ETV Bharat / science-and-technology

విపులంగా విశ్వవీక్షణం- వీడనున్న ఖగోళ గుట్టు!

author img

By

Published : Dec 25, 2021, 6:54 AM IST

James Webb Telescope: ఖగోళ రహస్యాలను ఛేదించేందుకు, అంతుచిక్కకుండా ఉన్న అనేక ప్రశ్నలకు జవాబులు కనుగొనేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు​ను శాస్త్రవేత్తలు ప్రయోగిస్తున్నారు. కాలంలో వెనక్కి వెళ్లి.. విశ్వం పుట్టుక తొలినాళ్లలో ఏర్పడిన గెలాక్సీలను శోధించడం దీని ప్రత్యేకత. హబుల్ టెలిస్కోపు వారసురాలిగా భావిస్తున్న దీన్ని.. శనివారం సాయంత్రం ప్రయోగించనున్నారు.

james webb space telescope
james webb space telescope

James Webb Space Telescope: అనంత విశ్వం అనేక రహస్యాల పుట్ట. ఎన్నెన్నో అద్భుతాలు.. మరెన్నో వింతలకూ అది నెలవు. సుదూర విశ్వంలోని పరిణామాలు ఖగోళ శాస్త్రవేత్తలను అనుక్షణం ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి. తమ గుట్టు విప్పండంటూ సవాళ్లతో వారిని ఊరిస్తుంటాయి! ఎప్పటికప్పుడు ఆ సవాళ్లను స్వీకరిస్తూ అంతరిక్ష చిక్కుముళ్లను విప్పుతున్న శాస్త్రవేత్తలు.. తాజాగా అదే తోవలో మరో అద్భుతానికి శ్రీకారం చుడుతున్నారు. ఖగోళ శాస్త్రానికి సంబంధించి జవాబుల్లేని అనేక ప్రశ్నలకు సమాధానాలను కనుగొనే సత్తా ఉన్న మహా విశ్వదర్శిని- 'జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ)'ను ప్రయోగిస్తున్నారు. కాలంలో వెనక్కి వెళ్లి.. విశ్వం పుట్టుక తొలినాళ్లలో ఏర్పడిన గెలాక్సీలను శోధించడం దీని ప్రత్యేకత.

James Webb launch

హబుల్‌ కన్నా జేడబ్ల్యూఎస్‌టీ వంద రెట్లు ఎక్కువ శక్తిమంతమైంది. విశ్వం గుట్టు విప్పడంలో మరే టెలిస్కోపునకూ దీనంత సామర్థ్యం లేదు. చంద్రుడిపై చిన్న కీటకం ఉన్నా దాన్ని ఇది పసిగట్టగలదు.

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జేడబ్ల్యూఎస్‌టీని అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. అంతా సవ్యంగా సాగితే ఈ అద్భుత సాధనం శనివారం రోదసిలోకి దూసుకెళుతుంది. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఎరియాన్‌-5 రాకెట్‌ దీన్ని మోసుకెళుతుంది. వినూత్న పరిజ్ఞానం, భారీ వ్యయ ప్రయాసలతో రూపొందిన ఈ అత్యాధునిక టెలిస్కోపు అందించబోయే డేటా, వెలుగులోకి తెచ్చే సరికొత్త విషయాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరిశోధనల కోసం ఒక కొత్త రంగాన్ని తీసుకొచ్చే సామర్థ్యం ఈ ప్రయోగానికి ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. జేడబ్ల్యూఎస్‌టీ అందించే సమాచారం కారణంగా మన పాఠ్యపుస్తకాలను మార్చేయాల్సి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

James webb telescope vs hubble

1990లో ప్రయోగించిన హబుల్‌ స్పేస్‌ టెలిస్కోపు విశ్వానికి సంబంధించిన అనేక నిగూఢ వివరాలను అందించింది. దాని వారసురాలిగా జేడబ్ల్యూఎస్‌టీని చెప్పుకోవచ్చు. విశ్వం పుట్టుక అనంతరం ఏర్పడిన తొలి గెలాక్సీలను ఇది శోధిస్తుంది. అంటే.. టైం మెషీన్‌ తరహాలో కాలంలో వెనక్కి వెళ్తుందన్నమాట! మన పాలపుంత వంటి నక్షత్ర మండలాలు ఏర్పడిన తీరును ఇది వెలుగులోకి తెస్తుంది. సూర్యుడు-భూమికి సంబంధించిన 'లాంగ్‌రేంజ్‌ పాయింట్‌-2 (ఎల్‌2)' వద్దకు వెళ్లే ఈ టెలిస్కోపు.. అన్ని దశలూ పూర్తిచేసుకొని పని ప్రారంభించడానికి ఆరు నెలలు పడుతుంది.

james webb space telescope
.

ఏ స్పెక్ట్రమ్‌లో..?

ఇది వర్ణపటం (స్పెక్ట్రమ్‌)లోని పరారుణ తరంగదైర్ఘ్యంలో పనిచేస్తుంది. విశ్వం నిరంతరం విస్తరిస్తుంటుంది. అందువల్ల తొలినాటి విశ్వానికి సంబంధించిన దృశ్య కాంతి (విజిబుల్‌ లైట్‌), అతినీలలోహిత కాంతి బాగా సాగిపోయి పరారుణ కాంతి (ఇన్‌ఫ్రారెడ్‌)గా మారుతుంది. దీన్ని 'కాస్మోలాజికల్‌ రెడ్‌ షిఫ్ట్‌' అంటారు. ఈ కాంతి మనిషి కంటికి కనిపించదు. దాన్ని ఒడిసిపట్టడం ద్వారా.. తొలినాటి విశ్వానికి సంబంధించిన దృశ్యాలను జేడబ్ల్యూఎస్‌టీ ఆవిష్కరిస్తుంది. ఈ పని కోసం టెలిస్కోపులో నియర్‌, మిడ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ పరికరాలను అమర్చారు.

బంగారు నేత్రం

పరారుణ కాంతిలో వీక్షించడానికి వీలుగా జేడబ్ల్యూఎస్‌టీ ఆప్టిక్‌ వ్యవస్థలో ప్రధానంగా నాలుగు దర్పణాలు ఉంటాయి. వాటి పరావర్తన సామర్థ్యం చాలా ఎక్కువ. దర్పణాలను బెరీలియంతో తయారుచేశారు. ఈ పదార్థం ఎలాంటి ఉష్ణోగ్రతల్లోనూ దాని ఆకృతిని కోల్పోదు. విద్యుత్‌, వేడిని బాగా గ్రహిస్తుంది. బెరీలియంపై సన్నటి పొరలా బంగారం పూత వేశారు. ఈ పొర మందం 100 నానోమీటర్లు మాత్రమే. మొత్తంగా దాదాపు 49 గ్రాముల స్వర్ణాన్ని వాడారు. బంగారం.. తనపై పడిన పరారుణ కాంతిలో 99 శాతాన్ని పరావర్తనం చెందిస్తుంది. టెలిస్కోపులోని భారీ ఆప్టిక్స్‌కు తోడ్పాటు అందించడానికి పదుల సంఖ్యలో ఉప వ్యవస్థలు ఉన్నాయి.

How James Webb telescope works

జేడబ్ల్యూఎస్‌టీలో ప్రధాన భాగం- ప్రైమరీ మిర్రర్‌. ఇది షడ్భుజి ఆకృతిలో ఉండే 18 వేరువేరు దర్పణాలతో తయారైంది. ఒక్కోదాని వెడల్పు 1.32 మీటర్లు. ఒక్కోటి ఒక్కో టెలిస్కోపులా పనిచేయగలదు. అంతిమంగా అన్నీకలిసి ఒకే టెలిస్కోపులా పనిచేసి, మరింత స్పష్టమైన చిత్రాన్ని అందిస్తాయి. మొత్తంమీద ప్రైమరీ మిర్రర్‌ వెడల్పు 6.5 మీటర్లు. హబుల్‌ ప్రధాన అద్దం వెడల్పు 2.4 మీటర్లు మాత్రమే.

james webb space telescope
.

నాలుగో మిర్రర్‌ను ఫైన్‌ స్టీరింగ్‌ మిర్రర్‌ అని కూడా పిలుస్తారు. ఇది టెలిస్కోపు కదలికల వల్ల ఏర్పడే వైరుధ్యాలను సరిచేస్తుంది. చివరకు కాంతిలోని ఫోటాన్లు.. ఎలక్ట్రాన్లుగా మారి, ఒక చిత్రం ఏర్పడుతుంది. అది డేటా రికార్డర్‌లో నమోదవుతుంది. నాసా డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ ద్వారా భూమికి చేరుతుంది.

ఇదీ చదవండి: రోదసిలో టైం మెషీన్- ఖగోళ రహస్యాలను ఛేదించే దర్శిని!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.