ETV Bharat / opinion

రూ.లక్ష కోట్లతో వ్యవసాయ నిధి: నాబార్డు ఛైర్మన్

author img

By

Published : Jun 22, 2020, 10:56 AM IST

రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నాబార్డు ఛైర్మన్​గా నియమితులైన తెలుగు వ్యక్తి చింతల గోవిందరాజులు. మొత్తం 2.50 కోట్ల మంది రైతులకు రూ.2 లక్షల కోట్లు రుణాలుగా ఇస్తున్నట్లు ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు . కిసాన్‌ క్రెడిట్‌ కార్డుపై ఇచ్చే రుణాల్లో రూ.3 లక్షల వరకు ఎలాంటి రుసుములు వసూలు చేయొద్దని బ్యాంకులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు చేపట్టిన చర్యలను వివరించారు.

rs 1 lakh crore package for farmers: NABARD Chairman
'రూ.లక్ష కోట్లతో వ్యవసాయ నిధి- పంటల ఆన్‌లైన్‌ అమ్మకాలకు పోర్టల్‌'

'రైతులకు వ్యవసాయం కోసం కిసాన్‌ క్రెడిట్‌ కార్డుపై ఇచ్చే రుణాల్లో రూ.3 లక్షల వరకు ఎలాంటి రుసుములు వసూలు చేయవద్దని సహకార, గ్రామీణ బ్యాంకులకు ఆదేశాలిచ్చాం. ఈ రుణాలను తక్కువ వడ్డీకే ఇవ్వాలని చెప్పాం. మొత్తం 2.50 కోట్ల మంది రైతులకు రూ.2 లక్షల కోట్లు రుణాలుగా ఇస్తున్నాం. రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. పాడి పరిశ్రమలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి రూ.15 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నిధులు బ్యాంకులకు మేమే ఇస్తాం' అని నాబార్డు ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు వెల్లడించారు. చాలాకాలం తరవాత నాబార్డు ఛైర్మన్‌గా నియమితులైన తెలుగు వ్యక్తి ఆయనే కావడం గమనార్హం. సుదీర్ఘకాలం నాబార్డులో అనేక హోదాల్లో పనిచేసిన ఆయనకు గ్రామీణ, వ్యవసాయ రంగాలపై అపార అనుభవం ఉంది. ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరవాత తొలిసారి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి మంగమూరి శ్రీనివాస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూ వివరాలివీ..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు రూ.30 వేల కోట్లతో ప్రత్యేకంగా నాబార్డులో ఏర్పాటు చేసిన నిధితో ఎలాంటి సహాయం అందించారు?

కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ ప్యాకేజీ కింద అదనంగా రూ.30 వేల కోట్లు కేటాయించింది. ఇందులో రూ.25 వేల కోట్లు రిజర్వు బ్యాంకు ఇటీవలే నాబార్డుకు విడుదల చేసింది. వీటిలో రూ.22,977 కోట్లు 23 రాష్ట్రాల సహకార బ్యాంకులకు, మరో 27 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు ఇచ్చాం. రూ.985 కోట్లు ‘సూక్ష్మ పరపతి సంస్థ(ఎంఎఫ్‌ఐ)’లకు ఇచ్చాం. ఈ నిధుల్ని ఆయా బ్యాంకులు రైతులకు రుణాలుగా ఇవ్వాల్సి ఉంటుంది.

వాణిజ్య బ్యాంకులు పంట రుణాలను సక్రమంగా ఇవ్వని ప్రస్తుత తరుణంలో సహకార బ్యాంకుల నుంచి రుణ పంపిణీ పెంచేందుకు కృషి జరుగుతోందా?

గత ఏడాది (2019-20)లో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి రూ.13.50 లక్షల కోట్ల రుణాల పంపిణీ లక్ష్యానికిగాను రూ.13.74 లక్షల కోట్లు ఇచ్చాం. ఇందులో సహకార బ్యాంకుల వాటా 11 శాతం. 2017-18లో సహకార బ్యాంకులు రూ.లక్షన్నర కోట్ల పంట రుణాలిస్తే 2019-20లో అంతకు రూ.వెయ్యి కోట్లు తక్కువగా ఇచ్చిన మాట వాస్తవమే. ఈ ఏడాది కొవిడ్‌ ప్యాకేజీ నుంచి సహకార బ్యాంకులకు అదనంగా నిధులు సమకూరుస్తున్నాం. పాడి రైతులకు కూడా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇస్తున్నాం. దీనివల్ల వ్యవసాయ రంగానికి మరిన్ని రుణాలు అందుబాటులోకి వచ్చి రైతులకు ఉపయోగపడతాయి.

బ్యాంకులు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదు. వారికోసం నాబార్డు ప్రత్యేకంగా ఏదైనా పథకం తెస్తుందా?

ఈ సమస్యను అధిగమించడానికి నాబార్డు ‘సంయుక్త భాగస్వామ్య సంఘం’(జేఎల్‌జీ) పేరుతో కౌలురైతులకు ఉమ్మడి పూచీకత్తుపై రుణాలిచ్చే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ సంఘాల ఏర్పాటుకు, రుణాలు పంపిణీ చేసే బ్యాంకులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలను నాబార్డు అందిస్తోంది. ఇందుకోసం పలు రాష్ట్రాల్లో బ్యాంకులతో 105 ఒప్పందాలను చేసుకుంది. ఈ రుణాల పంపిణీ సొమ్మంతా నాబార్డే సమకూరుస్తోంది.

నాబార్డు ఇటీవల వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల మాటేమిటి?

వ్యాపారాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రెండూ సమాంతరంగా నడుస్తున్నాయి. వాటర్‌షెడ్‌లాంటి సహజ వనరుల అభివృద్ధి పనులకు నిధులిస్తున్నాం. కొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించే గ్రామీణ ప్రజలకు, గిరిజన ప్రాంతాల్లో ‘మాతోట’ వంటి పథకాలకూ నిధులిస్తున్నాం. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి నుంచి రాష్ట్రాలకు ఇస్తున్నాం. వ్యవసాయాభివృద్ధికి ఈ నిధి చాలా ఉపయోగపడుతోంది. గత పాతికేళ్లలో నాబార్డు రాష్ట్రాలకిచ్చిన రుణాలతోనే 4.7 లక్షల కిలోమీటర్ల రహదారులు నిర్మించారు. ఈ సొమ్ముతో చేపట్టిన నిర్మాణాలతో 3.30 కోట్ల హెక్టార్ల భూమికి సాగునీటి వసతి అదనంగా లభించింది.

స్వయం సహాయక సంఘాల విస్తరణకు నాబార్డు ఎందుకు కృషి చేయడం లేదు?

ఈ సంఘాల ఏర్పాటు ప్రారంభమైన 90లలో దక్షిణ భారత రాష్ట్రాలు ముందున్న మాట వాస్తవమే. కానీ ఆ తరవాత వీటిని దేశమంతా విస్తరించడానికి మేం చేపట్టిన చర్యలతో దక్షిణాది వాటా 42 నుంచి 36.01 శాతానికి తగ్గింది. తీవ్రవాద ప్రభావిత 150 జిల్లాల్లోనూ 2.11 లక్షల సంఘాలు ఏర్పాటు చేసి 2.60 కోట్ల మందిని చేర్చాం. వీటిలో 60 శాతం సంఘాలకు రుణాలు అందుతున్నాయి. నేను చేపట్టిన ‘ఈ-శక్తి’ కార్యక్రమంతో సంఘాల రికార్డులన్నీ డిజిటలైజ్‌ చేశాం. జీవనోపాధి-వాణిజ్య అభివృద్ధి కార్యక్రమంతో దేశమంతా ఈ సంఘాల్లోని మహిళలకు శిక్షణ ఇచ్చి రుణపరపతి పెంచాం. మహిళలందరినీ సంఘాల్లో చేర్చాలనే లక్ష్యంతోపాటు, చేరిన వారందరికీ రుణాలు, శిక్షణ ఇచ్చి మెరుగైన జీవనోపాధి కల్పనపై దృష్టిపెట్టాం.

సన్న, చిన్నకారు రైతులకు అధునాతన పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఎలాంటి కృషి జరుగుతోంది?

ఇందుకోసం ప్రత్యేకంగా ‘వ్యవసాయ రంగ ప్రోత్సాహక నిధి’ ఏర్పాటుచేశాం. ఇప్పటికే 4450 రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఎఫ్‌పీఓ)లను ఏర్పాటు చేయించాం. వీటిలో 80 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. ఈ సంఘాలు నేరుగా ఆన్‌లైన్‌లో వారి ఉత్పత్తులను అమ్ముకునేందుకు ప్రత్యేకంగా ‘ఈ-కామర్స్‌’ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఈ రంగంలో అంకుర సంస్థలనూ ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే ఏపీలో 293, తెలంగాణలో 331 ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేయించాం.

పంటల బీమా పథకంలోకి ఎక్కువ మంది రైతులను చేర్చేందుకు యత్నిస్తున్నారా?

పంటల బీమాపై అవగాహన లేక చాలామంది రైతులు దూరంగా ఉంటున్నమాట వాస్తవం. జాతీయ వ్యవసాయ బీమా కంపెనీ స్థాపనలో నాబార్డుకూ 30 శాతం వాటా ఉంది. గత డిసెంబరు నాటికి దేశంలో సాగైన పంటల విస్తీర్ణంలో 30 శాతం బీమా పరిధిలోకి వచ్చింది. గ్రామాల్లోని పలు సంఘాల ద్వారా పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తాం. రాష్ట్రాలతో కలసి పనిచేస్తాం.

మార్కెట్ల కొరత విషయంలో నాబార్డు ఏం చేస్తోంది?

ప్రస్తుతమున్న మార్కెటింగ్‌ వ్యవస్థ సన్న, చిన్నకారు రైతులకు అనుకూలంగా లేదు. గిట్టుబాటు ధరల కల్పనకు ప్రత్యేకంగా ‘మార్కెటింగ్‌ సదుపాయాల నిధి’ని ఏర్పాటు చేశాం. దేశంలో 10 వేల గ్రామీణ సంతలను వ్యవసాయ మార్కెట్లుగా అభివృద్ధి చేయడానికి ఈ నిధి ఇస్తున్నాం. గిడ్డంగుల మౌలిక సదుపాయాల నిధి నుంచి 642 మార్కెట్ల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాం. రాష్ట్రాలకు ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు రుణాలిచ్చాం.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు?

రైతులకు సేవలు అందించడంతోపాటు ఆదాయం పెంచుకునేందుకు వ్యాపార కార్యక్రమాలను చేపట్టాలంటూ ఈ సంఘాలను ప్రోత్సహిస్తున్నాం. కంప్యూటరీకరణకు రాష్ట్రాలతో కలసి పని చేస్తున్నాం. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులిస్తున్నాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.