ETV Bharat / opinion

ఉమ్మడి కృషితోనే ఎత్తిపోతలు సఫలీకృతం

author img

By

Published : Jan 11, 2021, 8:40 AM IST

Success can only be achieved if there is coordination between farmers and governments in the management of lift schemes
ఉమ్మడి కృషితోనే ఎత్తిపోతలు సఫలీకృతం

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎత్తిపోతల పథకాల హవా నడుస్తోంది. గతంలో చేపట్టిన ప్రాజెక్టులు పరిమిత ఆయకట్టుకు కూడా నీరందించలేకపోయాయి. ఇందుకు లెక్కకు మించి కారణాలు ఉన్నా.. ప్రధానంగా నిర్వహణ అనేది సమస్యగా మారింది. ఇది గమనించిన ఇరు రాష్ట్రాల సర్కార్లు సంస్కరణల బాటపట్టాయి. అటు ఆంధ్రప్రదేశ్​లో ఎత్తిపోతల నిర్వహణలో లబ్ధిదారుల కమిటీల ప్రమేయం ఉండదని ప్రకటిస్తే.. తెలంగాణాలో ప్రతీ పథకాన్ని అధికారులే పర్యవేక్షిస్తారు అని ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. లిప్టుల ఫలితాలు వందశాతం లబ్ధిదారులకు అందాలంటే ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోగానే సరిపోదు. సాంకేతిక సౌకర్యాలు, ఆయకట్టు రైతుల సామాజిక చైతన్యం అవసరం అనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో నిర్వహణ బాధ్యతలు ఎవరికి అప్పగించినా.. అన్నదాతలతో సమన్వయం ఉంటేనే ఆయకట్టులో ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణలు భావిస్తున్నారు.

గతంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలు రైతులకు తలకు మించిన భారంగా మారాయి. పరిమిత ఆయకట్టుకూ నీరందించలేక వందల పథకాలు చతికిలపడ్డాయి. ఈ పరిస్థితిని గ్రహించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సంస్కరణలకు పూనుకొన్నాయి. ఇకపై ఎత్తిపోతల నిర్వహణలో లబ్ధిదారుల కమిటీల ప్రమేయం ఉండదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి పథకాన్ని అధికారులే పర్యవేక్షిస్తారని తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు ఇస్తోంది. ఈ ప్రయత్నం ఆహ్వానించదగ్గదే అయినా మొత్తం అధికారుల మీదే భారం వేస్తే క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1974లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఐడీసీ) చొరవతో ఎత్తిపోతలకు పునాదులు పడ్డాయి. అప్పట్లో 25శాతం ప్రభుత్వం నిధులు ఇస్తే, మిగతా జాతీయ బ్యాంకులు, రైతులు, మిల్లర్లు, చక్కెర కర్మాగారాలు సాయం చేశాయి. అలా చేపట్టిన ప్రాజెక్టులను కొన్నేళ్లు ప్రభుత్వమే నిర్వహించింది. తరవాత క్రమంగా రైతులకు అప్పగించింది. 1995 తరవాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని లిఫ్టులను పూర్తిగా రైతులకే వదిలేసింది. ఆంధ్రప్రదేశ్‌లో చిన్నా, పెద్ద ప్రాజెక్టులతో మొత్తం 76లక్షల ఎకరాలు సాగవుతుండగా, తెలంగాణలో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుతో 37లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చే ప్రయత్నం జరుగుతోంది.

నిర్వహణే పెద్ద క్రతువు

భారీ ఆనకట్టలతో పోల్చితే ఎత్తిపోతల పథకాల ఏర్పాటుసులువు. ఏడాది పొడవునా నీటి లభ్యత ఉంటే చాలు. భూ సేకరణ, పెద్దయెత్తున నిర్మాణాలు అవసరం లేదు. సేకరించిన నీటిని తక్కువ సరఫరా నష్టాలతో ఎగువ ప్రాంతాలకు గొట్టాల ద్వారా పంపిణీ చేయవచ్చు సమస్యల్లా నిర్వహణ ఒక్కటే. విద్యుత్తు రుసుములు భారీగా వెచ్చించాల్సి ఉంటుంది. మరమ్మతులు, ఉద్యోగుల జీతాలు, ఏటా మోటార్ల క్షీణత వంటి నిర్వహణ వ్యయం ఎక్కువగానే ఉంటుంది. ఉత్తమ నీటి యాజమాన్యం, వాణిజ్య పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచితే ఈ ఖర్చు అంతగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమూ ఉండదు.

ఎత్తిపోతలు అంటే- గొట్టంమార్గం వ్యవస్థ, మోటార్లు, కండెన్సర్లు, ఫ్యూజులు, ఇన్‌టేక్‌ వెల్‌లు, సర్జిపూల్‌లు దాటి డిస్ట్రిబ్యూటరీలకు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ లోపం వచ్చినా పంట ఎండుతుంది. ఒక ఎత్తిపోతల ఏర్పాటు నుంచి మూడేళ్ల వరకు ఎలాంటి మరమ్మతు రాకుండా సేవలందిస్తుందనేది ఓ అంచనా. ఆ తరవాత సమస్యలు రావడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులూ అంతగా దృష్టి సారించడం లేదు. ఒక మేజర్‌ కాల్వపై ఏర్పాటు చేసే చిన్న ఎత్తిపోతల (రెండు వేల నుంచి అయిదు వేల ఎకరాల ఆయకట్టు ఉన్నవి) పథకం నిర్వహించాలన్నా కనీసం పది మంది సిబ్బంది అవసరం. చాలా పథకాలకు సరైన సిబ్బంది లేకపోవడమూ సమస్యగా మారింది. ఇవేకాక.. నీటి వినియోగానికి పోటీ ఎక్కువ కావడం కారణంగా ఆయా పథకాల పరిధిలోని చివరి భూములు తడవక గొడవలు జరుగుతున్నాయి. పేలవమైన సాంకేతిక పరిజ్ఞానం, కాలం చెల్లిన నీటి పారుదల వ్యవస్థ, నీటి పంపిణీ వ్యవస్థ ఆధునికతను అందిపుచ్చుకోకపోవడం, విద్యుత్తు, వ్యవసాయం, నీటిపారుదల రంగాల మధ్య సమన్వయ లోపం ఇవన్నీ క్రమంగా ప్రాజెక్టు ఆయకట్టుపై ప్రభావం చూపుతున్నాయి

పాతవాటి పునరుద్ధరణ కష్టమే

ఎత్తిపోతల నిర్వహణను ప్రభుత్వమే తన అధీనంలోకి తీసుకున్నా పాత వాటి నిర్వహణ అధికారులకు సవాలుగా మారే అవకాశం ఉంది. దశాబ్దాల కిందట నాగార్జునసాగర్‌ ఎడమ, కుడి కాల్వలపై ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలకు వాడిన పరికరాలు ఇప్పుడు మార్కెట్‌లో దొరకడం లేదు. కొత్త సాంకేతికత, కొలతలతో వచ్చిన ఉపకరణాలు వాటికి అమరడం లేదు. వీటి నిర్వహణ బాధ్యతలు తలకెత్తుకున్న రైతులు సరైన పరికరాలు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతుల నుంచి పరికరాల కొనుగోలుకు డబ్బు జమకాక సొంత ఖర్చులతో పనులు చేయించిన నీటి వినియోగ కమిటీ (డబ్ల్యూయూసీ)ల రైతులు అప్పులపాలయ్యారు.

లిప్టుల ఫలితాలు వందశాతం అందాలంటే ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోగానే సరిపోదు. సాంకేతిక సౌకర్యాలు, ఆయకట్టు రైతుల సామాజిక చైతన్యం అవసరం. అధికారులుగానీ, రైతులుగానీ ఒక్కరిపైనే నిర్వహణ భారం వేయకుండా సమన్వయంతో కృషి చేస్తేనే ఫలితం ఉంటుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకున్నా ముందుగా రైతు కమిటీల సంఘం నుంచి ఖర్చుపెట్టి తరవాత తీసుకునే అవకాశం ఉంది. ఎత్తిపోతల లబ్ధిదారుల కమిటీలను సక్రమంగా వినియోగిస్తే నీటి వృథా ఉండదు. కాల్వలకు తరచూ గండ్లు పడే అవకాశమూ ఉండదు. పంట ప్రణాళికను కమిటీలతో చర్చించి సులువుగా క్షేత్రస్థాయిలో రైతులకు తెలియజేయవచ్చు. మేజర్లు, మైనర్లు, డిస్ట్రిబ్యూటరీలపై ఎలాంటి పనులైనా రైతుల పర్యవేక్షణ ఉంటుంది. ఎత్తిపోతలన్నింటినీ గుత్తేదారులకు అప్పగించినా లేదా గుజరాత్‌, రాజస్థాన్‌లో నడుస్తున్నట్లు ఎన్జీఓలకు నిర్వహణ బాధ్యతలు ఇచ్చినా అన్నదాత సమన్వయం ఉంటేనే ఆయకట్టులో ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

- బండపల్లి స్టాలిన్‌

ఇదీ చూడండి: నిమిషానికి 25-30 మంది నగరాలకు వలస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.