ETV Bharat / sitara

శిల్పాశెట్టి: అమ్మగా ఫుల్​టైమ్​..​ ప్రొఫెషనల్​గా పార్ట్​టైమ్

author img

By

Published : Jun 8, 2020, 5:31 AM IST

సాగరకన్య పాత్రంటే వెంటనే గుర్తొచ్చే నటి శిల్పాశెట్టి. అంతలా ఆ పాత్రతో ఒదిగిపోయిందీ భామ. 'సాహసవీరుడు సాగరకన్య'తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

Actress Shilpa Shetty Birthday Special Story
ఫుల్​టైమ్​ అమ్మగా.. పార్ట్​టైమ్​ ప్రొఫెషనల్​గా శిల్పశెట్టి

కథానా‌యి‌కల అందంలో చాలా మార్పు‌లొ‌స్తుంటాయి. పరి‌శ్రమలోకి అడు‌గు‌పె‌ట్టిన కొత్తలో ఒకలా ఉంటారు. ఐదారేళ్ల తర్వాత చూస్తే మరోలా కని‌పి‌స్తారు. ఇంకొ‌న్నేళ్లు పోతే గుర్తు‌ప‌ట్ట‌లేనంతగా తయా‌రవుతారు. అందాల తార శిల్పా‌శెట్టి మాత్రం తొలి రోజుల్లో ఎలా కని‌పిం‌చిందో... ఇప్ప‌టికీ అదే రూపంతో కట్టి‌ప‌డేస్తోంది. అమ్మ అయినా ఆమె అందంలో ఏ మాత్రం మార్పు‌లేదు. నవ‌తరం హీరోయిన్లకు సైతం పోటీ‌ని‌చ్చేలా తన అందాన్ని కాపాడు‌కుంటోంది. 'సాహ‌స‌వీ‌రుడు సాగ‌ర‌క‌న్య'తో తొలిసారి తెలుగు తెరపై కనిపించి, ప్రేక్ష‌కుల మదిలో చెర‌గని ముద్రవేసింది. ప్రస్తుతం బాలీవు‌డ్‌లో నిర్మా‌తగా, టీవీ షోలకు వ్యాఖ్యా‌తగా వ్యవ‌హ‌రిస్తూ జీవితాన్ని బిజీ‌ బి‌జీగా గడుపు‌తోంది. ఈరోజు 46వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శిల్పా‌శెట్టి ప్రస్థానం గురించి కొన్ని విష‌యాలు.

Actress Shilpa Shetty Birthday Special Story
శిల్పా‌శెట్టి

కన్నడ కస్తూరి..

మంగ‌ళూ‌రు‌లోని సంప్రదా‌య‌ కుటుంబంలో 1974 జూన్ 8న జన్మించింది శిల్పాశెట్టి. సురేంద్ర, సునం‌ద‌ శెట్టి తల్లి‌దం‌డ్రులు. ఔషదాల తయారీ కంపెనీ ఉండ‌టం వల్ల కుటుంబ‌మంతా ముంబయికి వచ్చి స్థిర‌ప‌డ్డారు. అక్కడి సె‌యింట్‌ ఆంథోనీ గర్ల్స్‌ హైస్కూల్, పోడార్‌ కళా‌శా‌లలో చదువులు పూర్తి చేసింది. చిన్న‌ప్పుడే భర‌త‌నాట్యంపై పట్టు పెంచు‌కోవడం సహా కరా‌టేలో బ్లాక్‌ బెల్ట్‌ సంపా‌దించింది. దీనితో పాటే పాఠశాలలో వాలీ‌బాల్‌ జట్టుకు కెప్టె‌న్‌గా వ్యవ‌హ‌రించింది. నటి షమి‌తా‌శెట్టి శిల్పాకి స్వయానా చెల్లెలు. ఇద్దరూ కలిసి 'ఫారే‌బ్‌'లో నటించారు.

పదహారేళ్లకే..

కళా‌శా‌లలో చదు‌వుకొం‌టు‌న్న‌ప్పుడు మోడ‌లింగ్‌పై దృష్టి‌పె‌ట్టిన శిల్పాశెట్టి... పద‌హా‌రేళ్ల వయ‌సులో ప్రముఖ వాణిజ్య సంస్థ కోసం కొన్ని ప్రక‌ట‌నల్లో నటించింది. రెండేళ్ల తర్వాత 'బాజీ‌ఘర్‌'లో అవ‌కా‌శాన్ని దక్కించుకుంది. అందులోని కీలక పాత్రలో కనిపించిన శిల్పా‌శె‌ట్టికి చక్కటి గుర్తింపు లభించింది. ఉత్తమ సహాయనటిగా పలు అవా‌ర్డుల్ని సొంతం చేసు‌కుంది. ఆ తర్వాత 'ఆగ్‌'లో పూర్తి‌స్థాయి కథా‌నా‌యి‌కగా నటించి పేరు తెచ్చు‌కుంది. 'మై ఖలాడీ తు అనారి' చిత్రంలో అక్ష‌య్‌కు‌మార్‌ సర‌సన నటించి అందరి దృష్టినీ ఆక‌ర్షించింది. 'ఆవో ప్యార్‌ కరే', 'హత్‌కడి' తది‌తర చిత్రాల్లో నటించి హీరోయిన్​గా తన స్థానం సుస్థిరం చేసుకుంది.

బిగ్‌ బ్రద‌ర్‌తో..

ఇంగ్లాండ్‌లో బిగ్‌ ‌బ్రదర్‌ సెల‌బ్రిటీ రియాలిటీ షోలో పాల్గొ‌న‌డం వల్ల ప్రపం‌చ‌వ్యా‌ప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అందులో గెలు‌పొంది భారీ మొ‌త్తంలో నగదు బహు‌మ‌తిని సొంతం చేసుకుందీ భామ. అయితే ఆ షోలో ఆమెపై జేడ్‌గూడీ చేసిన వ్యాఖ్యలు వివాదా‌స్ప‌ద‌మ‌య్యాయి. ఆ ఎపి‌సో‌డ్‌లో ప్రపంచం మొత్తం శిల్పకు అండగా నిలి‌చింది. దీంతో షోలో 63 శాతం ఓట్లతో ఆమె గెలు‌పొం‌దింది.

నట‌నలోనూ...

అందంతో తొలి అడు‌గుల్లోనే అంద‌రినీ కట్టి‌ప‌డేసింది శిల్పాశెట్టి. అయితే ఆ అందంపై ఎంతోకాలం ఆధా‌ర‌ప‌డ‌లేదు. మధ్యలో నటి‌గానూ ప్రతి‌భను చూపించే ప్రయత్నం చేసింది. 'థడ్‌కన్‌', 'రిస్తే', 'ఫిర్‌ మిలింగే', 'గర్వ్‌', 'లైఫ్‌ ఇన్‌ మెట్రో' తది‌తర చిత్రాల్లో చక్కటి నట‌నను కన‌బ‌రి‌చింది. 'ఫిర్‌ మిలిం‌గే'లో ఎయిడ్స్‌ వ్యాధి బారిన పడిన యువ‌తిగా ‌న‌టించి ప్రశం‌సలు దక్కిం‌చుకుంది. హిందీ‌లోనే కాకుండా... దక్షి‌ణాది చిత్రల్లోనూ అవ‌కా‌శాల్ని అందిపు‌చ్చు‌కుంది. తెలు‌గులో 'సాహ‌స‌వీ‌రుడు సాగ‌ర‌కన్య', 'వీడె‌వ‌డండి బాబూ', 'భలే‌వా‌డివి బాసూ', 'ఆజాద్‌' తది‌తర చిత్రాల్లో నటించింది. తమి‌ళంలో చేసిన 'మిస్టర్‌ రోమియో' శిల్పకు మంచి పేరు తీసు‌కొ‌చ్చింది. అన్ని భాషల్లో కలిపి మొత్తం 40 చిత్రాలు చేసింది.

Actress Shilpa Shetty Birthday Special Story
శిల్పా‌శెట్టి

ముద్దుతో వివాదం..

శిల్పాశెట్టి కేంద్రంగా చాలా వివాదాలే సాగాయి. 2007లో ఇంగ్లీష్‌ నటుడు రిచర్డ్‌ గెరెతో కలిసి దిల్లీలో ఎయి‌డ్స్‌పై ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో రిచర్డ్‌ గెరె... శిల్పా‌శెట్టి బుగ్గపై గట్టిగా ముద్దు‌ పె‌ట్టుకొ‌న్నారు. బహి‌రం‌గంగా అలా ముద్దాడడంపై అప్పట్లో వివాదం రేగింది. పలు ప్రజా ‌సంఘాలు, పార్టీలు శిల్పా‌శె‌ట్టికి వ్యతి‌రే‌కంగా కోర్టు‌కె‌ళ్లాయి. ఆ విష‌యంపై శిల్పా వివ‌రణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

కుంద్రాతో పెళ్లి..

లండన్‌లో స్థిర‌ప‌డిన ప్రముఖ వ్యాపా‌రవేత్త రాజ్‌కుంద్రాతో ప్రేమా‌యణం సాగించిన శిల్పాశెట్టి... 2009 నవం‌బరు 22న అతడిని పెళ్లి చేసుకుంది. ఆ విషయాన్ని తన వెబ్‌సైట్‌ ద్వారా వెల్ల‌డించింది. వీరి‌ద్ద‌రికి 2012లో ఓ బాబు పుట్టాడు. ఆ చిన్నారి పేరు వియాన్‌ కుంద్రా. రాజ్‌కుంద్రాను వివాహం చేసు‌కు‌న్నాక పలు వ్యాపా‌రా‌లపై దృష్టి‌పె‌ట్టిందీ ముద్దుగుమ్మ. భర్తతో కలిసి ఐపీ‌ఎల్‌లో రాజ‌స్థాన్‌ రాయల్స్‌ టీమ్‌ను కొను‌గోలు చేసింది. నిర్మాణ సంస్థనూ ప్రారంభించింది. సన్నీ‌దేఓల్, హర్మన్‌ భవే‌జా‌లతో 'దక్షి‌యా‌వూన్‌' అనే సినిమాను నిర్మించింది.

యోగా గురూ..

శిల్పా‌శెట్టికి ప్రస్తుతం 40 ఏళ్లు దాటినా ఇప్ప‌టికీ ఆమె ఎంతో నాజూగ్గా కని‌పి‌స్తుంది. నవ‌తరం హీరోయిన్లు సైతం విస్తు‌పో‌యేలా తన ఆకృ‌తిని కాపా‌డు‌కుంటోంది. దాని వెనుక రహస్యం యోగానే అని చెబు‌తోంది. యోగా నేప‌థ్యంలో ఆమె కొన్ని వీడియో డీవీడీలూ విడు‌దల చేసింది. అవి హాట్‌కే‌కుల్లా అమ్ము‌డు పో‌వడం విశేషం.

Actress Shilpa Shetty Birthday Special Story
శిల్పా‌శెట్టి

ఫుల్‌టైమ్‌ అమ్మ

పెళ్లి తర్వాత సిని‌మాలు తగ్గించిన శిల్పాశెట్టి. ఆ తర్వాత నుంచి బుల్లితె‌రపై డ్యాన్స్‌ షోలకు న్యాయ‌ని‌ర్ణే‌తగా వ్యవ‌హ‌రిస్తోంది. "ఇప్పుడు ఫుల్‌ టైమ్‌ అమ్మని, పార్ట్‌‌టైమ్‌ ప్రొఫె‌ష‌న‌ల్‌ను" అని చెబుతుంటోంది.

Actress Shilpa Shetty Birthday Special Story
శిల్పా‌శెట్టి

నాలో నేను..

  • కామెడీ సిని‌మా‌లంటే చాలా ఇష్టం. చూడ‌టా‌నికైనా నటించ‌డా‌ని‌కైనా వినో‌దాత్మక చిత్రాల్నే ఇష్ట‌ప‌డతా.
  • 1965లో వచ్చిన 'గైడ్‌' నా ఆల్‌టైమ్‌ ఫేవ‌రేట్‌ చిత్రం. మళ్లీ తీస్తే అందులో నేను తప్ప‌ని‌స‌రిగా భాగమవుతా.
  • హిందీ చిత్ర పరి‌శ్రమ అంటే నాకు ఎంతో ఇష్టం. ఇంత పేరు, ప్రేమించే వ్యక్తుల్ని ఇచ్చింది ఇదే కదా.
  • స్నేహి‌తు‌లంటే చాలా మందే ఉన్నారు. అంద‌రికంటే మంచి స్నేహి‌తు‌రా‌లంటే నా చెల్లి షమి‌తానే.
  • ఏ విష‌యా‌న్నైనా నా భర్త రాజ్‌కుం‌ద్రాతో పంచు‌కో‌వడాన్ని ఇష్ట‌ప‌డతా.
  • ఆహారం విష‌యంలో క్రమ‌శి‌క్షణ పాటి‌స్తుంటా. నాకు ఇష్ట‌మైన ఆహార పదార్థం.. పానీ‌పూరి. కారులో వెళు‌తు‌న్నప్పుడు చిన్న కొట్టు కని‌పించినా సరే వెళ్లి తినే‌సొస్తా.
  • జీవి‌తంలో సంతృ‌ప్తి‌ని‌చ్చిన సందర్భం అంటే.. నేను తల్లిని అయిన క్షణమే. మాతృత్వంలోని తీయదనం అనుభ‌విం‌చా‌ల్సిందే తప్ప మాటల్లో చెప్పలేం.
  • నిర్మా‌తగా మారడం నేను చేసిన ఓ పెద్ద సాహసం.
  • నవ‌తరం కథా‌నా‌యి‌కలు అన్ని విధాలుగా ఆలోచించే నిర్ణ‌యాలు తీసు‌కుంటు‌న్నారు. వారికి సల‌హాలు, సూచ‌నలు అవ‌సరం లేదని నా అభి‌ప్రాయం.

ఇదీ చూడండి... నాలుగేళ్లలో మూడుసార్లు రిటైర్మెంట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.