ETV Bharat / sitara

లాక్​డౌన్​లో 'సెంచరీ' కొట్టిన సినిమా హాళ్లు

author img

By

Published : Jun 25, 2020, 1:00 PM IST

కరోనా ప్రభావంతో థియేటర్లు మూసివేసి 100 రోజులైంది. వాటిని ఎప్పుడు తెరుస్తారా? అని సగటు ప్రేక్షకుడు, పూర్వ వైభవం ఎప్పుడొస్తుందా? అని ఎగ్జిబిటర్లు ఎదురుచూస్తున్నారు.

Film theaters remain closed for 100 days in telangana
100 రోజులుగా మూసివున్న థియేటర్లు

లాక్​డౌన్ మన జీవితాన్ని మార్చేసింది. రోజూ తిరిగేవాడిని ఇంట్లో కూర్చోబెట్టింది. అన్నిచోట్ల తినేవాడ్ని, అమ్మ చేతివంటకు అలవాటు చేసింది. శుభ్రతే తెలియని వాడికి, శానిటైజర్లు నిత్యం ఉపయోగించేలా చేసింది. ప్రతివారం థియేటర్లలో సినిమా చూసేవాడిని ఓటీటీలకు బానిసగా మార్చింది. అయితే థియేటర్లు తెరవక ఈ బుధవారానికి 100 రోజులైంది. ఈ సందర్భంగా వచ్చిన మార్పులు ఏంటి? రాబోయే రోజుల్లో సినిమా హాళ్ల పరిస్థితి ఎలా ఉండనుంది?

"అరేయ్ మామ.. ఫస్ట్​డే మార్నింగ్​​ షోకు నాకు ఓ రెండు టికెట్లు తీసిపెట్టరా" అనే మాటలు విని చాలా రోజులైంది. భారత్​లో కరోనా ప్రభావంతో మార్చి రెండో వారం నుంచి ఇలాంటి పిలుపులు ఆగిపోయాయి. అందుకు కారణం అప్పటి నుంచి థియేటర్లను పూర్తిగా మూసేశారు. వైరస్ తగ్గితే కొన్ని రోజుల్లో మళ్లీ తెరవొచ్చు అని అనుకున్నారు కానీ అది ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. ఇంకా ఎప్పటికీ మోక్షం కలుగుతుందో అర్థం కావట్లేదు.

వేసవి దెబ్బకొట్టింది!

టాలీవుడ్​కు సంక్రాంతి తర్వాత ప్రధాన సీజన్ వేసవికాలం. పాఠశాలలు, కాలేజ్​ సెలవులు కావడం వల్ల స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న చిత్రాలు చాలా వరకు విడుదలవుతాయి. అయితే ఈ ఏడాది సమ్మర్ కరోనా వల్ల పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. పవన్​ 'వకీల్​సాబ్', వెంకటేశ్ 'నారప్ప', నాని 'వి', రామ్ 'రెడ్', 'ఉప్పెన', 'అరణ్య'లతో పాటు పదుల సంఖ్యలో చిత్రాల విడుదల, షూటింగ్​లు నిలిచిపోయి, దర్శక నిర్మాతలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

PAWAN KALYAN IN VAKEELSAAB
వకీల్​సాబ్ సినిమాలో పవన్​కల్యాణ్

సడలింపులు ఇచ్చినా భయం భయమే

ప్రభుత్వాలు ఇటీవలే చిత్రీకరణలకు అనుమతులిచ్చిన నేపథ్యంలో షూటింగ్​లు అంతంతమాత్రంగానే ప్రారంభమవుతున్నాయి. స్టార్ హీరోలెవరు ఇంతవరకు సెట్స్​లోకి​ అడుగుపెట్టలేదు. వాళ్లు ఎప్పుడొస్తారనేది ఇంకా సందేహమే.

థియేటర్లలోనూ జాగ్రత్తలు పెరిగాయ్!

కరోనా నేపథ్యంలో మనిషికి మనిషికి మధ్య 'దూరం' పెరిగిన నేపథ్యంలో సీట్లు కూడా దూరం దూరంగా ఉండేలా కొన్ని థియేటర్లలో మార్పులు చేశారు. మరికొన్నింటిలో చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయినా సరే ప్రేక్షకుడు ధైర్యం చేసి ముందులా వస్తాడా? అనేది ఇంకా అంతుచిక్కని ప్రశ్నే.

CINEMA THEATRE
సినిమా హాల్​లో చిన్నారులు

ఓటీటీలకు పెరుగుతున్న ఆదరణ

థియేటర్ల మూసివేతతో కొందరు నిర్మాతలు, తమ సినిమాల్ని ఓటీటీలకు అమ్మేస్తున్నారు. మరికొందరు మాత్రం థియేటర్లలోనే విడుదల చేస్తామని తీర్మానించుకున్నారు. ఇప్పటికే కీర్తి సురేశ్ 'పెంగ్విన్', జ్యోతిక 'పొన్​మగళ్ వందాన్', అమితాబ్-ఆయుష్మాన్ 'గులాబో సితాబో' లాంటి చిత్రాలు ఓటీటీల్లో విడుదలై ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. మరికొన్ని ఇదే బాటలో వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

మళ్లీ వస్తాడా?

ఈ '100 రోజులు' ఓటీటీల్లో పలు భాషల్లోని అద్భుతమైన సినిమాలు, ఆశ్చర్యపరిచే వెబ్​ సిరీస్​లు చూసి సినీ వీక్షకుడు ముగ్దుడయ్యాడు. అలాంటి ప్రేక్షకుడు.. మునుపటిలా మళ్లీ థియేటర్లకు వస్తాడా? అలాంటి రోజులు మళ్లీ వచ్చేది ఎప్పుడు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.