ETV Bharat / sitara

Fathers day: 'నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే'

author img

By

Published : Jun 20, 2021, 9:01 AM IST

fathers day
ఫాదర్స్​ డే

కెరీర్​లో ఎన్ని అడ్డంకులు వచ్చిన వాటిని అధిగమించి విజయం సాధించడానికి ​ గల కారణం తమ తండ్రులని చెప్పారు హీరోలు ఎన్టీఆర్​, అల్లుఅర్జున్​ కథానాయికలు శృతి హాసన్​, రష్మిక, ఆలియా భట్​. వారితో తమకున్న అనుబంధాన్ని తెలియజేశారు.

'నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే' అనే ఈ నటీనటులు... తమ గెలుపు వెనుక ఉన్నది ఓ సగటు తండ్రేనంటారు. నాన్న గురించి రకరకాల వేదికల మీద వారు చెప్పిన మాటలు ఫాదర్స్‌డే సందర్భంగా మీ కోసం...

పక్కనుంటే చాలు...

"ఈ రోజున నా కాళ్లపైన నేను నిలబడగలిగానంటే కారణం మా బాపూజీనే. అవును, నేను మా నాన్నను బాపూజీ అనే పిలుస్తా. ఆయన నన్ను ఓ అబ్బాయిలా పెంచారు. చిన్నతనంలో ఏదయినా తప్పు చేస్తే వెంటనే అరవడమో, కొట్టడమో కాకుండా నా తప్పు నేను తెలుసుకునేలా చేసేవారు. మాకు సంబంధించిన నిర్ణయాల్ని మేమే సొంతంగా తీసుకునేలా ప్రోత్సహించే వారు. ఆ నిర్ణయం తప్పయినా, ఒప్పయినా పూర్తి బాధ్యత మాదేననేవారు. అవన్నీ నాకు ఇప్పుడు బాగా ఉపయోగ పడుతున్నాయి. నిజానికి నేను పుట్టే సమయానికి నాన్నకు ఆర్థిక సమస్యలు ఉన్నా ఆ లోటు తెలియనివ్వకుండా, నేను బాధపడకుండా 'శ్రీమంతురాలు' అని పిలిచేవారు. చిన్నప్పటినుంచీ కూడా నాన్న నా పక్కనుంటే ఏదయినా సాధించగలననే ధైర్యం కలుగుతుంది."

-శృతి హాసన్‌(ShrutiHassan)

shruthi
కమల్​తో శృతి

ఆయన వల్లే 'ఛలో' చేశా

"మా నాన్న మదన్‌ నేను పుట్టినప్పటినుంచీ వ్యాపారరీత్యా బిజీగా ఉండేవారు. నేనేమో హాస్టల్‌లో ఉండి చదువుకునేదాన్ని. దాంతో 'నాన్న - అమ్మలాగా పిల్లల్ని ప్రేమిస్తారా లేదా' అనుకునేదాన్ని కానీ.. అంతకన్నా ఎక్కువగానే ప్రేమిస్తారని పెద్దయ్యేకొద్దీ తెలుసుకున్నా. ఎంత పని ఒత్తిడి ఉన్నా నాకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేవారు. కన్నడ సినిమాల్లో చేస్తున్నప్పుడు దర్శకుడు వెంకీ నా గురించి తెలుసుకుని 'ఛలో' గురించి చెప్పినప్పుడు తెలుగు ఇండస్ట్రీ పెద్దది కాబట్టి నేను చేయడానికి భయపడ్డా. కానీ నాన్న మాత్రం 'మంచి అవకాశం... ప్రయత్నించు' అన్నారు. ఈ రోజున తెలుగులో ఇంత గుర్తింపు తెచ్చుకున్నానంటే దానికి కారణం నాన్నే."

- రష్మిక మందన్న(Rashmika)

rashmika
తండ్రితో రష్మిక

నాన్నా నేనూ ఫ్రెండ్స్‌

"నేను పుట్టే సమయానికి నాన్న చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉండేవారు. అయితే ఎంత బిజీగా ఉన్నా - నాకు మాత్రం ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉండేవారు. జీవితం అంటే ఎప్పుడూ విజయాలూ, ఆనందాలే కాదనీ, వైఫల్యాలూ, కష్టాలూ కూడా రుచి చూడాలనీ చెప్పేవారు. నాకు ఏదైనా సమస్య ఎదురైతే దాన్నుంచి బయటపడేందుకు ఏం చేయాలో సూచించేవారు తప్ప జాలి చూపించేవారు కాదు. అందుకేనేమో నేను ఈ రోజున ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నా. ఆయన మొదటినుంచీ ఎంత స్వేచ్ఛనిచ్చినా ఆయన్ని చూసి ఎప్పుడూ భయపడేదాన్ని. ఇప్పుడు మాత్రం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌.

- ఆలియాభట్‌.(Aliabhatt)

alia
ఆలియా భట్​, మహేశ్​ భట్​

ధైర్యం చెప్పి పంపించారు

"ఓ సారి ఏదో ఆడియో ఫంక్షన్‌లో నాన్నతో ఎవరో.. 'ఇలాంటి కొడుకుల్ని కన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు' అన్నారట. కానీ అలాంటి తండ్రి కడుపున పుట్టినందుకు నేనే అదృష్టవంతుడిగా భావిస్తా. నాన్న చాలా బోళా. మనసులో ఒకలా, పైకి ఒకలా మాట్లాడే స్వభావం కాదు. నిజానికి నేను అసలు నటుడిని అవుతానని అనుకోలేదు. సినిమా అవకాశం వచ్చిందని తెలిసినప్పుడు నాకు ధైర్యం చెప్పి, వెన్ను తట్టి ప్రోత్సహించి నామీద నాకు నమ్మకం కలిగేలా చేశారు. నాన్న మా అన్నదమ్ములు ముగ్గురికీ ఎప్పుడూ 'దేనికీ భయపడకండి. ఏదయినా సమస్య ఎదురైనప్పుడు ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురు చూడకండి. మీకు మీరుగా బతకండి... మా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి' అనేవారు. నాన్న అన్న ఆ మాటల్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటా."

- ఎన్టీఆర్‌(NTR)

NTR
హరికృష్ణతో ఎన్టీఆర్​

నా మొదటి హీరో

"నాన్న మొదటినుంచీ ఎంతో కష్టపడి ప్రముఖ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. మమ్మల్నీ అలానే కష్టపడమంటూ ప్రోత్సహించారు. నా మొదటి సినిమా 'గంగోత్రి'ని నాన్న బ్యానర్‌లోనే చేశా. ఆ తరువాత మేమిద్దరం కలిసి మరికొన్ని సినిమాలూ చేశాం. అవి విజయం సాధించినా, సాధించకపోయినా ఆయనెప్పుడూ బాధపడలేదు. ఇంట్లో కూడా ఆ ప్రస్తావన తెచ్చేవారు కాదు. గెలుపోటములు సహజమనే చెప్పేవారు. అందుకే ఆయనే నా మొదటి హీరో అంటుంటా. మా అబ్బాయి పుట్టాక నేను మా నాన్నలో సగం సాధించినా చాలనుకుంటున్నా. ఆ స్థాయికి చేరుకుంటానో లేదో తెలియదు కానీ... తనలా ఉండేందుకు నా వంతుగా ప్రయత్నిస్తున్నా... చూడాలి సాధిస్తానో లేదో."

- అల్లు అర్జున్‌(Alluarjun)

allu
అల్లు అరవింద్​తో అల్లుఅర్జున్​

ఇదీ చూడండి: fathers day: సినిమాల్లో నాన్నంటే గుర్తొచ్చేది వీళ్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.