ETV Bharat / science-and-technology

Chandrayaan 3 Wake Up : 'ఆశలు లేవు.. చంద్రయాన్‌-3 ఇక ముగిసినట్లే!'

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 7:17 AM IST

Chandrayaan 3 Wake Up
Chandrayaan 3 Wake Up

Chandrayaan 3 Wake Up : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్​-3 ప్రాజెక్ట్​లోని విక్రమ్​ ల్యాండర్​, రోవర్​ ప్రజ్ఞాన్​లు ఇంకా మేల్కొనలేదు. అయితే అవి మేల్కొవడంపై ఆశలు కనిపించడం లేదని ఇస్రో మాజీ ఛైర్మన్‌ కిరణ్‌ కుమార్‌ చెప్పారు. చంద్రయాన్‌-3 ప్రాజెక్టు ఇక ముగిసేనట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు

Chandrayaan 3 Wake Up : జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన చంద్రయాన్​-3 ప్రాజెక్ట్​లోని విక్రమ్​ ల్యాండర్​, ప్రజ్ఞాన్​ రోవర్​లు.. ఇంకా నిద్రాణస్థితి నుంచి బయటకు రావడం లేదు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్​-3లోని ల్యాండర్​, రోవర్​లు.. సెప్టెంబర్​ 22వ తేదీన సూర్యోదయమైనప్పటికీ ఇంకా మేల్కొవడం లేదు. వాటిని మేల్కొలిపేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా.. ఫలితం కనిపించడం లేదు.

Chandrayaan 3 ISRO : ఈ నేపథ్యంలో ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ చంద్రయాన్‌-3 ప్రాజెక్టుపై స్పందించారు. ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌లు మేల్కొవడంపై ఇక ఆశ కనిపించడం లేదని ఆయన అన్నారు. భారత్‌ ప్రతిష్టాత్మకంగా పంపిన చంద్రయాన్‌-3 ప్రాజెక్టు ఇక ముగిసేనట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"చంద్రయాన్​-3లోని ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న నమ్మకం లేదు. ఒక వేళ మేల్కోవాల్సి ఉంటే ఇప్పటికే అది జరిగి ఉండేది. అవి నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. చంద్రయాన్‌-3ని విశాల దృక్కోణంలో చూసినప్పుడు అనుకున్న ఫలితం ఇప్పటికే వచ్చింది. ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో దక్షిణ ధ్రువం పై చంద్రయాన్‌ కాలుమోపింది. ఇప్పటికే ఆ రీజియన్‌ నుంచి విలువైన సమాచారం మనకు అందింది. ఇది కచ్చితంగా ఉపయోగపడే సమాచారం. తదుపరి చేపట్టే ప్రాజెక్టుల్లో విజ్ఞానపరంగా, ప్లానింగ్‌ పరంగా ఆ ప్రాంతానికి సంబంధించి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది"

-- ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌, ఇస్రో మాజీ ఛైర్మన్‌

Chandrayaan 3 Update : చంద్రుడి నుంచి నమూనాలను తీసుకొచ్చే అవకాశాలపై కిరణ్‌ కుమార్‌ స్పందించారు. భవిష్యత్తులో ఇది సాధ్యం కావచ్చని పేర్కొన్నారు. సాంకేతిక సామర్థ్యాలు పెరగడం వల్లే చంద్రయాన్‌-3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరిగిందన్నారు. భవిష్యత్తులో చంద్రుని నుంచి నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకొచ్చే ప్రాజెక్టులు కచ్చితంగా ఉంటాయని తెలిపారు. టెక్నాలజీ అభివృద్ధి ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం ఉందన్నారు.

Chandrayaan 3 Landing Date : భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువం చేరింది. దీంతో ఇస్రో కీర్తి పతాకాల్లో నిలిచింది. ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌లు 14 రోజుల పాటు చంద్రుడి గురించి విలువైన సమాచారం అందించాయి. అనంతరం చంద్రుడిపై చీకటి కావడం వల్ల సెప్టెంబర్‌ 2న రోవర్‌, 4న ల్యాండర్‌ను శాస్త్రవేత్తలు నిద్రాణస్థితికి పంపారు. 14 రోజుల తర్వాత సెప్టెంబర్‌ 22న అక్కడ సూర్యోదయం కావడం వల్ల ఇస్త్రో శాస్త్రవేత్తలు వాటి బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్‌ చేసి మేల్కొలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.