ETV Bharat / opinion

sports facilities: కఠోర సాధన.. పతకాలకు నిచ్చెన

author img

By

Published : Aug 28, 2021, 7:46 AM IST

ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్డా(neeraj chopra) సాధించిన స్వర్ణపతకం అథ్లెటిక్స్‌పై యువతకు కచ్చితంగా మక్కువ పెంచుతుంది. బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, రెజ్లింగ్‌లపైనా దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. కాకపోతే, సౌకర్యాల లేమి(sports facilities), ఆర్థిక ఇబ్బందులు ఔత్సాహిక క్రీడాకారులను వెనక్కి లాగుతున్నాయి.

sports
క్రీడలు

క్రికెట్టే లోకమైన భారత్‌లో కొన్నేళ్లుగా మన ఆటగాళ్లు బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌ వంటి క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. జావెలిన్‌ త్రో, పురుషుల హాకీ జట్ల స్వర్ణాలు తప్ప గత 20 ఏళ్లుగా భారత్‌కు ఒలింపిక్స్‌లో వచ్చిన పతకాలన్నీ ఈ క్రీడాంశాల్లో సాధించినవేనన్న సంగతిని జాతీయ క్రీడా దినోత్సవం (ఈ నెల 29) సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరముంది. ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో(tokyo olympics 2021) జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా(neeraj chopra) సాధించిన స్వర్ణపతకం అథ్లెటిక్స్‌పై యువతకు కచ్చితంగా మక్కువ పెంచుతుంది. బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, రెజ్లింగ్‌లపైనా దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. కాకపోతే, సౌకర్యాల లేమి(sports facilities), ఆర్థిక ఇబ్బందులు ఔత్సాహిక క్రీడాకారులను వెనక్కి లాగుతున్నాయి.

ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున తొలిసారి హ్యాట్రిక్‌ గోల్స్‌ చేసిన మహిళల హాకీ క్రీడాకారిణి వందనా కటారియా చెట్టుకొమ్మతో ఆటను ప్రాక్టీస్‌ చేయడం దేశంలో క్రీడా సౌకర్యాల లేమికి నిదర్శనం. ఉత్తరాఖండ్‌లోని రోష్నాబాద్‌లో హాకీ సాధనకు ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు. 2000 సంవత్సరంలో ఆ ఊళ్లో స్టేడియం ఏర్పాటు కావడంతో ఆమెలాంటి చాలామంది క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదగగలిగారు. సరైన సౌకర్యాలుంటే మన క్రీడాకారులు ఏ స్థాయిలో రాణించగలగరో చెప్పడానికి వందనే ఓ ఉదాహరణ.

ఖరీదైన క్రీడలు

సరైన శిక్షణ, కఠోర సాధన ప్రపంచస్థాయి క్రీడాకారులుగా తయారవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఒక అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్‌లో గెలవాలంటే కనీసం 10 వేల గంటల కఠోర సాధన అవసరమని ఓ అంచనా. అంటే కనీసం అయిదు నుంచి పదేళ్లపాటు దాన్ని కొనసాగించాలి. ఇందుకు క్రీడా పరికరాలు, మౌలిక వసతులతోపాటు ఆర్థిక వనరులూ కీలకమే. ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చే స్థాయి ఆటగాళ్లకు అత్యున్నత శిక్షణ ఇచ్చే 'టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం పథకం (టాప్స్‌)' కింద నీరజ్‌ చోప్రా కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అయిదు కోట్ల రూపాయల సహాయం అందింది. నీరజ్‌ జర్మన్‌ కోచ్‌కు రూ.1.22 కోట్లు వెచ్చించారు. షూటింగ్‌ క్రీడాసాధనకు నెలకు రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుందని, ఒక అథ్లెట్‌ ప్రాక్టీస్‌ కోసం ఏటా కనీసం అయిదారు లక్షల రూపాయలు వెచ్చిస్తేగాని అంతర్జాతీయ స్థాయిలో నిలబడలేరని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ వెల్లడించారు.

అత్యున్నత స్థాయిలో క్రీడల శిక్షణే కాదు- వాటి సాధన కూడా ఎంతో ఖరీదైన వ్యవహారమని చెప్పేందుకు ఈ ఉదాహరణలు చాలు. దేశంలో జాతీయ క్రీడా సమాఖ్యలకు, 'టాప్స్‌' కార్యక్రమానికి కలిపి గత మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.765 కోట్లు వెచ్చించింది. అంటే సరాసరిన ఏడాదికి రూ.250 కోట్లు. కేంద్ర యువజన, క్రీడా వ్యవహారాల శాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించింది రూ.2,596 కోట్లు. బ్రిటన్‌ కేవలం రియో ఒలింపిక్స్‌ కోసం రూ.2,789 కోట్లు కేటాయించింది. ఆ క్రీడల్లో బ్రిటన్‌ 67 పతకాలు సాధించడంలో కేటాయింపులు కూడా తోడ్పడ్డాయనడం కాదనలేని సత్యం. యూపీయే ప్రభుత్వ హయాముతో పోల్చితే ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో క్రీడలకు బడ్జెట్‌ కొంత పెరిగినట్లు కనిపించినా- దాదాపు 35 లక్షల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్‌లో వీటికి కేటాయింపు 0.07 శాతం మాత్రమే కావడం గమనార్హం. ఆ కేటాయింపులోనూ యువజన వ్యవహారాలకు పోను క్రీడారంగానికి దక్కేది 50 నుంచి 60 శాతమే. ఈ రంగానికి నిధుల కేటాయింపు పెరగాల్సిన అవసరాన్ని ఈ లెక్కలే నొక్కి చెబుతున్నాయి. దేశానికి పతకాలు దక్కాలంటే ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులనూ పరిగణనలోకి తీసుకోవాలి.

దిగ్గజాల సేవలు పొందాలి

ఒలింపిక్స్‌లో పతకాలు తేగలిగే స్థాయి ఆటగాళ్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించి, విదేశాలకు పంపి శిక్షణ ఇప్పించింది. మీరాబాయి, నీరజ్‌ విదేశాల్లో పొందిన నాణ్యమైన శిక్షణ, వారి కఠోర సాధన టోక్యోలో మంచి ఫలితాన్నిచ్చాయి. పతకం తేవాలంటే శిక్షణ కోసం విదేశాలకు వెళ్ళాల్సిందేనా అనేది ఆలోచించాల్సిన అంశం. మన వద్ద ఒలింపిక్‌ పతకాలు తెచ్చిన క్రీడాకారులు, ప్రపంచ ఛాంపియన్లు ఉన్నారు. వీరు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భూమి ఇస్తే సొంత ఖర్చులతో అకాడమీలు పెట్టి క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు. కొన్నిచోట్ల కార్పొరేట్‌ కంపెనీలు కాస్త చేయూతనిస్తున్నాయి. బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌, పరుగుల రాణి పీటీ ఉష, షూటింగ్‌లో దేశఖ్యాతిని చాటిన గగన్‌ నారంగ్‌ వంటివారు సొంతంగా అకాడమీలను ఏర్పాటు చేసి భావి క్రీడాకారులను తయారు చేస్తున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వపరంగా అవసరమైనంత ప్రోత్సాహం అందడం లేదు. సిడ్నీ ఒలింపిక్స్‌లో మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించిన కరణం మల్లీశ్వరి వంటి దిగ్గజ క్రీడాకారుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి.

పలుచోట్ల అకాడమీలు నిర్మించి, వాటి బాధ్యతల్ని ప్రపంచస్థాయి క్రీడాకారులు, ఒలింపిక్‌ పతక విజేతలకు అప్పగించాలి. దేశ క్రీడాభివృద్ధికి క్షేత్రస్థాయిలో సహకారం అందించడంలో కార్పొరేట్‌ సంస్థలూ మరింతగా ముందుకు రావాలి. ఇవన్నీ సాకారమైతేనే భావి విజేతలను తీర్చిదిద్దగలం!

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.