ETV Bharat / science-and-technology

Microsoft: మైక్రోసాఫ్ట్ ఖాతాలకు పాస్‌వర్డ్ అక్కర్లేదట.. మరి లాగిన్?

author img

By

Published : Sep 17, 2021, 6:12 AM IST

Updated : Sep 17, 2021, 8:00 AM IST

మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్

సైబర్​ నేరాలు (Cyber Crime) పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంటర్​నెట్​ ఉపయోగించే సమయంలో రక్షణగా ఉండే టూల్​ను మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త ఫీచర్​తో పాస్​వర్డ్​లు అవసరం లేకుండానే అత్యంత సురక్షితంగా యూజర్స్ లాగిన్​ కావచ్చని చెబుతోంది.

ఆన్‌లైన్ భద్రతకు సంబంధించి యూజర్స్‌కు మెరుగైన సేవలందించడం కోసం మైక్రోసాఫ్ట్ (Microsoft) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట మైక్రోసాఫ్ట్ యూజర్స్ తమ ఖాతాల్లోకి లాగిన్ అయ్యేందుకు పాస్‌వర్డ్‌ అవసరంలేదని తెలిపింది. ఈ మేరకు యూజర్స్‌ అంతా పాస్‌వర్డ్‌కు బదులు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్‌ యాప్‌, విండోస్‌ హలో లేదా ఎస్సెమ్మెస్‌, ఈ-మెయిల్ ద్వారా వచ్చే కోడ్‌లతో లాగిన్ కావాలని సూచించింది. ఇది పాస్‌వర్డ్ కంటే సురక్షితమైన పద్ధతని మైక్రోసాఫ్ట్(Microsoft) తెలిపింది. ఔట్‌లుక్‌, వన్‌డ్రైవ్‌, మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ సేఫ్టీ, ఎక్స్‌బాక్స్‌ సిరీస్‌ ఎక్స్‌/ఎస్‌తోపాటు అన్ని రకాల మైక్రోసాఫ్ట్ సేవలు పొందేందుకు ఇక మీదట పాస్‌వర్డ్‌ అవసరంలేదని వెల్లడించింది. అక్టోబరు 5న కొత్త ఓఎస్‌ విండోస్ 11ను విడుదలచేయనున్న నేపథ్యంలో అంతకుముందే ఈ ఫీచర్‌ను పూర్తిస్థాయిలో యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురావాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.

మైక్రోసాఫ్ట్(Microsoft) అథెంటికేటర్ యాప్‌ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యూజర్స్ తమ ఖాతాలను పాస్‌వర్డ్‌లెస్‌కు మార్చుకోవచ్చు. ముందుగా మీ ఖాతాని అథెంటికేటర్‌ యాప్‌తో అనుసంధానించాలి. తర్వాత మీ మైక్రోసాఫ్ట్ ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీలో పాస్‌వర్డ్‌లెస్‌ ఆప్షన్‌ని ఎనేబుల్ చేయాలి. తర్వాత అథెంటీకేటర్‌ యాప్‌లో వచ్చే నోటిఫికేషన్లను ఓకే చేస్తూ మీ ఖాతాలోకి లాగిన్ కావచ్చు. ఒకవేళ మీరు తిరిగి పాస్‌వర్డ్‌ కావాలనుకుంటే ఖాతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి పాస్‌వర్డ్‌లెస్‌ ఆప్షన్‌ని డిసేబుల్ చేస్తే సరిపోతుంది. అయితే పాస్‌వర్డ్‌తో కంటే పాస్‌వర్డ్‌లెస్‌తోనే ఆన్‌లైన్ ఖాతాలకు ఎక్కువ భద్రత ఉంటుందని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చాలా మంది గుర్తుండటం కోసం ఒకే రకమైన పాస్‌వర్డ్‌ని ఒకటి కన్నా ఎక్కువ ఆన్‌లైన్‌ ఖాతాలకు ఉపయోగిస్తుంటారు. దాంతో సైబర్‌ నేరగాళ్లకు మీ పాస్‌వర్డ్ తెలిస్తే మీకు సంబంధించిన అన్ని ఖాతాలను యాక్సెస్‌ చేయొచ్చు. దీనివల్ల సైబర్ దాడులు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు సైబర్ నిపుణులు. ఇప్పటికే గూగుల్, యాపిల్‌ వంటి కంపెనీలు కూడా పాస్‌వర్డ్‌కు బదులు అథెంటికేషన్‌ ద్వారా లాగిన్‌ అయ్యే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే వీటిని ఉపయోగించలా? వద్దా? అనే నిర్ణయాన్ని యూజర్స్‌కే ఇచ్చాయి.

ఇవీ చదవండి:

Last Updated :Sep 17, 2021, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.