ETV Bharat / sitara

వాళ్లు చెప్తేనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా: విష్ణు

author img

By

Published : Sep 24, 2021, 5:15 PM IST

Updated : Sep 24, 2021, 6:33 PM IST

'మా'(maa elections 2021 date) అభివృద్ధికి తోడ్పడటమే తన ముఖ్య ఎజెండా అని అన్నారు 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న హీరో మంచు విష్ణు(maa elections vishnu panel). చిత్రసీమకు చెందిన కొంతమంది పెద్దలు చెప్తేనే తాను ఈ ఎలక్షన్స్​ బరిలో దిగినట్లు తెలిపారు.

vishnu
విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (maa elections 2021 panels) ప్రెసిడెంట్‌ అనేది ఒక బిరుదు కాదని, ఒక బాధ్యత అని మంచు విష్ణు అన్నారు. 'మా' ఎన్నికల్లో(maa elections 2021 schedule) భాగంగా తన ప్యానెల్‌ సభ్యులతో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు సుదీర్ఘంగా మాట్లాడారు.

"మా పుట్టి 25 సంవత్సరాలు అయింది. చాలా మంది కళాకారులకు తమిళనాడు/ చెన్నై అన్నం పెట్టింది. ఇప్పటికీ పెడుతూనే ఉంది. ప్రత్యేకంగా తెలుగు నటులకు ఒక సంఘం ఉండాలని 'మా'ను ఏర్పాటు చేశారు. ఎంతోమంది అతిరథ మహారథులు తెలుగు సినిమా కోసం, నటీనటుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. తెరపై చూసినట్లు సినిమా నటులు ఖరీదైన జీవితాలను గడుపుతారని చాలా మంది అనుకుంటారు. కానీ, మేకప్‌ తీసి ఇంటికి వచ్చిన తర్వాత మేమూ మీలాగే జీవిస్తాం. ఒక నటుడికి ఈ ఏడాది మొత్తం పని ఉండొచ్చు. వచ్చే ఏడాది కనీసం మూడు నెలలు కూడా పని దొరకని పరిస్థితి ఏర్పడొచ్చు. నటుడి కష్టాలు, ఆవేదన అతడికే తెలుస్తుంది. వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. ఆ బాధ ఎవరితోనూ పంచుకోలేం. ఆర్టిస్ట్‌ల కోసం, మా అందరి కోసం 'మా' ఉంది. ‌మా ప్రెసిడెంట్‌ అనేది ఒక బిరుదు కాదు.. బాధ్యత. దాన్ని నేను సమర్థంగా తీసుకోగలననే నమ్మకంతో వస్తున్నా. ఈ ఎన్నికలు ఇలా జరగడం పట్ల మేమెవరమూ సంతోషంగా లేం. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం నాన్నకు ఇష్టం లేదు. నాన్న 46ఏళ్ల నట జీవితంలో ఈ స్థాయిలో నటులు విడిపోలేదు. ఇంత బీభత్సంగా ఎన్నికలు జరగలేదు. చిత్రసీమకు చెందిన కొంతమంది పెద్దలు చెప్తేనే నేను ఈ ఎలక్షన్స్​ బరిలో నిలుచున్నా."

"2015-16లో స్వర్గీయ దాసరి నారాయణరావుగారు, సీనియర్‌ నటులు మురళీమోహన్‌గారు నన్ను ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేయమన్నారు. ఇదే విషయాన్ని నాన్న దగ్గర ప్రస్తావిస్తే, 'ఆ పదవి బాధ్యతతో కూడుకున్నది. నీ అనుభవం సరిపోదు. నీకు వరుస సినిమాలు ఉన్నాయి. నటుల సంక్షేమం కోసం నువ్వు సమయాన్ని కేటాయించలేవు' అన్నారు. మార్పు తీసుకురాగలననే ధైర్యంతో ఇప్పుడు వస్తున్నా. 'మా'లో ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొనే సత్తా మా ప్యానెల్‌కు ఉంది. ప్రత్యర్థి ప్యానెల్‌లో మంచి నటులు ఉన్నారు. వారిలో కొందరు నా బ్యానర్‌లోనూ పనిచేశారు. ఒక నిర్మాతగా వాళ్లను నా సినిమాలోకి తీసుకుంటా. కానీ మా అసోసియేషన్‌లో పనిచేసేంత సామర్థ్యం వాళ్లకు లేదు. ఈ విషయంలో నాకన్నా ఎవరూ బాగా పనిచేయలేరు. దీన్ని ఎక్కడైనా చెబుతా. వాళ్ల గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. వాళ్ల ప్రసంగాలు విన్నా. వాళ్లు చెప్పింది 99 శాతం నేను ఆమోదించను. తినడానికే సగం మందికి తిండి లేదు. రెస్టారెంట్‌కు డిస్కౌంట్‌లో ఎలా తినగలుగుతారు. 'మా' ఒక ఛారిటీ ఆర్గనైజేషన్‌ కాదని ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ అంది. పెద్దలకు పింఛన్‌ ఇవ్వడాన్ని ఛారిటీ అని ఎలా అంటారు? అది మన బాధ్యత. రేపు వయసు అయిపోయిన తర్వాత మనల్ని కూడా చూసుకోవాలి కదా! డబ్బున్న వాడికీ, లేని వాడికీ కరోనా స్పష్టత ఇచ్చింది. " అని మంచు విష్ణు(maa elections vishnu panel) ఆవేశంగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా బాబూ మోహన్‌ మాట్లాడుతూ.. "ఒకప్పుడు చిత్ర పరిశ్రమ మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉండేది. మహామహులతో కళకళలాడేది. పెద్దదిక్కులాంటి వారు వెళ్లిపోయాక, ఇండస్ట్రీ దిక్కులేకుండా అయిపోతుందని నాకు అనిపించింది. ఒకానొక సందర్భంలో విమానంలో ప్రయాణిస్తుండగా 'మా' గురించి ఆలోచన మొదలైంది. అనుకున్న వెంటనే ప్రారంభమైంది. మొదట్లో బాగుండేది. తర్వాతర్వాత కొన్ని మార్పులు వచ్చాయి. ఇప్పుడు పోటీ చేస్తున్న మరో ప్యానెల్‌ ప్రెసిడెంట్‌.. మా ప్యానెల్‌కి సంబంధించి వారు ఇలా, వీరు అలా అనడం ఎంతవరకూ భావ్యం? ఈ విషయంలో నాకు బాధ కలిగింది. ఆయన అనవసర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 'మా'కు అధ్యక్షుడిగా క్రమశిక్షణ కలిగిన మంచు విష్ణు సరైనవాడు. ఆయన్ను గెలిపించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.

ఇదే ప్యానెల్‌ నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తోన్న మాదాల రవి మాట్లాడుతూ... 'ప్రజలను చైతన్య పరుస్తూ, వినోదం అందించేది కళాకారులు. వీరి కోసం ఏర్పాటు చేసిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)కు ప్రెసిడెంట్‌గా గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతో సేవ చేశారు. అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే మా (మంచు విష్ణు) ప్యానెల్‌ ఉద్దేశం. నేను గత 14 ఏళ్లుగా 'మా'కు సంబంధించిన అన్ని సభలకీ హాజరయ్యాను. మోహన్‌బాబు గారు ఫోన్‌ చేశారని, విష్ణు అడిగారని నేను ఇప్పుడు 'మా'లోకి రాలేదు. విష్ణు చెప్పిన విధివిధానాలు నాకు బాగా నచ్చాయి. విజనరీ ఉన్న వ్యక్తి అని అర్థమైంది.'

'ప్రకాశ్‌రాజ్‌ చాలా గొప్ప నటుడు. అలాంటి ఆయన్ను మీరు నాన్‌ లోకల్‌ అనడం తప్పు. కళాకారులకి హద్దులేవు. ప్రపంచమంతా మనదే. ఇక్కడ సేవ ఎవరైనా చేయొచ్చు. ఆయన మాట్లాడిన మాటలు విన్నా. మేనిఫెస్టో చూశా. చాలా స్ఫూర్తిపొందా. కానీ, నాకు అందులో కొన్ని తప్పులు కనిపించాయి. గత 14 ఏళ్లలో మీరు ఎప్పుడైనా ఓటేయడానికి వచ్చారా? మీ కోసం 900మంది వచ్చి ఓటెందుకు వేయాలి? అగ్ర హీరోలు, మహానటుల వల్ల 'మా' ముందుకు కదులుతోంది. అలాంటిది వారందరినీ ముందుకునెట్టి పనిచేయిస్తాననడం ఎంతవరకు సమంజసం. ఒక వర్కింగ్‌ ప్యానెల్‌ ఉండగా, అందులోని సభ్యుల కాలపరిమితి అవ్వకుండానే మీ ప్యానల్‌లోకి తీసుకుని ప్రెస్‌మీట్‌ పెట్టడం ధర్మమా? ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక కదా ఇది చేయాల్సింది. మరి ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది' అని ప్రశ్నించారు. 'ఎవరు గెలిచినా, ఓడినా 'మా'ను మరోస్థాయికి తీసుకెళ్దాం" అని కోరారు.

ఇదీ చూడండి: MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్​ ఇదే

Last Updated : Sep 24, 2021, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.