ETV Bharat / sitara

అంతకు మించి మరేమి లేదు: నాగార్జున

author img

By

Published : Apr 25, 2021, 6:27 AM IST

'వైల్డ్​డాగ్'కు ఓటీటీలో వస్తున్న ఆదరణ గురించి మాట్లాడటం సహా మరెన్నో ఆసక్తికర విషయాల్ని హీరో నాగార్జున పంచుకున్నారు. కుమారుడు అఖిల్​తో కలిసి నటించాలనేది తన ఆలోచన అని అన్నారు. ప్రస్తుతం 'బంగార్రాజు' సినిమాను సిద్ధం చేసే పనిలో ఉన్నామని వెల్లడించారు.

NAGARJUNA ABOUT PRESENT SITUATION AND HIS FUTURE PROJECTS
అంతకు మించి మరేమి లేదు: నాగార్జున

'పని చేయడం అంటే ఇష్టం' అని అంటుంటారు కథానాయకుడు నాగార్జున. కరోనాతో చిత్రీకరణలకే విరామం కానీ.. నేను మాత్రం ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటానని చెబుతున్నారాయన. కథానాయకుడిగా 35 యేళ్ల ప్రయాణం ఆయనది. ఇప్పటికీ కొత్తదనంలోనూ... ఫిట్‌నెస్‌లోనూ ఈతరంతో పోటీపడుతుంటారు. అందుకే నాగార్జున నుంచి గుర్తుండిపోయే సినిమాలు వస్తుంటాయి. ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన 'వైల్డ్‌డాగ్‌' నెట్​ఫ్లిక్స్‌లో నాలుగు దక్షిణాది భాషల్లో విడుదలై ఆదరణ సొంతం చేసుకొంటోంది. పలు దేశాల్లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా నాగార్జునతో 'ఈనాడు సినిమా' ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విశేషాలివీ...

‘వైల్డ్‌డాగ్‌’ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్‌లో చక్కటి ఆదరణ లభిస్తోంది. ఈ స్పందన సంతృప్తినిస్తోందా?

చాలా సంతోషంగా ఉంది. మన దగ్గరే కాదు.. మలేసియా, సింగపూర్‌, బంగ్లాదేశ్‌ ఇలా రకరకాల ప్రాంతాల్లో ట్రెండింగ్‌లో ఉంది. మేం సినిమాను ఏప్రిల్‌ 2న విడుదల చేశాం. కొవిడ్‌ ప్రభావం అప్పుడే మళ్లీ మొదలైంది. ఇంతగా పెరిగిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. కొవిడ్‌ ముందు ప్రపంచమే ఆగిపోయింది, మా ‘వైల్డ్‌డాగ్‌’ ఎంత (నవ్వుతూ). కానీ ఎక్కడో ఓ చిన్న వెలితి ఉంటుంది కదా. థియేటర్లలో చూసినవాళ్లంతా బాగుందన్నారు. మంచి సమీక్షలు వచ్చాయి. కానీ ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు. అప్పటికే కరోనా రెండో దశ ప్రభావం పెరిగిపోయింది. మా సినిమానే కాదు, చాలా వాటికి అలాంటి పరిస్థితే ఎదురైంది.

NAGARJUNA wild dog movie
నాగార్జున వైల్డ్​డాగ్ సినిమా

అఖిల్‌, నేను నటిస్తున్న సినిమా గురించి సన్నాహాలు మొదలయ్యాయి. మా పెద్దబ్బాయి నాగచైతన్యతో కలిసి నటించాను కదా, ఇప్పుడు రెండో అబ్బాయితోనూ కలిసి ఓ సినిమా చేయాలనేది నా ఆలోచన. అఖిల్‌ ప్రస్తుతం 'ఏజెంట్‌' కోసం సన్నద్ధం అవుతున్నాడు. తన లుక్‌ కూడా నాకు బాగా నచ్చింది.

ఇకపైనా ఇలాంటి ప్రయత్నాలు కొనసాగుతాయా?

నా జీవితంలో నేను చూడని విజయాలున్నాయా? అదే తరహాలో పరాజయాల్నీ చూశా. కొత్తగా ఫలితాల గురించి మాట్లాడేది ఏముంది? ఇప్పుడు మనసుకు నచ్చిందే చేయాలని ఉంటుంది తప్ప, అంతకుమించి మరేమీ లేదు. దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌ ‘వైల్డ్‌డాగ్‌’ కథ చెప్పగానే... ‘ఇక్కడ జరిగిన పేలుళ్ల కథ ఇది. మనం చెప్పాలి’ అనిపించింది. అందుకే చేశా. ప్రజలు చూస్తున్నారని అర్థమైంది కదా. కొవిడ్‌ లేకపోతే కచ్చితంగా థియేటర్లలోనూ ఈ సినిమా ఫలితాల్ని రాబట్టేది. నా సినిమా పోయిందన్న బాధ కంటే, కొవిడ్‌ ఇలా పెరిగిపోతోందేమిటనే బాధే ఎక్కువగా ఉంది.

చిత్ర పరిశ్రమ ఇక గాడిన పడిందనుకునేలోపే మళ్లీ ఇలాంటి పరిస్థితులు రావడంపై మీ అభిప్రాయం?

ఒక్క 15 రోజుల్లోనే అంతా మారిపోయింది. మొన్నటివరకు మన పరిశ్రమలో కెమెరా కావాలంటే కెమెరా దొరకలేదు, లైట్లు కావాలంటే లైట్లు దొరకలేదు. సినిమాల షూటింగులు, విడుదలలతో సందడి సందడిగా కనిపించింది. మనం ఇంత వేగంగా పుంజుకుంటామని అనుకోలేదు. పక్క పరిశ్రమలూ మనల్ని ఆశ్చర్యంగా చూశాయి. అంతలోనే పరిస్థితులు తారుమారయ్యాయి.

మీరు చిత్రీకరణలో పాల్గొంటున్నారా?

మేమూ ఆపేసి కూర్చున్నాం. జాగ్రత్తలు తీసుకుని చేసేద్దాం అని సెట్‌కు వెళతాం, ఒకట్రెండు రోజులు చిత్రీకరణ చేస్తాం. ఆ వెంటనే వేరే రాష్ట్రం నుంచి, వేరే ఊళ్ల నుంచి నటులు సాంకేతిక నిపుణులు రావల్సిన అవసరం ఏర్పడుతుంది. వాళ్లేమో రావడానికి భయపడుతుంటారు. ఈ పరిస్థితుల్లో ఇళ్లు వదిలి రావడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. దాంతో చిత్రీకరణలు ఆపేసి కూర్చుంటున్నాం. అంతా గందరగోళం అయిపోయింది. గతేడాది విడుదలలు ఆగిపోవడం వల్ల, ఈ యేడాదిపై బాగా ఒత్తిడి పెరిగిపోయింది. ఎలాగోలా సినిమాలు విడుదలవుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ వాయిదా పడ్డాయి.

nagarjuna
నాగార్జున

నేను వ్యాక్సిన్‌ రెండు డోసులూ తీసుకున్నా. అయినా సరే జాగ్రత్తగా ఉంటున్నా. చుట్టు పక్కల వాళ్లనీ జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తున్నా. వ్యాక్సిన్‌ తీసుకుంటే జ్వరం వస్తుందని, ఇతరత్రా సమస్యలనీ చాలా మంది అంటున్నారు. ఒకటో డోస్‌ తీసుకున్నప్పుడు నాకేం కాలేదు. రెండో డోస్‌ తీసుకున్నప్పుడు ఒకట్రెండు రోజులు కొంచెం ఒళ్లు నొప్పులు అనిపించాయి. ఆ తర్వాత మామూలే. మా అత్తగారూ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆమె వయసు 85 యేళ్లు. ఏ సమస్య రాలేదు. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ప్రయత్నించండి.

పరిశ్రమలో మళ్లీ సాధారణ పరిస్థితులు రావడానికి ఎంత సమయం పట్టొచ్చని భావిస్తున్నారు?

త్వరలోనే బయటపడతాం అనే నమ్మకం ఉంది. గతేడాది ఎదురైన పరిస్థితుల్నే ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు బాగా తెలిసింది. వ్యాక్సినూ వచ్చేసింది. రానున్న రెండు మూడు నెలలు కష్టంగా ఉంటుందేమో అనిపిస్తోంది. ఆ తర్వాత బయట పడతాం అనే నమ్మకం. మనకు నమ్మకమే ముఖ్యం. అది లేకపోతే బతకలేం కదా.

ప్రస్తుతం దేశంలో పరిస్థితులు గమనిపిస్తుంటే ఓ పౌరుడిగా మీకు ఏం అనిపిస్తోంది? ప్రజలకు ప్రభుత్వాలకు ఎలాంటి సూచనలు ఇస్తారు?

మన జనాభా చాలా ఎక్కువ. అందుకే మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ ఎవరూ ఊహించని పరిణామాలు ఇవన్నీ. కరోనా తగ్గినట్టే కనిపించింది కదా. ఫిబ్రవరి, మార్చిలో 6 వేల కేసులకు తగ్గిపోయినట్టు కనిపించాయి. నెల రోజుల వ్యవధిలో 3 లక్షలకి పెరిగిపోయింది. ప్రభుత్వాలు పుంజుకోవాలి, శరవేగంగా చర్యలు చేపట్టాలి. అలాగే ప్రజలు జాగ్రత్తగా ఉంటూ, నియమాలు పాటించాలి. గతేడాది మొత్తం నేను పనిచేస్తూనే ఉన్నా. జాగ్రత్తగా ఉంటే మన పనులు మనం చేసుకోవచ్చు. అజాగ్రత్తగా ఉన్నప్పుడే ఇబ్బందులు ఎదుర్కొంటాం, పక్కవాళ్లనీ కష్టాల పాలు చేస్తాం. ప్రభుత్వాలు వ్యాక్సిన్‌ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి కదా. 18 యేళ్ల వయసు నుంచి ప్రతి ఒక్కరూ రిజిస్టర్‌ అయ్యి వ్యాక్సిన్‌ తీసుకోవాలి. వ్యాక్సిన్‌ తీసుకున్న దేశాల్లో కేసుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. ఎంత త్వరగా వ్యాక్సిన్‌ తీసుకుంటే అంత మంచిది. కొద్దిమంది వ్యాక్సిన్‌ తీసుకున్నా మళ్లీ కరోనా వచ్చిందని చెబుతున్నారు. ఒకవేళ వచ్చినా అది తక్కువ బలంతో వస్తుంది. ప్రాణాంతక పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చు.

ఈ విరామంలో కొత్తగా కథలేమైనా వింటున్నారా?

కొత్త కథలంటే.. 'బంగార్రాజు' కథనే సిద్ధం చేసుకుంటున్నాం. దర్శకుడు కల్యాణ్‌కృష్ణతో కలిసి ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ కథ గురించి చర్చించుకుంటున్నాం. చిత్రీకరణలు మొదలు కాగానే, ఆ సినిమాను మొదలు పెట్టాలి.

Conclusion:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.