ETV Bharat / sports

BCCI చీఫ్​ సెలెక్టర్​ చేతన్​ శర్మ రాజీనామా.. ఆమోదించిన జై షా

author img

By

Published : Feb 17, 2023, 10:56 AM IST

Updated : Feb 17, 2023, 12:48 PM IST

BCCI చీఫ్​ సెలెక్టర్​ పదవికి చేతన్​ శర్మ రాజీనామా
BCCI చీఫ్​ సెలెక్టర్​ పదవికి చేతన్​ శర్మ రాజీనామా

10:51 February 17

BCCI చీఫ్​ సెలెక్టర్​ పదవికి చేతన్​ శర్మ రాజీనామా

బీసీసీఐ చీఫ్​ సెలెక్టర్ చేతన్​ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామాను బీసీసీఐ కార్యదర్శి జై షా ఆమోదించారు. కాగా, ఇటీవల ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో ఆయన భారత జట్టులో నెలకొన్న పరిస్థితులపై పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. ఫిట్‌నెస్‌ కోసం టీమ్ఇండియా క్రికెటర్లు ఇంజక్షన్లు తీసుకోవడం, సౌరవ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లీల మధ్య పొరపొచ్చాలు లాంటి విషయాలను అందులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో చేతన్‌శర్మ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది

ఆసీస్‌తో జరుగుతున్న బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ మధ్యలో ఈ పరిణామం జరగడం గమనార్హం. దీంతో చేతన్‌ శర్మ రాజీనామా సిరీస్‌పై ప్రభావం చూపించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై బీసీసీఐకు చెందిన ఓ సీనియర్‌ అధికారి స్పందించారు. "సిరీస్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. మిగతా రెండు మ్యాచ్‌లకు జట్టు ఎంపికకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం" అని తెలిపారు.

వివాదమిదీ..
ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో చేతన్‌ శర్మ భారత జట్టులో నెలకొన్న పరిస్థితులపై పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించాడు. కొందరు భారత క్రికెటర్లు ఫిట్‌గా లేనప్పటికీ ఇంజక్షన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించాడు. వారు తీసుకుంటున్న ఇంజక్షన్లను డోపింగ్‌ పరీక్షల్లో సైతం గుర్తించలేరని తెలిపాడు. 80 శాతం ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు కీలకమైన మ్యాచ్‌లకు ముందు ఇంజక్షన్లు తీసుకొని పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్లుగా చూపి మ్యాచ్‌లు ఆడుతున్నట్లు చేతన్‌ శర్మ ఆరోపించాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీల మధ్య విభేదాలు ఉన్నాయని చేతన్‌శర్మ చెప్పాడు. మరోవైపు టీమిండియాలో రెండు వర్గాలు ఉన్నాయని.. వాటికి కోహ్లీ, రోహిత్‌ శర్మ నాయకత్వం వహిస్తారని పేర్కొన్నాడు. హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌, కోహ్లీల మధ్య కూడా అంతర్గత చర్చలకు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. జట్టుకు సంబంధించిన రహస్య వివరాలు బయటకు రావడంపై బీసీసీఐ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.

బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా మరోసారి చేతన్‌ శర్మను నియమిస్తూ బోర్డు గత నెలలోనే నిర్ణయం తీసుకుంది. గత టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో పది వికెట్ల తేడాతో భారత్‌ ఘోర పరాభవం చెందిన తర్వాత అప్పటి సెలెక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొత్తవారికి కమిటీ బాధ్యతలు అప్పగించాలని భావించినా.. అనూహ్యంగా చేతన్‌నే ఆ పదవిలో నియమించారు.

Last Updated :Feb 17, 2023, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.