ETV Bharat / opinion

నియంతృత్వంలోకి శ్రీలంక.. 'రాజపక్స' దూకుడు!

author img

By

Published : Sep 24, 2020, 7:16 AM IST

దశాబ్దాల క్రితం శ్రీలంకలో అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు నియంతృత్వం వైపు నడిపించాయి. ఆ చీకటి రోజులను మళ్లీ తీసుకురావడానికి ప్రస్తుత పాలకులు రాజపక్స సోదరులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అధ్యక్షుడి అధికారాలకు కత్తెరవేసిన 2015నాటి 19వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటు కాకుండా చూడటానికి వీరు తాజాగా 20వ సవరణను ప్రతిపాదించారు.

rajapaksa
రాజపక్స

"ఈ పదవిలో ఉండగా నేను చేయలేనిదంటూ ఏదైనా ఉందంటే అది పురుషుణ్ని స్త్రీగా, స్త్రీని పురుషుడిగా మార్చడం మాత్రమే"నన్నారు శ్రీలంక మాజీ అధ్యక్షుడు జె.ఆర్‌.జయవర్దనే. నాలుగు దశాబ్దాల క్రితం ఆయన అమలులోకి తెచ్చిన రాజ్యాంగం- దేశాధ్యక్షుడికి అపరిమిత అధికారాలు కట్టబెట్టింది. శ్రీలంకను ‘రాజ్యాంగబద్ధమైన’ నియంతృత్వం వైపు నడిపించింది. ఆ చీకటి రోజులను తిరిగి తేవడానికి ప్రస్తుత పాలకులు రాజపక్స సోదరులు గట్టి ప్రయత్నం చేస్తున్నారు.

అధ్యక్షుడి అధికారాలకు కత్తెరవేసిన 2015నాటి 19వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటు కాకుండా చూడటానికి వీరు తాజాగా 20వ సవరణను ప్రతిపాదించారు. సెప్టెంబరు రెండున సవరణ ముసాయిదాను గెజెట్లో ప్రకటించారు. పార్లమెంటులో తమకున్న సంఖ్యాబలంతో వచ్చే నెలలో దీనికి ఆమోదముద్ర వేయించుకోవడానికి వేగంగా పావులు కదుపుతున్నారు.

పార్లమెంటు అధికారాలకు కోత

దేశ పాలనలో పార్లమెంటు, ప్రధానమంత్రి పాత్రలను నామమాత్రం చేస్తూ 1978లో కార్యనిర్వాహక అధ్యక్ష వ్యవస్థకు రూపకల్పన చేశారు జె.ఆర్‌.జయవర్దనే! న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను పూర్తిగా అధ్యక్షుడి కనుసన్నల్లోకి తెచ్చే కొత్త రాజ్యాంగానికి ఊపిరిపోశారు. దాని ఆధారంగా జయవర్దనే చలాయించిన అధికారం- శ్రీలంకలో జాతుల మధ్య విద్వేషాన్ని పెంచింది. మూడు దశాబ్దాల పాటు సాగిన అంతర్యుద్ధానికి అదే మూల కారణం.

ఈ క్రమంలో దేశ ప్రజల్లో ఈ రాజ్యాంగ నిబంధన పట్ల వ్యతిరేకత ప్రబలింది. దాంతో 2001లో అప్పటి అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగ 17వ రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని సంస్కరణలు తెచ్చారు. అధ్యక్షుడి అధికారాలకు కోతపెట్టిన ఈ సవరణ స్ఫూర్తిని కాలరాస్తూ 2010లో రెండోసారి అధ్యక్షుడైన వెంటనే మహింద రాజపక్స, రాజ్యాంగానికి 18వ సవరణ చేశారు. పూర్తి అధికారాలను అధ్యక్షుడికి అప్పగించడం సహా, ఎవరూ రెండు పర్యాయాలకు మించి అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడకూడదన్న నిబంధననూ తొలగించారు. పదేళ్ల పాటు దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన మహింద, 2015లో తాను మూడోసారి అధ్యక్షుడు కావడానికే ఇలా చేశారు.

మళ్లీ సవరణలే..

కానీ, అనూహ్యంగా 2015 ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మైత్రిపాల సిరిసేన, 18వ సవరణ కోరలు తీసేస్తూ రాజ్యాంగానికి 19వ సవరణ చేశారు. దాదాపుగా అధ్యక్షుడి అధికారాలన్నింటినీ పార్లమెంటుకు బదలాయించారు. ఈ సవరణ ప్రకారం రెండుసార్లకు మించి ఏ వ్యక్తీ అధ్యక్షుడు కావడానికి వీల్లేదు. ద్వంద్వ పౌరసౌత్వం కలిగిన వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. జాతీయ పోలీసు, పబ్లిక్‌ సర్వీసు, న్యాయసేవలు, మానహక్కులు, ఎన్నికల కమిషన్ల స్వతంత్రతకూ ఈ సవరణ పూచీ ఇచ్చింది.

ప్రస్తుత అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద తెస్తున్న 20వ రాజ్యాంగ సవరణతో అధికారాలు పార్లమెంటు నుంచి మళ్ళీ అధ్యక్షుడి చేతుల్లోకి వెళ్ళిపోనున్నాయి. రెండుసార్లకు మించి అధ్యక్షుడు కావడానికి వీల్లేదనే 19వ సవరణలోని నిబంధనను మాత్రం కొనసాగిస్తూ మిగిలిన అన్ని విషయాల్లో 18వ సవరణలోని నిబంధనలనే ఇందులో పొందుపరచారు. స్వతంత్ర కమిషన్లలో సభ్యుల నియామకంలోనూ పార్లమెంటు పాత్రను నామమాత్రం చేశారు. తద్వారా దేశాన్ని పూర్తిగా ఏకవ్యక్తి అదుపాజ్ఞల్లోకి తెచ్చే ఈ సవరణపై దేశంలోని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

తమిళులకు మళ్ళీ సెగ

శ్రీలంక పాలనాధికారం తమ కుటుంబం చేతుల్లోంచి మరోసారి జారిపోకుండా ఉండటానికే 20వ రాజ్యాంగ సవరణకు రాజపక్స సోదరులు పూనుకొన్నారు. ప్రస్తుత రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కనపెట్టి తమకు అనుగుణమైన కొత్త దాన్ని తీసుకురావడానికీ ప్రయత్నాలు ప్రారంభించారు. కొత్త రాజ్యాంగ రచనకు ఇటీవలే నిపుణుల కమిటీని ఏర్పాటుచేశారు. 20వ రాజ్యాంగ సవరణ ద్వారా పూర్తి అధికారాలు తమ చేతుల్లోకే వస్తున్నా, వీళ్లెందుకు కొత్త రాజ్యాంగాన్ని కోరుకుంటున్నారు? 1987 ఇండో-శ్రీలంక ఒప్పందం ద్వారా ఉనికిలోకి వచ్చిన ప్రాంతీయ శాసనసభలను రద్దుచేయడం కోసమేననే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

అదే జరిగితే ముఖ్యంగా దేశ ఉత్తర ప్రాంతంలోని తమిళులకు తీరని అన్యాయమే జరుగుతుంది. పాలనలో వారి భాగస్వామ్యం కొరవడితే అంతర్యుద్ధానికి ముందునాటి సంక్షోభ పరిస్థితులు తిరిగి నెలకొనవచ్చు. కొత్త రాజ్యాంగం ద్వారా ప్రాంతీయ శాసనసభలను శ్రీలంక రద్దుచేస్తే, భారత్‌తో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందం నుంచి అది ఏకపక్షంగా తప్పుకొన్నట్టే అవుతుంది. ఇప్పటికే శ్రీలంక మంత్రులు ‘భారతీయులు తుపాకీ గురిపెట్టి ఈ సభలను మా నెత్తికి చుట్టా’రనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే, చైనాకు దగ్గరి మిత్రులైన రాజపక్స సోదరుల చేతుల్లోకి లంక పాలనావ్యవస్థ పూర్తిగా వెళ్లిపోతే భద్రతాపరంగానూ ఇండియాకు చిక్కులు ఎదురుకావచ్ఛు ప్రస్తుతానికి ఈ పరిణామాలను న్యూదిల్లీ నిశితంగా పరిశీలిస్తోంది కానీ, త్వరగా స్పందించాల్సిన సమయమైతే ఆసన్నమైంది!

(రచయిత - శైలేష్‌ నిమ్మగడ్డ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.