ETV Bharat / sitara

రివ్యూ: 'క్రాక్​'తో మాస్​ మహారాజ్​ ఫామ్​లోకి వచ్చాడా?

author img

By

Published : Jan 10, 2021, 12:26 PM IST

Updated : Jan 10, 2021, 12:36 PM IST

మాస్​మహారాజ్​ రవితేజ హీరోగా నటించిన చిత్రం 'క్రాక్​'. శనివారం (జనవరి 9) విడుదలైన సినిమా..ప్రేక్షకుల నుంచి పాజిటివ్​ టాక్​ దక్కించుకుంది. ఈ చిత్రంలో ఎవరెలా నటించారు? కథాంశం ఏమిటనే విషయాలను 'ఈటీవీ భారత్​' సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

Mass Maharaj Ravi Teja's Krack movie review
రివ్యూ: 'క్రాక్​'తో మాస్​ మహారాజ్​ ఫామ్​లోకి వచ్చాడా?

చిత్రం: క్రాక్‌

నటీనటులు: ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌, స‌ముద్ర‌ఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీప్ర‌సాద్‌, చిర‌గ్ జాని, మౌర్య‌ని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి త‌దిత‌రులు

సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌

ఛాయాగ్ర‌హ‌ణం: జి.కె. విష్ణు

సంభాష‌ణ‌లు: సాయిమాధ‌వ్ బుర్రా, వివేక్‌

కూర్పు: న‌వీన్ నూలి

క‌ళ‌‌: ఎ.ఎస్‌. ప్ర‌కాష్‌

పోరాటాలు: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌

పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి

నిర్మాత‌: బి. మ‌ధు

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని

సంస్థ‌‌: స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్

విడుద‌ల‌: 09-10-2021

Mass Maharaj Ravi Teja's Krack movie review
'క్రాక్​' సినిమా పోస్టర్​

తెలుగునాట సంక్రాంతి అంటే ‌కొత్త సినిమాల సంద‌డి ఉండి తీరాల్సిందే. ఈసారి క‌రోనా కూడా మ‌న సినీ సంక్రాంతిని ఆప‌లేక‌పోయింది. ఎప్పట్లాగే నాలుగు సినిమాలు బాక్సాఫీసు ముందుకు వ‌రుస ‌కడుతున్నాయి. అందులో భాగంగా విడుదలైన తొలి సినిమా 'క్రాక్'. 'డాన్‌శీను', 'బ‌లుపు' త‌ర్వాత ర‌వితేజ - గోపీచంద్ మ‌లినేని కాంబోలో రూపొందిన మ‌రో చిత్ర‌మిది. మాస్‌కు నిర్వ‌చ‌నంలా క‌నిపించే ర‌వితేజ మ‌రోసారి పోలీస్‌గా న‌టించ‌డం.. ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకునేలా ఉండ‌టం వల్ల ఈ సినిమాపై అంచ‌నాలు నెల‌కొన్నాయి. శ‌నివారం ఉద‌యమే విడుద‌ల కావ‌ల్సిన ఈ సినిమా, ఆర్థిక కార‌ణాల‌తో కాస్త ఆల‌స్యంగా రాత్రి విడుద‌లైంది. మ‌రి సినిమా ఎలా ఉంది? ర‌వితేజ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్టేనా?

క‌థేంటంటే?

పోత‌రాజు వీర‌శంక‌ర్ (ర‌వితేజ) నేర‌స్తుల ప‌ట్ల నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రించే పోలీస్ అధికారి. ఎక్క‌డ ప‌నిచేసినా అక్క‌డ త‌న ప్ర‌భావం చూపిస్తుంటాడు. బ్యాక్‌గ్రౌండ్ మాటెత్తితే అస‌లేమాత్రం స‌హించ‌డు. వృత్తినీ, కుటుంబాన్నీ స‌మంగా ప్రేమిస్తూ భార్య క‌ల్యాణి (శ్రుతిహాస‌న్‌), వీరిద్ద‌రికీ పుట్టిన ఓ అబ్బాయితో క‌లిసి ఆనందంగా జీవిస్తుంటాడు. సీఐగా ఒంగోలుకు వెళ్లాక అక్క‌డి ముఠా నాయ‌కుడు క‌ఠారి కృష్ణ (సముద్ర‌ఖ‌ని)తో వైరం ఏర్ప‌డుతుంది. ఇంత‌లోనే వీర‌శంక‌ర్ స్టేష‌న్‌లో ప‌నిచేసే ఓ కానిస్టేబుల్ హ‌త్య‌కు గుర‌వుతాడు. ఆ హ‌త్య‌కూ, క‌ఠారి కృష్ణ‌కు సంబంధం ఏమిటి? ఆ హ‌త్య కేసును వీర‌శంక‌ర్ ఎలా ఛేదించాడు? ఆ క్ర‌మంలో ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయన్న‌దే మిగిలిన క‌థ‌.

Mass Maharaj Ravi Teja's Krack movie review
'క్రాక్​' సినిమా పోస్టర్​

ఎలా ఉందంటే

ఓ పోలీసు అధికారి.. ముగ్గురు క‌ర‌డుగ‌ట్టిన నేర‌స్తుల చుట్టూ సాగే క‌థ ఇది. మ‌న సినిమాల్లో ఇదివ‌ర‌కు చూసిన క‌థే. కానీ క‌థ‌నంతో ఈ సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు. జేబులో ఉండాల్సిన నోటు, గోడ‌కు ఉండాల్సిన మేకు, చెట్టుకు ఉండాల్సిన మామిడికాయ అంటూ క‌థ‌ని మొద‌లు పెట్టడం అందులో భాగ‌మే. ముగ్గురు నేర‌స్తుల జీవితాల్లోకి వీర‌శంక‌ర్‌ ఎలా ప్ర‌వేశించాడు? వాళ్ల జీవితాల్ని ఎలా ప్ర‌భావితం చేశాడ‌నేది ఇందులో ఆస‌క్తిక‌రం. క‌థ మ‌న‌కు అల‌వాటైన క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తోనే ముస్తాబైంది. క‌థ‌నంతో తెలిసిన ఆ క‌థ‌నూ ఆస‌క్తిక‌రంగా న‌డిపించడంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు. ప్ర‌థ‌మార్ధం వీర‌శంక‌ర్ కుటుంబ జీవితం, త‌న వ్య‌క్తిత్వాన్ని ఆవిష్క‌రిస్తూ సాగుతుంది. కుటుంబ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు కాస్త బ‌ల‌వంత‌గా, పాటల కోస‌మే అన్న‌ట్టుగా సాగుతాయి. కానిస్టేబుల్ హ‌త్య త‌ర్వాతే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ఆ కేసును ఛేదించ‌డం కోసం వీర‌శంక‌ర్ చేసే ప‌రిశోధ‌న‌, ఆ క్ర‌మంలో క‌ఠారి కృష్ణ వేసే ఎత్తులు, పైఎత్తులు సినిమాను ఆస‌క్తిక‌రంగా మార్చేస్తాయి.

ముఖ్యంగా ద్వితీయార్ధంలో వ‌చ్చే మ‌లుపులు సినిమాకు ప్ర‌ధాన‌బ‌లం. ప్ర‌ధాన‌మైన ప్ర‌తి పాత్ర కూడా క‌థ‌లో ఓ మ‌లుపుకు కార‌ణం అవుతుంటుంది. దాంతో సాదాసీదాగా సాగిపోతున్న క‌థ అనూహ్య‌మైన సంఘ‌ట‌న‌ల‌తో స‌రికొత్త అనుభూతిని పంచుతుంది. ర‌వితేజ‌ని ఎలాంటి పాత్ర‌లో చూడాల‌నుకుంటారు? ఆయ‌న్నుంచి ప్రేక్ష‌కులు ఏం కోరుకుంటారో అవి ప‌క్కాగా ఉండేలా చూసుకుంటూనే క‌థ‌కు కొత్త రంగులు అద్దే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా ర‌వితేజ అభిమానుల్లో పండ‌గ ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఆయ‌న పాత్ర‌ను తీర్చిదిద్దాడు. పోరాట ఘ‌ట్టాల మోతాదు ఎక్కువైనా.. అక్క‌డ‌క్క‌డా లాజిక్ మిస్ అయినా.. ర‌వితేజ మార్క్ అంశాలు పుష్క‌లంగా ఉండ‌టం సినిమాకు క‌లిసొచ్చే విష‌యం.

Mass Maharaj Ravi Teja's Krack movie review
'క్రాక్​' సినిమా పోస్టర్​

ఎవ‌రెలా చేశారంటే?

ర‌వితేజ‌ మ‌ళ్లీ ఫామ్ అందుకునేలా చేసే చిత్ర‌మిది. ఇదివ‌ర‌క‌టి హుషారైన ర‌వితేజ ఇందులో క‌నిపించారు. పోత‌రాజు వీర‌శంక‌ర్‌గా ఆయ‌న పాత్ర‌లో ఒదిగిపోయిన విధానం, అందులో త‌న మార్క్ ఎన‌ర్జీని ప్ర‌ద‌ర్శించిన తీరు, టైమింగ్ అల‌రిస్తుంది. శ్రుతిహాస‌న్ పాత్ర పాట‌ల కోస‌మేనా అన్న‌ట్టుగా సాగిపోతున్న ద‌శ‌లో ద్వితీయార్థంలో ఆశ్చర్య‌కరంగా కొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తుంది. స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మిశ‌ర‌త్‌కుమార్ పాత్ర‌లు, వారి న‌ట‌న చిత్రానికి ప్రాణం పోశాయి. దేవిప్ర‌సాద్‌, వంశీ చాగంటి, సుధాక‌ర్ కోమాకుల త‌దిత‌రుల పాత్ర‌లు కూడా ఆక‌ట్టుకునేలా ఉంటాయి. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ప్ర‌తి విభాగం సినిమాపై త‌న‌దైన ముద్ర వేసింది. ముఖ్యంగా జి.కె.విష్ణు కెమెరా మేజిక్ చేసింది. ఒక మాస్ సినిమాకు కొత్త రంగుల‌ద్దింది. వేట‌పాలెం ముఠాని ప‌రిచ‌యం చేసే స‌న్నివేశాలు, కానిస్టేబుల్ హ‌త్య‌, బ‌స్టాండ్ ఫైట్ ఘ‌ట్టాల్లో జి.కె.విష్ణు కెమెరా ప‌నిత‌నం చ‌ప్ప‌ట్లు కొట్టే స్థాయిలో ఉంటుంది. త‌మ‌న్ నేప‌థ్య సంగీతం హీరోయిజాన్ని మ‌రింతగా ఎలివేట్ చేయ‌డానికి దోహ‌దం చేసింది. సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు మాస్‌ను మ‌రింత‌గా మెప్పిస్తాయి. ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని తన‌కు వాణిజ్యాంశాల‌పై ఎంత ప‌ట్టుందో ఈ చిత్రంతో మ‌రోమారు నిరూపించారు. ర‌వితేజ నుంచి ప్రేక్ష‌కులు, ఆయ‌న అభిమానులు ఏం కోరుకుంటారో అవి ప‌క్కాగా ఉండేలా చూసుకుంటూ ఎంతో స్పష్ట‌త‌తో చిత్రాన్ని తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఈ క‌థ‌కు క‌థ‌నంతో కొత్త హంగులు అద్దిన విధానం మెప్పిస్తుంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

Mass Maharaj Ravi Teja's Krack movie review
'క్రాక్​' సినిమా పోస్టర్​
బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ ర‌వితేజ మార్క్ న‌ట‌న‌, స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి పాత్ర‌లు
- ప్ర‌థ‌మార్ధంలో కొన్ని స‌న్నివేశాలు
+ క‌థ‌నం, ద్వితీయార్ధంలో మ‌లుపులు - పోరాట ఘ‌ట్టాల మోతాదు
+ సాంకేతిక బృందం పనితీరు

చివ‌రిగా: ర‌వితేజ అభిమానుల‌కు సంక్రాంతి కాస్త ముందుగానే వచ్చింది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated : Jan 10, 2021, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.