ETV Bharat / opinion

జీవించే హక్కుకు దిక్కులేదిక్కడ!

author img

By

Published : Apr 4, 2021, 9:03 AM IST

ఆకాశంలో సూర్యుడు చండప్రచండంగా నిప్పులు చిమ్ముతున్న వేళ... జనారణ్యంలో ఓ మురుగు కాలువ పక్కన పురిటినొప్పులు పడుతున్న నిండు గర్భిణి... సుమారు రెండు గంటల ప్రసవ యాతన అనంతరం మగశిశువును కని ఆ అభాగ్యురాలు స్పృహ తప్పింది... అక్కడికి దగ్గరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నా- ఆ దీనురాలికి సాయమందలేదు. కడకు ఆ బిడ్డా దక్కలేదు!

human interest
editorial, eenadu

జీవించే హక్కుకు దిక్కులేదిక్కడ!
జీవించే హక్కుకు దిక్కులేదిక్కడ!

ఇదేదో అవార్డ్‌ సినిమాలో ప్రేక్షకుల గుండెల్ని మెలిపెట్టే దయనీయ నాటకీయ దృశ్యం కానేకాదు. భాగ్యనగర శివార్లలోని షామీర్‌పేట మండలం, మేడ్చల్‌ ప్రాంతంలో మొన్నీమధ్యే చోటుచేసుకున్న దిగ్భ్రాంతికర ఉదంతమిది. ఇది ఒకటి రెండు రాష్ట్రాలకో ఏ కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకో, సర్కారీ దవాఖానాలకో పరిమితమైన దౌర్భాగ్యం అంతకన్నా కాదు. ఇలా వెలుగు చూసి విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చేవి కొన్నే. అనామకుల పుట్టుకలకు దస్త్రాల్లో నమోదూ వృథాయే అన్నట్లుగా చీకట్లోనే మలిగిపోయేవి మరెన్నో! భారత రాజ్యాంగం పౌరులందరికీ జీవించే హక్కును ప్రసాదించింది. ఊపిరి పోసి, స్వస్థత చేకూర్చి, ఎలాగైనా బతికించాల్సిన ఆస్పత్రుల ప్రాంగణాల్లోనే అది అక్షరాలా దిక్కూ మొక్కూ లేనిదై కొల్లబోతోంది. సిబ్బంది లేరని, ఔషధాలకు పరికరాలకు నిత్యక్షామమని గుమ్మంలోంచే వెనక్కి పంపించేసేవారు కొంతమంది. కాళ్లా వేళ్లా పడి గత్యంతరం లేదంటూ బతిమాలినవాళ్లను దయతలచి చేర్చుకుని- దిగువ స్థాయి సిబ్బందే చికిత్స పేరిట తోచిన ప్రయోగాలేవో చేసే వైపరీత్యాలు లెక్కకు మిక్కిలి. అత్యవసర వైద్యానికి నోచక గుడ్ల నీరు కుక్కుకుంటూ వెనుతిరిగేవాళ్లను దురదృష్టవంతులంటే- మిడిమిడి జ్ఞానంతో తెలిసీ తెలియకుండా చేసే చికిత్స బారిన పడేవాళ్లను ఇంకేమనాలి? ఆమధ్య మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్ర దవాఖానాలో భార్యను ప్రసవానికి చేర్చిన భర్త- అక్కడి సిబ్బందికి లంచాలు మేపలేక రైలు కింద పడి, సమస్త బాదరబందీ నుంచీ నేరుగా తక్షణ విముక్తి కోరుకున్నాడు. బతికించాల్సిన బాధ్యతను తుంగలో తొక్కడంలో ఆ తరహా ‘అంకితభావ ప్రదర్శన’కు పోటీపడుతున్న చికిత్సా కేంద్రాలు దేశంలో దండిగానే ఉన్నాయి!

స్వస్థ సేవల లభ్యత, నాణ్యతల పరంగా 195 దేశాల జాబితాలో భారతావనిది 145వ స్థానం. లక్షన్నరకు పైగా ఉపకేంద్రాలు, సుమారు పాతిక వేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏడు వందలకు పైబడిన జిల్లా స్థాయి చికిత్సాలయాలు... ఇవన్నీ చూపులకే ఏపు. సరికొత్తగా 70 వేల ఆయుష్మాన్‌ భారత్‌- ఆరోగ్య స్వస్థ కేంద్రాల సేవలు అందుబాటులోకి వచ్చినట్లు కేంద్రం ఇటీవలే ఘనంగా ప్రకటించింది. ఎన్ని ఉంటేనేం- ప్రసవం కోసం వచ్చినవారికి గోలీలిచ్చి పంపేసి ఆపై బిడ్డ ప్రాణాలు కడతేరిపోవడానికి కారణమయ్యే అలసత్వం, నిర్లక్ష్యం, అశక్తత ఇబ్బడి ముబ్బడిగా పోగుపడినప్పుడు... వాటి ప్రయోజకత్వం ఏపాటి? కొన్నాళ్లక్రితం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఎలుకలు పదిరోజుల పసికందును కొరికి పొట్టన పెట్టుకున్న బాగోతం ఎందరినో కలచివేసింది. ఆ తరవాతా చాలా చోట్ల ‘పారిశుద్ధ్య లోపాలు’ నిక్షేపంగా కొనసాగుతుండటం దేనికి సంకేతం? అంచెలవారీగా అనేకానేక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో పరికరాలకు, మందులకు కొరత అంతులేని కథగా కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలతోపాటు తక్కిన చోట్లా ప్రజారోగ్య సంరక్షణ బాధ్యతకది తూట్లు పొడుస్తూనే ఉంది. ఈ అవ్యవస్థ మూలాన ఎందరు తల్లులు గర్భశోకానికి గురయ్యారో నికరంగా లెక్కలు ఎక్కడా లేవు.

ఏ రోగికైనా సురక్షిత నీరు, ఆహారం, పారిశుద్ధ్యం, ఇన్‌ఫెక్షన్ల నిరోధం తదితరాలతో కూడిన భద్రమైన చికిత్సను కోరుకునే హక్కుందంటూ గతంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ(జాతీయ మానవ హక్కుల సంఘం) స్పష్టీకరించింది. రోగిని ఛీత్కరించుకున్నా, చికిత్సలో దుర్విచక్షణ కనబరచినా హక్కులకు భంగం వాటిల్లినట్లుగానే పరిగణించాలని అప్పట్లో అది ప్రతిపాదించింది. దేశంలోని ఎన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆ స్ఫూర్తికి మన్నన దక్కుతోంది?

కొవిడ్‌ కోర సాచిన దరిమిలా దక్షిణాసియా వ్యాప్తంగా గత సంవత్సరం తల్లీబిడ్డల మరణాలు ఇండియాలోనే అత్యధికంగా నమోదై ఉంటాయని ఐక్యరాజ్య సమితి నివేదిక మొన్నీమధ్య విశ్లేషించింది. దేశంలో ఆరోగ్య సేవలపై కరోనా వైరస్‌ ప్రభావ తీవ్రత అందుకు దారితీసి ఉంటుందనీ అది ఊహించింది. భారత్‌, చైనా, నేపాల్‌, అమెరికా, బ్రెజిల్‌ సహా 17 దేశాలకు చెందిన 40 అధ్యయనాలను క్రోడీకరించి ‘లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌’ పత్రిక తాజాగా మరింత విస్పష్ట చిత్రాన్ని ఆవిష్కరించింది. కొవిడ్‌ సంక్షోభానికి తగ్గట్లు ఆరోగ్య వ్యవస్థను చక్కదిద్దుకోవడంలో దేశాల వైఫల్యం వల్ల- మృత శిశువులు పుట్టే ముప్పు 28శాతం పెరిగిందని, తల్లులకు ప్రాణగండం మూడోవంతు మేర అధికమైందని లాన్సెట్‌ చెబుతోంది. మాతాశిశువుల పట్ల నిరాదరణ ఇంతలంతలైందన్న విశ్లేషణ, ఇండియా విషయంలో నూటికి నూరుపాళ్లు నికార్సయిన యథార్థమే.

నిజానికి దేశ ఆరోగ్య రంగాన్నిప్పుడు బహుముఖ సమస్యలు ఉమ్మడిగా దిగలాగుతున్నాయి. 18శాతం దాకా ఉపకేంద్రాలకు, 22శాతం మేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, 30శాతం వరకు సామాజిక ఆరోగ్య కేంద్రాలకు దేశంలో కొరత నెలకొన్నట్లు గతంలో అంచనాలు వెలువడ్డాయి. ఇప్పటికే ఏర్పాటైనవీ సక్రమంగా సేవలందించగల స్థితిలో లేవు. 60శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒకే డాక్టరుతో నెట్టుకొస్తున్నట్లు చెబుతున్నా- విధులు నిర్వర్తించడానికి వారెప్పుడు వచ్చేదీ పోయేదీ ఎవరికీ అంతు చిక్కని రహస్యం! ప్రజారోగ్య రక్షణకు నియోగితులైన డాక్టర్లు, నర్సులు, మంత్రసానులు, పారామెడికల్‌ సిబ్బంది... అందరిలో సరైన అర్హతలు లేనివారు ఎకాయెకి 54శాతమంటే- వారందించే మాయదారి వైద్యం... జనం ప్రాణాలతో చెలగాటం కాదా? ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, యూపీ, బిహార్‌ వంటివి అరకొర చికిత్సా వసతులకు మారుపేరుగా పదిహేనో ఆర్థిక సంఘం నివేదిక అభివర్ణించింది. పునాది స్థాయి ఆరోగ్య సేవలు, ఉచితంగా మందుల సరఫరాలకు పేరెన్నిక గన్న కేరళ, తమిళనాడు వంటి అరుదైన ఉదాహరణలు మినహా- తరతమ భేదాలతో స్వస్థ అవ్యవస్థకు చిరునామాలుగా అప్రతిష్ఠ పాలవుతున్న రాష్ట్రాలదే నేడు దేశంలో బలాధిక్యం. కనీస వసతులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని పరిపుష్టీకరించి, సంప్రదాయ వైద్య పద్ధతుల్నీ విరివిగా ప్రోత్సహిస్తేనే- అనాథ శిశువుగా గుక్కపట్టి రోదించే దురవస్థ స్వస్థ సంరక్షణకు తప్పుతుంది. వైద్య సేవలకు అటువంటి మౌలిక చికిత్సతోనే- ‘జీవించే హక్కు’ కాస్తోకూస్తో నిలదొక్కుకుంటుంది!

- బాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.