ETV Bharat / sports

Ashes 2023 : తొలి టెస్టులో ఇంగ్లాండ్‌కు నిరాశే.. ఆసీస్‌దే ఆఖరి పంచ్‌!

author img

By

Published : Jun 21, 2023, 6:41 AM IST

Eng Vs Aus Ashes : యాషెస్‌ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు తమ తొలి టెస్ట్​ను అద్భుతంగా ముగించాయి. ఎంతో ఉత్కంఠగా జరిగిన పోరులో చివరి రోజు మరింత ఆసక్తికరంగా మారింది. పరుగుల కోసం ఆసీస్‌, వికెట్ల కోసం ఇంగ్లాండ్‌ హోరాహోరీగా తలపడ్డాయి. చివరి నిమిషాల్లో ఫలితం తేలిన మ్యాచ్‌లో విజయం కంగారూలనే వరించింది.

Etv Bharat
Etv Bharat

Ashes 2023 : యాషెస్‌ తొలి టెస్టుకు అనూహ్యమైన ముగింపు లభించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి హోరాహోరీగా తలపడుతూ వచ్చిన ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు.. ఆఖరి రోజు తమ పోరాటాన్ని మరింత ఉత్కంఠతకు తీసుకెళ్లాయి. దీంతో ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో గొప్పగా పోరాడిన కంగారూలదే పై చేయిగా నిలిచింది. ఉత్కంఠ భరితంగా ముగిసిన ఈ పోరులో ఆ జట్టు 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఈ క్రమంలో 281 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ సాధించిన ఓపెనర్‌ ఖవాజా.. మరో మేటి ఇన్నింగ్స్‌ ఆడాడు. మ్యాచ్‌ చేజారుతున్న దశలో కెప్టెన్‌ కమిన్స్‌.. లైయన్​తో కలిసి గొప్పగా పోరాడి ఆసీస్‌ను గెలిపించాడు. ఇక ఇంగ్లాండ్‌ బౌలర్లలో స్టువర్ట్‌ బ్రాడ్‌, ఓలీ రాబిన్సన్‌ రాణించారు. అయిదు టెస్టుల సిరీస్‌లో తర్వాతి మ్యాచ్‌ ఈ నెల 28న మొదలవుతుంది.

నాలుగో రోజు ఆట చివరికి ఆస్ట్రేలియా స్కోరు 107/3. ఆ జట్టు విజయానికి ఇంకా 174 పరుగులు కావాల్సి ఉంది. మరోవైపు ఇంగ్లాండ్‌ విజయానికి అవసరమైన వికెట్లు 7. మామూలుగా అయితే మధ్యాహ్నానికి ఫలితాలు తేలిపోవాలి. కానీ పిలవని అతిథిలా వచ్చిన వరుణుడు.. మధ్యాహ్నం వరకు ప్రతాపం చూపడం వల్ల ఫలితంపై ఉత్కంఠ తప్పలేదు. తొలి సెషన్‌ అంతా వర్షం వల్ల తుడిచిపెట్టుకుపోగా.. రసవత్తర మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందేమో అని అభిమానులు ఆందోళన చెందారు. కానీ రెండో సెషన్​లో వర్షం ఆగిపోవడం వల్ల ఆటకు మార్గం సుగమమైంది. 67 ఓవర్లు అందుబాటులో ఉండగా.. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు ఖవాజా, బోలాండ్‌ (నైట్‌వాచ్‌మన్‌) ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. ఏడు ఓవర్లకు పైగా వికెట్‌ ఇవ్వలేదు. ఆచితూచి ఆడుతున్న బోలాండ్​ను బ్రాడ్‌ ఔట్‌ చేసి వికెట్ల పతనాన్ని ఆరంభించాడు.

యాషెస్​ 2023
కమిన్స్

Eng Vs Aus Ashes : హెడ్‌ వచ్చీ రాగానే షాట్లకు దిగడం వల్ల దూకుడుగా ఆడి మ్యాచ్‌ను ముగించాలనే ప్రణాళికతో ఆసీస్‌ ఉన్నట్లు కనిపించింది. కానీ అతణ్ని మొయిన్‌ అలీ ఎక్కువసేపు క్రీజులో నిలవనీయలేదు. చక్కటి స్పిన్నింగ్‌ డెలివరీకి హెడ్‌ స్లిప్‌లో రూట్‌కు చిక్కడం వల్ల ఇంగ్లాండ్‌ సంతోషంలో మునిగిపోయింది. అప్పటికి స్కోరు 143/5. అప్పటికీ 138 పరుగులు చేయాల్సి ఉండటం వల్ల ఆసీస్‌కు కష్టమే అనిపించింది. అయితే ఓ ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయిన ఖవాజాకు.. గ్రీన్‌ జత కలవడం వల్ల ఆసీస్‌ వేగం పుంజుకుంది. 192/5తో మెరుగైన స్థితికి చేరుకుంది. దీంతో మరో వికెట్‌ కోసం ఇంగ్లాండ్‌ 19 ఓవర్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. మ్యాచ్‌ ఆసీస్‌ వైపు మొగ్గుతున్న దశలో గ్రీన్‌ను రాబిన్సన్‌ బౌల్డ్‌ చేయగా.. కాసేపటికే ఖవాజా అసమాన ఇన్నింగ్స్‌కు స్టోక్స్‌ తెరదించాడు. వీళ్లిద్దరూ బంతిని వికెట్ల మీదికి ఆడుకున్నారు.

యాషెస్​ 2023
స్ట్రోక్స్​

ఖవాజా ఏడో వికెట్‌ రూపంలో వెనుదిరిగే సమయానికి స్కోరు 209. ఈ దశలో కేరీ (20)తో కలిసి కమిన్స్‌ పట్టుదలను ప్రదర్శించాడు. కానీ 227 పరుగుల వద్ద కేరీని రూట్‌ ఔట్‌ చేయడం వల్ల మ్యాచ్‌ ఇంగ్లాండ్‌ చేతుల్లోకి వచ్చేసినట్లే అనిపించింది. చేతిలో రెండు వికెట్లే ఉండగా.. జోరుమీదున్న ఇంగ్లిష్‌ బౌలర్లను కాచుకుని 54 పరుగులు చేయడం చాలా కష్టంగానే అనిపించింది. కానీ ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ మాత్రం తన ఆశలను ఏ మాత్రం వదులుకోలేదు. లైయన్‌ అండతో గొప్పగా పోరాడాడు. ఇంగ్లాండ్‌ బౌలర్ల ఒత్తిడి ఉన్నప్పటికీ. ఈ జోడీ వాటన్నింటిని తట్టుకుని నిలబడింది. రూట్‌ బౌలింగ్‌లో కమిన్స్‌ రెండు సిక్సర్లు బాదడం వల్ల ఒత్తిడి కాస్త తగ్గిపోయింది. ఇక ఆసీస్‌ విజయం దిశగా అడుగులేసింది. మధ్యలో కమిన్స్‌, లైయన్‌ల క్లిష్టమైన క్యాచ్‌లు నేలపాలయ్యాయి. చివర్లో ఇంగ్లాండ్‌ వికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. రాబిన్సన్‌ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్‌ వైపు బౌండరీ కొట్టిన కమిన్స్‌ జట్టును గెలుపు పథంలోకి నడిపించాడు.

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 393/8 డిక్లేర్డ్‌

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 386

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 273

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 282/8 (ఖవాజా 65, వార్నర్‌ 36, గ్రీన్‌ 28, కమిన్స్‌ 44 నాటౌట్‌; బ్రాడ్‌ 3/64, రాబిన్సన్‌ 2/43)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.