ETV Bharat / opinion

నిపుణ మానవ వనరుల రాజధాని అయ్యేనా?

author img

By

Published : Jan 16, 2021, 7:29 AM IST

దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో ప్రధానమంత్రి కౌశల్​ వికాస్ యోజన మూడో విడత కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. మూడో దశ కింద లబ్ధిదారులు ఎనిమిది లక్షలమందిగా.. అంచనా వ్యయం రూ.948 కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. మరి 2022 నాటికి 40 కోట్ల మందిని నిపుణశక్తులుగా తీర్చిదిద్దాలన్న మౌలిక లక్ష్యం ఏమైపోయినట్లు?

pm koushal vikas yojana third phase has started in 600 districts
2022నాటికి 40కోట్ల మందికి నైపుణ్యం శిక్షణ..లక్ష్యం అందేనా..

నిపుణ మానవ వనరుల రాజధానిగా భారత్‌ అవతరించాలని అభిలషిస్తూ 2015 జులైలో ప్రధాని నరేంద్ర మోదీ ‘కౌశల్‌ వికాస్‌ యోజన’కు శ్రీకారం చుట్టారు. ఏడాది వ్యవధిలో రూ.1500కోట్ల అంచనా వ్యయంతో 24 లక్షలమందికి శిక్షణ సమకూర్చనున్నట్లు మంత్రులు, అధికారులు అప్పట్లో మోతెక్కించారు. రెండో అంచెగా 2016-20 మధ్య రూ.12వేలకోట్లతో కోటిమందికి అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నైపుణ్య శిక్షణ ఇవ్వాలని తలపెట్టారు. ఆ వరసలోనే నిన్న ‘కౌశల్‌ వికాస్‌ యోజన’ మూడో అంచె ప్రారంభమైంది. తొలి రెండు దశల అనుభవాల ప్రాతిపదికన రేపటి సవాళ్లకు, కొవిడ్‌ కారణంగా మారిన స్థితిగతులకు తగ్గట్లు మూడో దశ కార్యక్రమాన్ని తీర్చిదిద్దినట్లు చెబుతున్నా- నేర్చిన పాఠాలేమిటన్నది పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది.

మొదటి రెండంచెల్లో కౌశల్‌ వికాస్‌ లబ్ధిదారుల సంఖ్య సుమారు 90 లక్షలని, వారిలో కొలువులో కుదురుకున్నది 30-35 లక్షల మందేనని కేంద్రమంత్రి రాజ్‌కుమార్‌ సింగ్‌ ‘అసోచామ్‌’ వేదికపై స్వయంగా వెల్లడించారు. నికర లబ్ధి అంతకన్నా తక్కువేనని, శిక్షణ పొందిన 72 లక్షల మందిలో రమారమి 15 లక్షల మందికే ఉపాధి దక్కిందన్న విశ్లేషణలు ఇటీవల వెలుగుచూశాయి. రెండు దశల్లోనూ కలిపి కౌశల్‌ యోజనకు వెచ్చించింది ఆరు వేలకోట్ల రూపాయల లోపేనన్న గణాంకాలు- ప్రకటనలకు, కార్యాచరణకు మధ్య దూరమెంతో ప్రస్ఫుటీకరించాయి. కొత్తగా 600 జిల్లాల్లో ఆరంభించిన మూడో దశకింద లబ్ధిదారులు ఎనిమిది లక్షలమందిగా, అంచనా వ్యయం రూ.948కోట్లుగా చెబుతున్నారు. ఈ లెక్కన 2022నాటికి 40కోట్ల మందిని నిపుణశక్తులుగా తీర్చిదిద్దాలన్న మౌలిక లక్ష్యం ఏమైపోయినట్లు? శిక్షణ విధివిధానాలను, ఫలితాల సరళిని శారదా ప్రసాద్‌ కమిటీ నిగ్గదీసిన దృష్ట్యా ఉద్యోగార్హమైన మానవ వనరుల సృజన కసరత్తును అన్నిందాలా పరిపుష్టీకరించాలి!

ప్రస్తుతం జపానీయుల సగటు వయసు 48 సంవత్సరాలు, అమెరికాలో 46 ఏళ్లు, ఐరోపాలో 42 ఏళ్లు. అదే ఇండియాలో 27 ఏళ్లు. 15-59 ఏళ్ల మధ్యవారు దేశ జనాభాలో 62 శాతం మేర ఉండటం భారత్‌ సహజ బలిమిని కళ్లకు కడుతోంది. ఇంతటి అపార మానవ వనరుల రాశికి దేశం నెలవైనా- సరైన అర్హతలు కలిగిన నిపుణ శ్రామికులకు పెద్దయెత్తున కరవు ఏర్పడిందని అనేక సంస్థలు వాపోతున్నాయి. మరోవైపు డాక్టరేట్లు, స్నాతకోత్తర పట్టభద్రులు సైతం చిన్నాచితకా ఉద్యోగాలకు బారులు తీరుతుండటం- మానవ వనరుల భారీ వృథాను, ప్రణాళిక రచనలో తక్షణ మార్పుల ఆవశ్యకతను చాటుతోంది. విశిష్ట పథకం ప్రారంభమైన నాలుగేళ్ల తరవాత- శిక్షకులకు ప్రత్యేక డిగ్రీ ఉండాలన్న సంబంధిత శాఖామాత్యులు, అందుకోసం విడిగా సంస్థనొకదాన్ని ఏర్పరుస్తామన్నా- ఇప్పటికీ ఎక్కడి గొంగడి అక్కడే! కరోనా సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా భిన్న రంగాల్ని పట్టి కుదిపేసిన దరిమిలా- పారిశ్రామికంగా, సేవారంగాల్లో అనివార్య మార్పులకు తగ్గట్లు యువతను తీర్చిదిద్దుకోవడం నేడు అతిపెద్ద సవాలు. రాబోయే రెండు మూడు దశాబ్దాల్లో కృత్రిమ మేధకు ఇనుమడించనున్న ప్రాధాన్యం, ఊపందుకోనున్న జీవనశైలి మార్పులనుబట్టి ఉద్యోగావకాశాల స్వరూప స్వభావాలూ విశేష పరివర్తనకు లోనుకానున్నాయి. వాటిని అందిపుచ్చుకొనే సామర్థ్యాలు విద్యార్థులకు అలవడేలా పాఠ్యాంశాల కూర్పు, బోధన విధివిధానాలు, ఉపాధ్యాయుల ఎంపిక, శిక్షణ, వాటికోసం స్వతంత్ర వ్యవస్థ- ఇవన్నీ చకచకా పట్టాలకు ఎక్కాలి. విడిగా నైపుణ్యాలు నేర్పే సంస్థలపై ఇప్పుడు వెచ్చిస్తున్నా- విద్యాసంస్థల ప్రాంగణాలనుంచే మెరికల్ని నియమించుకునే వెసులుబాటు పారిశ్రామిక విభాగాలకు ఉండేట్లు ‘పనికొచ్చే చదువులు’ సాకారం కావాలి. కోట్లమంది యువతీ యువకుల కౌశలానికి, వృత్తిగత వికాసానికి బాటలు పరచే రాజమార్గమది!

ఇదీ చదవండి : 600 జిల్లాల్లో పీఎం కౌశల్​ వికాస్​ యోజన మూడో విడత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.