ETV Bharat / opinion

'అణు'మానాలు ఎన్నిఉన్నా అత్యంత సంయమనం

author img

By

Published : Apr 22, 2021, 7:24 AM IST

Updated : Apr 22, 2021, 9:15 AM IST

భారత్‌, చైనా అత్యంత సంయమనంతో ఉంటాయని స్వీడన్​కు చెందిన స్టాక్​హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ(సిప్రి) పేర్కొంది. తమకు తాముగా ఏ దేశం మీదా అణు దాడి చేయకూడదన్నది భారత్‌, చైనాల ప్రకటిత విధానమని తెలిపాయి. భారత్‌, చైనా, అమెరికా, రష్యా, పాకిస్థాన్‌లకు చెందిన 119 మంది నిపుణులను ఇంటర్వ్యూ చేసిన మీదట సిప్రి ఈ నిర్ధరణకు వచ్చింది.

nuclear weapons
అణు ఆయుధాలు, అణ్వాస్త్రాలు

ఇటీవల లద్దాఖ్‌లో భారత్‌, చైనా సైనిక ఘర్షణ చిన్న స్థాయిలోనే జరిగినా, అది పెరిగి పెద్దదై అణు యుద్ధానికి దారితీస్తుందేమోనని ప్రపంచం కలవరపడింది. అలాంటి భయాలు పెట్టుకోనక్కర్లేదని స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) భరోసా ఇస్తోంది. భారత్‌, చైనా, అమెరికా, రష్యా, పాకిస్థాన్‌లకు చెందిన 119 మంది నిపుణులను ఇంటర్వ్యూ చేసిన మీదట సిప్రి ఈ నిర్ధరణకు వచ్చింది. ఈ నిపుణుల్లో అత్యధికులు ఇంకా సర్వీసులో ఉన్న సైన్యాధికారులే. భారత్‌, చైనాల మధ్య అణుయుద్ధం జరిగే అవకాశమే లేదని, అది అనూహ్యమని సిప్రి తేల్చిచెప్పింది. తమకుతాముగా ఏ దేశం మీదా అణు దాడి చేయకూడదన్నది భారత్‌, చైనాల ప్రకటిత విధానం కావడమే ఇందుకు కారణం.

2018లో అరిహంత్‌ జలాంతర్గామిని జలప్రవేశం చేయించేటప్పుడు ప్రధాని మోదీ స్పందిస్తూ- భారత్‌ తనకుతానుగా ఏ దేశంపైనా అణ్వస్త్ర ప్రయోగానికి దిగబోదని స్పష్టంగా ప్రకటించారు. ఏదైనా దేశం తమ మీద అణుదాడికి దిగినప్పుడు మాత్రమే ఎదురుదాడి చేస్తాం తప్ప, తామే ముందుగా అణ్వస్త్రాలు ప్రయోగించబోమని రెండు దేశాలూ మొదటి నుంచీ చెబుతున్నాయి. కనుక రెండు దేశాల మధ్య అణుయుద్ధం అనూహ్యమని సిప్రికి నిపుణులు వివరించారు. భారత్‌, చైనా, పాకిస్థాన్‌, అమెరికాల సమీకరణలు- దక్షిణాసియా స్థితిగతులను కొత్త కోణం నుంచి దర్శించాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తున్నాయి. పాకిస్థాన్‌కు చైనా సాధారణ ఆయుధాలతోపాటు అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని అందిస్తోంది. మరోవైపు భారత్‌, అమెరికాలు ఇండో-పసిఫిక్‌, క్వాడ్‌ పేరిట సైనికంగా చేరువవుతున్నాయి. ఈ పొత్తుల పట్ల భారత్‌, చైనాలకు ఎవరి భయాలు వారికి ఉన్నాయి. దక్షిణాసియాలోని మూడు అణ్వస్త్ర దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదాలు తరచూ ఉద్రిక్తతలకు దారితీయడం, ఈ భయాలకు మూలకారణం.

ఉద్రిక్తతలు నెలకొన్నా..

లద్దాఖ్‌లో గత ఏడాది నుంచే భారత్‌, చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నా, రెండు దేశాలు ఏ దశలోనూ అణ్వస్త్రాల కోసం ప్రయత్నించలేదు. ఉభయ దేశాల అణ్వస్త్ర బలగాల అధికారులు రహస్య సమావేశాలు జరపడం కానీ, రాజకీయ నాయకులు అణు యుద్ధ హెచ్చరికలు జారీచేయడం కానీ జరగలేదు. ఉభయ దేశాల్లో ఇలాంటి ప్రమాదం గురించి చర్చలూ లేవు. దీనికి కారణం- తమకుతాముగా మొట్టమొదట అణ్వస్త్ర ప్రయోగానికి దిగకూడదన్న విధానమే. పాకిస్థాన్‌కు అలాంటి పట్టింపులేమీ లేవు. భారత్‌తో నేరుగా తలపడి నెగ్గలేమనే ఉద్దేశంతో అణ్వస్త్ర బెదిరింపులకు దిగుతుంటుంది. ఇలాంటి ప్రమాదకర విధానానికి భారత్‌, చైనా బహుదూరం. ఇతర దేశాలు తమను అణ్వస్త్ర పరంగా బెదిరించకుండా నిలువరించేందుకే అణు ఆయుధాలను సమకూర్చుకున్నాయే తప్ప తామే దాడులకు పాల్పడే ఆలోచన లేదు. అందుకే ఈ విషయంలో సంయమనం, స్థిరత్వాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

అరిహంత్​ జలాంతర్గామితో..

అమెరికా, రష్యా కూటముల మధ్య మొదటి నుంచీ ఇలాంటి సంయమనం లేదు. ఈ అవగాహనా లోపం వల్లే పాశ్చాత్య నిపుణులు తరచూ భారత్‌, చైనా అణు యుద్ధ ప్రమాదం గురించి హెచ్చరికలు, విశ్లేషణలు జారీ చేస్తూ ఉంటారు. లద్దాఖ్‌ ఘర్షణల సందర్భంగా భారత్‌ అణు దాడి చేయగల విమానాలను చైనా సరిహద్దుకు తరలించిందని, అణ్వస్త్ర ప్రయోగ సామర్థ్యం కలిగిన అరిహంత్‌ జలాంతర్గామిని సముద్రంలోకి పంపిందని పాశ్చాత్య సైనిక నిపుణులు పేర్కొన్నారు. భారత్‌ అణు ఆయుధాలను అన్నివేళలా క్షిపణులు, బాంబర్‌ విమానాలు, జలాంతర్గాములకు అమర్చి ఉంచదు.

విడివిడిగా ఉండే అణ్వస్త్రాలు, ప్రయోగ వాహనాలను అవసరమైనప్పుడు మాత్రమే ఒకచోటికి చేరుస్తుంది. వాటి ప్రయోగంపై పటిష్ఠ నియంత్రణ వ్యవస్థను ఏర్పరచుకొంది. ఈ విషయం చైనాకూ తెలుసు. అందుకే, మన యుద్ధ విమానాలు, జలాంతర్గాముల కదలికలకు ప్రతిగా తానూ మోహరింపులకు దిగలేదు. అయితే, అణ్వాయుధాల విషయంలో జాగ్రత్తలపై భారత్‌, చైనా తరచూ చర్చించుకొంటూ, పరస్పరం విశ్వాసం పెంపొందించుకోవాలనేది నిపుణుల సూచన.

అపనమ్మకం తొలగాలి

దక్షిణాసియాలో పాక్‌ను అడ్డుపెట్టుకుని అస్థిరత సృష్టించడానికి చైనా ప్రయత్నిస్తోందని అగ్రరాజ్యం భావిస్తుంటే, తనను అస్థిర పరచడానికే క్వాడ్‌, ఇండో పసిఫిక్‌ పేరిట అమెరికా హడావుడి చేస్తోందని డ్రాగన్‌ రుసరుసలాడుతోంది. పాకిస్థాన్‌కు చైనా సైనికంగా, ఆర్థికంగా అండదండలు ఇవ్వడం, ఆర్థిక నడవాను నిర్మించడాన్ని భారత్‌, అమెరికా అనుమానంగా చూస్తున్నాయి. ఇదంతా చివరికి దక్షిణాసియాలో భారత్‌-అమెరికా, చైనా-పాకిస్థాన్‌లు రెండు ప్రత్యర్థి కూటములుగా తలపడటానికి దారితీస్తుందని అగ్రరాజ్యం నిపుణులు భాష్యం చెబుతున్నారు. దీనితో భారత రక్షణ నిపుణులు ఏకీభవించడం లేదని సిప్రి వెల్లడించింది. అమెరికా తన భుజంపై తుపాకీ పెట్టి, చైనాపై కాల్పులు జరిపే పరిస్థితి ఏర్పడకూడదని భారత్‌ అభిలషిస్తోంది. కానీ, పాక్‌ భుజంపై చైనా తుపాకీ ఆన్చి, తనపై గురిపెట్టదనే భరోసా భారత్‌కు లేదు. ఈ అపనమ్మకం తొలగించుకోవాలంటే కేవలం చర్చలతోనే ఆగకూడదు.. అంతకుమించిన అడుగులు పడాలి!

- ఆర్య

ఇదీ చదవండి:భారత్​కు బయలుదేరిన 4 రఫేల్​ విమానాలు

Last Updated :Apr 22, 2021, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.