ETV Bharat / sitara

Alitho Saradaga: మీకు డైరెక్షన్ రాదు అన్నారు!

author img

By

Published : May 31, 2021, 2:30 PM IST

'బాహుబలి'(bahubali) , 'భజరంగీ భాయ్​జాన్' వంటి అద్భుత చిత్రాలకు కథ అందించి గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్నారు విజయేంద్ర ప్రసాద్ (vijayendra prasad). ఆయన ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్', 'సీత' వంటి చారిత్రాత్మక సినిమాలకు కథ అందిస్తున్నారు. తాజాగా ఆయన ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నేడు ఈ ఎపిసోడ్ రాత్రి 9.30 గంటలకు ప్రసారంకానుంది.

vijayendra prasad
విజయేంద్ర ప్రసాద్

పాన్‌ ఇండియా హీరోలను చూశాం.. పాన్‌ ఇండియా డైరక్టర్లనూ చూశాం. కానీ భాషలతో సంబంధం లేకుండా ఒక రచయిత పాన్‌ ఇండియా స్థాయికి చేరుకోవచ్చని.. అంతేకాదు.. అక్కడ రాణించ వచ్చని నిరూపించిన రచయిత విజయేంద్ర ప్రసాద్‌ (vijayendra prasad). టాలీవుడ్‌, బాలీవుడ్‌ అని ఇండస్ట్రీలతో తేడా లేకుండా సినిమాలకు మంచిమంచి కథలు అందిస్తూ ఇండియాలోనే మోస్ట్‌ వాంటెడ్‌ రైటర్‌గా కొనసాగుతున్నారు. 'బాహుబలి'(bahubali) తో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన డైరక్టర్‌ రాజమౌళి తండ్రి, ఆ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' (Alitho Saradaga) కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత ఆలీ అడిగిన ప్రశ్నలకు ఆయన సరదాగా సమాధానాలిచ్చారు.

ఆలీ: 'భజరంగీ భాయిజాన్‌' సినిమాను 'పసివాడి ప్రాణం'తో పోల్చి చూశారు చాలామంది..!

విజయేంద్రప్రసాద్‌: 'పసివాడి ప్రాణం' నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ చిత్రం చూసేటప్పుడు 'భలే బాగుందే.. సినిమా నొక్కేద్దామా' అని నా స్నేహితులతో అన్నాను(నవ్వులు)

ఆలీ: రచయితగా సక్సెస్‌ అయ్యారా? డైరక్టర్‌గా సక్సెస్‌ అయ్యారా?

విజయేంద్రప్రసాద్‌: రైటర్‌గా సక్సెస్‌ అయ్యాను. కానీ.. డైరక్టర్‌గా సక్సెస్‌ కాలేకపోయాను.

ఆలీ: డైరక్టర్‌గా విజయవంతం కాలేకపోవడానికి కారణం..?

విజయేంద్రప్రసాద్‌: తెలిస్తే ఈపాటికి పెద్దహిట్లు తీసి ఉండేవాడిని(నవ్వులు).

ఆలీ: మీ దర్శకత్వంలో వేరేవాళ్ల కథలు తీశారా? మీరు రాసుకున్న కథతో తీశారా?

విజయేంద్రప్రసాద్‌: ఒక వ్యక్తి 'రాజన్న' సినిమా చూశాడు. సినిమా ఎలా ఉంది అని ఆయనను అడిగితే.. తెలుగులో ముందు వరుసలో ఉన్న డైరక్టర్లతో సమానంగా తీశారు అన్నాడు. మళ్లీ అదే వ్యక్తి 'శ్రీవల్లీ' చూశారు. ఎలా ఉందని అడిగితే.. 'మీకు డైరక్షన్‌ రాదు' అని చెప్పారు.

ఆలీ: ఆయన ఇండస్ట్రీకి చెందిన వారేనా?

విజయేంద్రప్రసాద్‌: అవును, పెద్ద డైరక్టర్‌.. మా అబ్బాయి రాజమౌళి(నవ్వులు)

ఆలీ: సాధారణంగా స్క్రిప్టు రైటర్లు కథ రాయాలంటే గోవాకో.. థాయ్‌ల్యాండ్‌కో వెళుతుంటారు. కొంతమంది చెట్టు కింద కూర్చొని రాస్తారు. మరి మీరు ఎలా రాస్తారు?

విజయేంద్రప్రసాద్‌: నాలుగు గోడల మధ్య కూర్చొని రాస్తా. పేరుకు పెద్ద రచయిత అంటారు గానీ.. ఇంతవరకూ ఎవరూ ఎక్కడికీ తీసుకెళ్లలేదు(మళ్లీ నవ్వులు)

'సీరియల్​ చూసి చెప్పులతో సన్మానం చేస్తామన్నారు!'

ఆలీ: మీ కథలో హీరోకు ఒక గతం ఉంటుంది. అది మీ సెంటిమెంటా..?లేకపోతే యాధృచ్ఛికంగా జరుగుతుందా?

విజయేంద్రప్రసాద్‌: సౌలభ్యంగా చేసుకోవడం తప్పితే.. అలా ఉండాలని నిబంధన ఏం లేదు.

ఆలీ: మరి ప్రతీ సినిమాకు అదే ఫాలో అవుతున్నారా?

విజయేంద్రప్రసాద్‌: నేను సినిమాలు చూడటం తక్కువ. సమస్య ఏంటంటే సినిమాలు చూస్తే నాకు నిద్ర వస్తుంది. కొన్నిసార్లు నిద్రపోవడానికే సినిమాకు వెళ్లేవాడిని.(నవ్వులు)

ఆలీ: తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి కాకుండా మీకు నచ్చిన డైరక్టర్‌ ఎవరు?

విజయేంద్రప్రసాద్‌: పూరీ జగన్నాథ్‌గారు. ఆయన అంటే నాకు అసూయ. నా శత్రువును ప్రతిరోజూ చూడాలని ఆయన ఫొటో నా ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకున్నా. (ఆలీ మధ్యలో కలుగజేసుకొని అందుకే మంచి మంచి కథలు రాస్తున్నారు)

vijayendra prasad
విజయేంద్ర ప్రసాద్

ఆలీ: ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి?

విజయేంద్రప్రసాద్‌: అబద్ధాలు ఆడేవారికి మంచి చోటు ఉంటుంది. అది బాగా నచ్చింది. ఇండస్ట్రీకి రావాలనుకునేవాళ్లు కూడా అబద్ధాలాడటం నేర్చుకోవాలి.

ఆలీ: విజయేంద్రప్రసాద్‌గారి అబ్బాయి రాజమౌళి. రాజమౌళి గారి తండ్రి విజయేంద్రప్రసాద్‌. ఈ రెండింట్లో మీకు ఏది బాగా అనిపించింది?

విజయేంద్రప్రసాద్‌: మొదటి దాంట్లో నాకు ఎక్కువ పేరుంటే 'నా కొడుకు నాకన్నా ఎప్పుడు గొప్పవాడవుతాడు' అనే కోరిక ఉండేది. రెండోదాంట్లో 'నా కొడుకు అంతటి స్థాయికి నేనెప్పుడు ఎదుగుతా' అని బాధ ఉంటుంది.

ఆలీ: 'ఆర్‌ఆర్‌ఆర్‌' చూశారా? ఎలా ఉంది?

విజయేంద్రప్రసాద్‌: నేను చూశాను. చాలా బాగుంది. అందులో సర్‌ప్రైజ్‌ ప్యాకేజ్‌ అలియా భట్‌. ఆమె తెరపై కనిపించే సమయం తక్కువే. కానీ.. ప్రతి సీన్‌లోనూ ఆమె కనిపిస్తుంది.

ఆలీ: బాహుబలి సినిమా గురించి..?

విజయేంద్రప్రసాద్‌: బాహుబలి సినిమా మొదటి భాగం తర్వాత కొంతమంది మాతో చాలా అసభ్యకరంగా మాట్లాడారు. కట్టప్ప ఎందుకు చంపాడో తెలియకుండా అలా ఎలా ముగిస్తారు అని గొడవ చేశారు(నవ్వుతూ)

వీరిద్దరి మధ్య సాగిన సరదా సంభాషణలో వాళ్లు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే.. నేడు (మే 31) ఈటీవీలో ప్రసారం కానున్న 'ఆలీతో సరదాగా' పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. మరి.. అప్పటి వరకూ ఈ ప్రోమో చూసి ఆనందించండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

17 ఏళ్లకే ఇంట్లోంచి వెళ్లిపోయా: శ్రీవాణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.