఆసీస్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. సిరీస్‌నూ గెలుచుకుంది. ఈ ఊపులో చివరి టెస్టునూ గెలిచిన ఆసీస్‌.. క్లీన్‌స్వీప్‌ను పూర్తి చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులు వెనకబడి.. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో.. బంతి గిరగిరా తిరుగుతున్న పిచ్‌పై మురళీ లాంటి మాస్టర్‌ స్పిన్నర్‌, మిగతా లంక బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ గిల్‌క్రిస్ట్‌ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ ఎప్పటికీ గుర్తుండిపోయేదే.

బ్యాట్స్‌మన్‌ : ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌

పరుగులు : 144

బంతులు : 185

ప్రత్యర్థి : శ్రీలంక

ఫలితం : 27 పరుగులతో ఆసీస్‌ విజయం

సంవత్సరం: 2004

ఇదీ చూడండి.. 'కోహ్లీ అందుకే స్లెడ్జింగ్​ చేస్తాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.