ETV Bharat / opinion

ఔషధ రంగంలో అగ్రాసనం.. నవీకరణకు కట్టాలి నడుం

author img

By

Published : Mar 9, 2021, 7:50 AM IST

ప్రపంచ దేశాలకు సరఫరా అవుతున్న జనరిక్‌ మందుల్లో 20 శాతం భారత్‌ నుంచే వెళ్తున్నాయి. 200కు పైగా దేశాలకు ఫార్మా ఉత్పత్తులను అందిస్తోంది మన దేశం. కొవిడ్‌ టీకాలను 70 దేశాలకు సరఫరా చేసింది. నేడు అత్యధిక పరిమాణంలో మందులు తయారుచేస్తున్న దేశాల్లో భారత్‌ మూడోస్థానంలో నిలుస్తోంది. మందుల ఉత్పత్తి కర్మాగారాలు అమెరికా తరవాత ఎక్కువగా భారత్‌లోనే ఉన్నాయి. అమెరికాలో వైద్యులు సిఫార్సు చేసే మందుల్లో 40 శాతం భారతీయ జనరిక్‌ ఔషధాలే. ఈ క్రమంలో చైనాపై ఆధిక్యం సాధించిన భారత్‌, జనరిక్‌ మందులతో పాటు కొత్త మందుల ఆవిష్కరణలోనూ ముందుకు దూసుకెళ్లాలి. ఇందుకు రాజకీయ దృఢ సంకల్పం, పటిష్ఠ ఫార్మా విధానం, దీటైన కార్యాచరణ ఎంతో అవసరం అని నిపుణులు భావిస్తున్నారు.

indian pharmaceutical field will be in the top position and its a time to update
ఔషధ రంగంలో అగ్రాసనం.. నవీకరణకు కట్టాలి నడుం

అమెరికాకు సరసమైన ధరలపై జనరిక్‌ మందులు, ఆఫ్రికాకు హెచ్‌ఐవీ ఔషధాలు, బడుగు దేశాలకు పోలియో తదితర టీకాలు సరఫరా చేస్తూ భారతదేశం ప్రపంచానికి ఫార్మసీగా వెలుగొందుతోంది. ప్రపంచ దేశాలకు సరఫరా అవుతున్న జనరిక్‌ మందుల్లో 20 శాతం భారత్‌ నుంచే వెళ్తున్నాయి. 200కు పైగా దేశాలకు ఫార్మా ఉత్పత్తులను అందిస్తున్న భారత్‌, ఇప్పటిదాకా కొవిడ్‌ టీకాలను 70 దేశాలకు సరఫరా చేసింది. మరో 40 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇటీవల ప్రకటించారు. నేడు అత్యధిక పరిమాణంలో మందులు తయారుచేస్తున్న దేశాల్లో భారత్‌ మూడోస్థానంలో నిలుస్తోంది. అమెరికా, ఆహార, ఔషధ నియంత్రణ శాఖ (ఎఫ్‌డీఏ) ఆమోదం పొందిన మందుల ఉత్పత్తి కర్మాగారాలు అమెరికా తరవాత ఎక్కువగా భారత్‌లోనే ఉన్నాయి. అమెరికాలో వైద్యులు సిఫార్సు చేసే మందుల్లో 40 శాతం భారతీయ జనరిక్‌ ఔషధాలే. కొవిడ్‌ భారత్‌కు సవాలు విసరడంతోపాటు, కొత్త అవకాశాలూ తీసుకొచ్చింది. కొవిడ్‌ టీకాల ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా నిలుస్తున్న భారత్‌ తన ఫార్మా ఎగుమతులను గణనీయంగా పెంచుకోగలిగింది. భారతీయ ఫార్మా ఎగుమతుల్లో 2019 ఏప్రిల్‌-అక్టోబరుతో పోలిస్తే, 2020 ఏప్రిల్‌-అక్టోబరు కాలానికి 18 శాతం మేర పెరుగుదల నమోదైంది. నేడు భారత్‌ అత్యధికంగా ఎగుమతి చేస్తున్న సరకుల్లో ఔషధాలు మూడో స్థానం ఆక్రమిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలల్లో ఎఫ్‌డీఏ అనుమతి పొందిన కొత్త మందుల దరఖాస్తుల్లో (ఏఎండీఏ) 45 శాతం భారతీయ కంపెనీలకే దక్కినందువల్ల, మన ఫార్మా ఎగుమతులు మరింత పెరగడం ఖాయం. భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షిస్తున్న 10 ప్రధాన రంగాల్లో ఫార్మా పరిశ్రమ ఒకటి. 2019-20లో ఈ రంగం రూ.3,650 కోట్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించిందని, అంతకుముందు సంవత్సరంకన్నా ఇది 98 శాతం పెరుగుదల అని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ వెల్లడించారు.

ప్రధాన లోపాలు

భారత ఫార్మా రంగం దినదిన ప్రవర్ధమానవుతున్నా మందుల ఎగుమతికి అమెరికా విపణిపైన, మందుల తయారీకి చైనా ముడిసరకులపైనా అతిగా ఆధారపడటం వంటివి ప్రధాన లోపాలు. ఇవి శాపాలుగా మారకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తపడాలి. భారతీయ మందుల అమ్మకాల్లో సగానికిపైగా ఎగుమతులే; వాటిలో 37 శాతం అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి. మందుల తయారీకి ఉపయోగపడే ముడి పదార్థాలను బల్క్‌డ్రగ్స్‌ లేదా ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మస్యూటికల్‌ ఇంగ్రెడియంట్స్‌) అంటారు. క్రోసిన్‌ వంటి నొప్పి నివారణ ఔషధంలో వాడే ప్యారాసెటమాల్‌ కోసం కూడా చైనాపై ఆధారపడక తప్పని దుస్థితి మనదేశానిది. భారతీయ ఫార్మా కంపెనీలు చైనా నుంచి బల్క్‌డ్రగ్స్‌ను, ఇంటర్మీడియట్‌ రసాయనాలను దిగుమతి చేసుకుంటున్నట్లు ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. చౌకగా లభించే చైనా ఏపీఐలతోనే భారతీయ కంపెనీలు జనరిక్‌ మందులను తయారుచేసి ఎగుమతి చేయగలుగుతున్నాయి. కానీ, ఈ పరిస్థితి క్రమంగా మారిపోనున్నది. ఇంతవరకు ఏపీఐల ఎగుమతితో సరిపెట్టుకున్న డ్రాగన్‌ దేశం- మేడిన్‌ చైనా 2025 విధానం కింద మందుల తయారీని వ్యూహప్రాధాన్యం గల పరిశ్రమగా గుర్తించి అభివృద్ధి చేస్తోంది. ఏపీఐ, ఇతర రసాయనాలతో తయారయ్యే ఫార్ములేషన్లను అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తోంది. తద్వారా కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలతో కొత్త మందుల పరిశోధనకు, నిపుణ మానవ వనరుల సృష్టికి దండిగా నిధులు వెచ్చిస్తూ భారత్‌కు పోటీదారుగా అవతరించనున్నది. జీవ పదార్థాల నుంచి కొత్త బయలాజిక్‌ మందుల తయారీలో ఫార్మా అంకురాలకు తోడ్పడే ఇంక్యుబేటర్లను నెలకొల్పింది. కానీ ఇప్పటికీ జనరిక్‌ మందులకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్న భారత్‌, బయలాజిక్స్‌ తయారీలో వెనకబడే ప్రమాదం కనిపిస్తోంది. ఇతర దేశాలు, కంపెనీలు కనిపెట్టిన మందులకు పేటెంట్‌ గడువు తీరిపోయిన తరవాత వాటిని జనరిక్‌ మందులుగా పరిగణిస్తారు. ఇకపై జన్యు వైద్యం, రోబోటిక్‌ వైద్యం వంటి కొత్త రీతులు విస్తరించనున్నందువల్ల మందుల తయారీలో నవీకరణకు భారత్‌ నడుం కట్టాలి. దీనికి అవసరమైన నిపుణ సిబ్బందిని తయారు చేసుకోవాలి. చైనాలో ప్రతి 10,000 జనాభాకు 41 మంది నిపుణ సిబ్బంది ఉంటే, భారత్‌లో 29 మంది ఉన్నారని భారత ఫార్మస్యూటికల్‌ అలయన్స్‌ (ఐపీఏ) లెక్కకట్టింది. నైపుణ్యాల సృష్టి, నవీకరణ సాధనకు భారత్‌ త్వరగా కార్యాచరణ చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఈ వాస్తవాన్ని గుర్తించి మందుల తయారీతోపాటు వైద్య పరికరాల తయారీపైనా దృష్టిపెట్టింది. ఏపీఐల కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మూడు బల్క్‌డ్రగ్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. రూ.14,300 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రాలతో కలిసి ఈ పార్కులను నిర్మిస్తారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం కింద వైద్య పరికరాల తయారీకి మరి నాలుగు పార్కులను ఏర్పాటు చేయదలచారు.

ఆలస్యం అమృతం విషం

బల్క్‌డ్రగ్‌ పార్కులకు స్థలం, ప్రోత్సాహకాలు, సౌకర్యాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలతోపాటు 14 రాష్ట్రాలు ముందుకొచ్చాయి. ప్రతి పార్కుకు రూ.1000 కోట్ల గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను, 70 శాతం ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కేంద్రం ప్రకటించింది. బల్క్‌డ్రగ్‌ పార్కుల ఏర్పాటుకు ఏ రాష్ట్రాలను ఎంపిక చేసినదీ ఈ ఏడాది జనవరి 15కల్లా ప్రకటించాల్సిన కేంద్రం, ఇప్పటిదాకా ఆ పని చేయలేదు. ప్రస్తుతం పెనిసిలిన్‌-జి, 7-ఏసీఏ, ఎరిత్రోమైసిన్‌ థియోసైనేట్‌, క్లావులనిక్‌ యాసిడ్‌ అనే నాలుగు మాలిక్యూల్స్‌ కోసం పూర్తిగా చైనా మీదే ఆధారపడుతున్నాం. ఈ నాలుగు మాలిక్యూల్స్‌తోపాటు మొత్తం 53 బల్క్‌డ్రగ్‌లను ప్రతిపాదిత పార్కుల్లో తయారు చేయాలని లక్షిస్తున్నారు. బల్క్‌డ్రగ్‌ పార్కుల్లో వాణిజ్య ప్రాతిపదికపై ఉత్పత్తి 2023 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కావలసి ఉన్నా, కేంద్రం ఆ పార్కులను ఏ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేదీ ప్రకటించకపోవడం వల్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇతర దేశాలకు కొవిడ్‌ టీకాల సరఫరాలో చైనాపై ఆధిక్యం సాధించిన భారత్‌, జనరిక్‌ మందులతోపాటు కొత్త మందుల ఆవిష్కరణలోనూ ముందుకు దూసుకెళ్లాలి. ఇందుకు రాజకీయ దృఢ సంకల్పం, పటిష్ఠమైన ఫార్మా విధానం, దీటైన కార్యాచరణ ఎంతో అవసరం.

- కైజర్‌ అడపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.