ETV Bharat / opinion

ఉగ్రమూకల అభయారణ్యం.. 'పాకిస్థాన్​' గడ్డ

author img

By

Published : Aug 25, 2020, 5:52 AM IST

Pakistan terror activities against India
ఉగ్రమూకల అభయారణ్యం.. 'పాకిస్థాన్​' గడ్డ

భారత్​పై ఎప్పుడూ ద్వేషంతో రగిలిపోయే పాకిస్థాన్​ ప్రచ్ఛన్న యుద్ధ వ్యూహం ఉగ్రవాదం. ఇందుకోసం ఉగ్రవాదాన్ని, ఉగ్రమూకలను ఎన్నో దశాబ్దాలుగా పెంచిపోషిస్తోంది పొరుగు దేశం. జమాత్‌ ఉద్‌ దవా, లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌, హక్కానీ నెట్‌వర్క్‌, తాలిబన్‌ ప్రభృత ఉగ్రముఠాల అభయారణ్యంగా చలామణీ అవుతున్న పాక్‌- ప్రపంచం కళ్లకే గంతలు కట్టజూస్తోంది!

విషంలో పుట్టిన పురుగుకు విషమే ఆహారమన్న చందంగా- భారత్‌పై నిరంతరం జ్ఞాతిద్వేషం వెళ్ళగక్కే పాకిస్థాన్‌ ప్రచ్ఛన్న యుద్ధ వ్యూహమే ఉగ్రవాదం. ఇండియాను దగ్ధభూమిగా మార్చాలని తహతహలాడుతున్న ఇస్లామాబాద్‌, దశాబ్దాల తరబడి ఉగ్రవాద మిన్నాగులకు పాలుపోసి పెంచుతోందనేది యథార్థం. టెర్రరిస్టులకు నిధులు అందకుండా పర్యవేక్షించే అంతర్జాతీయ సంస్థ ఎఫ్‌ఏటీఎఫ్‌ (ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌) కఠినతర ఆంక్షల్ని తప్పించుకోవడానికి- అనివార్యమై పాక్‌ ఇటీవల రెండు జాబితాలు విడుదల చేయడం తెలిసిందే. అందులో 88 నిషేధిత ఉగ్రవాద సంస్థలు, వాటి నాయకుల వివరాలు పొందుపరచారు. 1993 నాటి బొంబాయి వరస బాంబుపేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం పేరూ అందులో చోటుచేసుకుంది. దావూద్‌తోపాటు జగమెరిగిన విచ్ఛిన్నశక్తులు హఫీజ్‌ సయీద్‌, మసూద్‌ అజర్‌ తదితరుల స్థిరచరాస్తులు వశపరచుకొని వాళ్ల బ్యాంకు ఖాతాల్నీ స్తంభింపజేశామని ప్రకటించాక- రోజుల వ్యవధిలోనే పాక్‌ నాలుక మడతేసింది. 'రొటీన్'గా ఆ ప్రకటన జారీ చేశామన్న ఇమ్రాన్‌ప్రభుత్వం-కాకలు తీరిన ఉగ్రనేతలకు తమదేశం ఆశ్రయమివ్వనే లేదని తాజాగా బుకాయించింది. కళ్లు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదనుకుంటుందట జంగురుపిల్లి. భయానక ఉగ్రసంస్థలను అన్ని విధాలా సాకుతున్న పాక్‌ ధోరణీ అలాగే అఘోరించింది. నిషేధాంక్షల విధింపు తథ్యమని తలపోసినప్పుడు నామమాత్రం కేసులూ అరకొర చర్యలతో హడావుడి చేసే పాక్‌, ఆపై ఉగ్రతండాల ప్రయోజనాలకు నిష్ఠగా కొమ్ముకాయడం ఆనవాయితీగా స్థిరపడింది. జమాత్‌ ఉద్‌ దవా, లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌, హక్కానీ నెట్‌వర్క్‌, తాలిబన్‌ ప్రభృత ఉగ్రముఠాల అభయారణ్యంగా చలామణీ అవుతున్న పాక్‌- ప్రపంచం కళ్లకే గంతలు కట్టజూస్తోంది!

పేరుకది పాకిస్థాన్‌ అయినా, స్వభావరీత్యా టెర్రరిస్థాన్‌. ఉపఖండానికే పెనుశాపంగా పరిణమించిన ప్రతీప ధోరణులతో యథేచ్ఛగా చెలరేగుతున్న పాక్‌ అయిష్టంగానైనా తన గురించి తాను చేదునిజం చెప్పడానికి ప్రధాన కారణం- ఎఫ్‌ఏటీఎఫ్‌. మూడు దశాబ్దాలక్రితం 'మనీ లాండరింగ్‌'ను నియంత్రించే లక్ష్యంతో జి-7 దేశాల పారిస్‌ సదస్సులో బీజావాపనమైన ప్రత్యేక కార్యదళం పరిధిలోకి ఉగ్రనిధుల కట్టడి అంశం 2001లో చేరింది. దాదాపు పుష్కరం తరవాత ఆ సంస్థ ‘గ్రే’ జాబితాలోకి ఎక్కిన పాక్‌ అంతకుముందు, తరవాత సైతం రకరకాల కుటిల పోకడలతో ఎన్నో పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. ఏడాదిక్రితం తమ గడ్డమీద 30-40 వేలమంది ఉగ్రవాదులున్నట్లు ఇమ్రాన్‌ ప్రభుత్వమే అంగీకరించింది. దరిమిలా అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను ‘సయీద్‌ సర్‌’ అంటూ సంబోధించి ఎనలేని వినయం ఒలకబోసిన ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌- ఐరాస జాబితాలోని ఉగ్రశక్తుల ఆనుపానుల్ని తమ దేశంలో పట్టుకోవడం దుర్లభమని ప్లేటు ఫిరాయించారు. కొన్నాళ్లుగా డ్రోన్ల సాయంతో ఇండియా సరిహద్దుల వెంట ఆయుధాలు జారవిడుస్తూ పాక్‌ కొత్త సవాళ్లు విసరుతోంది. భారత స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఉగ్రదాడికి పొరుగుదేశం పన్నిన కుట్ర బట్టబయలై త్రుటిలో పెనుముప్పు తప్పింది. చైనా, టర్కీ, మలేసియాల మద్దతుతో ఆమధ్య ఎఫ్‌ఏటీఎఫ్‌ వేటు పడకుండా కాచుకున్న పాక్‌ నిజ నైజమేమిటో పదేపదే బహిర్గతమవుతూనే ఉంది. చైనా అండ ఉండగా తనకేమీ కాదన్న ఇస్లామాబాద్‌ దొంగాటకం పట్ల ఆ సంస్థ ఏ తీరుగా స్పందిస్తుందో చూడాలి. మూడు వారాలక్రితం భద్రతామండలిలో భారత్‌ స్పష్టీకరించినట్లు- పాక్‌ ప్రాయోజిత ఉగ్రముఠాలపై ఉమ్మడి పటిష్ఠ వ్యూహమే ఘోర వినాశం నుంచి మానవాళిని కాపాడగలిగేది. ఉగ్రశక్తులన్నింటిపైనా ఉక్కుపాదం మోపే అంతర్జాతీయ కార్యాచరణే, పాక్‌ కౌటిల్యానికి చెంపపెట్టు అవుతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.