ETV Bharat / sports

పాక్​ వర్సెస్ శ్రీలంక.. ఆసియాకప్‌ ఎవరిది? నేడే ఫైనల్‌!

author img

By

Published : Sep 11, 2022, 6:41 AM IST

Asia Cup Final Match
Asia Cup Final Match

ఏదో అనుకున్నాం. ఇంకేదో జరిగింది. ఆసియా కప్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా, ఈసారి కూడా టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా.. ఫైనల్‌ చేరకుండానే నిష్క్రమించింది. గ్రూప్‌ దశలో తిరుగులేని ప్రదర్శన చేసిన అఫ్గానిస్థాన్‌.. సూపర్‌-4లో చతికిలపడింది. తక్కువ అంచనాలతో టోర్నీలో అడుగు పెట్టినా మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగవుతూ సూపర్‌-4లో మూడుకు మూడు మ్యాచ్‌లు నెగ్గిన శ్రీలంక ఫైనల్లోకి దూసుకొచ్చింది. తొలి మ్యాచ్‌లో భారత్‌కు తలవంచిన పాక్‌.. తర్వాత పుంజుకుని తుది పోరుకు అర్హత సాధించింది. ఇప్పుడీ రెండు జట్ల మధ్య తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారమే టైటిల్‌ పోరు. మరి పాకిస్థాన్‌ మూడోసారి ఆసియాకప్‌ను చేజిక్కించుకుంటుందా.. లేక లంక ఆరో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంటుందా?

Asia Cup 2022 Finals : ఆసియా కప్‌ బరిలో నిలిచిన ఆరు జట్లలో హాంకాంగ్‌ను పక్కన పెడితే.. మిగతా అయిదు జట్టలో అతి తక్కువ అంచనాలతో టోర్నీలో అడుగు పెట్టిన జట్టు శ్రీలంక. ఒకప్పటితో పోలిస్తే బాగా బలహీన పడి, దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా ఆటగాళ్లలో అనిశ్చితి నెలకొని, స్వదేశంలో ఆసియా కప్‌ నిర్వహించలేని స్థితిలో యూఏఈకి ఆతిథ్యం కట్టబెట్టిన దుస్థితిలో టోర్నీకి వచ్చిందా జట్టు. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో ఆ జట్టుపై పూర్తిగా నమ్మకం పోయింది అందరికీ.

కానీ రెండో మ్యాచ్‌ నుంచి గొప్ప పట్టుదలతో ఆడుతూ, భారత్‌, పాకిస్థాన్‌ లాంటి మేటి జట్లను మట్టికరిపిస్తూ ఫైనల్‌ చేరిన లంకేయులు.. ఇప్పుడు టైటిల్‌కు హాట్‌ ఫేవరెట్లుగా మారారు. పాకిస్థాన్‌ కూడా మెరుగ్గానే కనిపిస్తున్నప్పటికీ.. ఇప్పుడు లంక ఉన్న ఊపులో, ఇప్పటికే గ్రూప్‌ దశలో తమను ఓడించిన ఆ జట్టుపై నెగ్గి ఆసియా కప్‌ను అందుకోవడం అంత తేలిక కాదు. అలా అని పాక్‌ అవకాశాలను తీసిపడేయలేం. ఎప్పట్లాగే ఉత్తమ బౌలింగ్‌, ఇటీవల మెరుగుపడ్డ బ్యాటింగ్‌తో ఆ జట్టు టైటిల్‌ రేసులో ఉంది.

లంక అన్నింటా.. : అఫ్గాన్‌ చేతిలో ఓటమి తర్వాత టోర్నీలో లంక పుంజుకున్న తీరు అసామాన్యం. బంగ్లాతో రెండో లీగ్‌ మ్యాచ్‌లో గెలిస్తేనే సూపర్‌-4కు అర్హత సాధించాల్సిన స్థితిలో పోరాడితే పోయేదేముందన్నట్లు ఆ జట్టు తెగించి ఆడింది. 184 పరుగుల కఠిన లక్ష్యాన్ని ఛేదించి ముందంజ వేసింది. అక్కడి నుంచి అదే దృక్పథాన్ని కొనసాగిస్తూ సూపర్‌-4లో భారత్‌, పాక్‌లను కూడా ఓడించింది. బ్యాటింగ్‌లో ఆ జట్టు ఎదురు దాడే మంత్రంగా ఆడుతోంది. కుశాల్‌ మెండిస్‌, నిశాంక, రాజపక్స, శానక తమ దూకుడుతో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తున్నారు. ముఖ్యంగా ఛేదనల్లో కెప్టెన్‌ శానక అదరగొడుతున్నాడు. అతను బౌలింగ్‌తోనూ జట్టుకు ఉపయోగపడుతున్నాడు.

కరుణరత్నె సైతం ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేస్తున్నాడు. బౌలింగ్‌లో అనుభవజ్ఞులు హసరంగ, తీక్షణలకు తోడు యువ బౌలర్‌ మధుశంక ఆకట్టుకుంటున్నాడు. లంక ఫీల్డింగ్‌ కూడా మెరుగ్గా సాగుతోంది. ఇదే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనను ఆ జట్టు ఫైనల్లోనూ కొనసాగిస్తే కప్పు గెలిచేసినట్లే. ఇక పాక్‌ విషయానికి వస్తే.. ఎప్పట్లాగే బౌలింగే ఆ జట్టు బలం. పేస్‌లో నసీమ్‌ షా, రవూఫ్‌, హస్నైన్‌.. స్పిన్‌లో షాదాబ్‌, నవాజ్‌ అదరగొడుగుతున్నారు. బ్యాటింగ్‌లో ఆ జట్టును నిలకడ లేమి ఇబ్బంది పడుతోంది. కెప్టెన్‌ బాబర్‌ అనూహ్యంగా టోర్నీలో విఫలమయ్యాడు. అయితే లంకతో చివరి మ్యాచ్‌లో అతను పర్వాలేదనిపించాడు. ఫైనల్లో కెప్టెన్‌ నుంచి పెద్ద ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది పాక్‌. ఫామ్‌లో ఉన్న రిజ్వాన్‌ మీద ఆ జట్టు చాలా ఆశలు పెట్టుకుంది. జమాన్‌, ఖుష్‌దిల్‌ షాలకు తోడు మిడిలార్డర్లో షాదాబ్‌, అసిఫ్‌ అలీ, నవాజ్‌ కీలకం.

తుది జట్లు (అంచనా)... పాకిస్థాన్‌: బాబర్‌ (కెప్టెన్‌), రిజ్వాన్‌ (వికెట్‌ కీపర్‌), జమాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, ఖుష్‌దిల్‌ షా, అసిఫ్‌ అలీ, షాదాబ్‌, నవాజ్‌, నసీమ్‌ షా, రవూఫ్‌, హస్నైన్‌.
శ్రీలంక: కుశాల్‌ మెండిస్‌ (వికెట్‌ కీపర్‌), నిశాంక, ధనంజయ డిసిల్వా, గుణతిలక, రాజపక్స, శానక, హసరంగ, చమిక కరుణరత్నె, తీక్షణ, మధుశంక, మధుశాన్‌.

పాకిస్థాన్‌, శ్రీలంక ఆడిన ఆసియా కప్‌ ఫైనల్స్‌. రెండుసార్లు లంక (1986, 2014) నెగ్గగా.. ఒకసారి పాక్‌ (2000) విజయం సాధించింది.ఆసియా కప్‌లో 11 సార్లు ఫైనల్‌ చేరిన శ్రీలంక అయిదుసార్లు విజేతగా నిలిచింది. ఆరుసార్లు రన్నరప్‌ అయింది. టోర్నీలో నాలుగు ఫైనల్స్‌ ఆడిన పాక్‌.. రెండు నెగ్గి, రెండు ఓడింది.దుబాయ్‌ బౌలర్లకు ఎక్కువ అనుకూలం. ముఖ్యంగా స్పిన్నర్ల ఆధిపత్యం సాగొచ్చు. బ్యాటింగ్‌ మరీ కష్టమేమీ కాదు. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశముంది.

ఇదీ చదవండి: టీ20 వరల్డ్​కప్​కు టీమ్​ ఇండియా ఎంపిక అప్పుడే.. ఆ ఇద్దరి వల్లే ఆలస్యం.

'పెద్ద టోర్నీల్లో ప్రయోగాలా?.. వరల్డ్​ కప్​లో టీమ్​ఇండియా గెలవడం చాలా ముఖ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.