ETV Bharat / opinion

భారత్‌-చైనా సమస్యకేదీ పరిష్కారం?

author img

By

Published : Aug 11, 2021, 9:02 AM IST

india china border dispute
భారత్​ చైనా వివాదం

ఆసియాలో రెండు అతిపెద్ద దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యకు ముగింపు పలికే విధంగా ఇప్పటివరకు సీనియర్‌ కమాండర్‌ స్థాయిలో 12 దఫాల చర్చలు సాగాయి. ఆవేశం, ఆగ్రహం, అసహనం, సానుభూతి, విశ్వాసం వంటి భావోద్వేగాల నడుమ ఇవి జరిగాయి. అయినప్పటికీ తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వివాద శాశ్వత పరిష్కారానికి ఈ చర్చలు ఉపయోగపడలేదు. సమస్యను పరిష్కరించలేని నిస్సహాయ స్థితిలో సైనిక వర్గాలు ఉన్నట్టు పరిస్థితులను గమనిస్తే స్పష్టమవుతుంది.

సరిహద్దులో నెలకొన్న సైనిక ప్రతిష్టంభనపై జులై 31న భారత్‌-చైనా నిర్వహించిన 12వ దఫా చర్చల్లో నిర్మాణాత్మక పురోగతి సాధించినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. అయితే ఇప్పటివరకు జరిగిన చర్చల్లో పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించలేదు. అత్యున్నత రాజకీయ స్థాయిలో చర్చలు జరిగితేనే తూర్పు లద్దాఖ్‌లో దశాబ్దాలుగా నెలకొన్న అలజడులకు ముగింపు లభిస్తుందన్నది సుస్పష్టం. ఆసియాలో రెండు అతిపెద్ద దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యకు ముగింపు పలికే విధంగా ఇప్పటివరకు సీనియర్‌ కమాండర్‌ స్థాయిలో 12 దఫాల చర్చలు సాగాయి. ఆవేశం, ఆగ్రహం, అసహనం, సానుభూతి, విశ్వాసం వంటి భావోద్వేగాల నడుమ ఇవి జరిగాయి. అయినప్పటికీ తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వివాద శాశ్వత పరిష్కారానికి ఈ చర్చలు ఉపయోగపడలేదు. సమస్యను పరిష్కరించలేని నిస్సహాయ స్థితిలో సైనిక వర్గాలు ఉన్నట్టు పరిస్థితులను గమనిస్తే స్పష్టమవుతుంది.

సరిహద్దు సమస్యపై అంగీకారం అవసరం..

లెహ్‌లోని 14 కోర్‌ కమాండర్‌, పీఎల్‌ఏ దక్షిణ షిన్‌జియాంగ్‌ మిలిటరీ జిల్లా కమాండర్‌, సీనియర్‌ దౌత్యవేత్తలు, డబ్ల్యూఎమ్‌సీసీ(వర్కింగ్‌ మెకానిజమ్‌ ఫర్‌ కన్సల్టేషన్‌ అండ్‌ కోఆర్డినేషన్‌) సమక్షంలో సమావేశాలు నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోవడం గమనార్హం. చర్చల్లో భారత్‌ ఏ విధంగా ముందుకు సాగాలనే అంశాన్ని జాతీయ భద్రతా సలహాదారు అధ్యక్షత వహించే సీఎస్‌జీ(చైనా స్టడీ గ్రూప్‌) నిర్ణయిస్తుంది. ఇందులో కేబినెట్‌, హోం, విదేశీ, రక్షణ కార్యదర్శులు, ఉపసైన్యాధితులు, నావికాదళ, వాయుసేన, నిఘా విభాగం, రా అధిపతులు సభ్యులుగా ఉన్నారు. ఈ భేటీల్లో అజెండాను నిర్ణయించిన తరవాతే సైన్యం క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి చర్చలు జరుపుతుంది. సరిహద్దు రేఖపై అవగాహన లేమితో ఏర్పడిన విభేదాలను పరిష్కరించేందుకు ప్రస్తుత కమాండర్‌ స్థాయి చర్చలు తోడ్పడుతున్నాయి. సరిహద్దుపై ఒక అంగీకారానికి వస్తేనే ఉద్రిక్తతలు తగ్గించేందుకు, సరిహద్దులో భద్రతా బలగాల ఉపసంహరణకు సైన్యం స్థాయిలో తలపెట్టిన సమావేశాలు దోహదం చేస్తాయి.

దానికోసం చైనా పట్టు...

1959లో నాటి డ్రాగన్‌ దేశ ప్రధాని చౌ ఎల్‌లై భారత్‌- చైనా మధ్య ఓ సరిహద్దును ప్రతిపాదించారు. భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దాన్ని తిరస్కరించారు. ఆనాడు చేసిన ప్రతిపాదననే సరిహద్దుగా గుర్తించాలని చైనా ఇప్పటికీ పట్టుబడుతోంది. సరిహద్దుపై ఏకాభిప్రాయం లేకపోతే, చర్చల్లో పురోగతి లభించదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల సరిహద్దు వివాదానికి తెరదించాలంటే భారత్‌-చైనా రాజకీయ నాయకత్వాలు రంగంలోకి దిగాల్సిందేనని ఈ 12 దఫాల చర్చలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అధ్యక్షతన ఇరు దేశాల్లో బలమైన ప్రభుత్వాలు ఉన్నాయి. సరిహద్దు సమస్య పరిష్కారానికి ఇది ఓ సానుకూలాంశం. అగ్రనేతలు రంగంలోకి దిగకపోతే, ఈ సమస్యకు పరిష్కారం దక్కడం మరింత కష్టమవుతుంది. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌పై 2020 మేలో చైనా సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. నిరుడు జూన్‌ 15న గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో 20మంది భారత జవాన్లు వీర మరణం పొందారు. చైనా వైపు సైతం మృతుల సంఖ్య భారీగా ఉందని అంచనా. ఈ పరిణామాలతో భారత్‌-చైనాలు యుద్ధం అంచు వరకు వెళ్ళాయి. సరిహద్దు వెంబడి ఇరు దేశాలు బలగాలను పెద్దయెత్తున మోహరించాయి. ఈ తరుణంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు రెండువైపులా అధికారులు రంగంలోకి దిగారు.

ఒకే విధమైన ప్రకటనలు.. కానీ..

ఈ ఏడాది జూన్‌ 25న డబ్ల్యూఎమ్‌సీసీ సమావేశం అనంతరం జులై 14న భారత్‌-చైనా విదేశాంగ మంత్రులు దుషంబే వేదికగా చర్చలు జరిపారు. ఆ తరవాత జులై 31న వాస్తవాధీన రేఖకు సమీపంలోని చుషుల్‌లో తాజా భేటీ జరిగింది. ఆ తరవాత రెండు రోజులకు ఇరు వర్గాలు ఒకే విధంగా ప్రకటనలు చేశాయి. సమావేశం నిర్మాణాత్మకంగా, పరస్పర అవగాహనలు పెంపొందించుకునే దిశగా సాగిందని పేర్కొన్నాయి. ప్రస్తుతమున్న ఒప్పందాలకు కట్టుబడి, చర్చలు సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్టు స్పష్టం చేశాయి. ఈ ప్రకటన వెలువడిన తరవాత గోగ్రా హైట్స్‌ ప్రాంతం నుంచి భారత్‌-చైనాలు తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి. అయితే ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న హాట్‌స్ప్రింగ్స్‌ ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణపై భారత్‌, చైనాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. అందువల్ల ఇరు దేశాల అగ్రనేతలు రంగంలోకి దిగితేనే సరిహద్దు ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

- సంజీవ్‌ కె. బారువా

ఇదీ చూడండి: భారత్‌పై పోరుకు చైనా పన్నాగం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.