ETV Bharat / sports

ఆ లక్ష్యంతోనే గచ్చిబౌలి స్టేడియంలో సింధు ప్రాక్టీస్!

author img

By

Published : Mar 15, 2021, 11:23 AM IST

EXCLUSIVE: 'I have learnt from my mistakes in Thailand Open, happy to make a strong comeback,' says PV Sindhu
'అందుకే గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్​ చేస్తున్నా'

థాయ్​ ఓపెన్​లో వైఫల్యాలు చవిచూసిన పీవీ సింధు.. స్విస్​ ఓపెన్​తో తిరిగి గాడిలోకి వచ్చింది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్​కు ముందు గచ్చిబౌలి స్టేడియంలో సాధన, ఆల్​ ఇంగ్లాండ్ ఛాంపియన్స్​కు సన్నద్ధత.. వంటి విషయాలపై ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఇటీవల బ్యాడ్మింటన్​ టోర్నీల్లో వరుసగా విఫలమైన భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు.. స్విస్​ ఓపెన్​లో తిరిగి గాడిలో పడింది. ఫైనల్లో మారిన్ చేతిలో ఓడినప్పటికీ.. ఫామ్​లోకి రావడం ఆనందంగా ఉందని తెలిపింది. థాయ్​లాండ్​ ఓపెన్ తప్పిదాలు, ఆల్​ ఇంగ్లాండ్​ ఛాంపియన్స్​కు సన్నద్ధత, కొవిడ్ కాలంలో తీసుకున్న శిక్షణ, టోక్యో ఒలింపిక్స్​కు ముందు గచ్చిబౌలి స్టేడియంలో సాధన.. వంటి వివిధ అంశాలపై ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడింది.

1. స్విస్​ ఓపెన్​లో మీ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నారా?

స్విస్​ ఓపెన్​ ఫైనల్​ వరకు వెళ్లడం ఆనందంగా ఉంది. అయితే అదే సమయంలో మ్యాచ్​ ఫలితం పట్ల సంతోషంగా లేను. ఆ మ్యాచ్​ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను అనుకున్న వ్యూహం పనిచేయలేదు. అది తప్పుడు వ్యూహం అయి ఉండొచ్చు. స్విస్​ ఓపెన్​ అనంతరం ఆట పట్ల బలంగా తయారయ్యాను.

2. గత టోర్నీల్లో తొలి రౌండ్​లోనే నిష్క్రమించారు. ఈసారి అలా జరగలేదు. టెక్నికల్ అంశాలలో ఏమైనా మార్పులు చేశారా?

థాయ్​లాండ్​ ఓపెన్ నుంచి వచ్చాక నా తప్పులేంటో తెలుసుకున్నాను. వాటిని సరిదిద్దుకోవడం నాకు ముఖ్యం. ఇది చాలా అవసరం. ఫైనల్స్​కు చేరుకోవడం అంటేనే గొప్ప. ఈ విషయం నాకు థాయ్​లాండ్​ ఓపెన్​లో తెలిసొచ్చింది. టెక్నిక్​, వ్యూహం, ఇంకేదైనా.. నేను ప్రతి దానిపై పని చేస్తాను. నా తప్పులను సరిదిద్దుకున్నాను. వాటి నుంచి అంతే బలంగా తిరిగొచ్చాను. గెలిచామా లేదా అన్నది పక్కనపెడితే స్విస్​ ఓపెన్​ నాకు చాలా ముఖ్యమైనది.

3. కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​.. మీ ఆటపై ఏ మేరకు ప్రభావం చూపింది?

కొవిడ్​ సమయంలో నేను ఇంటి దగ్గర సాధన చేశాను. దీంతో నాకంతా బాగానే అనిపించింది. లాక్​డౌన్​ తర్వాత తిరిగి గాడిలోకి రావడానికి నాక్కొంచెం సమయం పట్టింది. ఏదేమైనా మళ్లీ కోర్టులోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉంది.

4. కరోలినా మారిన్​పై మీ స్పందన ఏంటి? ఆమె కోర్టులో వేగంగా కదులుతుంది. స్మాష్​లు, డ్రాప్​లు సరిగా ఆడుతోంది.

మారిన్ ఒక దూకుడైన క్రీడాకారిణి. ఆమె చాలా బాగా ఆడుతుంది. మామూలు ప్లేయర్​ కాదు. మనం ప్రతి దానికి సంసిద్ధంగా ఉండాలి. డ్రాప్​లు, స్మాష్​లు ఉంటాయి. నాకు తెలిసి నేను తప్పుడు వ్యూహంతో ఆమెతో స్విస్​ ఫైనల్​కు వెళ్లాను. ఈ సారి ఆమెతో ఆడినప్పుడు పునరావృతం కానివ్వను. గొప్ప వ్యూహంతో ముందుకొస్తాను.

5. ఆల్​ఇండియా ఛాంపియన్స్​ సన్నద్ధత ఎలా సాగుతోంది. ఇదే ఆత్మవిశ్వాసంతో టోర్నీలోకి వెళ్తారా?

నేను ప్రస్తుతం జురిచ్​లో​ ఆడుతున్నాను. స్విస్​ ఓపెన్​ తర్వాత జర్మనీ ఓపెన్​ లేదు. ఇక్కడ వారం రోజులు మాత్రమే ఉండాలి. తర్వాత ఆల్​ ఇంగ్లాండ్​ ఛాంపియన్​షిప్​ టోర్నీ జరగనుంది. మొత్తానికి మ్యాచ్​కు సంబంధించి సన్నద్ధత బాగుంది. కానీ, దాన్ని ఆచరణలో పెట్టాలి.

6. బాసెల్​​లో ఆడటం ఎలా అనిపించింది?

బాసెల్​లో ఆడడం చాలా బాగుంది.

7. లండన్​లో శిక్షణ ఎలా ఉంది? టోక్యో ఒలింపిక్స్​కు ముందు గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్​ చేయడానికి కారణమేంటి?

లండన్​లోని జీఎస్​ఎస్​ఐ (గేటరోడ్​ స్పోర్ట్స్​ సైన్స్​ ఇనిస్టిట్యూట్​)లో శిక్షణ కోసం వెళ్లాను. ఇంతకుముందు బిజీ షెడ్యూల్​ కారణంగా వెళ్లలేకపోయాను. ఈ పర్యటన ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. నా శరీరాన్ని అంచనా వేయడానికి ఇది దోహదం చేసింది. ఇది ప్రతి అథ్లెట్​కు చాలా అవసరం. ఇదొక సుదీర్ఘ ప్రయాణం.

ఇక టోక్యో ఒలింపిక్స్​కు ముందు గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్​ చేయడం చాలా అవసరం. ఈ రోజుల్లో ప్రతి అంతర్జాతీయ టోర్నమెంట్​లలో.. పెద్ద స్టేడియాలు, ఎయిర్ కండీషనింగ్ స్టేడియాలు ఉన్నాయి. వాటి తరహాలో గచ్చిబౌలి కూడా పెద్ద మైదానం. ఇక్కడ సాధన చేయడం ద్వారా.. అంతర్జాతీయ స్టేడియాల్లోని పరిస్థితులకు అలవాటు పడొచ్చు. ఈ స్టేడియంలో ఆడటానికి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చాలా సహాయపడింది. ఈ విషయంలో క్రీడా అధికారులకు, సాయ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

ఇదీ చదవండి: 'భారత్ సమష్టిగా ఆడబట్టే మాకు విజయం దక్కలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.