ETV Bharat / opinion

వ్యూహాత్మక మైత్రే దేశానికి రక్షాకవచం!

author img

By

Published : Apr 8, 2021, 8:52 AM IST

India's shield is to maintain strategic friendship with Foreign countries
వ్యూహాత్మక మైత్రే రక్షాకవచం!

భారత్​కు అత్యంత సన్నిహిత దేశం రష్యానేనని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ గతంలో ఘనంగా చెప్పారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ.. భారత్​కు రష్యా గొప్ప మిత్ర దేశమని, దేశంలో ఎవర్ని అడిగినా చెప్తారన్నారు. అయితే.. కొన్ని రోజులుగా తలెత్తుతున్న పరిణామాలను చూస్తే.. ఇరు దేశాల మధ్య దూరం కాస్త పెరిగినట్టు కనిపిస్తోంది. అమెరికాకు, భారత్​ చేరువవుతుందని అనుమానించిన రష్యా.. తాను పాక్​వైపు మొగ్గు చూపింది.

దిల్లీకి క్రెమ్లిన్‌లో అత్యంత ఆప్తమిత్రుణ్ని తానేనని వ్లాదిమిర్‌ పుతిన్‌ గతంలో ఘనంగా చాటారు. బదులుగా ప్రధాని నరేంద్ర మోదీ 'భారత్‌కు రష్యా గొప్ప మిత్ర దేశమని ఇండియాలో చిన్నపిల్లవాణ్ని అడిగినా చెబుతా'డని ప్రతిస్పందించారు. కాలపరీక్షకు నిలిచి గెలిచిన పటిష్ఠ బంధం తమదని ఇరుదేశాల నాయకగణం పదేపదే ఉద్ఘాటించిన రోజులతో పోలిస్తే- కొన్నాళ్లుగా దృశ్యంలో మార్పు కనిపిస్తోంది. ఆ మధ్య అమెరికాకు ఇండియా చేరువవుతోందని అనుమానించి ఇస్లామాబాద్‌ వైపు మాస్కో కొంత మొగ్గు చూపింది. ఇంచుమించు ఆ సమయంలోనే రష్యా నుంచి తనకందిన రక్షణ పరికరాల్లాంటివే చైనాకు చేరుతుండటం భారత్‌ను కలవరపాటుకు గురిచేసింది. ఆ బాణీకి కొనసాగింపుగా, ఇటీవల అఫ్గాన్‌ శాంతి చర్చల్లో భారత్‌కు ప్రమేయం లేకుండా రష్యా దారులు మూసేసిందన్న వార్తా కథనాలు విస్తృతంగా ప్రచారమయ్యాయి.

రద్దైన శిఖరాగ్ర సదస్సు..

గత డిసెంబరులో భారత్‌-రష్యా అధినేతల మధ్య జరగాల్సిన శిఖరాగ్ర సదస్సు కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా రద్దయినా, తెరవెనక కారణాలు వేరేనన్న విశ్లేషణలూ వినవచ్చాయి. ఈ ఏడాది చివర్లో పుతిన్‌-మోదీల భేటీకి సన్నాహకాల్లో భాగంగా ఇరుదేశాల విదేశాంగ శాఖామాత్యుల తాజా సమావేశం, ఎన్నో ప్రశ్నలకు ఏకకాలంలో సమాధానాలు ఇచ్చినట్లయింది. ప్రపంచంలోనే ఎన్నదగ్గ మేటి క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్‌-400 కొనుగోలు ఒప్పందంపై ముందడుగు వేస్తే ఇండియాపై ఆంక్షల విధింపు తప్పదన్న అమెరికా హెచ్చరికల్ని మంత్రుల సదస్సు పట్టించుకోలేదు. సైనిక సహకారంపై రెండు దేశాల రక్షణ మంత్రులు లోతుగా చర్చిస్తారన్న జైశంకర్‌, సెర్గీ లవ్రుఫ్‌ల ద్వయం- భిన్నరంగాల్లో ఇచ్చి పుచ్చుకోవడాలపై దృష్టి కేంద్రీకరించినట్లు సంయుక్త ప్రకటన పాఠం వెల్లడిస్తోంది. మైత్రీలతలు విరబూయించే సమష్టి కృషి కచ్చితంగా ఉభయతారకమవుతుంది!

అప్పుడు పెద్దన్న పాత్ర పోషించి..

సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నానికి మునుపు దశాబ్దాల తరబడి భారత రక్షణావసరాలకు మాస్కోయే పెద్ద దిక్కుగా భాసిల్లింది. అనంతర కాలంలో పుతిన్‌ సౌహార్దం కొనసాగినా, కొన్ని విభేదాలూ పైకి తేలాయి. అణు, రక్షణ, ఇంధన రంగాల్లో సమధిక తోడ్పాటును అభిలషించిన ఇండియాను కొన్ని షరతులు, స్వీయ ప్రాథమ్యాల ప్రాతిపదికన రష్యా ఇరకాటంలోకి నెట్టిన సందర్భాలూ ఉన్నాయి. భారత్‌ నిర్వహించిన యుద్ధ విమానాల వేలంపాటలో తమ దేశానికి చెందిన 'మిగ్‌' నెగ్గకపోయేసరికి అణు రియాక్టర్ల సరఫరా విధివిధానాలు మార్చాలని మాస్కో పట్టుపట్టింది! ఒకటిన్నర పుష్కరాల క్రితం ఇండియా, చైనా, రష్యాల త్రైపాక్షిక కూటమి భావనకు గట్టిగా ఓటేసిన పుతిన్‌ కొన్నాళ్లుగా బీజింగ్‌తో చెట్టపట్టాలు పట్టి సాగడం తెలిసిందే. చైనా ఆర్థిక ప్రాబల్యాన్ని, రష్యా సైనిక శక్తిని నియంత్రించడానికి ఉద్దేశించిన అమెరికా విధానాలు- పుతిన్‌, జిన్‌పింగ్‌లను పరస్పరం చేరువ చేశాయి.

అదే దేశానికి రక్షణ కవచం..

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దుందుడుకు పోకడలు చుట్టుపక్కల దేశాలన్నింటినీ తీవ్ర అసహనానికి గురి చేస్తుండగా, రష్యా ఆ అంశాన్నే పట్టించుకోవడం లేదు. చైనా ముప్పుగా మారడంవల్లే 'క్వాడ్‌' (భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాల కూటమి)లో చేరికకు ఇండియా సుముఖమైతే- అమెరికా తంత్రంలో దిల్లీ పావుగా మారిందని మాస్కో తలపోయడం.. ఒకప్పటి ప్రగాఢ మిత్ర దేశాల నడుమ పెరిగిన మానసిక దూరాన్ని ప్రస్ఫుటీకరిస్తోంది. అది అలాగే కొనసాగినా, ఇనుమడించినా- చైనాకు పట్టపగ్గాలుండవు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సొంత అజెండాలకు అనుగుణంగా రష్యా, అమెరికా పావులు కదుపుతున్నాయి. ఒక దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామంటే ఇంకో దేశానికి దూరం జరుగుతున్నట్లు కానేకాదని తన దౌత్య పథ ప్రస్థానగతిని భారత్‌ రెండు దశాబ్దాల క్రితమే ఆవిష్కరించింది. అమెరికా, రష్యాలతో సమాన ఫాయాలో నెయ్యం, వాణిజ్యం నెరపుతూనే చైనా మేరమీరకుండా కాచుకొనే పరీక్షలో నెగ్గుకొచ్చేలా- భారత దౌత్య ప్రజ్ఞ పదునుతేలాలి. అదే దీర్ఘకాలికంగా దేశానికి రక్షాకవచమవుతుంది!

ఇదీ చదవండి: ప్రధాని మోదీతో జాన్​ కెర్రీ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.