చిరంజీవిని మెగాస్టార్​గా మార్చిన దర్శకధీరుడు

author img

By

Published : Aug 1, 2021, 11:12 AM IST

kodanda ramireddy

సినిమా ఓ బాధ్యత.. సమాజాన్ని తట్టి లేపుతుంది. సినిమా ఓ సృజన కళాకారుడిలో అద్భుతమైన నైపుణ్యానికి వేదికగా నిలుస్తుంది. సినిమా.. ఓ వేదిక ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందిస్తుంది. వీటన్నింటినీ మించి ఓ పరిశ్రమ వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. కమర్షియల్ సక్సెస్‌గా సినీ పరిభాషలో పిలిచే ఈ పదంపైనే వందల జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఈ వాణిజ్య కోణాలన్నీ ఔపోసన పట్టేసిన మాంత్రికుడాయన. ఏ డైరెక్టర్​కైనా కెరీర్​లో కొన్ని బ్లాక్ బ్లస్టర్​లు, సూపర్ హిట్​లు ఉండటం సహజం. కానీ కెరీర్​లో తీసిన చిత్రాల్లో 90శాతం విజయవంతమైన చిత్రాలే ఉంటే ఆయన్నే కోదండరామిరెడ్డి అంటారు. ఆయన గురించే ప్రత్యేక కథనం మీకోసం..

హీరో చిరంజీవిని మెగాస్టార్​గా మార్చిన దర్శకధీరుడు ఆయన. అర్జునుడికి చెట్టుపై ఉన్న పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు బాక్సాఫీస్​ను బద్ధలు కొట్టటమే లక్ష్యంగా సినిమాలు తీసిన నిర్మాతల దర్శకుడు ఆయన. సినిమాలంటే సదరు వ్యక్తుల ప్రతిభకు వేదికలే కాదు వందలాది మంది కడుపు నింపాల్సిన వ్యాపారమనే మర్మం ఎరిగిన వ్యక్తి. దర్శకుడిగా కెరీర్​లో 94 చిత్రాలు తెరకెక్కిస్తే అందులో 90శాతం విజయవంతమైన చిత్రాలే ఉండటం విశేషం. తొలినాళ్లలో ఎక్కువ రీమేక్ లే చేసినా.. మూలకథ తప్ప సినిమా అంతటికీ తన ఫ్లేవర్ యాడ్ చేయటం కోదండరామిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇదంతా సులభంగా జరిగిపోలేదు. అసలు ఏ రోజూ సినిమా దర్శకుడు అవ్వాలనే ఆలోచనే ఆయనకు లేదు. ఆయన ధ్యేయం, సంకల్పం అంతా వేరే. కానీ జరిగింది వేరే. కమర్షియల్ సినీ మాంత్రికుడిగా ఆయన సాధించిన పేరు వెనుక.. ఎన్నో కష్టాలు.. అంతకు మించిన మానసిక వ్యథ ఉన్నాయి.

16 కిలోమీటర్లు సైకిల్​ మీద

నెల్లూరు జిల్లా మైపాడులోని ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో 1950 జులై 1న వెంకురెడ్డి, రమణమ్మ దంపతులకు జన్మించారు కోదండరామిరెడ్డి. ఆయనకు ఓ సోదరి. చదువు పెద్దగా అబ్బకపోయినా నాటకాలంటే మాత్రం విపరీతమైన ఆసక్తి ఉండేది. ఊరిలో సినిమా హాల్ లేకపోవటం వల్ల మైపాడు నుంచి 16కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుకు స్నేహితులతో కలిసి సైకిల్ పై వెళ్లి వచ్చేవారు. అలా తెలియకుండానే సినిమాలపై, నటనపై విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నారు. హీరో అక్కినేని నాగేశ్వరరావును విపరీతంగా అభిమానించేవారు. సాంఘిక చిత్రాలంటే చాలా ఇష్టపడేవారు. హీరోలా ఉన్నావంటూ మిత్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో.... సినిమాల్లో హీరో అయిపోదామనే కలలతో మద్రాసు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. మద్రాస్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న బంధువు ప్రభాకరరెడ్డి సినిమావాళ్లతో పరిచయం చేయిస్తాను అని ఇచ్చిన మాటమీద హుటాహుటిన ట్రైన్ ఎక్కేశారాయన.

నిరాశకు లోనై..

ఎన్నో కలలతో మద్రాసుకు చేరుకున్న కోదండరామిరెడ్డికి మొదట్లోనే షాక్ తగిలింది. సినిమా వాళ్లకు పరిచయం చేస్తానని తీసుకువచ్చిన ప్రభాకరరెడ్డి తన ఉద్యోగంలో చాలా బిజీగా ఉండేవారు. దీంతో సొంతంగా ప్రయత్నిద్దామని వివరాలు కనుక్కుంటూ టీ-నగర్ చేరుకుని సినిమా ఆఫీసులు చుట్టూ ఆయన తిరగటం మొదలు పెట్టారు. ఎవరూ పట్టించుకోకపోవటం వల్ల తీవ్ర నిరాశకు లోనై ఇంటికి తిరిగి వచ్చేశారు. ఈ క్రమంలోనే నాలుగు నెలల తర్వాత ప్రభాకరరెడ్డి మరోసారి మద్రాసు రమ్మని కబురు పంపారు. ఈసారి రెండు నెలలున్నా ఆయన ఎవర్నీ కలిపించకపోవటం వల్ల విసుగుపుట్టి ఏదైనా ఉద్యోగం చేసుకుందామని ఊరికి తిరిగివచ్చేశారు. మూడోసారి ప్రభాకరరెడ్డి కబురుపెట్టగా కోదండ పట్టించుకోలేదు. దీంతో నేరుగా ఊరికి వచ్చిన ప్రభాకరరెడ్డి.. కోదండను బలవంతంగా మద్రాసు తీసుకువెళ్లి.. అప్పటికే అసోసియేట్ డైరెక్టర్​గా పనిచేస్తున్న పి.చంద్రశేఖర్ రెడ్డికి పరిచయం చేశారు. హీరో అవ్వాలనుకుంటున్నానని కోదండ చెప్పటం వల్ల పీసీ రెడ్డి ఫక్కున నవ్వేశారు. ఆ తర్వాత విక్టరీ మధుసూదన రావు దగ్గర డైరెక్షన్ అప్రెంటిస్​గా పెట్టించారు. అసలేమాత్రం ఇష్టంలేకపోయినా....పని నేర్చుకుని డైరెక్టర్ అయితే...హీరోగా తర్వాత మారొచ్చని భావించారు కోదండరామిరెడ్డి. అలా మధుసూదనరావు దగ్గర 'మనుషులు మారాలి' చిత్రానికి వంద రూపాయలు నెలజీతంగా అప్రెంటిస్​గా చేరారు.

మనుషులు మారాలి చిత్రానికి శోభన్ బాబు హీరో కాగా....అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్న పీసీరెడ్డి కి దర్శకుడిగా వేరే సినిమా అవకాశం రావటం వల్ల ఆయన వెళ్లిపోయారు. ఖాళీ అయిన స్థానంలో అప్పటి ప్రముఖ దర్శకుడు కే ప్రకాశరావు కుమారుడు కే రాఘవేంద్రరావు కొత్తగా వచ్చారు. ఆయనకు నెలకు 250 రూపాయలు జీతం ఇచ్చేవారు. నటీనటులకు సీన్లు వివరించటం దగ్గర నుంచి అన్ని పనులను రాఘవేంద్రరావే చూసుకునేవారు. సీన్లు రాయటం కోదండరామిరెడ్డి చూసుకునేవారు. అలా ఆ తర్వాత కాలంలో శోభన్​, రాఘవేంద్రరావుతో బలమైన స్నేహానికి పునాది పడింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆయనే గురువు

డైరక్టర్​గా ఫస్ట్ సీన్​లో యాక్షన్ చెప్పింది ఎన్​టీఆర్​కే కానీ... పూర్తిస్థాయిలో ఓ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం మాత్రం అంత సలువుగా రాలేదు. ఒకటి కాదు.. రెండు కాదు... నాలుగు సార్లు ఛాన్స్ వచ్చినట్టే వచ్చి.. చేజారిపోయింది. అయినా.. కోదండరామిరెడ్డి కుంగిపోలేదు. ప్రతిభ, పట్టుదల, ఓర్పుతో లక్ష్యం దిశగా అడుగులు వేశారు. సంధ్య సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో నవోదయం తెచ్చారు.

సుమారు 20 చిత్రాలకు మధుసూదనరావు దగ్గర కోదండరామిరెడ్డి పనిచేశారు. ఈ క్రమంలోనే శోభన్ బాబును హీరోగా పెట్టి రాఘవేంద్రరావు తన మొదటి సినిమా "బాబు"ను తీశారు. దానికి కో డైరెక్టర్ గా కోదండరామిరెడ్డి పనిచేశారు. రాఘవేంద్రరావును తన గురువుగా భావించేవారు. ఎందుకంటే పనిచేసింది మధుసూదనరావు దగ్గరే అయినా...సినిమాపై పూర్తి అవగాహన నేర్పించింది మాత్రం రాఘవేంద్రరావేనని చెబుతారు. ఎన్టీఆర్, వాణిశ్రీతో రాఘవేంద్రరావు "సింహబలుడు" సినిమా తీశారు. అందులో కొన్ని సీన్ల షూటింగ్ కోదండరామిరెడ్డితో చేయించారట రాఘవేంద్రరావు. అలా దర్శకుడిగా తను యాక్షన్ చెప్పింది ఎన్టీఆర్​కే కావటం విశేషంగా భావిస్తారు కోదండరామిరెడ్డి.

దర్శకుడిగా కెరీర్​ ప్రారంభం

1978 నుంచి దర్శకుడు కావాలని కోదండరామిరెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని 1980 జూలై 8న దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. సంధ్య షూటింగ్ మొదటి రోజు పూజా కార్యక్రమానికి హీరో కృష్ణ, విజయనిర్మల, స్నేహితుడు శోభన్ బాబు అందరూ వచ్చారు. సినిమా నిర్మాణం శరవేగంగా సాగుతున్న తరుణంలో...లింగమూర్తి సినిమా రషెస్ చూడాలని కోరారట. 15రోజుల పాటు తీసిన సినిమా అడగ్గానే కోదండరామిరెడ్డి తొలుత కంగారుపడినా... ఆ తర్వాత ధైర్యంగా చూపించారట. సినిమా చూసిన లింగమూర్తి మెచ్చుకోవటం సహా...డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరపగా....మొత్తం సినిమా ఐదు నిమిషాల్లో అమ్ముడైపోయిందంట. అప్పట్లో మద్రాస్ పట్టణం మొత్తం టాక్ ఆఫ్ దిటౌన్ గా మారిపోయింది. పదిహేనురోజులు మాత్రమే షూటింగ్ పూర్తైన చిత్రం అమ్ముడు అయిపోవటం అంటే..ఆ దర్శకుడిలో ఎంత ప్రతిభ ఉందో అనే చర్చ మొదలైంది. సినిమా విడుదలై మంచి చిత్రంగా పేరు తెచ్చుకోవటం సహా రామిరెడ్డికి అవకాశాలు రావటం మొదలయ్యాయి.

సంధ్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన వీఎంసీ అధినేత దొరస్వామి రాజు.. కోదండరామిరెడ్డి గురించి అప్పటికి ప్రముఖ నిర్మాత క్రాంతి కుమార్ కు చెప్పారట. అప్పటికే చిరంజీవితో చిన్నబడ్జెట్ తో సినిమా చేయాలని చూస్తున్న క్రాంతి కుమార్.. కోదండరామిరెడ్డితో సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు. అలా చిరు, రాధిక 'న్యాయం కావాలి' తెరెకెక్కి ఘన విజయం సాధించింది. ఆ తర్వాత క్రాంతి కుమార్ తన 'కిరాయి రౌడీలు' చిత్రానికి కోదండరామిరెడ్డికే అవకాశం ఇచ్చారు. చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా రూపుదిద్దుకున్న ఆ సినిమా చిత్తూరు జిల్లా తలకోన అటవీ ప్రాంతంలో షూటింగ్ జరిగిన తొలి చిత్రం. ఆ లొకేషన్లు సినిమా హాలీవుడ్ స్టైల్ అందాన్ని తీసుకువచ్చాయని అప్పట్లో బాగా చర్చించుకున్నారంట. ఆ సినిమాతో కోదండరామిరెడ్డి- చిరంజీవి అనుబంధం మరింత బలపడి ఓ సూపర్ హిట్ సినిమా దిశగా అడుగులు పడేలా చేసింది.

ఏఎన్​ఆర్​తో సినిమా ఫ్లాప్​

ఓటములు ఎదురైతేనే.. విజయం గొప్పతనం ఏంటో తెలుస్తుంది. కోదండరామిరెడ్డి సినీప్రయాణంలోనూ ఇదే జరిగింది. తన అభిమాన నటుడు ఏఎన్ఆర్ తో తీసిన సినిమా ఆడకపోవడం.. ఆయనలో పట్టుదలను మరింత పెంచింది. అసాధారణ సక్సెస్ రేట్ తో తిరుగులేని కమర్షియల్ మూవీ డైరెక్టర్ గా కోదండరామిరెడ్డి ఎదుగుదలకు బీజం పడేలా చేసింది.

బుచ్చిరెడ్డి అనే నిర్మాత ద్వారా...తన అభిమాన కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు ను డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నారు కోదండరామిరెడ్డి. గోపాల కృష్ణుడు సినిమా కోసం తమిళనటుడు, దర్శకుడు మణివన్నన్ కథ తయారు చేయగా....సత్యానంద్, సత్యమూర్తి స్క్రీన్ ప్లే విషయంలో సహాయం అందించారు. సత్యానంద్ డైలాగులు రాశారు. 1982లో గోపాలకృష్ణుడు సినిమా విడుదలైనా పెద్దగా ఆడలేదు. దీంతో తన అభిమాన నటుడికి హిట్ ఇవ్వలేకపోయినందుకు కోదండరామిరెడ్డి చాలా బాధపడ్డారు. అదే సమయంలో అదే కాంబినేషన్ లో అమరజీవి సినిమా అనౌన్స్ చేసిన నిర్మాత బుచ్చిరెడ్డి...గోపాలకృష్ణుడు ఆడకపోయే సరికి ప్రాజెక్ట్ నుంచి కోదండరామిరెడ్డిని తప్పించారు. ఇండస్ట్రీలో హిట్ కీ, ఫ్లాప్ కీ ఉండే విలువ అర్థమైపోయింది కోదండరామిరెడ్డికి. ఎంతటి భారీ హిట్ లు ఇచ్చామన్నది ముఖ్యం కాదు...సినిమా ఆడలేదంటే ప్రొడ్యూసర్లు మన ముఖం కూడా చూడరు అనే విషయం స్పష్టమైంది. సరిగ్గా ఆ సంఘటనే ఓ లెజెండరీ కమర్షియల్ మూవీ డైరెక్టర్ గా కోదండరామిరెడ్డి ఎదుగుదలకు బీజం పడేలా చేసింది. ఇది జరిగిన కొద్దినెలలకే అక్కినేని సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియో ఆఫీస్ నుంచి కోదండరామిరెడ్డికి పిలుపు వచ్చింది. తను ఫ్లాప్ ఇచ్చినా...తన అభిమాన కథానాయకుడే తిరిగి అవకాశం ఇవ్వటాన్ని నమ్మలేకపోయారు ఆయన. ఎప్పటికైనా అక్కినేనితో సినిమా చేస్తే చేయాలి అనుకున్న రెండు సినిమా కథలను కోదండరామిరెడ్డి చెప్పారు. అందులో ఒకటి శివాజీ గణేషన్ నటించి 1967లో వచ్చిన పూర్తి వినోదాత్మక కథా చిత్రం ఊటీ వరై వురువు. కథ నచ్చటం, అంతకు చేయని ప్రయోగం కావటం వల్ల...అక్కినేని ఒప్పుకున్నారు. కానీ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న వేరే చిత్రాల ఖర్చు అదుపు దాటిపోవటం వల్ల....తను నిర్మాతగా రిటైర్ అవుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు అక్కినేని. దీంతో కోదండరామిరెడ్డికి ఏం చేయాలో పాలుపోలేదు. తన అభిమాన నటుడిని మళ్లీ డైరెక్ట్ చేసే అవకాశం చేజారిపోతున్నందుకు చింతిస్తున్న తరుణంలో దిగ్గజ రచయిత డీవీ నరసరాజు...కోదండరామిరెడ్డికి అండగా నిలబడ్డారు. అక్కినేనితో నేరుగా మాట్లాడి...సినిమా నిర్మాణ వ్యయం ఎక్కువ కాకుండా బాధ్యతలు చూసుకుంటానని మాట ఇవ్వటం వల్ల అక్కినేని-కోదండరామిరెడ్డి సినిమా పట్టాలెక్కింది. అలా తెరకెక్కిన 1983లో శ్రీరంగనీతులు పెద్దహిట్ అయ్యింది.విషాదభరిత సన్నివేశాలు లేకుండా అంత హుషారుగా సినిమా తీయెచ్చని నిరూపించారు కోదండ. ఆ తర్వాత అనుబంధం, దాంపత్యం సినిమాలు వరుసగా ఆ తర్వాత ఐదేళ్లకు నాగేశ్వరావు, నాగార్జునతో ఇద్దరూ ఇద్దరే చిత్రాలను తీశారు కోదండరామిరెడ్డి.

చిరంజీవికి స్టార్​డమ్​

చిరంజీవి-కోదండరామిరెడ్డి... తెలుగు చిత్రసీమలో తిరుగులేని హిట్ కాంబో. అప్పటివరకు 29 సినిమాలు చేసినా తగినస్థాయిలో స్టార్ డమ్ రాని చిరంజీవిని రాత్రికి రాత్రే మెగాస్టార్ ను చేసింది కోదండరాముడి దర్శకత్వం. అభిలాష, ఖైదీ, ఛాలెంజ్, ముఠామేస్త్రి వంటి 25 ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

హీరో కృష్ణతో కిరాయి కోటిగాడు సక్సెస్ తర్వాత.. యండమూరి వీరేంద్రనాథ్ కథతో..."అభిలాష" చిత్రాన్ని తీశారు కోదండరామిరెడ్డి..అప్పటికే న్యాయం కావాలి సినిమాతో నటుడిగా నిరూపించుకున్న చిరంజీవికి ఈ సినిమా చాలా మంచిపేరు తీసుకువచ్చింది. ఉరిశిక్షను రద్దు చేయాలనే సందేశంతో...కావాలనే కేసులో ఇరుక్కుపోయిన యువ లాయర్ గా చిరంజీవి నటన...ఓ మంచి సందేశంతో రూపు దిద్దుకున్న ఈ చిత్రం కమర్షియల్ ఫార్మాట్ లా అనిపిస్తూనే...అందరినీ ఆలోచనల్లో పడేలా చేసింది.

ఇన్ని మంచి సినిమాలు పడుతున్నా...స్టార్ డమ్ అందుకోలేకపోతున్న చిరంజీవి టైం మొదలైంది అదే ఏడాదిలో. అభిలాష వచ్చిన ఏడాదిలోనే కోదండరామిరెడ్డి చిరంజీవితో మరో సారి సినిమా ప్లాన్ చేశారు. ఆ ఆలోచనే తెలుగు సినిమాలో ఓ సరికొత్త శకం ఆరంభానికి నాంది పలికింది. రెగ్యులర్ మూసధోరణికి భిన్నంగా యాక్షన్, రివెంజ్ డ్రామాను ఇలా కూడా తీయొచ్చా అని ఇండస్ట్రీ ఆశ్యర్యపడేలా కోదండరామిరెడ్డి టేకింగ్ తో ఆ సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచిన ఆ చిత్రమే 1983లో వచ్చిన "ఖైదీ". ఇక చిరంజీవి అనే నటుడు...తన అండర్ కరెంట్ యాక్టింగ్ రుచి చూపించి ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రత్యేకించి ఆ పోలీస్ స్టేషన్ సీన్..ఇప్పటికీ ఓ మాస్టర్ పీస్ గా చెప్పుకుంటారు.కోదండరామిరెడ్డి తనలో ఓ ఇంటెన్సివ్ ఫిల్మ్ మేకర్ ఉన్నాడని ఇండస్ట్రీ మొత్తానికి ఘనంగా చాటి చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అక్కడితో మేలిమలుపు తీసుకున్న చిరంజీవి-కోదండరామిరెడ్డి అనుబంధం.....ఛాలెంజ్, విజేత, పసివాడిప్రాణం, అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, ముఠామేస్త్రి ఇలా సూపర్ హిట్..బంపర్ హిట్ అంటూ...దిగ్విజయంగా సాగిపోయింది. మరణమృదంగం సినిమాతో తొలిసారిగా సుప్రీం హీరో చిరంజీవి పేరును కోదండరామిరెడ్డి" మెగాస్టార్ " చిరంజీవి గా తెరపై వేయించారు. చిరంజీవి వందో చిత్రం త్రినేత్రుడుని కోదండరామిరెడ్డే డైరెక్ట్ చేశారు. అలా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అక్షరాలా 25. తెలుగులో ఒకే కాంబినేషన్ లో వచ్చిన సినిమాల రికార్డును కైవసం చేసుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్ డం లేనప్పటి నుంచి ఇద్దరూ ఒకరికి ఒకరు పరిచయం. కష్టాలను చూశారు. కన్నీళ్లను అదుముకున్నారు. అంతటి అనుబంధం ఉన్నా...ఎప్పుడూ ఒకరి పరిధులు ఒకరు దాటలేదు. చిరంజీవి రెడ్డిగారూ అని పిలిస్తే....కోదండరామిరెడ్డి చిరంజీవి గారూ అని ఇప్పటికీ పిలుచుకుంటారు.అంతటి అనుబంధం ఉన్నా...పరస్పర గౌరవానికి చిరంజీవి ఇచ్చే విలువ గురించి గొప్పగా చెబుతారు కోదండరామిరెడ్డి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చిరు తర్వాత బాలకృష్ణతోనే

డైరెక్టర్ అవ్వకముందే ఎన్​టీఆర్​కు యాక్షన్ చెప్పారు కోదండరామిరెడ్డి. పూర్తిస్థాయిలో సినిమా చేసే అవకాశం మాత్రం రెండుసార్లు చేజారింది. అయితే.. బాలకృష్ణతో ఏకంగా 18 సినిమాలు తీసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించారు.

చిరంజీవి తర్వాత ఎక్కువగా నందమూరి బాలకృష్ణతో 18 సినిమాలు తీశారు కోదండరామిరెడ్డి. 1986లో అనసూయమ్మ గారి అల్లుడుతో మొదలుపెట్టి...భానుమతి గారి మొగుడు, భార్గవ రాముడు, ధర్మక్షేత్రం, నారీనారీ నడుమ మురారి, నిప్పురవ్వ, బొబ్బిలి సింహం, ముద్దులమొగుడు లాంటి చిత్రాలను తీశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ తో బాగా పరిచయం ఏర్పడింది. రెండుసార్లు ఆయన్ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని కోల్పోయారు కోదండరామిరెడ్డి. అదే విషయం ఆయనతో అంటే...మీ లాంటి యువకులతో పనిచేసే అదృష్టం మాకే లేదు బ్రదర్ అన్నారట. దాన్నిగొప్ప ప్రశంసగా భావిస్తారు కోదండరామిరెడ్డి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సంగీతానికి ప్రాధాన్యం

కోదండరామిరెడ్డి సినిమాల్లో....సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉండేది. ముఖ్యంగా చక్రవర్తితో ప్రారంభమైన ఆయన సంగీతప్రయాణం....ఆ తర్వాత ఇళయరాజాను తెలుగులో పెద్ద సినిమాలకు పరిచయం చేసేలా చేసింది. ముఖ్యంగా చిరంజీవి-ఇళయరాజా-కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు తదితర సినిమాల్లో వచ్చిన పాటలు....అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించాయి. రాజ్- కోటి కాంబినేషన్ లో వచ్చిన మ్యూజికల్ బీట్స్ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి. సినిమాల్లో బిజీగా ఉన్నంతకాలం కుటుంబంతో ఎక్కువ సేపు గడపలేకపోయిన లోటును ప్రస్తుతం కోదండరామిరెడ్డి తీర్చుకుంటున్నారు.

ఇదీ చూడండి: 'చిరంజీవితో ఫొటో దిగితే చాలనుకున్నా.. కానీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.