ETV Bharat / opinion

జాతీయోద్యమ రణ స్ఫూర్తే.. అమృతోత్సవ శుభసంకల్పం

author img

By

Published : Aug 19, 2021, 8:31 AM IST

స్వేచ్ఛా భారతం కోసం మన పూర్వీకులు కలలుకన్న తీరు మనల్ని చకితుల్ని చేస్తుంది. ఆ కలలను సాకారం చేసుకోవాలని వారు పడ్డ తపన, చేసిన పోరాటం పూర్తిగా అర్థం కావాలంటే- స్వాతంత్య్రం అనే పదానికి సరైన నిర్వచనం మనకు బోధపడాలి. ఎంత గొప్ప దేశాన్ని వారు మనకు బహూకరించారో, ఎంత చక్కటి సమాజాన్ని స్వప్నించారో తెలియాలి. ఆ ఉజ్జ్వలతను, ఆశయాలను మన పిల్లలకు చేరవేయాలి. అదే అమృతోత్సవ శుభసంకల్పం అవుతుంది.

75 years of independence
75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఉద్దేశం

'ఈ దేశం నాకు ఏమిచ్చింది?' అని అడిగేవారు, అనుకొనేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే. తల్లి బిడ్డకు ఏమిస్తుందో- దేశం పౌరుడికీ అదే ఇస్తుంది. దాన్ని గుర్తింపు(ఐడెంటిటీ) అంటారు. 'ఫలానావారి అబ్బాయి లేదా అమ్మాయి' అనే ఒక చిరునామా తల్లి మూలంగానే సంక్రమిస్తుంది. వేల గోవుల మందలో తల్లిగోవును లేగదూడ గుర్తించినట్లు- అమ్మ స్పర్శను, గొంతును పసికందు చప్పున గ్రహిస్తుంది. అలాంటి తీయటి బంధం మరెవరితోనూ పెనవేసుకొనే అవకాశం లేదు- ఒక్క దేశంతో తప్ప!

నీరజ్‌ చోప్డాకు దేశమంతటా నీరాజనాలు ఎందుకు లభించాయి? పి.వి.సింధు పతకం గెలిచిందనగానే మనకెందుకు సంతోషం కలిగింది? క్రికెట్‌ పోటీల్లో- ముఖ్యంగా పాకిస్థాన్‌పై మన జట్టు విజయం సాధించగానే మనమెందుకు సింహనాదం చేస్తాం? ఉద్రేకంగా పక్కవారి భుజాలను చరుస్తామే, మనకేమి కలిసొచ్చిందని?... ఈ ప్రశ్నలకు జవాబులు తెలిస్తే- దేశంతో అనుబంధం ఏర్పడటమన్న మాటకు అర్థం బోధపడుతుంది. ఆ అనుబంధానికి చిహ్నమే- మన స్పందన! అమ్మ పకపక నవ్వితే బిడ్డకు ఎనలేని ఆనందం ఎందుకు కలుగుతుందో- దేశం ఏ రంగంలో గెలిచినా మనకు సంతోషం అందుకే కలుగుతుంది. పెద్దలు దేశాన్ని అమ్మతో పోల్చింది- అనాలోచితంగా కాదు, ఆ రెండూ ఒకటే కనుక!

అందుకే మనలో ఆ భావన

తల్లిని ఎవరైనా అవమానిస్తే లేదా హింసిస్తే ఎవరికైనా చాలా కోపం వస్తుంది. ఒక్కోసారి ఆ గాయం జీవితాంతం వెంటాడుతుంది. ప్రహ్లాదుడు దానికి మంచి ఉదాహరణ. గొప్ప విష్ణుభక్తుడిగా, పరమ సాత్త్వికుడిగా పేరొందిన ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడయ్యాక దేవతలపై దండెత్తి, వారిని ఊచకోత కోశాడని పురాణాలు చెబుతున్నాయి. దీనికి కారణమేమిటి అంటే- ప్రహ్లాదుడు తన తల్లి లీలావతి కడుపులో ఉన్న సమయంలో దేవేంద్రుడు ఆమెను చెరపట్టి హింసించాడు. నారదుడు రక్షించి, లీలావతికి ఆశ్రయం కల్పించాడు. ప్రహ్లాదుడు ఆశ్రమంలోనే పుట్టాడు. తల్లికి జరిగిన ఘోర పరాభవం, ఆమె మనసులో రగిలిన దుర్భర వేదన- గర్భస్థశిశువు చైతన్యంలో గాఢంగా నమోదయ్యాయి. వాటి ప్రతిరూపాలే ప్రహ్లాదుడి ప్రతీకారంలో ఆయుధాలయ్యాయి. పసిబిడ్డగా ప్రహ్లాదుడు నిస్సహాయుడు. పెద్దయ్యాక అసహాయశూరుడు. చైనాయో పాకిస్థానో మనదేశంపై దురాక్రమణకు పాల్పడిన సందర్భాల్లో సాధారణ పౌరులది- ప్రహ్లాదుడి నిస్సహాయస్థితి వంటిది. వీరసైనికుల్లో వారు చూసుకొనేది- అసహాయశూరులను! ప్రహ్లాదుడి మనసులో నాటుకొన్న కోపం, ద్వేషం ఎలా పెరుగుతూ వచ్చాయో- మనకూ అలాగే అవి శత్రుదేశాలన్న భావన పెరుగుతూ వస్తుంది. అందుకే మనకు తెలియకుండానే ఆ రెండు దేశాలను మనం లోలోపల ద్వేషిస్తాం. ఏ రంగంలోనైనా సరే, వాటిపై పైచేయి సాధించిన సందర్భాల్లో ఎంతో ఆనందం ఉబికివస్తుంది.

దేశమిచ్చిన కానుక ఇదే..

దేశంతో ఇలాంటి బంధానికి సంబంధించిన భావతీవ్రతను వివేకానందుడిలో బాగా గుర్తించగలం. 'ప్రప్రథమంగా స్వామీజీ తమ మాటల్లో 'ఇండియా' అనే పదాన్ని ఉచ్చరించినప్పుడే మా అందరిలో భారతదేశం పట్ల ప్రేమానురాగాలు ఉదయించాయి. ఇండియా అనే చిన్ని మాటలో అంతటి భావప్రకంపనలు వెలువడటం, వారి వాక్కులో ప్రేమ గర్వం పూజ్యభావం శౌర్యం ఆకాంక్ష అంకితభావం... ఇంకా ఎన్నో ప్రజ్వరిల్లడం మాకు ఉత్తేజం కలిగించాయి. పెద్దపెద్ద గ్రంథాలు సైతం అంతటి ప్రభావాన్ని సృష్టించలేవని మాకు అనిపించింది. భారతదేశానికి చెందిన అణువణువూ అమూల్యమేనన్న నిశ్చయభావం స్వామీజీలో జీర్ణమైపోయిన కారణంగా వారి మాటలకు ఆ తీవ్రత ఒనగూడింది. కాంతి పరివేషం(ఆరా) తోచింది' అని పాశ్చాత్య విలేకరి సిస్టర్‌ క్రిస్టెయిన్‌ స్పష్టంగా రాశారు. ఈ స్వాతంత్య్ర అమృతోత్సవ శుభవేళ మనం ఆవాహన చేసుకోవలసింది- ఆ భావతీవ్రతను! అర్థం చేసుకోవలసింది- ఆ అనుబంధాన్ని! గర్వించవలసింది- మనం వివేకానందుడికి వారసులం అయినందుకు, ఆయనతోపాటు మనమూ 'భారతీయులు'గా జన్మించినందుకు! అద్భుతమైన, అనంతమైన ఆ గర్వాన్నే (ప్రైడ్‌) భారతదేశం మనకు కానుకగా ఇచ్చింది.

అదే శుభసంకల్పం

స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రత్యక్షంగా గమనించిన తరం ఇంచుమించుగా వెళ్లిపోయింది. ఏ కాస్తో మిగిలి ఉన్న పండుటాకులను పలకరిస్తే- వారి మాటల్లో ఇప్పటికీ అనంతమైన ఉత్తేజం ఉరకలు వేస్తుంది. అలనాటి జాతీయోద్యమ రణ స్ఫూర్తి ఈనాటికీ వారికి పులకలు రేకెత్తించడం- మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్వేచ్ఛా భారతం కోసం వారు కలలుకన్న తీరు మనల్ని చకితుల్ని చేస్తుంది. ఆ కలలను సాకారం చేసుకోవాలని వారు పడ్డ తపన, చేసిన పోరాటం పూర్తిగా అర్థం కావాలంటే- స్వాతంత్య్రం అనే పదానికి సరైన నిర్వచనం మనకు బోధపడాలి. ఎంత గొప్ప దేశాన్ని వారు మనకు బహూకరించారో, ఎంత చక్కటి సమాజాన్ని స్వప్నించారో తెలియాలి. ఆ ఉజ్జ్వలతను, ఆశయాలను మన పిల్లలకు చేరవేయాలి. అదే అమృతోత్సవ శుభసంకల్పం అవుతుంది.

- వై.శ్రీలక్ష్మి

ఇదీ చదవండి:చెరిపేస్తే చెరిగేదా చరిత్ర- 'ఖుదీరామ్​ బోస్'​ భరతమాత ముద్దుబిడ్డ!

75th Independence Day: నాటికీ.. నేటికీ.. వచ్చిన మార్పులివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.