ETV Bharat / sitara

బాలయ్య పవర్​ఫుల్​ డైలాగ్​కు 20 ఏళ్లు

author img

By

Published : Jan 11, 2021, 5:27 PM IST

Updated : Jan 11, 2021, 5:56 PM IST

Nandamuri Balakrishna's Narasimha Naidu movie completed 20 years
బాలయ్య పవర్​ఫుల్​ డైలాగ్​కు 20 ఏళ్లు

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బి.గోపాల్​ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నరసింహనాయుడు'. ఈ సినిమా విడుదలై నేటి(సోమవారం)తో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలు మీకోసం.

'కత్తులతో కాదురా..కంటి చూపుతో చంపేస్తా..' ఈ ఒక్క డైలాగ్‌తో 'నరసింహనాయుడు'గా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా బి.గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన విజయవంతమైన చిత్రమిది. 2001 జనవరి 11న విడుదలైన ఈ చిత్రం నేటి(సోమవారం)తో 20ఏళ్లు పూర్తి చేసుకుంది. బాలకృష్ణ నటనతో పాటు, చిన్ని కృష్ణ కథ, పరుచూరి సోదరుల సంభాషణలు, మణిశర్మ సంగీతం, బి.గోపాల్‌ దర్శకత్వ ప్రతిభ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం అప్పట్లోనే రూ.30కోట్ల వసూళ్లు రాబట్టింది.

Nandamuri Balakrishna's Narasimha Naidu movie completed 20 years
20 ఏళ్లు పూర్తి చేసుకున్న 'నరసింహనాయుడు' సినిమా

'నరసింహనాయుడు' వెనుక జరిగింది ఇది

దర్శకుడు బి.గోపాల్‌ ఒక రోజున రచయిత పరుచూరి గోపాలకృష్ణ దగ్గరకు వెళ్లి మూడు చిన్న చిన్న కథలు చెప్పారు. అందులో ఏది బాగుందో చెప్పమని అడిగితే, 'పిల్లాడిని ఎత్తుకుని రైలులో నుంచి హీరో దిగుతాడు' అన్న కథ బాగుందని అని పరుచూరి చెప్పారు. అయితే, రచయితను మిగిలిన కథ సిద్ధం చేయమని చెబుతాను అని అక్కడి నుంచి వెళ్లిపోయారు బి.గోపాల్‌. ఆ కథ రాసింది చిన్ని కృష్ణ అని అప్పటివరకూ పరుచూరి సోదరులకు తెలియదు. ఆ తర్వాత చిన్నికృష్ణను తీసుకుని, బి.గోపాల్‌ కథ చెప్పడానికి పరుచూరి సోదరుల దగ్గరకు వచ్చారు. 'సీమ సింహం'లో పోలీస్‌ ఆఫీసర్‌ కథను ఇంకో రకంగా చిన్ని కృష్ణ చెప్పారు. బి.గోపాల్‌కు ప్రథమార్ధం బాగా నచ్చింది.

Nandamuri Balakrishna's Narasimha Naidu movie completed 20 years
'నరసింహనాయుడు' సినిమాలో బాలకృష్ణ

అయితే, 'రౌడీ ఇన్‌స్పెక్టర్‌' కన్నా గొప్పగా లేదని, అంతకంటే మించి కథ ఉంటే చెప్పమని చిన్నికృష్ణకు బి.గోపాల్‌ సూచించారు. రెండు, మూడు రోజులు సమయం తీసుకుని, మళ్లీ మరో పాయింట్‌తో చిన్నికృష్ణ వచ్చారు. అప్పుడు 'నేను బిహార్‌లో ఒక సంఘటన చూశాను. వాళ్ల గ్రామంపైకి ఎవరైనా దాడి చేస్తే, ఎదుర్కొనేందుకు ఇంటికి ఒక మగ పిల్లాడిని చొప్పున బలి పశువుగా ఇచ్చారు. అందులో ఒకడు హీరో' అని చిన్న పాయింట్‌ చెప్పారు చిన్ని కృష్ణ. వెంటనే అక్కడే ఉన్న బి.గోపాల్‌.. 'కథలా డెవలప్‌ చేసి, చెప్పకుండా ఇలా పాయింట్‌లా చెబితే ఎలా' అని ప్రశ్నించారు. దీంతో పరుచూరి గోపాలకృష్ణ స్పందించి 'అతన్ని రాయనివ్వండి. అప్పుడే అసలు కథ తెలుస్తుంది' అని గోపాల్‌ను వారించారు. రెండు, మూడు రోజులు పరుచూరి సోదరులతో కలిసి కూర్చొని 'నరసింహనాయుడు' కథను సిద్ధం చేశారు చిన్ని కృష్ణ.

పవర్‌ఫుల్‌ డైలాగ్‌ వచ్చింది అప్పుడే!

కథ అంతా ఓకే అయిన తర్వాత సినిమా సెట్స్‌పైకి వెళ్లడం, చిత్రీకరణ పూర్తి చేసుకోవడం సజావుగా సాగిపోయింది. అయితే, రెండుసార్లు బ్రహ్మానందం అందుబాటులో లేక గుండు హనుమంతరావుతో సన్నివేశాలు తీసేశారు. షూటింగ్‌ చివరి రోజు ఆఖరి సన్నివేశం తీస్తుండగా, బి.గోపాల్‌.. పరుచూరి గోపాలకృష్ణ దగ్గరకు వచ్చి.. 'గురువుగారు ఈ సీన్‌లో మంచి పవర్‌ఫుల్‌ డైలాగ్‌ పడితే బాగుంటుంది' అని అంటే, అప్పటికప్పుడు ఆలోచించి 'కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా..!' అనే డైలాగ్‌ సెట్‌లో రాశారు గోపాలకృష్ణ. థియేటర్‌లో ఈ డైలాగ్‌కు వచ్చిన స్పందన మామూలుగా లేదు.

Nandamuri Balakrishna's Narasimha Naidu movie completed 20 years
'నరసింహనాయుడు' సినిమా 200 రోజులు ఆడిన థియేటర్లు

17వేల అడుగుల రష్‌..మారిన ఇంటర్వెల్‌

సినిమా చిత్రీకరణ అంతా పూర్తి కాగా, మొత్తం 17వేల అడుగుల రష్‌ వచ్చింది. ఎడిటింగ్‌ రూమ్‌లో సినిమాను చూసిన పరుచూరి గోపాలకృష్ణ 'ఇది ఆంధ్రా షోలే అవుతుంది' అన్నారు. అయితే, ద్వితీయార్ధం నిడివి పెరిగిపోయిందనడం వల్ల, 'ఎడిటింగ్‌ చేసి చూపిస్తా' అని బి.గోపాల్‌ అన్నారు. మరుసటి రోజు మళ్లీ సినిమా చూడగా, "బి.గోపాల్‌.. నిన్న ఆంధ్రా షోలే అవుతుంది అన్నాను కదా! కేవలం 'ఆంధ్రా' అనే అవుతుంది 'షోలే' కాలేదు" అంటూ గోపాలకృష్ణ చెప్పగా.. బి.గోపాల్‌ ఆశ్చర్యపోయారు. 'ద్వితీయార్ధంలో ఒక్క సీన్‌ కూడా తీయడానికి వీల్లేదు' అని చెప్పడం వల్ల కొన్ని సీన్లు, అటూ ఇటూ మార్చారు.

బాలకృష్ణ రైలులో నుంచి దిగుతుండగా, రౌడీలు పారిపోతున్న సీన్‌ను ఇంటర్వెల్‌గా పెట్టారు దర్శకుడు బి.గోపాల్‌. ఆ తర్వాత దాన్ని ముందుకు తీసుకొచ్చారు. 'మా అన్నయ్యలు రానిదే పెళ్లి చేసుకోను' అని బాలకృష్ణ చెప్పే సన్నివేశం దగ్గర ఇంటర్వెల్‌ వేయమని పరుచూరి సూచించారు. 'ఇంటర్వెల్స్‌ ఎప్పుడూ సినిమాలను ఆడించవు.. సెకండాఫ్‌లు మాత్రమే ఆడిస్తాయి' అన్న పరుచూరి మాటకు కట్టుబడి బి.గోపాల్‌ ఇంటర్వెల్‌ మార్చారు. అలా చిన్న చిన్న మార్పులతో ఇప్పుడు మనం చూస్తున్న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్రబృందం.

2001 జనవరి 11న సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'నరసింహనాయుడు'.. ప్రభంజనం సృష్టించింది. బాలకృష్ణ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక మణిశర్మ అందించిన పాటలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. బి.గోపాల్‌-బాలకృష్ణ కాంబినేషన్‌లో మరో ఆణిముత్యం వెండితెరపై మెరిసింది. 105 థియేటర్‌లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. కేవలం వారం రోజుల్లో 101 షోలను వేశారు. అప్పట్లో ఇదో రికార్డు. ఈ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నందమూరి బాలకృష్ణ నంది అవార్డును అందుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'చంటి' ఆ హీరోతో తీద్దామనుకున్నారట.. కానీ!

Last Updated :Jan 11, 2021, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.