ETV Bharat / sitara

'నలుగురితో చూస్తూ.. నవ్వుకునే చిత్రమిది'

author img

By

Published : Nov 21, 2021, 6:43 AM IST

anubhavinchu raja movie
అనుభవించు రాజా మూవీ

'అనుభవించు రాజా' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు వెల్లడించారు నిర్మాత సుప్రియ యార్లగడ్డ. ఆ విషయాలు మీకోసం.

"చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ లేదు. వాటిలో నుంచే కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కాబట్టి ప్రతి పెద్ద బ్యానర్‌ తప్పకుండా చిన్న చిత్రాలు తీయాలి. ప్రస్తుతం ఆ ఒరవడి తెలుగులో బాగానే కనిపిస్తోంది. అది ఇంకా పెరగాలి. ఓ చిన్న సినిమాని హిట్‌ చేయగలిగితే ఆ వచ్చే సంతృప్తిని మాటల్లో చెప్పలేం" అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. ఇప్పుడామె నిర్మాణంలో రూపొందిన చిత్రమే 'అనుభవించు రాజా'. రాజ్‌ తరుణ్‌, కశిష్ ఖాన్‌ జంటగా నటించారు. శ్రీను గవిరెడ్డి దర్శకుడు. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు సుప్రియ. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

అన్నపూర్ణ స్టూడియోస్‌ కథలన్నీ తొలుత మీరే వింటారా?

ఈ బ్యానర్‌ మీద చేసే సినిమా కథలన్నీ దాదాపుగా నేనే వింటాను. స్క్రిప్ట్‌ బాగుంది.. సినిమాగా మలచొచ్చని ఏమాత్రం అనిపించినా ఆయా నటీనటులకు పంపిస్తాను. ఒకవేళ నాగార్జున మామ, చైతన్య హీరోలుగా కథలు వస్తే.. ముందు వాళ్లకే వినిపిస్తా. వేరేవరైనా వాళ్ల కథలతో నా దగ్గరకొచ్చినా.. నేరుగా వాళ్లకే వినిపించమని చెప్పేస్తుంటాను.

supriya yarlagadda
నిర్మాత సుప్రియ యార్లగడ్డ

సుప్రియకు కథ చెప్పి.. ఒప్పించడం కష్టమంటారు నిజమేనా?

నేనెప్పుడూ కథ నచ్చితేనే ముందుకెళ్తాను. ఈ చిత్ర కథ వింటున్నప్పుడు చాలా నవ్వాను. నేను నవ్వానంటే మరో పదిమంది నవ్వుతారనే కదా. అందుకే విన్న వెంటనే ఈ సినిమా ఒకే చేశా. ఈ కథ మీద ఓ ఆరు నెలలు కూర్చోవాలి అని చెబితే కొందరు పారిపోతారు. శ్రీను అలా పారిపోతాడనుకున్నాను. కానీ, ఉన్నాడు. ఓపికగా సినిమా చేశాడు.

ఇంతకీ ఈ 'అనుభవించు రాజా' ఎలా ఉంటుంది?

పచ్చడన్నం లాంటి సినిమా ఇది. చిన్న సందేశం చెప్పి.. చిన్న నవ్వు నవ్వించి.. సంతృప్తిగా ఇంటికి పంపిస్తుంది. ఓ మంచి తెలుగు సినిమా చూశామన్న అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుంది. మన ఊరు నేటివిటీ, అక్కడి వాతావరణాన్ని అందరం మిస్‌ అవుతుంటాం కదా. ఇందులో అవన్నీ ఉన్నాయి. వంశీ గారి 'ఏప్రిల్‌ 1న విడుదల', 'లేడీస్‌ ట్రైలర్‌' సినిమాల్లా ఉంటుంది.

anubhavinchu raja movie
'అనుభవించు రాజా' సినిమా

కథ విన్నప్పుడే రాజ్‌ తరుణ్‌ను హీరోగా అనుకున్నారా?

అవును. రాజ్‌లో మంచి కామిక్‌ టైమింగ్‌.. ఓ వెటకారం అన్నీ ఉంటాయి. కథ వినగానే తను చేస్తేనే బాగుంటుందనిపించి తీసుకున్నాం. రాజ్‌ తరుణ్‌ పాత్రలో రెండు షేడ్స్‌ ఉంటాయి. హాల్లో నలుగురితో కలిసి చూస్తూ.. నవ్వుకునే చిత్రమిది.

‘బంగార్రాజు’ సంక్రాంతికి వచ్చే అవకాశముందా?

ప్రస్తుతానికి మా లక్ష్యమైతే సంక్రాంతే. ఇప్పటికే మూడు సినిమాలు పండక్కి వస్తామని ప్రకటించాయి. ఆ మూడు వస్తే.. 'బంగార్రాజు'కు చోటుండకపోవచ్చు. వాటిలో ఏ ఒక్కటి తప్పుకొన్నా.. మేము రేసులోకి వచ్చేస్తాం. ఎందుకంటే సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలకు చోటు లేదు. రెండింటికైతే హ్యాపీగా ఉంటుంది. కావాల్సిన సంఖ్యలో థియేటర్లు దొరుకుతాయి. ఏదేమైనా రానున్న రోజుల్లో పరిస్థితుల్ని బట్టి మేం రావాలా? వద్దా? అన్నది తేలుతుంది. ప్రస్తుతం మా బ్యానర్‌లో నాలుగు వెబ్‌సిరీస్‌లు, ఓ పెద్ద సినిమా.. మరో చిన్న చిత్రం నిర్మాణంలో ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.