ETV Bharat / opinion

కొవిడ్‌ విజేతలకు మాససిక క్షోభ- థర్డ్ వేవ్​పై భయాలు

author img

By

Published : Sep 17, 2021, 9:32 AM IST

కొవిడ్‌
కొవిడ్‌

క‌రోనా నుంచి కోలుకున్నవారిలో తలెత్తుతున్న పలు వ్యాధులతో(Post Covid Symptoms) తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు రోగులు. రెండు మోతాదుల టీకాలు వేయించుకున్నవారిలోనూ కొవిడ్‌ కేసులు బయట పడుతున్నాయనే వార్తల నడుమ. కొవిడ్‌ మూడోదశపై(Covid Third Wave) ఆందోళనలు పెరుగుతున్నాయి. దీనితో ఈ భయాలన్నింటినీ దూరం చేసి, ప్రజలందరి ఆరోగ్యరక్షణ దిశగా ఆలోచించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.

కొవిడ్‌ వ్యాధి నుంచి కోలుకొని ఊరట చెందేలోపు- రకరకాల ఆరోగ్య సమస్యలు(Post Covid Health Problems) చుట్టుముడుతున్నాయి. రోగనిరోధక వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులతోపాటు, చాలా సమస్యలు కొవిడ్‌ విజేతలను వేధిస్తున్నాయని వైద్యశాస్త్ర నిపుణులు అనుమానిస్తున్నారు. నిద్రలేమి లేదా అతినిద్ర, జుట్టు విపరీతంగా రాలడం, చిన్న పనికే విపరీతమైన ఆయాసం-అలసట, కీళ్ల నొప్పులు, డయేరియా, జ్వరం, దగ్గు, కడుపు లేదా గుండెనొప్పి, ఆలోచనా సామర్థ్యం తగ్గడం, చేసే పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం, మూత్రపిండాలు దెబ్బతినడం, మహిళలకు రుతుక్రమంలో మార్పులు, నిలబడితే కళ్లు తిరగడం లాంటివి చాలా ఉన్నాయి. వీటితో పాటు.. అత్యంత అరుదుగా వినే నొకార్డియోసిస్‌ లాంటి సమస్యలూ కొవిడ్‌ అనంతర కాలంలో వెలుగు చూస్తున్నాయి. ఇవన్నీ బాధితుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

ఒక్కసారిగా..

జుట్టు రాలడం(Post Covid Hair Loss), నిద్రలేమి చాలా ఎక్కువమందిలో కనిపిస్తున్న సమస్యలు. అంతకుముందు కనీసం రెండు మూడు అంతస్తులైనా అవలీలగా ఎక్కి వెళ్ళగలిగినవాళ్లు ఇప్పుడు లిఫ్టులను ఆశ్రయిస్తున్నారు. మనిషి ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడో ఉంటోంది. ఆలోచనలను ఒకచోట కేంద్రీకరించలేకపోతున్నారు. ఇవన్నీ కొవిడ్‌ అనంతరం అనేకమంది భారతీయులకు నిత్యం ఎదురవుతున్న సమస్యలు. ఇవే కాదు, ఇంకా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు సైతం కొవిడ్‌ విజేతలను వెంటాడుతున్నాయి. సాధారణంగా మూత్రపిండాల్లో ఏమైనా సమస్య వస్తే కాళ్లు లాగడం, ఇతర లక్షణాలు కొన్ని కనిపించేవి. కానీ, కొవిడ్‌ అనంతర పరిస్థితుల్లో పైకి అంతా సర్వసాధారణంగానే కనిపించినా ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అప్పటికే మూత్రపిండాలు బాగా దెబ్బతిన్నట్లు వైద్య పరీక్షల్లో తెలుస్తోంది. అంతకుముందు ఎలాంటి సమస్యలూ లేకుండా, కొవిడ్‌తో ఇంటివద్దే ఉండి చికిత్స పొందినవారి లోనూ మూత్రపిండాలు(Post Covid Kidney Disease) దెబ్బతింటున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. ఈ విషయాన్ని అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ నెఫ్రాలజీ (ఏఎస్‌ఎన్‌) తాజాగా వెల్లడించింది. కొవిడ్‌ తీవ్రత చాలా తక్కువగా ఉన్న ప్రతి పదివేల మంది రోగుల్లో కనీసం ఏడుగురికి తదనంతర కాలంలో డయాలసిస్‌ లేదా మూత్రపిండాల మార్పిడి అవసరం అవుతోంది. రాబోయే దశాబ్దకాలంలో ఇది మానవ జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. కొవిడ్‌ విజేతల ఆరోగ్యాన్ని పరీక్షించే వైద్యులు తప్పనిసరిగా మూత్రపిండాల పరీక్షలు నిర్వహిస్తూ ఉండాలని ఏఎస్‌ఎన్‌ హెచ్చరించింది.

రోగనిరోధక శక్తి క్షీణత..

నొకార్డియాసిస్‌ అనేది అత్యంత అరుదైన ఇన్ఫెక్షన్‌. సాధారణంగా ఇది రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోయినవారిలో కనిపించేది. మెదడులో వచ్చే ఈ ఇన్ఫెక్షన్‌ వల్ల చూపు మందగించడం, మూర్ఛ రావడంతో పాటు కొన్నిసార్లు కోమాలోకీ వెళ్ళిపోతారు. సాధారణ ఇన్ఫెక్షన్లు వేటికైనా మూడు వారాలు యాంటీబయాటిక్స్‌ వాడితే సరిపోతుంది. కానీ దీనికి మాత్రం ఏకంగా ఏడాది పాటు వాడాలి. అందులోనూ మొదటి ఆరు వారాలు నరానికి ఇచ్చే ఇంజక్షన్ల ద్వారా వైద్యుల పర్యవేక్షణలోనే ఉపయోగించాలి. ఈ సమయంలో ఇన్ఫెక్షన్‌ మరోసారి వచ్చే ప్రమాదమూ ఉన్నందువల్ల అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. ఇంతకుముందు నొకార్డియాసిస్‌ సమస్య కేన్సర్‌, హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనే కనిపించేది. వారిలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోవడంవల్లే ఇది వచ్చేది. దాదాపు పది లక్షల జనాభాలో ఒకరికి వచ్చేదని, కానీ ఇప్పుడు తొలిసారిగా కొవిడ్‌ నుంచి కోలుకున్న చాలామందిలో కనిపిస్తోందని వైద్యనిపుణులు అంటున్నారు.

ప్రభుత్వ మద్దతుతోనే..

ఒకవైపు కొవిడ్‌ మూడోదశ ముంచుకొస్తోందని ఆందోళనలు పెరుగుతున్నాయి. రెండు మోతాదుల టీకాలు వేయించుకున్నవారిలోనూ కొవిడ్‌ కేసులు బయట పడుతున్నాయని కేరళ అనుభవం చెబుతోంది. ఇప్పటికి ఒకసారి వచ్చి తగ్గితేనే ఇన్ని రకాల సమస్యలు కనిపిస్తున్నప్పుడు, మరోసారి వస్తే ఏమవుతుందోనన్న ఆందోళన చాలామందిలో కనపడుతోంది. ఇంట్లోనే ఉండి చికిత్స పొందినా కొవిడ్‌ వచ్చి తగ్గిన మూడు నాలుగు నెలల వరకూ వివిధ రకాల పరీక్షలు చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సరికొత్త భయాలు వెన్నాడుతున్న ప్రస్తుత సమయంలో కొవిడ్‌ అనంతర సమస్యలపై విస్తృత అధ్యయనాలు జరగాలి. కొవిడ్‌ అనంతరం శరీరంలో చోటుచేసుకునే సమస్యలు, వాటికి పరిష్కారాలను గుర్తించాలి. సామాన్య ప్రజానీకానికి ప్రభుత్వ వైద్యరంగం నుంచి మద్దతు ఎంతైనా అవసరం. ప్రభుత్వాసుపత్రుల్లో కొవిడ్‌ వార్డులను నెలకొల్పాలి. వైద్యపరీక్షలు, చికిత్సల కోసం తగిన సదుపాయాలను అందించడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. ఇప్పటికే వైద్యబీమా సంస్థలు సైతం కొవిడ్‌ చికిత్సకు అయ్యే ఖర్చులను పూర్తిగా ఇచ్చేది లేదంటూ పరిమితులు పెట్టడంతో- సామాన్యులు వైద్యపరీక్షలు, చికిత్సలంటేనే భయపడుతున్నారు. ఈ భయాలను దూరం చేసి, ప్రజలందరి ఆరోగ్యరక్షణ దిశగా ఆలోచించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.

- కామేశ్వరరావు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.