ETV Bharat / sitara

'అలా అయితేనే మహేశ్​, ప్రభాస్​ ప్రోత్సహిస్తారు'

author img

By

Published : Aug 25, 2021, 7:32 AM IST

sridevi soda center
శ్రీదేవి సోడా సెంటర్ నిర్మాతలు

'శ్రీదేవి సోడాసెంటర్'​ ఈ నెల 27న విడుదల కానున్న సందర్భంగా నిర్మాతలు విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి విలేకర్లతో ముచ్చటించారు. తమకు కథే ముఖ్యం అని.. ఆ తర్వాతే వ్యాపారం గురించి ఆలోచిస్తాం అని అంటున్నారు. త్వరలో స్టార్స్​తోనూ సినిమాలు తీస్తుమని చెబుతున్నారు.

"మా సంస్థ నుంచి వచ్చిన సినిమాల్ని గమనిస్తే ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. కథల పరంగా ఒకదానికొకటి పొంతన లేదు. జోనర్‌ కంటే కూడా మా దగ్గరికి వచ్చిన ఆ కథే ముఖ్యం. కథ తర్వాతే వ్యాపారం గురించి ఆలోచిస్తాం. ఒక్కసారి స్క్రిప్టు నచ్చిందంటే మా కొత్త సినిమా ప్రయాణం మొదలైనట్టే" అని అంటున్నారు నిర్మాతలు విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి. 70 ఎమ్‌.ఎమ్‌.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వరుసగా సినిమాలు నిర్మిస్తోంది ఈ ద్వయం. 'భలే మంచి రోజు', 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర'... ఇలా వరుసగా విజయాలే. ఇటీవల సుధీర్‌బాబు కథానాయకుడిగా కరుణకుమార్‌ దర్శకత్వంలో 'శ్రీదేవి సోడాసెంటర్‌' నిర్మించారు. ఆ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

"మంచి కథ ఎప్పుడు వస్తే అప్పుడు సినిమాని మొదలు పెట్టడం మా శైలి. 'ఆనందో బ్రహ్మ' తర్వాత చాలా మంది దర్శకులు హారర్‌ కామెడీ కథలతో వచ్చారు. కానీ అవేవీ 'ఆనందో బ్రహ్మ'కంటే బాగున్నట్టు అనిపించలేదు. 'యాత్ర' తర్వాత జీవిత కథలతో వచ్చారు. కానీ నచ్చలేదు. 'శ్రీదేవి సోడాసెంటర్‌' కథ నచ్చడం వల్ల వెంటనే మొదలుపెట్టాం. కథలవల్లే నిర్మాణంలో ఆలస్యమైంది తప్ప.. మేం విరామం తీసుకోవడం లేదు. నిర్మాత శ్యాం ప్రసాద్‌రెడ్డి తీసింది ఏడు సినిమాలే. కానీ ఆయన సినిమాల గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆయన ఎంచుకున్న కథలే అందుకు కారణం. మేం కూడా కథే ప్రధానంగా ప్రయాణం చేస్తున్నాం".

  • "వాస్తవికత ఉట్టిపడే కథతో 'శ్రీదేవి సోడాసెంటర్‌' రూపొందింది. దర్శకుడు కరుణకుమార్‌ తీసిన 'పలాస' ఒక 'రా' వాతావరణాన్ని ఆవిష్కరించింది. ఇది అందుకు భిన్నంగా సాగుతుంది. పూర్తిగా ఓ పల్లెటూరి నేపథ్యంతో కూడిన కథ. మణిశర్మకు కథ చెప్పగానే సంగీతం అందించడానికి ఒప్పుకొన్నారు. నిజ జీవిత పాత్రల ఆధారంగా రూపొందిన చిత్రమిది. మొదట ఈ కథకు 'నల్లవంతెన' అనే పేరు అనుకున్నాం. కానీ ఇందులో ప్రేమకథ కూడా ఉంటుంది, దానికి తోడు 'శ్రీదేవి సోడాసెంటర్‌' చుట్టూ సాగే కథ కావడం వల్ల అదే పేరునే ఖరారు చేశాం. సూరిబాబు పాత్రతో కూడిన ప్రచార చిత్రాన్ని విడుదల చేయగానే సినిమాకు వ్యాపారం మొదలైంది. ప్రేక్షకులందరినీ సూరిబాబు ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ఈ సినిమాతో అమెరికాలో ఓ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నాం. 20 మంది కలిసి టికెట్స్‌ బుక్‌ చేసుకుంటే వారి కోసం ఓ షో ఏర్పాటు చేస్తాం. అక్కడ 120 థియేటర్లలోనూ, ఆంధ్ర, తెలంగాణలో 500 థియేటర్లలో విడుదల చేస్తాం".
  • "స్నేహం ఒకవైపు, సినిమా మరోవైపు. సుధీర్‌, మేము సెట్లో హీరో.. నిర్మాతల్లాగే మెలుగుతాం. బయటికొస్తే స్నేహితులం. అలా ఉండకపోతే సినిమా చేయలేం. సినిమాల విషయంలో మా ఆలోచనలు చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాయి. చిరంజీవి సర్‌ సహకారం మాకు ఎప్పుడూ ఉంటుంది. మేం ఎంచుకునే కథల్నిబట్టే మహేశ్​బాబు, ప్రభాస్‌ ప్రోత్సహిస్తుంటారు. కథ మాకు, కథానాయకులకు నచ్చితే స్టార్స్‌తోనూ సినిమాలు చేస్తాం. తదుపరి చిత్రాల కోసం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి".

ఇదీ చదవండి : డిసెంబర్​లో బాక్సాఫీస్ వద్ద సందడే సందడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.