ETV Bharat / sitara

మహేశ్​బాబుతో 'ఫిదా' తెరకెక్కించి ఉంటే?

author img

By

Published : Apr 15, 2021, 9:39 AM IST

Updated : Apr 15, 2021, 10:38 AM IST

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' టాక్​ షోకు దర్శకుడు శేఖర్​ కమ్ముల హాజరై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'ఫిదా' సినిమా కథను మొదటగా మహేశ్​ బాబు, రామ్​చరణ్​కు వినిపించినట్లు పేర్కొన్నారు. దీంతోపాటు 'లవ్​స్టోరి' సినిమాలోని 'సారంగదరియా' పాట వివాదంపై మాట్లాడిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

Director Sekhar Kammula Interview in Alitho Saradaga
మహేశ్​బాబుతో 'ఫిదా' తెరకెక్కించి ఉంటే?

తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది 'ఆనంద్‌', 'గోదావరి', 'హ్యాపీడేస్‌', 'లీడర్', 'ఫిదా' లాంటి చిత్రాలు. ఆయన దర్శకుడిగానే కాక, నిర్మాతగాను, సినీ రచయితగాను రాణించారు. తొలుత 'డాలర్‌డ్రీమ్స్'తో సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఇప్పటి వరకూ ఆరు నంది అవార్డులు అందుకున్నారు. శేఖర్‌ చిత్రాల్లో ద్వంద్వార్థ సంభాషణలు, అశ్లీలత, హింసకు పెద్దగా ఆస్కారం ఉండదు. అందుకే ఆయన సినిమాలను సకుటుంబ సపరివార సమేతంగా చూడొచ్చనే అభిప్రాయం ఉంది. అలాంటి శేఖర్‌ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న 'లవ్‌స్టోరి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి శేఖర్​ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ముచ్చట్లేమిటో తెలుసుకుందాం..

'అయ్య బాబోయ్‌ ఎంత పొడుగో' పాటను ఆ రచయిత మిమ్మలి దృష్టిలో పెట్టుకొని రాశారా? లేక హీరో కోసం రాశారా.. ఇంత ఎత్తు ఉన్నారు?

శేఖర్‌ కమ్ముల: వరుణ్‌తేజ్‌ కూడా పొడుగ్గానే ఉంటారు కదా. అతడిని దృష్టిలో పెట్టుకొనే రాశారు. ఎత్తులో ఇద్దరం సమానమే. కానీ నేను అతనిలో సగం ఉంటాను.

Director Sekhar Kammula Interview in Alitho Saradaga
శేఖర్ కమ్ముల

మీరు ఇంత సన్నగా ఉండటానికి కారణం.. గాలి తిని బతుకుతారా (నవ్వుతూ)?

శేఖర్‌ కమ్ముల: (నవ్వుతూ) చాలామంది నన్ను ఇదే ప్రశ్న అడుగుతుంటారు. సినిమా షూటింగ్‌ ప్రారంభమైతే చాలు ఇంకా తగ్గిపోతాను. ఎందుకు తగ్గుతానో నాకే తెలియదు. మా ఇంట్లో అందరూ సన్నగానే ఉంటారు. కానీ నేను ఇంకొంచెం ఎక్కువ. అన్నీ తింటాను. అంతా కెలికి.. కెలికి.. అది కొద్దిగా.. ఇది కొద్దిగా తింటాను. తిండి మీద ఆసక్తి ఉండదు. తినే విషయంలో దేనిపైనా నాకు పెద్దగా ఇష్టం ఉండదు.

ముందుగా మీకు ధన్యవాదాలు.. అక్టోబర్ 19 నాటికి మీరు దర్శకత్వం వహించిన మొదటి చిత్రానికి 20 ఏళ్లు అవుతోంది? అందుకోసమే ధన్యవాదాలు చెబుతున్నా.

శేఖర్‌ కమ్ముల: థ్యాంక్యూ

మీరు పుట్టి పెరిగింది ఎక్కడ?

శేఖర్‌ కమ్ముల: పుట్టింది ఏలూరు. పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న ఇక్కడ రిజిస్ట్రేషన్‌ విభాగంలో పనిచేసేవారు. సికింద్రాబాద్‌ సెయింట్ పాట్రిక్స్ స్కూల్‌లో చదివాను. పద్మారావునగర్‌లోనే ఎక్కువగా తిరిగాను. ఇప్పటికీ అక్కడే ఉంటున్నాను. అందరిలా నేను కూడా ఇంజనీరింగ్‌ చదివాను. కానీ ఐఐటీలో చదవాలని, ఐఏయస్ అవ్వాలని నాన్న కోరిక. నాకేమో అంత లేదు. సీబీఐటీ కాలేజీలో ఇంజనీరింగ్‌ చదివా. చదువులో నేను పెద్ద ర్యాంకర్‌ను కాదు. నాన్న భయంతో ఏదో చదివేవాణ్ణి. ఏవరేజ్‌ స్టూడెంట్‌ని. అయితే మరీ అంతా బ్యాడ్‌ కాదు. అందరూ అమెరికా వెళ్తుంటే, నేనూ వెళ్లాను. అప్పుడు అనిపించింది.. ఏంటిది అని. దేనిపైనా పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అమెరికాలో ఉండడం కూడా పెద్దగా ఇష్టం లేదు. ఇండియా తిరిగి రావాలని ఉంది. అందరేమో గ్రీన్‌ కార్డు, డాలర్లు సంపాదించాలని, అక్కడే సెటిల్‌ అవుదామని అనుకునేవాళ్లు. నాకేమో ఇంకేదో చెయ్యాలని ఉండేది. అక్కడే ఫిల్మ్ స్కూల్‌లో చేరాను. స్కూల్‌లో అడ్మిషన్‌ కోసం ఓ లెటర్‌ రాశాను.

ఆ లెటర్లో ఏం రాశానంటే "నేను ఇండియా నుంచి వచ్చాను. అమెరికా అంటే చాలా ఇష్టం. ఇండియా అంటే ఇంకా ఇష్టం. స్నేహితులు అందరూ నన్ను ఇష్టపడతారు. అందరితో కలిసి ఉండేవాడిని. నా స్నేహితులంతా నువ్వుంటే బాగుంటుందని అనేవాళ్లు. నేను చూసే ప్రపంచం బాగుంటుందేమో! అందుకే నా ప్రపంచాన్ని చూపించాలని అనుకుంటున్నా" అంటూ రాశా. "ఇంతా బాగా రాశావు. నీకు పూర్తిగా అవగాహన ఉంది. వచ్చి జాయిన్‌ అవ్వండి" అని జవాబు వచ్చింది. అక్కడే ఫిల్మ్ స్కూల్‌లో చేరిపోయా.

మీరు ఫిల్మ్ స్కూల్‌లో చేరింది యాక్టింగ్‌ కోర్సా లేక డైరక్షన్‌ కోర్సా?

శేఖర్‌ కమ్ముల: డైరక్షన్‌. అయితే అక్కడ యాక్టింగ్‌, డైరక్షన్ అంటూ ఏమీ ఉండదు. అదొక ఎమ్‌ఎఫ్‌ఏ అనే మాస్టర్‌ డిగ్రీ కోర్సు. మూడేళ్లు చదివాను. ఇప్పుడు నేను ఎక్కడైనా ఫిల్మ్ స్కూల్‌లో చేరినా పాఠాలు చెప్పగలను. ప్రొఫెసర్‌ స్థాయి అన్నమాట!

మీరు ఎంతమంది సంతానం?

శేఖర్‌ కమ్ముల: మొత్తం నలుగురం. నేను అందరికంటే చిన్నవాడిని. పెద్దక్క డాక్టర్‌. ఆ తర్వాత ఇంకో అక్క రిజర్వు బ్యాంక్‌లో పనిచేస్తుంది. ఆ తర్వాత మా అన్నయ్య. అమెరికాలో ఉన్నారు. ఆయన దగ్గరే ఉండి చదువుకోగలిగాను. అన్నయ్యే నాకు ప్రేరణ.

చిత్రసీమకు ఎప్పుడొచ్చారు?

శేఖర్‌ కమ్ముల: 1999లో 'డాలర్‌ డ్రీమ్స్' చేశాను. 2000లో విడుదల చేశా. అసలు ఆ సినిమా తీయడం ఒక ఎత్తయితే, దాన్ని విడుదల చెయ్యడం మరో ఎత్తు. ఇలా ఏం చేసినా సంవత్సరాలే పట్టింది. నేను చేసేవి బడ్జెట్‌ పరంగా చిన్న సినిమాలే. కానీ నేను మాత్రం చాలా గొప్పగానే తీస్తున్నా. ఇదే నా జీవితం అనుకుంటాను. 'డాలర్‌డ్రీమ్స్‌' 16 లక్షలతో తీశాను. నేనే సినిమా థియేటర్‌కు వెళ్లి ఒక్కో షోకి డబ్బులిచ్చి మూడు నాలుగు వారాలు ఆడాలని అక్కడే కూర్చున్నా.. సంగీత్‌ థియేటర్‌లో. మళ్లీ ఈ సినిమా ఇక్కడ కాదని.. ముంబయి తీసుకెళ్లి హిందీలో విడుదల చేశాం.

Director Sekhar Kammula Interview in Alitho Saradaga
శేఖర్ కమ్ముల

డాలర్‌ మీద ఉన్న ప్రేమతో ఆ సినిమాకు 'డాలర్‌డ్రీమ్స్' పేరు పెట్టారా?

శేఖర్‌ కమ్ముల: ప్రేమతో ఆ పేరు పెట్టలేదు. చాలామంది ఎంతో క్రేజ్‌తో అమెరికా వెళ్తున్నారు. ఈ దేశంలోని, అక్కడి జీవితాన్నీ చూసిన వ్యక్తిగా సినిమా తీశాను. ఇక్కడ అన్నీ వదులుకొని అక్కడికి వెళ్లడం అవసరమా? అని చూపించా. ఆ అంశం మీదే చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. అనుకోకుండా ఒకరోజు మా నాన్నగారు.. "ఎవరో నేషనల్ అవార్డువాళ్లంట.. ఫోన్‌ చేశారు.. నువ్వు కావాలని" అంటూ చెప్పారు. ఆ సమయంలో నేను సాప్ట్‌వేర్‌ ఆఫీసులో పని చేస్తున్నా. అదే నా జీవితంలో మరచిపోలేని సంఘటన. అప్పుడే మా ఇంట్లోవాళ్లకు నా మీద నమ్మకం కలిగింది. అప్పటికీ నాకెలాంటి సినిమా నేపథ్యం లేదు. నేను అమెరికా స్టయిల్‌లో ఉంటుందని 'అమిగోస్‌' అనే పేరుతో కంపెనీ పెట్టాను, స్నేహితులు ఇచ్చిన డబ్బుతో. నా సొంత డబ్బు కూడా ఉంది. స్పానిష్‌లో 'అమిగోస్‌' అంటే ఫ్రెండ్స్ అని అర్థం. కానీ మానాన్న మాత్రం 'ఆల్‌ మనీ గోస్‌' అనేవారు. ఆయనకు అంత భయం, డబ్బుపోతుందేమోనని.

మీ నాన్నగారు ప్రోత్సహించారా? లేక నిరుత్సాపరిచారా?

శేఖర్‌ కమ్ముల: ప్రేమతో పైకి ఏమీ అనలేరు. కానీ లోలోపల మాత్రం అనుకునేవాళ్లు. ఇది మనకు తెలిసిన పని కాదని చెప్పేవారు. నేను ఫిల్మ్ స్కూల్‌లో చదివిన 'ఎమ్‌ఎఫ్‌ఏ' డిగ్రీని ఇక్కడ మానాన్న దానికి 'మాస్టర్‌ ఆఫ్‌ ఫైనాన్స్ అఫ్లికేషన్‌' అని చెప్పేవారు. 'మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్' అని చెప్పేవారు కాదు. మన దగ్గర ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఎంబీఏ చేస్తే బెటర్‌. అదే కదా మన లైన్‌ ఇక్కడ. కానీ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నాన్న కొంత ఆనందపడ్డారు.

సినిమా కష్టాలంటే ‘ఆనంద్‌’ చిత్రానికేనా?

శేఖర్‌ కమ్ముల: సినిమా కష్టాలు అనేకంటే ఇంకా ఎక్కువే. ఇన్ని రోజుల్లో సినిమా తియ్యాలి. ఇంత ఖర్చు అవుతుందనుకున్నా. కానీ కుదరలేదు. తొలుత 80 లక్షలు అనుకున్నాం. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (ఎన్‌ఎఫ్‌డీసీ) నుంచి 40 లక్షలు. మిగతా 40 లక్షలు నావి. అయితే వాళ్లు డబ్బుకు బదులుగా ఫిల్మ్ ఇచ్చేవారు. నా బడ్జెట్‌ ఏమో పెరిగిపోయేది. నా బడ్జెట్‌ కోటిన్నర అయినా, వాళ్లది అందులో యాభైశాతం వాటా ఉంటుంది. ఏమీ అర్థం కాలేదు. ఈ బాధలు అన్నీ పట్టించుకోకుండా సినిమా తీశాను. ఈ సినిమా రాయడం మొదలుకొని విడుదలయ్యే వరకు ఒక్కడినే చాలా కష్టాలు పడ్డాను. ఈ సినిమా కోసం ముందుగానే నాలుగు థియేటర్లలో డబ్బులు ఇచ్చేసి, 'రెండు వారాలు ఆడించండి.. ఆ తర్వాత నేనేం చేయలేను' అని చెప్పా. ఆ సమయంలో చిరంజీవి సినిమా 'శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌' విడుదలవుతోంది. అప్పటికే సినిమాకు సంబంధించి రామానాయుడు స్టూడియోలో ఫ్రింట్స్ అవుతున్నాయి. చిరంజీవి సినిమా బాక్స్‌లను టాటా సుమోల్లో తీసుకెళ్లేందుకు డ్రైవర్లు చాలా క్రేజ్‌గా ఉండేవాళ్లు. విజయవాడకు మా బాక్స్ తీసుకెళ్లడానికి ఒక్క డ్రైవర్‌ దొరకడం లేదు. ఓ వైపు టైమ్‌ అయిపోతోంది. ఎలాగో ఒక డ్రైవర్‌ను పట్టుకున్నాం. "శంకర్‌దాదా.. చిరంజీవి సినిమా అని వెయిటింగ్‌ చేశా. ఆనంద్‌.. ఇదేం సినిమా?" అన్నాడతడు. బాక్స్ తీసుకెళ్లడానికి కూడా అతను నిరుత్సాహం చూపాడు.

ఆఖరికి ప్రీమియర్ షో వేయడానికి కూడా ఇబ్బంది పడ్డా. అప్పుడు అన్నీ డీల్సే. ఆఫీస్‌ ఇస్తే, మీకో షో ఇస్తాం. ఇలా ఉండేవి. అలా 'ఆనంద్‌' తీసిన ఆఫీస్‌కు ఓ షో ఇచ్చాం. మా పక్కనే 'శంకర్‌దాదా' ప్రీమియర్‌ షో అవుతోంది. ఇలా చూసి అలా వెళ్లిపోతున్నారు. ఆఖరికి ఓ హోటల్లో పుట్టినరోజు జరుపుకుంటున్న విద్యార్థుల దగ్గరికి వెళ్లి సాయంత్రం 6 గంటలకు ఓ సినిమా చూపిస్తానని వాళ్లను తీసుకెళ్లా. 'ఆనంద్‌' సినిమా చూసిన అందరూ బాగుందని అంటున్నారు. కానీ ఏమీ అర్థం కావడం లేదనేవారు. అదే నాకు కిక్ ఇచ్చేది. ఏదైనా కొత్త క్రియేషన్‌ అంటే ఏంతో కొంత నిరాదరణ ఉంటుంది. అయితే అది మనకు అర్థం కాదు. మనం పెద్ద గొప్ప అనుకుంటాం. మా కుటుంబం మరి ఆకలిదప్పుల కష్టాలు పడలేదు. కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. సెల్‌ఫోన్‌ బిల్లులు కూడా కట్టలేకపోయా. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండేవాడిని. ఎప్పుడైనా ప్రొడ్యూసర్స్ తిరస్కరిస్తే ఏమీ పట్టించుకోను. కసి, కోపంతో సినిమాలు చేయను. నాకు సాధారణంగా కోపం రాదు. మనం చేసేది ఏదైనా చివరకు ప్రేక్షకులకు అర్థమైతే చాలనుకునేవాడిని.

'ఆనంద్‌' సినిమా మీకు ఆనందం మిగిల్చిందా?

శేఖర్‌ కమ్ముల: (నవ్వుతూ) ఆనందం మిగిల్చింది. గౌరవం లభించింది. డబ్బుమీద నాకు వ్యామోహం లేదు. 'ఆనంద్‌' సినిమా తీసిన కాలనీలోనే ఇల్లు కొన్నాను. సక్సెస్‌ అనేది ఇల్లు కొనడం ద్వారానో, డబ్బు సంపాదించడం వల్లనే వస్తుందని అనుకోను. సక్సెస్‌ అంటే ఒక సిగ్నేచర్‌ లాంటిది. శేఖర్‌ కమ్ముల అంటే సినిమాల్లో చూపించేదానికి, బయటకి కూడా అలాగే ఉంటాడనే ముద్ర. ఇలాంటి సినిమాలే తీస్తాడనే పేరుంటే చాలు. అదే నా సక్సెస్. రాజమౌళిలాంటి పెద్ద ముద్ర కాదు కానీ, నాకు ఓ చిన్న ముద్ర ప్రేక్షకుల్లో ఉండిపోవాలి.

Director Sekhar Kammula Interview in Alitho Saradaga
శేఖర్ కమ్ముల

తొలిసారిగా కొత్త హీరో, ఓ కొత్త దర్శకుడు, సినిమా పెద్ద హిట్‌ అయ్యిందంటే.. చిత్రసీమ నుంచి పెద్దవాళ్లు అవకాశాలు ఇస్తారు. మరి మీకు ఆ సమయంలో పెద్ద హీరోలు ఎవరూ అవకాశాలు ఇవ్వలేదా?

శేఖర్‌ కమ్ముల: 'ఆనంద్‌' తర్వాత ఎవరూ నన్ను పిలిచి 'ఇది తీయండి' అని చెప్పలేదు. ఇప్పుడైనా సరే, ఎవరైనా స్టోరీ చెప్పమంటే నాకు భయమే. హీరోల కోసం నేను ఎప్పుడూ కథలు రాయను. కథలు రాసుకున్న తర్వాత వారి దగ్గరకు వెళ్తాను. నాకోసం ఏదో చెప్పాలని, అంతే. ఇప్పుడు అర్జంట్‌గా హిట్‌ కావాలని రాయను. ఓ కథ తారస పడిందనుకోండి, అదే రాస్తాను. 'ఆనంద్‌' సినిమాలో ఓ అమ్మాయి స్ట్రగుల్‌ అయిందనుకుందాం. అలా సొంత వ్యక్తిత్వం ఉండే అమ్మాయి పాత్రకు, అలాంటి వ్యక్తిత్వమే ఉన్న అబ్బాయికి మధ్య కుదిరితే ఎలా ఉంటుందనేది 'గోదావరి'.

కాలేజీలో లెక్చరర్లు, ప్రిన్సిపల్‌పై జోకులు వేసుకోవడం, అమ్మాయిలను ప్రేమించి లేపుకుపోవడం లాంటి అన్‌రియల్ సినిమాలు వస్తున్న సమయంలో.. రియల్‌గా కాలేజీ‌లో ఏం జరుగుతోందనే నేపథ్యంతో 'హ్యాపీడేస్‌' చేశా. ఆ తర్వాత రాజకీయాల్లో ఇలాంటి నాయకుడు ఉంటే ఎలా ఉంటుందని తీసిన చిత్రం 'లీడర్‌'. ఇలా ప్రతి చిత్రానికి ఒక నేపథ్యం ఉంటుంది. 'ఫిదా'లో అమ్మాయి ఎప్పుడూ రాజకుమారుడు రెక్కల గుర్రం మీద నుంచి వచ్చి కోటలోంచి తీసుకెళ్తాడని ఎదురుచూస్తుంది. కానీ ఆ కోట అంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం. అందుకే అతనే వచ్చి ఇక్కడే ఉంటే బాగుండని ఆశించే కథ అది. ఇలా ప్రతి కథకు ఆత్మ ఉంటుంది. నేను ఎవరికైనా కథలు చెప్తుంటే వారికి నిద్ర వస్తుంది. ఆకట్టుకునేలా చెప్పలేను. కానీ తెరపైన బాగా చూపించగలను.

ఈ మధ్య కాలంలో లేదా గతంలో కానీ పెద్ద హీరోలకు చెప్పి.. రిజక్ట్ అయిన కథలు ఏమైనా ఉన్నాయా?

శేఖర్‌ కమ్ముల: తొలుత 'ఫిదా' సినిమా కథను మహేశ్​‌బాబుకు చెప్పాను. రామ్‌చరణ్‌కి చెప్పా. నా సినిమాలో డ్రామా ఉండదు. అది నేను హీరోలకు చెప్పలేను. 'ఫిదా'లో అక్క అత్తగారింటికి వెళ్తూ చెల్లెలికి (సాయిపల్లవి) ఈ మాత్రలు తండ్రికి ఇవ్వాలంటూ చెబుతుంది. కానీ వీళ్లు ఇవ్వకుండానే తండ్రి మాత్రలు వేసుకుంటాడు. ఇది ప్రేక్షకుల్ని కదిలించే సన్నివేశం. ఈ సన్నివేశాన్ని ఏ హీరోకైనా, హీరోయిన్‌కైనా చెప్పలేను. వాళ్లను ఒప్పించలేను. కానీ చూపించగలను. నా ఉద్దేశంలో.. ఇన్ని సినిమాలు చేశాడు.. అని నమ్మి నాకు అవకాశం ఇస్తే.. బాగా చేస్తాను.

'ఫిదా' లేడీ ఓరియంటెడ్ చిత్రం కదా? అలాంటి సినిమాకు మహేశ్​‌బాబుని ఎలా అనుకున్నారు?

శేఖర్‌ కమ్ముల: ఆయనతో సినిమా చేసేవాడిని. ఆయనకు తగ్గట్లుగా ఇంకో విధంగా మార్చేవాడిని. ఒక మీనింగ్‌ఫుల్‌ సినిమాను కమర్షియల్‌గా ఎలా తీయగలననేది నాకు తెలుసు.

మీరు తెలుగు తెరకు పరిచయం చేసినవాళ్లు.. రాజా, కమలీని ముఖర్జీ..?

(మధ్యలో శేఖర్‌ కల్పించుకొంటూ) విజయ్‌ దేవరకొండ, వంశీకృష్ణ, నిఖిల్‌, నవీన్‌ పోలిశెట్టి, అభిజిత్, 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌'లో చాలామంది ఉంటారు. ఇంకా సంగీత దర్శకులు మిక్కి జే మేయర్‌, తమన్నా.. వీరిద్దరికి మొదటి చిత్రం కాదు కానీ.. మంచి పేరొచ్చింది మాత్రం 'హ్యపీడేస్‌'తోనే.

టాలెంట్‌ ఎవరి దగ్గర ఉంటే వారిని తీసుకుంటానని చెప్పడం చాలా సార్లు జరిగింది.. అలానే ఎంపిక చేస్తారా?

శేఖర్‌ కమ్ముల: నేను స్క్రిప్టు రాసుకున్న తర్వాత పాత్రలకు దగ్గరగా ఉండేవాళ్లను తీసుకుంటా తప్ప, అందంగా.. ఎర్రగా ఉంటే తీసుకోను. నేను ఆడిషన్స్ పెట్టినప్పుడు వేరే మధ్యవర్తులను పెట్టుకోను. వచ్చిన అతను బాగా చేస్తే బాగుండని అనుకుంటాను. ఆ వచ్చినవాడు కూడా 'నాకు అవకాశం ఇస్తే బాగుండు' అనుకుంటాడు. మొత్తం మీద ఇందులో నా స్వార్థమే ఉంటుంది. నేనెవరినో ఉద్ధరిస్తున్నానని అనుకోను.

మీ సినిమాల్లో విలన్స్ ఎందుకు ఉండరు?

శేఖర్‌ కమ్ముల: దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి విలన్స్ తారసపడతారు. 'ఆనంద్‌'లో ఒకడు 'రూపా.. మళ్లీ మళ్లీ కలుస్తా' అని అంటుంటాడు. అదే విలన్‌. 'లీడర్‌'లో పొలిటికల్‌గా ఎవరికివారు మంచివాళ్లుగా కథను అల్లుకుంటారు. ఇప్పుడున్న సమాజంలో స్వార్థం నరనరాల్లో ఉంటుంది. ప్రత్యేకంగా కొంతమంది దైవభక్తిలాంటి ముసుగులో ఏదో చేస్తుంటారు. అందువల్ల కథలు రాసేటప్పుడు విలన్‌ పాత్రల గురించి పెద్దగా పట్టించుకోను.

అప్పట్లో బాపుగారి దర్శకత్వంలో పనిచేయాలని చాలామంది నాయికలు కోరుకునేవారు. మరి ఇప్పటి ట్రెండ్‌లో.. ఎక్కువమంది మీ సినిమాల్లో నాయికలుగా చేయాలని కోరుకుంటున్నారు. ఇది కాంప్లిమెంటరీగా భావిస్తున్నారా?

శేఖర్‌ కమ్ముల: కాంప్లిమెంటరీగానే ఫీల్‌ అవుతాను. ఎవరైనా మీ దగ్గర పనిచేయడం నచ్చుతుందనడం కంటే ఇంకేముంటుంది? అలా ఒక ప్రేక్షకుడు 'కుటుంబంతో కలిసి మీ సినిమా చూస్తాను' అని అన్నప్పుడు, హీరో హీరోయిన్‌ 'మీ సినిమాల్లో నటించాలని ఉంది' అన్నప్పుడు గొప్పగానే అనిపిస్తోంది.

మీలో ఒక దర్శకుడు, టెక్నిషీయన్, నిర్మాత ఉన్నాడు..

శేఖర్‌ కమ్ముల: మా నాన్నగారు చెప్పినట్లు 'ఆల్‌ మనీ గోస్‌' అన్నట్లుగా, నిర్మాత లేనప్పుడు, అన్ని నేను చేసుకోవాల్సి వచ్చింది. ఎవరివైనా డబ్బులు వృథా అయిపోతుంటే మనది, వేరేవాళ్లది అనే తేడా నాకుండదు. అంతా మనమే అని నమ్ముతాను.

సామాజిక విషయాల్లో బలంగానే గొంతు విప్పుతున్నారని విన్నాను?

శేఖర్‌ కమ్ముల: నిర్భయ తర్వాత మనం ఒకరోజు కొవ్వొత్తులు పట్టుకొని, నల్ల డ్రెస్ ధరించి, నిరసన తెలపడం కాదు.. కావాల్సింది. మన మైండ్‌సెట్‌ మారాలి. మన చుట్టూ ఉన్న వారందరిని ఎలా చూస్తున్నాం.. తోటి ఆడవాళ్ల డ్రెస్‌ల మీద కామెంట్‌ చేయడం.. మన తోటి వాళ్లతో ఎలా ప్రవర్తిస్తున్నాం.. ఆడవాళ్లకు ఎలాంటి గౌరవం ఇస్తున్నాం.. తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు రెండేళ్లు కాలేజీల్లో కార్యక్రమాలు చేశాం. ఈ పని చేసినందుకు నాకెంతో గర్వంగా ఉంది.

ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందనుకున్న తర్వాత.. ఇదేంటి.. ఇలా అయిందే.. అని అనుకున్న సినిమా ఏది?

శేఖర్‌ కమ్ముల: ఇప్పటి వరకు అలాందేమీ లేదు. నా జయాపజయాలపై కచ్చితమైన అభిప్రాయం ఉంటుంది. బల్లగుద్ది మరీ చెప్పగలను. 'ఫిదా'కు ముందే చెప్పాను. 'హ్యాపీడేస్‌' కాలేజీ లైఫ్‌లో తీసిన సినిమాలు దీని తర్వాతనే. అలా పొలిటికల్‌ నేపథ్యంలో తీసిన 'లీడర్‌' చరిత్రలో నిలబడిపోతుందని చెప్పా. ఇప్పటికీ దాని హవా కొనసాగుతోంది. 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిపుల్‌' గురించి బల్లగుద్ది చెప్పలేదు.

(మధ్యలో అలీ కల్పించుకుంటూ) 'అప్పుడు బల్ల లేదా?'

బల్ల ఉంది కానీ నేను కొట్టలేదు. 'అనామిక' మొదటి రీమేక్‌ చిత్రం చేశా. కానీ భవిష్యత్తులో రీమేక్‌ చేయను. ఎందుకంటే ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు కాబట్టి.

ఇప్పుడొస్తున్న మీ 'లవ్‌స్టోరి' ప్రత్యేకత ఏంటి?

శేఖర్‌ కమ్ముల: ఇప్పటి వరకు చేసిన 'ఆనంద్‌', 'గోదావరి', 'ఫిదా' చిత్రాలు రొమాంటిక్‌ కామెడీ ప్రేమకథలు. వీటిలో పెద్ద సీరీయస్‌నెస్‌ ఉండదు. నిజంగా ఓ పల్లెటూరి నుంచి అబ్బాయి - అమ్మాయి పట్నానికి వచ్చి, తిండికి లేక ఎన్ని కష్టాలు పడుతుంటారో, మరోవైపు తమ జీవితాలను ఎలా బిల్డప్‌ చేసుకోవాలని ఆలోచిస్తుంటారో ఉందీ కథలో. వీరిద్దరూ వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీరిద్దరికి సామాజిక వ్యత్యాసం ఉంటుంది. ఇప్పటి వరకు నా సినిమాల్లో లేని కష్టాలు ఇందులో ఉంటాయి. ఇదొక ఏమోషనల్‌ లవ్‌స్టోరి. ఇదొక వైవిధ్యమైన చిత్రంగా చెప్పుకోవచ్చు.

ఈ సినిమాపై మేం ఎలాంటి ఆశలు పెట్టుకోవచ్చు? 'సారంగ దరియా' పాట ట్రెండింగ్‌లో ఉంది కదా?

శేఖర్‌ కమ్ముల: చాలా బాగుంటుంది.

'ఫిదా'లో ఆ ఒక్క పాట విజయాన్ని తెచ్చింది. మరి అదే రచయితతో ఈ సినిమాలో రాయిస్తున్నారు..

శేఖర్‌ కమ్ముల: ఆయన (సుద్దాల అశోక్‌తేజ) రాసిన పాటకి జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు 'సారంగ దరియా' కూడా చాలా బాగా రాశారు ధన్యవాదాలు (సుద్దాల) సర్‌.

రామానాయుడు ఎంతో మందిని పరిచయం చేశారు. వారిలో చాలామంది పెద్దస్టార్లు అయ్యారు. అలాంటిది 'రానా'ను మీ చేతిలో పెట్టారు.. ఏ ధైర్యంతో?

శేఖర్‌ కమ్ముల: ఈ కథకు రానా అయితేనే బాగుంటాడనిపించింది. నేను ఎడిటింగ్‌ కోసం రామానాయుడు స్టూడియోకి వెళ్లేవాణ్ని. రానా ఎక్కడి నుంచో 'హలో సర్‌' అంటూ పెద్దగా అరుస్తుండేవారు. ఆ వాయిస్ ఎంతో బాగుంది. అబ్బాయి మంచి పొడవు ఉన్నాడు, గొంతు బాగుంది అనుకున్నా. కథ రాసినప్పుడు నాకు ప్రెష్‌గా రానానే గుర్తుకొచ్చారు. రామానాయుడికి కథ చెప్పలేదు. కానీ టూకీగా 'హీరో సీఎం అవుతాడు' అని లైన్‌ చెప్పా. ఆయన 'బాగా తీయి' అన్నారు.

సినిమా చూసిన తర్వాత ఆయన స్పందనేంటి?

శేఖర్‌ కమ్ముల: నా చేతులు పట్టుకొని చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా బాగా తీశావని మెచ్చుకున్నారు. నేను ఊహించలేదు. వెంకటేష్‌ కూడా ఎమోషనల్‌ అయ్యారు. ఎంతోమంది దర్శకులను, నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని పరిచయం చేసిన రామానాయుడు 'చాలా బాగా తీశావు' అని మెచ్చుకున్నాక, అంతకంటే కావాల్సిందేముంటుంది!

మీ 'హ్యాపీడేస్‌' సినిమా చూశాక చాలామంది ఇంజనీరింగ్‌ చేరారు. తర్వాత.. వారంతా సినిమా వేరు, నిజ జీవితం వేరని తిట్టుకున్నారు. వాళ్లకేం చెబుతారు?

శేఖర్‌ కమ్ముల: సినిమా అంటే సినిమానే. కాలేజీకి వెళ్లిన రోజుల్లో పరీక్షలంటే తిట్టుకుంటాం. బయటకు వచ్చిన తర్వాత కాలేజీని చాలా మిస్‌ అవుతున్నాం అనిపిస్తోంది. అలా 'హ్యాపీడేస్‌' చూసి తిట్టుకునే వాళ్లుంటారు. అయినా మళ్లీ చూస్తుంటారు. కాలేజీ అంటే ఇలా ఉంటుందని అనుకోవద్దు.. చదువుకోండి.. అని జూనియర్‌కి సలహాలు కూడా ఇస్తుంటారు. మీరు కాలేజీ చదువు నుంచి బయటికొచ్చాక ఏం అనుకుంటారో అదే 'హ్యాపీడేస్‌' సినిమా.

మీ కథలో జూనియర్‌ని సీనియర్స్ లవ్‌ చేస్తుంటారు. మరో చిత్రంలో స్టూడెంట్స్ లెక్చరర్‌ని లవ్‌ చేస్తుంటారు. వాటికి ప్రేరణ ఎవరు?

శేఖర్‌ కమ్ముల: అలాంటిది ఏమీ లేదు. మెకానికల్ ఇంజనీరింగ్‌ చదువుతున్నప్పుడు మా క్లాస్‌లో ఒక్కతే అమ్మాయి ఉండేది. ప్రతి మనిషి బాల్యంలో టీచర్లు బాగా క్లాసులు చెప్పడంతో వారిపై ఏదో అభిమానం, ఇష్టం ఏర్పడుతుంది. అది ప్రేరణగా తీసుకున్నా తప్ప ఇంకేం లేదు. నా జీవితంలో ఏమీ జరగలేదు.

మీది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చినా పెళ్లా?

శేఖర్‌ కమ్ముల: నాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఆమె హోమ్‌ మేకర్‌. 1996లో పెళ్లయింది. మాకు ఇద్దరు పిల్లలు. పాప, బాబు.

మీ సినిమా చూసి మీ పిల్లలు కామెంట్‌ చేస్తారా?

శేఖర్‌ కమ్ముల: వాళ్లకు నచ్చదు. కామెంట్‌ చేస్తారు. కాంప్లిమెంట్ ఇవ్వరు. వాళ్లకు బ్రహ్మానందం, ఆలీ కామెడీ కావాలి. నాకు కామెడీ రాయడం రాదు. కానీ కామెడీ సినిమాలు చూస్తాను.

అప్పుడు 'ఆనంద్‌', 'గోదావరి'లో కమలీని ముఖర్జీ, ఇప్పుడు 'ఫిదా', 'లవ్‌స్టోరి'లో సాయిపల్లవి.. ఏంటి సంగతి?

శేఖర్‌ కమ్ముల: ముందుగా ఓ సినిమా చేశాం. కథ రాసేటప్పుడు ఈమె అయితే సరిపోతుందని అనిపిస్తోంది. అలాగే సంగీత దర్శకులు కూడా. 'ఫిదా'లో మాదిరిగా 'లవ్‌స్టోరి'లో డ్యాన్స్ ఉందని సాయిపల్లవినే తీసుకున్నా.

'లవ్‌స్టోరి' చిత్రంతో సంతోషంగా ఉన్నారా?

శేఖర్‌ కమ్ముల: నాగచైతన్య నన్ను నమ్మి చేశారు. ఆయన స్టార్ అని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. 'మీకు బాగా వచ్చేంత వరకు చేద్దాం' అని చెప్పేవారు. ఆ కష్టమంతా ఈ సినిమాలో చూడొచ్చు.

'ఆనంద్‌' సినిమా చూసి చిత్రసీమలో ఉన్న ఓ దర్శకుడు, మరో గీత రచయిత.. ఏంటి ఇది సినిమానా అని తలపట్టుకున్నారట?

శేఖర్‌ కమ్ముల: (నవ్వుతూ) మొదట్లో ఈ సినిమాను కృష్ణవంశీ, సీతారామశాస్త్రికి చూపించాను. కృష్ణవంశీ 'ఏంటిది సినిమా..?' అని అదోలా చూశారు. 'ఆనంద్‌' మొదట్లో మూడున్నర గంటలు నిడివి. కొత్త సినిమా, కొత్త దర్శకుడు, కొత్త నటుడు. సినిమా ఇంటర్వెల్‌ అయిపోయేసరికి కృష్ణవంశీ 'సినిమా అయిపోయిందా?' (ప్రేమతో) అన్నారు. అప్పుడే డల్‌ అయ్యాను. ఏంటిది ఇంత పెద్దగా ఉందనుకుని రీల్‌న్నర సినిమా తీసేయాల్సి వచ్చింది. అప్పటికి ఆ సినిమా ట్రెండ్‌కి భిన్నంగా ఉంది.

2021లో 'లవ్‌స్టోరి', ఇక మళ్లీ కొత్త చిత్రం 2023లో ఉంటుందా?

శేఖర్‌ కమ్ముల: ఈసారి 2022లోనే ఉంటుందనుకుంటున్నా. దీని తర్వాత మనసులో మరొకటి మెదులుతూనే ఉంటుంది కదా! 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' తీసినప్పుడు అందులో ఎక్కువ కథలు చెప్పినట్టు అనిపిస్తోంది. నేను అనుకున్నంతగా చేయలేదు. దాసరిగారు 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' గురించి ఓసారి మాట్లాడుతూ.."ఎందుకిలా? నీవు ఈ సినిమాను జడ్జ్ చేయలేదా? ఇంత పెద్ద సినిమా ఎందుకు రాసుకున్నావు?" అన్నారు. 'లీడర్‌' చిత్రం నాకొక కల్ట్ సినిమా. కానీ 'హ్యాపీడేస్‌' లాంటి బాక్సాఫీసు చిత్రం చేయాలనే కసితో 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌'కి అనుకున్నా. 'కోపంతో తీసే సినిమాలు పోతాయి' అని దాసరి చెప్పారు. అందుకే కోపంతో ఎప్పుడూ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: టాలీవుడ్​లో వాట్సప్​ వాడని దర్శకుడెవరో తెలుసా?

Last Updated : Apr 15, 2021, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.