ETV Bharat / sports

చిన్న టీమ్​ల పెద్ద దెబ్బ.. ఛాంపియన్లకు వరుస షాక్​లు.. బహుపరాక్!

author img

By

Published : Oct 18, 2022, 7:23 AM IST

2022-t20-world-cup
2022-t20-world-cup

నమీబియా చేతిలో శ్రీలంక ఓటమి. టీ20 ప్రపంచకప్‌ తొలి రోజే పెద్ద సంచలనం! దీనికే షాకవుతుంటే.. స్కాట్లాండ్‌ చేతిలో వెస్టిండీస్‌ కంగుతింది! ఈ రెండు విజయాలు గాలివాటం అనుకుంటే పొరపాటే. ఆ జట్లేమీ చిన్న తేడాతోనో, అదృష్టం కలిసొచ్చో గెలిచేయలేదు. రెండు జట్లూ సాధికారితతో ఆడాయి. మ్యాచ్‌లో ఎక్కువ శాతం ఆధిపత్యం చలాయించాయి. ఆద్యంతం ఒక ప్రణాళిక ప్రకారం ఆడి మాజీ ఛాంపియన్లను మట్టికరిపించాయి. ఈ రెండు మ్యాచ్‌ల ఫలితాలు ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్న పెద్ద జట్లకు ఒక పెద్ద హెచ్చరికే.

ఓ పెద్ద జట్టు.. చిన్న జట్టు చేతిలో షాక్‌ తిన్న సందర్భాలు ప్రపంచ క్రికెట్లో లేకపోలేదు. ఒకప్పుడు వన్డేల్లో ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఫలితాలు వచ్చేవి. ఆ రోజుకు అదృష్టం కలిసొచ్చి, అవతలి జట్టు స్థాయికి తగ్గట్లు ఆడకపోవడం వల్ల పసికూనలు గెలిచేసేవి అప్పట్లో. కానీ టీ20 క్రికెట్‌తో మొత్తం మారిపోయింది. జట్ల మధ్య అంతరం తగ్గిపోయింది. దీంతో ఏ జట్టునూ పసికూన అని ముద్ర వేయలేని పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్స్‌లో ఆడుతూ.. తీవ్రతతో తలపడుతూ అన్ని దేశాల క్రికెటర్లూ రాటుదేలుతున్నారు. బ్యాటర్లు అవతల ఎలాంటి బౌలర్లున్నా లెక్క చేయకుండా పవర్‌ హిట్టింగ్‌తో, పిచ్‌లతో సంబంధం లేకుండా చెలరేగిపోతున్నారు. కొన్ని పెద్ద క్రికెట్‌ దేశాల్లో అవకాశాలు లభించక చిన్న జట్లకు ప్రాతినిధ్యం వహించడం ద్వారా ఆ జట్ల ప్రమాణాలు పెంచుతున్న క్రికెటర్లూ ఉన్నారు. ఫలితమే.. ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక, వెస్టిండీస్‌లకు తగిలిన షాక్‌.

నిండా వాళ్లే..: నమీబియా.. ఈ పేరు వినగానే పసికూన అనే అభిప్రాయం బలంగా పడిపోయింది. ఒకప్పుడు వన్డే ప్రపంచకప్‌లో ఆ జట్టు ఆటతీరు అంత తీసికట్టుగా ఉండేది. దీనితో ఓ పెద్ద జట్టు మ్యాచ్‌ అంటే రికార్డుల కోసం చూసేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నమీబియాను అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని ఈ ప్రపంచకప్‌ కంటే ముందు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో దాని ప్రదర్శన చూసిన వారికి అర్థమై ఉంటుంది. పేరుకే నమీబియా జట్టు కానీ.. అందులో ఉన్న మెజారిటీ ఆటగాళ్లు దక్షిణాఫ్రికా వాళ్లే. సఫారీ జట్టుకు గతంలో ప్రాతినిధ్యం కూడా వహించి ఇప్పుడు నమీబియాకు ఆడుతున్న డేవిడ్‌ వీజ్‌ ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్‌. అతను ఎన్నో టీ20 లీగ్‌ల్లో ఆడుతుంటాడు.

లంకపై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచిన ఫ్రైలింక్‌తో పాటు జేజే స్మిట్, ఎరాస్మస్, లాఫ్టీ ఈటన్, గ్రీన్‌.. వీళ్లందరూ కూడా దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో అవకాశాలు లభించక నమీబియాకు వలస వచ్చిన వాళ్లే. ఇక ఆ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న పియెరీ డిబ్రుయిన్‌ కూడా దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండరే. సహాయ కోచ్‌లుగా సేవలందిస్తున్న అల్బీ మోర్కెల్, మోర్ని మోర్కెల్‌ల గురించి కూడా పరిచయం అవసరం లేదు. డిబ్రుయిన్‌ 2019లో బాధ్యతలందుకున్నాక నమీబియా జట్టు రాత మారింది. దక్షిణాఫ్రికా నుంచి చాలామంది ఆటగాళ్లను తీసుకొచ్చి, వారిని తీర్చిదిద్దాడు. ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ అర్హత టోర్నీల్లో నిలకడగా రాణించిన నమీబియా.. ఇప్పుడు ప్రధాన టోర్నీలో లంకకు షాకిచ్చి ప్రపంచానికి తన సత్తాను చాటింది.

కౌంటీల్లో రాటుదేలి..: వెస్టిండీస్‌పై అదరగొట్టిన స్కాట్లాండ్‌ జట్టుది కూడా నమీబియా తరహా కథే. ఆ జట్టులోని ఆటగాళ్లు చాలామంది సమీప దేశమైన ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్లో రాటుదేలినవాళ్లే. స్కాట్లాండ్‌ ప్రధాన బౌలర్లయిన మ్యాట్, వీల్, డేవీ ఇంగ్లిష్‌ కౌంటీ జట్లలో కీలక బౌలర్లు. కౌంటీలతో పాటు ఇంగ్లిష్‌ టీ20 బ్లాస్ట్‌లో ఏళ్ల నుంచి ఆడుతున్నారు. ది హండ్రెడ్‌ టోర్నీలో సైతం వీరు ప్రాతినిధ్యం వహించారు. విండీస్‌పై మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన మున్సీతో పాటు జట్టులోని దాదాపు ప్రతి ఆటగాడికీ కౌంటీ అనుభవం ఉంది. దేశానికి ప్రాతినిధ్యం వహించినపుడు మినహాయిస్తే వీళ్లంతా ఎక్కువగా కౌంటీ క్లబ్‌ల తరఫున ఆడుతుంటారు. కాబట్టే విండీస్‌పై అదురు బెదురు లేకుండా ఆడారు. వీరి బ్యాటింగ్, బౌలింగ్‌ పరిశీలిస్తే పెద్ద జట్ల ఆటగాళ్లకు వీరికి ఏమాత్రం తేడా కనిపించదు.

మరోవైపు, ఐర్లాండ్‌ జట్టును సైతం ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ జట్టు ఇప్పటికే పెద్ద జట్లకు బాగానే షాకులిచ్చింది. ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్, యూఏఈ, జింబాబ్వేల ఆటతీరును గమనించినా వీటిని కూడా తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదనే అనిపిస్తుంది. ఈ జట్ల నుంచి ఏవి సూపర్‌-12కు అర్హత సాధించినా.. పెద్ద జట్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఉదాసీనతకు అవకాశమే లేదు. టీ20 క్రికెట్‌ అంటేనే అంచనాలకు అందనిది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎవరు ఎవరినైనా ఓడించొచ్చు. కాబట్టి చిన్న జట్లతో అప్రమత్తంగా ఉండాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.