ETV Bharat / sitara

స్వప్న మాంత్రికుడు స్పీల్‌బర్గ్‌.. వెండితెర అద్భుతం

author img

By

Published : Dec 18, 2020, 5:31 AM IST

తండ్రి ఆడుకోమని ఓ రైలు బొమ్మ కొనిస్తే.. దాన్ని పట్టాలు తప్పించి 'ఎ ట్రైన్‌ రెక్‌' అనే బుల్లి సినిమా తీసేశాడా కుర్రాడు. అప్పటికి అతడి వయసు 12 ఏళ్లు. అలా మొదలైన సరదా.. అతడిని ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడిని చేసింది. అతడే సినీ చరిత్రను ఆధునిక మలుపు తిప్పిన దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌. శుక్రవారం(డిసెంబరు 16) ఆయన పుట్టినరోజు సందర్భంగా​ కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

Great Hollywood Director Steven Spielberg birthday special story
స్వప్న మాంత్రికుడు స్పీల్‌బెర్గ్‌.. ఓ వెండితెర అద్భుతం

దృశ్యం 1

ఆ కుర్రాడికి కిటికీలోంచి బయట పపంచాన్ని చూడడం ఇష్టం. చకచకా కదిలిపోతున్న దృశ్యాల్ని కళ్ల కెమెరాతో బంధించడం ఇంకా ఇంకా ఇష్టం. మరీ ప్రత్యేకించి తలెత్తి ఆసక్తిగా అందని ఆకాశాన్ని గమనించడం మహా ఇష్టం. రాత్రయితే ఇంద్రనీల మణుల్లా తళుక్కుమనే తారల కాంతుల్తో మెరిసి, మురిసే నీలాకాశాన్ని చూడడం ఇష్టం. ఇంద్రధనుస్సు పల్లకిలో దర్జాగా కూచుని అరచేతుల నిండా నక్షత్రాల్ని నింపుకోవడం... వెండిమబ్బుల్ని గుప్పెట్లోకి తీసుకోవడం...మహా ఇష్టం.

Great Hollywood Director Steven Spielberg birthday special story
స్పీల్​బర్గ్​

దృశ్యం 2

కిటికీలోంచి కాస్త పక్కకు తన ఇంట్లోకి తొంగి చూసేందుకు ఆ కుర్రాడికి ఇష్టం ఉండదు. కారణం.. చిరునవ్వుల్తో పలకరించడం.. ఆత్మీయంగా అక్కున చేర్చుకుని కులాసా కబుర్లు చెప్పడం.. హాయిగా ఒళ్లోకి తీసుకుని ప్రేమగా ముద్దాడడం.. అమ్మానాన్నల నుంచి ఆ కుర్రాడు ఆశించే చిన్ని చిన్ని ఆశలు. ఆ చిన్ని సరదాలూ తీరని నాలుగు గోడల ప్రపంచం తనది. అమ్మకు, నాన్నకు ఎప్పుడూ తగవులే. ఇల్లు ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తే... అది రాబోయే తుఫానుకు ప్రగాఢ సంకేతం. ఎప్పుడు...ఏ క్షణంలో ఏ విపత్తు విరుచుకుపడుతుందో... ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఆ కుర్రాడికి ఎప్పుడూ భయమే.. బాధే.. బెంగే. అందుకే.. గుంపులో ఒంటరితనాన్ని, సమూహంలో ఏకాకితనాన్ని ఆశ్రయించాడు. అంతే కాదు.. తనదైన స్వప్న ప్రపంచాన్ని అందంగా ఆవిష్కరించుకున్నారు. అదే స్వప్న ప్రపంచాన్ని తర్వాత యావత్‌ లోకానికి కానుకగా బహూకరించాడు.

Great Hollywood Director Steven Spielberg birthday special story
స్పీల్​బర్గ్

దృశ్యం 3

ఔను... ఆ కుర్రాడు పెరిగి పెద్దయి సృష్టించిన మాయ మోహ జగత్తుకు ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. అతడెవరో కాదు... ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌! అతడి కళ్లు కెమెరాతో సుందరంగా, సురుచిరంగా ఆవిష్కృతమైన అద్భుతాలకు రసజ్ఞ లోకం మోకరిల్లింది. ఒక్కో ఆవిష్కరణకు ఒళ్లంతా థ్రిల్లింతలు కాగా అవధుల్లేని పరవశానికి లోనైంది. కలలోనూ ఊహకు అందని సరికొత్త ప్రపంచాలకు ప్రేక్షకులంతా మంత్రం ముగ్ధులే అయ్యారు... ఇంకా ఇంకా అవుతున్నారు. ఆయన సృజనలో పురుడు పోసుకున్న అద్భుతాలు ఎన్నో...ఎన్నెన్నో. ఆయన కెమెరా కన్ను కొట్టని చోటంటూ ఈ భూమండలం మీద అస్సలు లేదు. సముద్రాల లోతులు చూసింది. ఆకాశాల్ని ఈదేసింది. అంతరిక్షాల్ని తాకింది. పాతాళాల్ని స్పృశించింది. అరణ్యాల్ని చుట్టుముట్టేస్తూ... ఏనాడో అంతమైపోయిన డైనోసార్లతో ఒళ్ళు గగుర్పొడిచేలా విచిత్రాలు చేసింది. 'జాస్‌' చిత్రం చూసిన ప్రజలు సముద్రంలోకి వెళ్లేందుకు భయపడితే... 'క్లోజ్‌ ఎన్‌ కౌంటర్‌' చిత్రం తర్వాత తలెత్తి ఆకాశం వంక చూసేందుకు భయపడ్డారంటే...అదీ ఆయన సృష్టే. 'జురాసిక్‌ పార్క్‌' ద్వారా రాకాసి బల్లుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి లోకానికి కలిగింది.

Great Hollywood Director Steven Spielberg birthday special story
స్పీల్​బర్గ్​

దృశ్యం 4

స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌... ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు. విఖ్యాత నిర్మాత. ఆస్కార్‌ అవార్డు విజేత. బుల్లితెర నుంచి మొదలైన స్పీల్‌బెర్గ్‌ సృజనాత్మక ప్రయాణం ఔత్సాహికులకు ప్రాతఃస్మరణీయం. సదా అనుసరణీయం. బాల్యం బాధల్ని మిగిల్చి ఒంటరివాడిని చేసినా... మనసు ఆకాశమంత విశాలమై వెండితెర వైభవ కాంతిదారుల్ని చూపించడం వల్ల స్టీవెన్‌ స్పీల్‌బెర్గ్‌ రూపొందాడు. జగద్విఖ్యాతి గడించిన గొప్ప దర్శకుడిగా మారాడు. ఇంట్లో లభించని ప్రేమ.. ఆప్యాయతల్ని ఒకప్పుడు తల్లి ఇచ్చిన కెమెరా ద్వారా అందుకున్నాడు. తనని నిలువునా కబళించే అభద్రతా భావనని.. భయాల్ని.. బెంగల్ని.. ప్రేమ రాహిత్యాన్ని.. నెమ్మది నెమ్మదిగా అధిగమిస్తూ.. తనకంటూ నిర్మించుకున్న కాల్పనిక ప్రపంచాన్ని యావత్‌ ప్రపంచం ముందు పెట్టి వెండితెర సృజనాత్మక పీఠంపై కొలువుతీర్చిన స్పీల్‌బెర్గ్‌ ప్రపంచ సినిమా దిశనూ.. దశనూ సమూలంగా మార్చేసాడంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అతడి చలన చిత్ర అరంగేట్రం ఓ తుపాను. సునామీ. ప్రేక్షక జనాన్ని కదిలించిన మహా ప్రభంజనం.

Great Hollywood Director Steven Spielberg birthday special story
స్పీల్​బర్గ్​

వ్యక్తిగతం...

స్పీల్‌బర్గ్‌ పూర్వీకులు 1905లో రష్యా నుంచి అమెరికాకు తరలివెళ్లారు. తండ్రి ఆర్నాల్డ్‌ స్పీల్‌బర్గ్‌ కంప్యూటర్‌ ఇంజనీర్‌. తల్లి లీ ఆర్నాల్డ్‌ పియానో కళాకారిణి. ఉద్యోగరీత్యా తండ్రి అనేక ప్రాంతాల్లో నివసించడం స్పీల్‌బెర్గ్‌ కూడా తరచూ ఊళ్లు మారేవాడు. అప్పట్లో అమెరికాలో యూదులంటే చిన్న చూపు. ప్రతిసారి కొత్త ప్రాంతాలకు తరలివెళ్లడం... అవమానాలు ఎదుర్కోవడం స్పీల్‌బర్గ్‌కు పరిపాటి అయింది. ఇంట్లో తల్లితండ్రుల మధ్య సఖ్యత లేకపోవడం చిన్నతనంలోనే అతడిని ఒంటరివాడిని చేసింది. ఆరియానా నుంచి కాలిఫోర్నియాకు కుటుంబం తరలి వెళ్లింది. అక్కడ తల్లి తండ్రి విడాకులు తీసుకున్నారు. ఆ ఘటన స్పీల్‌బర్గ్‌ను తీవ్రంగా కలచి వేసింది. ఇంగ్లీష్‌లో తనకు నచ్చని ఒకే ఒక పదం 'డివోర్స్‌' అని స్పీల్‌బెర్గ్‌ తరచు అంటుంటారు.

బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌..

స్పీల్‌బర్గ్‌ బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌. బడి అంటే ఇష్టం ఉండదు. హైస్కూల్​ స్థాయిలో ఫిజిక్స్‌ సబ్జెక్టులో మూడుసార్లు ఫెయిల్‌ అయ్యాడు. అయితే... పందొమ్మిదేళ్ల వయసులో కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో ఆంగ్లం అభ్యసించాడు. ఆ సమయంలోనే సమీపంలో ఉన్న యూనివర్సల్‌ స్టూడియోలో రెండు రోజులు గడపాల్సి వచ్చింది. అక్కడే సినిమా ప్రేమలో పడ్డాడు. స్టూడియో వాతావరణం... కెమెరాల సందడి... ఆర్టిస్ట్‌ల హడావుడి... వీటన్నింటికీ ఆకర్షితులయ్యాడు. అంతే కాదు... అమ్మ ఇచ్చిన కెమెరా ఆ సమయంలో ఎంతో అపురూపమనిపించింది. ఆ తర్వాత ఆయన ధ్యాస, శ్వాస సినిమాగా మారింది.

Great Hollywood Director Steven Spielberg birthday special story
స్పీల్​బర్గ్​

1958లో 9 నిముషాల వ్యవధి గల 'ది లాస్ట్‌ గన్‌' సినిమా రూపొందించాడు. అక్కడ నుంచి అతడి ప్రయాణం సినీబాటలోనే సాగింది. బుల్లితెర మొదలుకుని వెండితెర వరకూ... ఆధునిక కాలంలో చిన్నపిల్లల కార్టూన్‌ మూవీస్‌ వరకు తనదయిన ముద్ర వేస్తూ సాగుతున్నాడు. 1968లో 'ఎస్కేప్‌ నో వే' అనే 40 నిముషాల సినిమాను రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో చిత్రీకరించారు. 1964 మార్చి 24లో విడుదలైన 'ఫైర్‌లైట్' చిత్రం మొదటి ప్రదర్శనలోనే పెట్టుబడిని రాబట్టుకోగలిగింది. 1971లో 'డ్యూయెల్‌ ఫైర్‌లైట్' సినిమాను ప్రయోగాత్మకంగా తీశాడు. భిన్న పోకడలకు, ఆలోచనా ధోరణులకు అడ్డం పట్టిన చిత్రం ఇది.

అదుపు తప్పిన ట్రక్‌ కథ ఇది..

'షుగర్‌ ల్యాండ్‌ ఎక్స్‌ప్రెస్‌' గొప్పగా విజయం సాధించింది. 'జాస్‌' చిత్రం ప్రపంచ చలనచిత్ర పటంలో పెను ముద్ర వేసింది. సముద్రంలో జల విలయాన్ని, ప్రళయాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు. హాయిగా సాగిపోయే సముద్ర ప్రయాణంలో హఠాత్తుగా ఉపద్రవం వెల్లువెత్తుతుంది. హాహాకారాలు, ఆక్రందనలతో థియేటర్లు దద్దరిల్లుతాయి. ఎప్పుడేం జరుగుతుందో అంచనా వేయలేని స్థితిలో వీక్షకులు ఊపిరి బిగబట్టి మరీ ఉత్కంఠతో ఆధ్యంతం చిత్రాన్ని చూస్తారు. ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా.. అనేక అవార్డులు గెలుచుకుంది. సౌండ్‌ ఎఫెక్ట్, ఎడిటింగ్‌ విభాగాల్లో ఆస్కార్‌ పురస్కారాన్ని అందుకుంది. ఇటీవలే ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుందీ చిత్రం.

'జాస్‌' చిత్రం తర్వాత ప్రేక్షకులు సముద్రమంటేనే ఎంతగానో భయపడ్డారు. గతంలో తాను తీసిన సినిమానే కొంచెం మార్పులు చేసి సంచలన విజయాన్ని అందుకోవడం స్పీల్‌బెర్గ్‌ ప్రత్యేకత. 1964లో తీసిన 'ఫైర్‌లైట్‌' చిత్రంలో కొన్ని మార్పులు చేసి 1977లో 'క్లోజ్‌ ఎన్‌కౌంటర్స్‌ ఆఫ్‌ ది థర్డ్‌ కైండ్‌' చిత్రాన్ని తీశారు. ఇది సైన్స్‌ ఫిక్షన్‌ కథ. ఈ సినిమా కూడా అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం చూసిన తర్వాత ప్రేక్షకులు ఆకాశంలోకి చూసేందుకు భయపడ్డారంటే అది ఎలాంటి ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు.

Great Hollywood Director Steven Spielberg birthday special story
సెట్లో స్పీల్​ బర్గ్​

అంతరిక్షంలోని జీవులు మనకు శత్రువులు కారని చెప్పడం సహా అవసరమైతే వారితో సహజీవనం కూడా అనివార్యమని తేటతెల్లం చేస్తుంది ఈ సినిమా. 1981లో 'రైడర్స్‌ ఆఫ్‌ ది లాస్ట్‌ ఆర్క్‌' సూపర్‌ మూవీ. 'ఇండియానా జోన్స్‌', 'ది టెంపుల్‌ ఆఫ్‌ ది డూమ్‌' చిత్రాలు సాహస చిత్రాలు నిర్మించాలనుకునే ఔత్సాహికులకు పాఠ్య పుస్తకాలు. వర్ణ వివక్ష మీద స్పీల్‌బెర్గ్‌ తీసిన చిత్రం 'ది కలర్‌ పర్పుల్‌' 1985లో విడుదలైంది. బుకర్‌ బహుమతి పొందిన ఓ నవల ఆధారంగా తీసిన చిత్రం. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది.

జురాసిక్‌ పార్క్‌ పెను సంచలనం...

మైఖేల్‌ క్రిచ్‌ టన్‌ నవల ఆధారంగా 'జురాసిక్‌ పార్క్‌' చిత్రాన్ని స్పీల్‌బెర్గ్‌ రూపొందించాడు. ఇందుకుగాను వేలాది ఊహా చిత్రాల్ని కంప్యూటర్‌ తెరపైకి ఎక్కించారు. అనంతానంత కళావాహినిలో అంతర్ధానమయ్యే జీవుల నేపథ్యంలో.. డైనోసార్ల స్వైర విహారాన్ని క్షణక్షణం ఉత్కంఠభరితంగా రూపొందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం తర్వాత డైనోసార్లపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. పుస్తకాలు, మ్యూజియంలు.. ఇలా వాటికి సంబంధించి అనేక ఆవిష్కరణలు జరిగాయి.

నాజీల కాలం నాటి ఇతివృత్తం తీసుకుని 1993లో 'షిండ్లర్స్‌ లిస్ట్' చిత్రాన్ని స్పీల్‌బెర్గ్‌ రూపొందించారు. 'కుత్తుకలు తెగ నరికే నెత్తుటి సమాజం మనకొద్దని... మానవత్వమే ముద్ద'ని చాటి చెప్పే సందేశాత్మక చిత్రంగా విమర్శకుల ప్రశంసలను ఈ చిత్రం అందుకుంది. కలర్‌ చిత్రాలు రాజ్యమేలుతున్న సమయంలో నాజీల చరిత్రని కళ్ళకు కట్టే విధంగా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో రూపొందించడం విశేషం. ఈ చిత్రం ద్వారా ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు.

Great Hollywood Director Steven Spielberg birthday special story
ఆస్కార్​ అవార్డ్స్​లో స్పీల్​బర్గ్

1998లో 'సేవింగ్‌ ప్రైవేట్‌ ర్యాన్‌' చిత్రాన్ని యుద్ధ భీభత్సం నేపథ్యంలో రూపొందించారు. ఈ సినిమాకు రెండోసారి ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు స్పీల్​బెర్గ్​. 2002లో 'మైనార్టీ రిపోర్ట్', 'క్యాచ్‌ మీ ఇఫ్​ యు కెన్‌' చిత్రాలు సంచలన విజయాల్ని నమోదు చేశాయి. 'క్యాచ్‌ మీ ఇఫ్‌ యు కెన్‌' చిత్రంలో అపార మేధావి దారి తప్పి చరిస్తే సమాజానికి ఎంత ముప్పు వాటిల్లుతుందో తేల్చి చెప్పాడు. తర్వాత నిర్మించిన టెర్మినల్‌ చిత్రాలూ ఎంతో పేరు తెచ్చాయి.

2004లో 'ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌' చిత్రం ద్వారా మరమనుషులు సమాజంలో ఎంతటి ప్రభావం చూపిస్తారో సూచించారు. 2005లో హెచ్‌. జి . వెల్స్‌ నవలాధారంగా 'వార్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌' చిత్రాన్ని తెరకెక్కించారు.

సాంకేతికతను పెద్ద పీట...

అందివచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వెండితెరపై అద్భుతాలు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు స్పీల్‌బెర్గ్‌. 'జాస్‌' చిత్రంలో విద్యుత్‌తో నడిచే సొరచేపతో విన్యాసాలు చేయించిన అతడు 'క్లోజ్‌ ఎన్‌కౌంటర్స్‌' చిత్రంలో ఎగిరే పళ్లాలతో ప్రేక్షకులని ఆశ్చర్య చకితుల్ని చేశారు. 'ఈటీ..' ది ఎక్సట్రా టెర్రిస్ట్రియల్లో గ్రహాంతరవాసి విచిత్ర చేష్టలు వీక్షకులని కట్టి పడేశాయి. నిజానికి ఈ చిత్రం స్పీల్‌బెర్గ్‌ బాల్యాన్ని కళ్లకు కడుతుంది. చిన్న తనంలో తన ఒంటరితనం, ఆకాశంలోని చుక్కలతో సహవాసం, తనదయిన కాల్పనిక ప్రపంచంలో కాలక్షేపం... ఇదే 'ఈటీ' కథా కమామిషు.

వెండితెరపై సాంకేతిక ప్రదర్శనకు పరాకాష్ట 'జురాసిక్‌ పార్క్‌' 1993లో జురాసిక్‌ పార్క్‌ తీసిన స్పీల్‌బెర్గ్‌ 1997లో 'ది లాస్ట్‌ వరల్డ్‌' పేరుతో జురాసిక్‌ పార్క్‌ రెండో భాగాన్ని తీశారు.

2011లో 'ది అడ్వెంచర్స్‌ ఆఫ్‌ టిన్‌ టిన్‌', 'వార్‌ హౌస్' చిత్రాలు రూపొందించాడు. 2012లో 'లింకన్‌', 2015లో 'బ్రిడ్జి ఆఫ్‌ స్పైస్‌', 2016లో 'ది బి ఎఫ్‌ జి', 2017లో 'ది పోస్ట్‌', 2018లో 'రెడీ ప్లేయర్‌ వన్‌' చిత్రాలు స్పీల్‌బెర్గ్‌ ఖాతాలో పడ్డాయి.

జీవన గమనం...

జననం: 1946 డిసెంబర్‌ 18

జన్మస్థలం: సిన్‌సినాటీ, అమెరికా

తల్లి తండ్రి: ఆర్నాల్డ్‌ స్పీల్‌బెర్గ్, లీ ఆర్నాల్డ్‌

Great Hollywood Director Steven Spielberg birthday special story
కుటుంబంతో స్పీల్​బర్గ్​

మొదటి భార్య: అమీ ఇర్వింగ్‌ (నటి, 1985లో వివాహం)

రెండో భార్య: కేట్‌ కాప్‌ ఫా (హాలీవుడ్‌ నటి)

సంతానం: ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు.

కీర్తి: ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ప్రఖ్యాత దర్శకుడు, నిర్మాత

బలం: ఆకాశమంత విశాలమైన సృజన, వైవిధ్యంతో కూడుకున్న సబ్జెక్టులు

మెచ్చు తునకలు: 'జాస్‌' (1975-తొలి సంచలన విజయం), 'క్లోజ్‌ ఎన్‌కౌంటర్స్‌ ఆఫ్‌ ది థర్డ్‌ కైండ్‌', 'జురాసిక్‌ పార్క్‌', 'అమిస్టర్‌', 'ది లాస్ట్‌ వరల్డ్‌', 'సేవింగ్‌ ప్రైవేట్‌ ర్యాన్‌', 'బ్యాండ్‌ ఆఫ్‌ బ్రదర్స్‌' తదితర చిత్రాలెన్నో ఆయన ఖాతాలో ఉన్నాయి.

సినీ ప్రస్థానం...

1968: బుల్లితెరపై బుల్లిబుల్లి అడుగులు

1968: ఆంబ్లిన్‌తో కలసి దర్శకుడిగా ప్రయత్నాలు

1969: బుల్లితెర కోసం ఐస్‌ సినిమా నిర్మాణం

1975: 'జాస్​' ద్వారా సంచలన విజయం

1979: '1941' సినిమా. చేదు జ్ఞాపకం

1982: 'ఈ.టీ' భారీ సంచలనం

1984: 'ఇండియానా జోన్స్‌' సినిమాకు దర్శకత్వం

1985: 'ద కలర్‌ పర్పుల్‌' చిత్ర నిర్మాణం

1993: 'షిండ్లర్స్‌ లిస్ట్‌' దర్శకత్వం. ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ అవార్డు

1993: జురాసిక్‌ పార్క్‌

1997: అమిస్టెర్‌

1997: ది లాస్ట్‌ వరల్డ్‌ (జురాసిక్‌ పార్క్‌ రెండో భాగం)

1998: సేవింగ్‌ ప్రైవేటు ర్యాన్‌

2001: బ్యాండ్‌ ఆఫ్‌ బ్రదర్స్‌ (ఇవి కొన్ని మెచ్చు తునకలు...ఇంకా ఉత్తేజభరితంగా స్టీవెన్‌ స్పెల్‌ బెర్గ్‌ సినీ ప్రస్థానం సాగుతూనే ఉంది)

అవార్డులు -రివార్డులు

1982: 'ఈ.టీ' చిత్రానికిగాను ఫిలిం క్రిటిక్స్‌ అవార్డు

1985: ఔట్‌ స్టాండింగ్‌ దర్శకుడిగా డైరెక్టర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా అవార్డు

1993: గోల్డెన్‌ లైన్‌ కెరీర్‌ అచివ్‌ మెంట్‌ అవార్డు (వెనిస్‌ ఫిలిం ఫెస్టివల్‌ ‘సత్కారం’)

1993: ఆస్కార్‌ అవార్డు

1995: లైఫ్‌ టైం అచీవ్‌ మెంట్‌ పురస్కారం (అమెరికన్‌ ఫిలిం ఇన్స్టిట్యూట్‌)

1997: కథక్‌ విజన్‌ అవార్డు-ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా

1998: 'సేవింగ్‌ ప్రైవేట్‌ ర్యాన్‌' సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ అవార్డు.

ఆయన ఎక్కని విజయ శిఖరాలు లేవు. అందుకొని అవార్డులు లేవు. ప్రపంచ చలన చిత్రసీమలో మకుటం లేని మారాజు స్టీవెన్‌ స్పెల్‌ బెర్గ్‌. నిత్య ప్రయోగాల ప్రయోక్త. వెండితెరకు సాంకేతికతను అద్దిన రూపశిల్పి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.