ETV Bharat / opinion

యువత సాంకేతికత జతపడితేనే.. ఆత్మనిర్భరత

author img

By

Published : May 29, 2021, 6:44 AM IST

corona, gdp of india
కరోనా, దేశ ఆర్థిక వ్యవస్థ

ఏడాది మొదట్లో కరోనా విస్తరణ నెమ్మదించిన కారణంగా ఆయా సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ అంచనాలను అమాంతంగా పెంచేశాయి. ప్రఖ్యాత రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇదే ఏడాదికి గానూ 13.7శాతం వృద్ధిరేటును అంచనా వేసింది. కానీ కొవిడ్​ రెండో దశ పరిస్థితుల కారణంగా 9.3 శాతానికి కుదించింది. కరోనా వల్ల ఒక్క ఏడాదిలో దేశంలోని కోట్లాది ప్రజలు దారిద్య్ర రేఖ దిగువకు చేరారంటే మహమ్మారి ఎలాంటి దెబ్బకొట్టిందో అర్థమవుతోంది.

కరోనా మహా విపత్తు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర ఒడుదొడుకులకు లోనయింది. గత ఆర్థిక సంవత్సరంలో అంటే... 2020-21 మొదటి త్రైమాసికానికి ఏకంగా -23.9 శాతం దిగువకు వెళ్లి, మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను -8 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) నమోదయింది. దేశ ఆర్థిక అభివృద్ధి సూచి ఇంత పతనం కావడం ఎవరూ ఊహించని పరిణామం. 2021-22 ఏడాది మొదట్లో కరోనా విస్తరణ నెమ్మదించిన కారణంగా వివిధ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీని ఎక్కువ అంచనా వేశాయి. ప్రఖ్యాత రేటింగ్‌ సంస్థ మూడీస్‌ (మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీస్‌) కూడా మొదట 2021-22 సంవత్సరానికి 13.7శాతం వృద్ధిరేటును అంచనా వేసినా రెండో దశ కరోనా పరిస్థితుల కారణంగా దాన్ని క్రమంగా 9.3 శాతానికి కుదించింది. కరోనా వల్ల ఒక్క ఏడాదిలో దేశంలోని కోట్లాది ప్రజలు దారిద్య్ర రేఖ దిగువకు చేరారంటే మహమ్మారి సృష్టించిన ఉత్పాతం ఎలాంటిదో అర్థమవుతుంది.

ఆర్థికాభివృద్ధితో సంక్షోభాలకు కళ్లెం

కార్పొరేట్‌ సంస్థలు లేదా పెద్ద వ్యాపార సంస్థలు (బీఎస్‌ఈ కంపెనీస్‌) కరోనా మొదటి దశ అంటే 2020-21 మూడో త్రైమాసికానికి పొందిన నికరలాభం 1.67 లక్షల కోట్ల రూపాయలు. ఇదే సమయంలో అసంఘటిత రంగంతోపాటు శ్రామిక వర్గాల ఆదాయాలు భారీ స్థాయిలో తగ్గిపోయాయి. ఆయా రంగాల మీద ఆధారపడిన ఎన్నో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సంస్థ అంచనాల ప్రకారం ఉపాధి కోల్పోయిన వారిలో నైపుణ్యం లేని వారు, మహిళలు అధికశాతం ఉండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాల మద్దతు, ప్రణాళికల సక్రమ అమలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరం. కరోనా కట్టడికి ప్రస్తుతం భారత్‌ ముందున్న మార్గాలు రెండు. ఒకటి విస్తృతంగా కరోనా ప్రబలుతున్న రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయడం, రెండోది త్వరితగతిన కరోనా టీకాను దేశ ప్రజలందరికీ అందించడం. భారత్‌లో ఇప్పటిదాకా ఒకటి లేదా రెండు డోసుల టీకా అందిన జనాభా మొత్తం దాదాపు 15 శాతం లోపే. మిగతా ప్రజలకు టీకా వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా ప్రణాళికలు సిద్ధం చేసి త్వరితగతిన అమలు చేయాల్సి ఉంది.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దేశం ఆర్థికంగా నిలదొక్కుకుని అభివృద్ధి దిశగా పయనించేందుకు స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు ఎంతో దోహదం చేస్తాయి. స్వల్పకాలిక ప్రణాళికల కింద త్వరితగతిన ప్రభుత్వాలు పూర్తి చేయదగిన వివిధ అంశాలను పరిశీలించవచ్చు. నిజానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, పరిశ్రమలు దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటివి. ఇందులోనే ఆరు కోట్ల 30 లక్షల సంస్థలు కలిపి దేశంలోని సుమారు 12 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. దేశ తయారీ రంగంలో పరిశ్రమల వాటా 33.5శాతం; ఎగుమతుల్లో 40శాతం. ప్రస్తుతం ఈ రంగం తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతోంది. ముఖ్యంగా ముడి సరకు, శ్రామికుల కొరతతో పాటు పరిశ్రమలు నిర్వహించేందుకు కావలసిన రోజు వారి ఆర్థిక వనరుల లేమి కారణంగా ఈ పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడుతోంది. కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఈ రంగంలోని పరిశ్రమలు, వ్యాపారాలను పునరుత్తేజం చేయడానికి వాస్తవ రూపం దాల్చే రెండో ప్యాకేజీ చాలా అవసరం. నూతన వ్యవస్థాపకులను ప్రోత్సహించేందుకు ప్రస్తుత పరిస్థితి ఒక చక్కని సమయం. కృత్రిమ మేధ, మిషన్‌ లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, క్లౌడ్‌ టెక్నాలజీ, రోబోటిక్స్‌ లాంటి నూతన సాంకేతిక రంగ విప్లవాలకు అనుగుణంగా కొత్త సంస్థలు వెలసేందుకు ప్రభుత్వాలు సహకరించాలి.

నైపుణ్యాలకు పదును

ఏ దేశమైనా ప్రాంతమైనా అక్కడి మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటేనే ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ఆర్థికంగా బలపడిన అమెరికా, జపాన్‌, కొరియా, ఐరోపా సమాఖ్య దేశాల అనుభవాల నుంచి మనం గ్రహించవచ్చు. మన దేశంలో దాదాపు 5500 ఎంబీఏ కళాశాలలు, 1000 దాకా విశ్వవిద్యాలయాలు, లెక్కకు మిక్కిలి ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి కొన్ని కోట్ల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం చదువు పూర్తి చేసుకుని బయటికి వస్తున్నారు. మొత్తం జనాభాలో 15-29 ఏళ్ల మధ్య వయస్కులు 27 శాతానికి పైగా ఉన్నారు. భారతదేశానికి వారు అతిపెద్ద సంపద. వారిలో చాలామందికి సరైన అవగాహన, ప్రోత్సాహం లేక అర్హతకు తగని చిన్న ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. వాళ్ల అభిరుచులకు పదును పెట్టేలా వ్యవస్థాపకత, నైపుణ్య శిక్షణ జరగాల్సి ఉంది. తద్వారా యువత నూతన సాంకేతిక మార్పులను అందిపుచ్చుకొని వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించి దేశ అభివృద్ధికి తోడ్పడగలరు. ఇలాంటి దీర్ఘకాలిక ప్రణాళికల వల్ల దేశం ఎలాంటి తీవ్ర ఒడుదొడుకులనయినా ఎదుర్కొనే సత్తాను సాధిస్తుంది. అప్పుడే మనదేశం 2024 వ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్న అయిదు లక్షల కోట్ల డాలర్ల జీడీపీ స్థాయిని సులువుగా చేరుకోగలుగుతుంది.

-డాక్టర్​ కొండయ్య, నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఫర్​ ఎంఎస్​ఎంఈ మాజీ డైరెక్టర్​

ఇదీ చూడండి: 5G Trials in India: ట్రయల్స్‌కు స్పెక్ట్రమ్‌ కేటాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.