ETV Bharat / opinion

రైతు భవిత పరాధీనం- అందుకే అన్నదాత ఆగ్రహం!

author img

By

Published : Dec 8, 2020, 4:53 AM IST

కరోనా ప్రభావం వల్ల పారిశ్రామిక, సేవారంగాలు పూర్తిగా కుదేలై ఉన్నాయి. వ్యవసాయరంగ వృద్ధే ఆర్థిక వ్యవస్థకు ఆశాదీపంగా ఉన్న సమయంలో- రైతులకు రక్షణ కల్పించకుండా కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేసే సంస్కరణల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం చర్చనీయాంశమైంది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా లక్షలమంది రైతులు దిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. ఇది దేశానికి మంచిది కాదు

FARMERS
అన్నదాత

కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ సంస్కరణల పేరుతో తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు వివాదాస్పదమయ్యాయి. దేశమంతటా కరోనా సంక్షోభం నెలకొన్న తరుణంలో- విపక్షాలతో, రైతులతో సరైన సంప్రదింపులు లేకుండా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు (వ్యవసాయ వాణిజ్యం, ఒప్పంద వ్యవసాయం, నిత్యావసర సరకుల చట్ట సవరణ), విద్యుత్తు సంస్కరణలకు వ్యతిరేకంగా లక్షలమంది రైతులు దిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. పొలంలో కష్టపడి పంట పండించాల్సిన అన్నదాతలు రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన దుస్థితి ఆర్థిక వ్యవస్థకు, దేశానికి మంచిది కాదు. కరోనా ప్రభావం వల్ల పారిశ్రామిక, సేవారంగాలు పూర్తిగా కుదేలై ఉన్నాయి. వ్యవసాయరంగ వృద్ధే ఆర్థిక వ్యవస్థకు ఆశాదీపంగా ఉన్న సమయంలో- రైతులకు రక్షణ కల్పించకుండా కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేసే సంస్కరణల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం చర్చనీయాంశమైంది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం చట్టాలు చెయ్యాల్సి రావడం భారత సమాఖ్య స్ఫూర్తినే ప్రశ్నార్థకం చేసింది.

మేలు కంటే కీడే అధికం

వ్యవసాయ రంగాన్ని- అసంఘటితంగా ఉన్న సన్న, చిన్న కారు రైతుల భవితవ్యాన్ని బడా కార్పొరేట్ల చేతుల్లో పెట్టాలనుకోవడంపై వ్యతిరేకత వెల్లువెత్తింది. ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు లేవు. పార్లమెంటులో సమగ్ర చర్చకూ తావివ్వలేదు. దేశంలో రైతుల ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌, ప్రాసెసింగ్‌, నిల్వ సౌకర్యాలు లేక- గిట్టుబాటు ధరలు లభించడం లేదన్నది జగమెరిగిన సత్యం. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ చాలా క్లిష్టమైనది. రైతు తన ఉత్పత్తులకు తనంతట తాను ధర (గరిష్ఠ చిల్లర ధర- ఎంఆర్‌పీ)ను ముందే నిర్ణయించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రకటించే 'కనీస మద్దతు ధర' పంటల ఉత్పత్తులకు పూర్తిస్థాయి గిట్టుబాటు కల్పించదు. ఈ సమయంలో ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్‌ సౌకర్యాలను మరింత మెరుగుపరచి రైతుల బేరమాడే శక్తిని పెంచాలి. ప్రైవేటు వ్యాపారులు, కార్పొరేట్‌ కంపెనీలతో వ్యాపారం చెయ్యాలని సంస్కరణల రూపంలో చట్టాలు రూపొందించడం రైతుకు మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుంది.

కేంద్రం తెచ్చిన 'రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య చట్టం' వల్ల రాష్ట్రాలకు ప్రస్తుతమున్న వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీలపై నియంత్రణ తగ్గిపోయి, వాటి నుంచి వచ్చే ఆదాయానికి గండి పడుతుంది. వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి నిధులు తగ్గిపోతాయి. కొత్త వ్యవస్థలో ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల, వ్యాపారులు/ కార్పొరేట్‌ కంపెనీలు కుమ్మక్కై మార్కెట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మార్కెట్‌ కమిటీల బయట జరిగే అమ్మకాలకు కనీస మద్దతు ధరకు హామీ ఉండదు.

'రైతుల ధరల హామీ సేవల ఒప్పందం చట్టం' ప్రకారం రైతులు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, సేవలకు సంబంధించి వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ కంపెనీలతో ముందస్తు ఒప్పందం చేసుకోవచ్చు. కానీ, ఇక్కడ సమస్యల్లా దేశ వ్యవసాయ రంగంలో 85శాతానికి పైగా చిన్న సన్నకారు రైతులే. సహజంగా వీరికి పెద్ద వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ కంపెనీలతో సరిగ్గా బేరమాడి, ఒప్పందం అమలుపై చట్టపరంగా పోరాడే శక్తి సామర్థ్యాలు ఉండవు. కాబట్టి, కంపెనీ ఒప్పందాల్లో వీరు ఎక్కువశాతం నష్టపోయే ప్రమాదం ఉంటుంది. స్వేచ్ఛా మార్కెట్‌ సూత్రాల్లో పోటీ అనేది సమానమైన ఇరువురి మధ్య లేదా రెండు వ్యవస్థల మధ్య మాత్రమే జరిగితే అది ఆర్థిక వ్యవస్థకు మేలుచేస్తుంది. అలా కానప్పుడు అది బలవంతులకే మేలు చేస్తుంది. కాబట్టి బలహీనులకు ప్రభుత్వ రక్షణ అవసరమవుతుంది. 'నిత్యావసర సరకుల (సవరణ) చట్టం' ప్రకారం చిరు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉల్లిపాయలు, బంగళాదుంపల నిల్వలపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తారు. ఇక్కడ ధరల పెరుగుదలను లెక్కించే పద్ధతిపై స్పష్టత లేదు. దీన్ని ప్రైవేటు వ్యాపారులు, కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులు అవకాశంగా తీసుకొని అధికంగా నిల్వ చేసి మార్కెట్‌ను ప్రభావితం చేసి లబ్ధి పొందగలుగుతారు.

కార్పొరేట్‌ కంపెనీలకు స్వేచ్ఛ

మూడు చట్టాలను నిశితంగా పరిశీలిస్తే, కేంద్ర ప్రభుత్వ ఆంతర్యం అవగతమవుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పరిధిలోని మార్కెట్‌ కమిటీలను బలహీనపరచి, రైతులు వ్యాపారులతో ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకునే పరిస్థితి కల్పిస్తోంది. సరకు ఎక్కడినుంచైనా కొనుగోలు చేసుకొనేలా, ఎంతైనా నిల్వ చేసుకొనేలా కార్పొరేట్‌ కంపెనీలకు స్వేచ్ఛ లభించనుంది. ప్రస్తుతం వ్యవసాయ వ్యాపారం, ఆహార శుద్ధి రంగాలు లాభసాటిగా ఉన్న కారణంగా, కార్పొరేట్‌ కంపెనీలు దీన్ని మంచి అవకాశంగా భావిస్తున్నాయి. మరోవైపు ఈ సంస్కరణల పేరుతో, కేంద్ర ప్రభుత్వం రైతులకిచ్చే పంటల కనీస మద్దతు ధర ఎత్తివేసి, కొనుగోళ్లను తగ్గించే అవకాశం ఉందనేది కాదనలేని అంశం. కేంద్రం చేసిన ఈ చట్టాల అమలు ప్రధానంగా రాష్ట్రాలపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, కేంద్రప్రభుత్వం ఈ చట్టాల విషయంలో రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వాలు, రైతుల సంశయాలను, భయాలను తీర్చాలి. రైతులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టి, స్పష్టమైన భరోసా కల్పిస్తూ చట్ట సవరణలు చేపట్టాలి.

అందరి అభిప్రాయాలూ స్వీకరిస్తేనే...

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం బేషరతుగా చర్చలు జరపాలి. వ్యవసాయ ఉత్పత్తులకు స్వామినాథన్‌ కమిషన్‌ సిపార్సుల ప్రకారం 'కనీస మద్దతు ధర' (మొత్తం ఉత్పత్తి వ్యయం మీద 50శాతం) విధానం పూర్తిగా అమలు చెయ్యాలి. మద్దతు ధర ప్రకారం పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తూ వీటికి చట్టబద్ధత కల్పించాలి. చిన్న రైతులతో 'రైతు ఉత్పత్తి సంఘాలు' ఏర్పరచి, ఒప్పందాలు కుదుర్చుకోవాలి. పంటల ఒప్పంద ధర- ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరకు తగ్గకుండా ఉండాలి. ఈ ఒప్పందాల్లో ప్రభుత్వం కూడా మూడో పార్టీగా ఉంటూ- అవి సరిగ్గా అమలయ్యేలా చూడాలి. వ్యవసాయరంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 'జాతీయ వ్యవసాయ మండలి' ఏర్పాటు చెయ్యాలి. ప్రైవేటు వ్యాపారులు, కార్పొరేట్‌ కంపెనీలు వ్యవసాయ మార్కెటింగ్‌, నిల్వల్లో కుమ్మక్కై మార్కెట్‌ను ప్రభావితం చెయ్యకుండా నివారించడానికి స్వతంత్రంగా వ్యవహరించే 'వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ - నిల్వల పర్యవేక్షణ - నియంత్రణ వ్యవస్థ' ఉండాలి. వ్యాపారులు, కంపెనీలు చేసే వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలు పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వం వాటి నిల్వలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలి. 'బఫర్‌ స్టాక్‌' నియమాల ప్రకారం ఆహార నిల్వలు ఉండాలి. నిత్యావసర సరకుల ధరల పెరుగుదలను లెక్కకట్టే పద్ధతిలో స్పష్టత, పారదర్శకత అవసరం. అప్పుడే దేశంలో వ్యవసాయ మార్కెటింగ్‌ సౌకర్యాలు మెరుగుపడి, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లభించి, వ్యవసాయం లాభసాటిగా మారుతుంది!

- డాక్టర్‌ చీరాల శంకర్‌ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.