ETV Bharat / science-and-technology

మరణం ఎప్పుడో చెప్పే ఏఐ టూల్! 78% పర్ఫెక్ట్​ ప్రిడిక్షన్! ఎలా పనిచేస్తుందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 5:30 PM IST

AI Death Predictor Tool Life2vec : ఏ వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు? తన జీవితం మొత్తంలో ఎంత సంపాదిస్తాడు? ఏ మనిషి జీవితకాలం ఎంత? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే. కానీ వీటికి శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు! సైన్స్​కు టెక్నాలజీ జోడించి మరణాన్ని అంచనా వేసే ఏఐ టూల్​ను రూపొందించారు. 78 శాతం కచ్చితత్వంతో ఇది పనిచేస్తుందని తేలింది. ఈ టూల్ ఎలా పనిచేస్తుందంటే?

ai death predictor tool denmark
ai death predictor tool denmark

AI Death Predictor Tool Life2vec : మరణాన్ని అంచనా వేసే క్యాల్​క్యులేటర్​ను శాస్త్రవేత్తలు రూపొందించారు. మనుషులు ఎంత కాలం జీవిస్తారు? ఎంత సంపాదిస్తారు? అనే విషయాలను మెరుగ్గా అంచనా వేయగలిగే అల్గారిథమ్​ను తయారు చేశారు. వ్యక్తుల వివరాలు, అలవాట్లు, పద్ధతులు తదితర సమాచారాన్ని ఉపయోగించుకొని మరణాన్ని అంచనా వేసేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్​ను సిద్ధం చేశారు. ఇది 78 శాతం కచ్చితత్వంతో పని చేస్తోందని తాజా పరిశోధనలో తేలింది.

డెన్మార్క్, అమెరికా శాస్త్రవేత్తలు కలిసి 'లైఫ్​2వెక్' అనే ఏఐ మోడల్​ను రూపొందించారు. ఇది చాట్​జీపీటీ తరహాలో పనిచేస్తుంది. ఇతర మోడళ్ల తరహాలో కాకుండా చాట్​బాట్ మాదిరిగా యూజర్లతో నేరుగా సంభాషించి సమాచారం సేకరిస్తుంది. మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్​ను ఉపయోగించి ఈ ఏఐ మోడల్​కు విస్తృతమైన డేటాను అందించారు. ఆదాయం, వృత్తి, నివాసం ఉండే చోటు, ప్రెగ్నెన్సీ హిస్టరీ, గాయాలు తదితర సమాచారంతో కూడిన 60 లక్షల మంది వ్యక్తుల వివరాలను దీనికి ఇచ్చారు. ఓ వ్యక్తి ఎంత త్వరగా చనిపోయే అవకాశం ఉంది? వారి జీవిత కాలంలో సంపాదించే ఆదాయం ఎంత? వంటి విషయాలను ఇది అంచనా వేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

AI Death Predictor Tool Life2vec
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఈ మోడల్ ప్రకారం ఈ కింది లక్షణాలు ఉన్నవారు త్వరగా చనిపోయే అవకాశం ఉంది

  • మగవారు
  • మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు
  • నైపుణ్యం కలిగిన వృత్తిలో ఉన్నవారు

ఎక్కువ కాలం జీవించేందుకు కారకాలు ఇవే!

  • అధిక ఆదాయం
  • నాయకత్వ బాధ్యతల్లో ఉండటం

78 శాతం మంది విషయంలో సరైన ప్రిడిక్షన్!
2008 నుంచి 2016 మధ్య డేటాతో దీనికి ట్రైనింగ్ ఇచ్చారు. లక్షల మందికి సంబంధించిన సమాచారాన్ని అందించారు. ఆ సమాచారం ఆధారంగా 2020 నాటికి ఎంత మంది చనిపోయి ఉంటారన్న విషయం చెప్పాలని ఏఐని శాస్త్రవేత్తలు అడిగారు. ఇందులో 78 శాతం మంది విషయంలో ఏఐ మోడల్ అంచనాలు సరైనవే అని తేలింది. ఈ పరిశోధనా ఫలితాలు 'నేచర్ కంప్యుటేషనల్ సైన్స్' జర్నల్​లో పబ్లిష్ అయ్యాయి. అయితే, వ్యక్తిగత ఫలితాలను ఈ పరిశోధనలో భాగమైన వారెవరికీ చెప్పలేదు.

AI Death Predictor Tool Life2vec
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్

"పరిశోధనకు సంబంధించిన మరిన్ని ఫలితాలను షేర్ చేసే దిశగా యాక్టివ్​గా పనిచేస్తున్నాం. ఇందుకోసం మరింత రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. పరిశోధనలో పాల్గొన్నవారి ప్రైవసీకి ఇబ్బంది కలగకుండా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏఐ మోడల్​ కోసం ఉపయోగించిన వ్యక్తిగత వివరాలేవీ సాధారణ ప్రజలకు లేదా కంపెనీలకు అందుబాటులో ఉంచలేదు."
-సునే లేహ్​మన్, పరిశోధకుడు, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్​కు చెందిన నెట్​వర్క్స్ అండ్ కాంప్లెక్స్ సిస్టమ్స్​ విభాగ ఆచార్యుడు

'లైఫ్2వెక్​'కు సమాచారాన్ని సెంటెన్స్​ల రూపంలో ఇచ్చారు శాస్త్రవేత్తలు. సమాచారానికి టోకెన్ నంబర్లు కేటాయించారు. వృత్తి, ఆదాయం, హెల్త్, జీవిత సంఘటనలు సహా మనిషి జీవితంలో సంభవించే అన్ని వ్యవహారాలకు ఒక్కో టోకెన్ నంబర్​ను ఇచ్చి ఏఐ టూల్​ను ట్రైన్ చేశారు. వీటన్నింటిని ద్వారా ఇతరుల జీవితకాలాన్ని లెక్కగడుతుంది ఈ ఏఐ టూల్.

AI Death Predictor Tool Life2vec
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

పర్సనాలిటీ టెస్ట్ కూడా
వ్యక్తుల పర్సనాలిటీని సైతం ఇది అంచనా వేస్తుంది. ఇందుకోసం పది అంశాలను ఇచ్చి పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తుంది. 'కొత్త ప్రదేశాలకు వెళ్తే నేను మొదట చేసేది మిత్రులను చేసుకోవడమే', 'గ్రూప్ మీటింగ్​లలో అరుదుగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాను' వంటి సెంటెన్స్​లు ఇచ్చి, వీటికి మీరు ఎంత వరకు అంగీకరిస్తారు అని అడుగుతుంది. ప్రశ్నలకు మనుషులు ఇచ్చే సమాధానాలను బట్టి వారి వ్యక్తిత్వాలపై అంచనాకు వస్తుంది.

"ఏఐని ట్రైన్ చేయడానికి ఇచ్చిన డేటా మొత్తం డెన్మార్క్​కు చెందినదే. కాబట్టి ఇతర ప్రాంతాల్లో నివసించే వారి విషయంలో ఈ ప్రిడిక్షన్స్ అంత కచ్చితత్వంతో ఉండకపోవచ్చు. నిజానికి తాము ఎప్పుడు చనిపోతున్నామనే విషయాన్ని ఎవరూ తెలుసుకోవాలని కూడా అనుకోరు."
-సునే లేహ్​మన్, పరిశోధకుడు

జీవితంలో జరిగబోయే సంఘటనలను, మనుషుల ప్రవర్తనను ముందుగానే అంచనా వేసే ఇలాంటి టెక్నాలజీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని లేహ్​మన్ చెప్పారు. సోషల్ మీడియా యూజర్ల ప్రవర్తనను టెక్ కంపెనీలు ట్రాక్ చేస్తుంటాయని వివరించారు. యూజర్ల ప్రొఫైళ్లను అత్యంత కచ్చితత్వంతో పసిగట్టి, భవిష్యత్​ ప్రవర్తనను అంచనా వేస్తుంటాయని పేర్కొన్నారు. 'ఏఐ ద్వారా ఏం అభివృద్ధి చేయాలనే విషయంలో ఈ ప్రాజెక్ట్ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. ఇలాంటి వాటిపై చర్చలు మరింత జరగాలి. తద్వారా టెక్నాలజీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో, ఈ తరహా అభివృద్ధి మనకు అవసరమో కాదో తెలుస్తుంది' అని లేహ్​మన్ అంటున్నారు.

చంపేస్తానని చాట్​బాట్ వార్నింగ్.. జర్నలిస్టుకు పెళ్లి ప్రపోజల్.. ఎందుకిలా? ఏఐతో డేంజరేనా?

Artificial Intelligence in Our Daily Life : మీ ఇంట్లోకి.. నట్టింట్లోకి "AI".. వదిలించుకోవడం అసాధ్యం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.